30వ సామాన్య ఆదివారము, YEAR A

30వ సామాన్య ఆదివారము, YEAR A
నిర్గమ. 22:20-26; 1 తెస్స. 1:5-10; మత్త. 22:34-40
దైవప్రేమ – సోదరప్రేమ 

ఉపోద్ఘాతము: క్రీస్తునందు ప్రియసహోదరీ సహోదరులారా! ఈ రోజు దైవార్చన కాలములో మనం 30వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. నేడు దైవప్రేమ-సోదరప్రేమ గురించి ధ్యానిస్తున్నాము. క్రైస్తవ జీవిత సారాంశం, దైవప్రేమ-సోదరప్రేమ. దైవప్రేమ, సోదరప్రేమ విడదీయరానివి. సువార్తా బోధనల సారాంశంకూడా దైవప్రేమ-సోదరప్రేమ. ఎప్పుడైతే మనం వీటిని జీవిస్తామో, అప్పుడే మనం పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం జీవించినట్లు అవుతుంది. వీటిని జీవించాలంటే, ముందుగా మనం దేవుని గురించిన వ్యక్తిగతానుభవమును కలిగియుండాలి. ఇది నిండైన విశ్వాసము, ప్రార్ధనా జీవితముద్వారా సాధ్యపడుతుంది. మన అనుదిన జీవితములో దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించాలి. ఆయన సాంగత్యములో జీవించాలి. “నీ దేవుడవైన ప్రభువును నీవు పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను... నిన్ను నీవు ప్రేమించు కొనునట్లు నీ పొరుగు వానిని ప్రేమింప వలెనుఅని నేటి సువార్తా పఠనము తెలియజేయుచున్నది. మొదటి పఠనము, మనం పాటించవలసిన కొన్ని నైతిక, మత సూత్రములను గుర్తుకు చేయుచున్నది. రెండవ పఠనములో పౌలుగారు, తాను తెస్సలోనిక ప్రజలకు మార్గదర్శిగా ఉన్నరీతిగా, వారుకూడా ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని సలహా ఇచ్చుచున్నారు. 

మొదటి పఠనము: నేటి మొదటి పఠనము సినాయి కొండపై ప్రభువు మోషేకు (ఇశ్రాయేలు ప్రజలకు) సామాజిక, నైతిక, మత నియమాలు ఒసగబడిన ‘నిబంధన గ్రంధము’ (నిర్గమ. 20:22-23:19) అను భాగమునుండి తీసుకొనబడింది. ఇది సోదరప్రేమను గురించి తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు (నేడు మనము) బలహీనులపట్ల ప్రేమతో మెలగాలి. ‘బలహీనులు’ అనగా విదేశీయులు లేదా వలసదారులు, యుద్ధము, కరువు మొదలగు కారణాలవలన స్వదేశమును వీడువారు, వితంతువులు, అనాధలు. ఆనాటి పాలస్తీనాలో పరదేశులు, వితంతువులు, అనాధలు ఎలాంటి ఆధారము లేకుండా జీవించేవారు. అందుకే వారిని (నిస్సహాయులు, పేదలు, ఒంటరివారు), బాధించేవారు, కష్టపెట్టేవారు. “ఐగుప్తులో మీరును పరదేశులుగా ఉంటిరిగదా!” అని ప్రభువు వారికి గుర్తుకు చేయుచున్నాడు (మనముకూడా పాపము అనే పరదేశములో ఉంటిమి కదా!). కనుక, ఇప్పుడు, మనకన్నా దయనీయ స్థితిలో జీవిస్తున్నవారిపట్ల ప్రేమ కలిగియుండాలి, వారికి హానిచేయక, సహాయం చేయాలి. వారిపట్ల ప్రేమపూర్వకమైన బాధ్యత కలిగి జీవించాలి. “నేను వారి ప్రార్ధన ఆలకింతును. వారిపట్ల బాధ్యత కలిగి జీవించనిచో, వారిని బాధించు వారిని శిక్షింతును, వారి కుటుంబాలను శిక్షింతును, భార్యలు వితంతువులు అగుదురు, బిడ్డలు అనాధలు అగుదురు” అని ప్రభువు తెలియజేయుచున్నారు. మనము ఏ కొలతతో కొలుస్తామో, అదే కొలతతో మనము కొలవబడతామనే పాఠము గుర్తుకు చేసుకుందాం. మనము ఇతరులపట్ల ఎలా ప్రవర్తిస్తామో, దేవుడుకూడా మనపట్ల అలాగే ప్రవర్తిస్తాడు. 

సువిశేష పఠనము: గత కొన్నివారాలుగా, యూదమత నాయకులు ప్రభువును తప్పుబట్టుటకు ఆయనను వివిధ రకాలుగా పరీక్షించడం మనం చూస్తున్నాము. మొదటగా, యేసును వారు, “ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి? నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు? (మత్త. 21:23) అని ప్రశ్నించారు. యేసు దీనికి సమాధానం చెప్పకుండా మూడు ఉపమానములద్వారా (ఇద్దరుకుమారుల ఉపమానము, భూస్వామి-కౌలుదార్లు ఉపమానము, పెండ్లిపిలుపు ఉపమానము) యూదనాయకుల నాయకత్వ-వైఫల్యాలను ఎండగట్టారు. ఆ తరువాత పరిసయ్యులు, యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడపన్ని,”చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా? కాదా? నీ అభిప్రాయమేమి? (మత్త. 22:17) అని అడిగారు. అలాగే సద్దూకయ్యులు పునరుత్థానము గురించి ప్రశ్నించారు (మత్త. 22:24-28). 

యేసు సద్దూకయ్యుల నోరుమూయించెనని పరిసయ్యులు విని, వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు (మార్కు. 12:28లో ‘ధర్మశాస్త్ర బోధకుడు’) ఆయనను పరీక్షింపవలెనని (అనగా శోధింపవలెనని మత్తయి సువార్తలో సైతాను, పరిసయ్యులు మాత్రమే యేసును శోధించడం చూస్తున్నాము), “బోధకుడా! ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది? అని అడుగుచున్నాడు (నేటి సువిశేష పఠనము). ఇచ్చట యేసును చిక్కులో పడవేయాలనేదే ధర్మశాస్త్ర ఉపదేశకుడి ఆలోచన, కుట్ర! ఈ సంఘటనను మనం మార్కు. 12:28-34లోను, లూకా. 10:25-28లోనూ చూడవచ్చు. “అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది? ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును “బోధకుడా!” అని సంబోధించాడు. ఇది అతని కపటవేషానికి నిదర్శనం. బయటకి తీయటి పలుకులు, కాని మనస్సులో కుట్ర. అయితే, అతను అడిగిన ప్రశ్న అసాధారణమైన ప్రశ్న ఏమీ కాదు. రబ్బయిలు (బోధకులు, గురువులు) సాధారణముగా వారి శిష్యులకు ఇలాంటి ప్రశ్నలు వేసి బోధిస్తూ ఉంటారు. 

పాత నిబంధనలో, నీతితో జీవించడానికి నైతిక మార్గదర్శకాలుగా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చియున్నాడు. అయితే, యూదులు వాటిని 613 ఆజ్ఞలుగా మార్చారు (248 చేయవలసిన ఆజ్ఞలు; 365 చేయకూడని ఆజ్ఞలు). అయితే, వీటిలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదో చెప్పడానికి స్పష్టమైన కొలమానమేమీ నిర్దేశింపబడలేదు. అన్ని ఆజ్ఞలుకూడా దేవుడే ఇచ్చాడు కనుక, అన్నీ సమానమైన ప్రాముఖ్యతను కలిగియుంటాయి. అయినప్పటికీ, ధర్మశాస్త్ర బోధకులు కొన్ని ఆజ్ఞలను అత్యంత ప్రాముఖ్యమైనవిగాను, కొన్ని ఆజ్ఞలను తక్కువ ప్రాముఖ్యమైనవిగాను పరిగణించేవారు. సాధారణ ప్రజలకు ఈ ఆజ్ఞలను ఎలా సంక్షిప్తముగా వివరించ వచ్చోయని ఎప్పుడుకూడా చర్చలు జరుగుతూ ఉండేవి. కొంతమంది సబ్బాతు దినమును పాటించుట చాలా ప్రాముఖ్యమని భావించేవారు. కొంతమంది సున్నతి ప్రాముఖ్యమని భావించేవారు. అందుకే, యేసును పరీక్షింప కోరారు. వివాదాస్పద చర్చలోకి యేసును లాగాలని వారి ప్రయత్నం! [ఇలాంటి సంక్షిప్త వివరణలను కీర్తన. 15:2-5, యెషయ 33:15, మీకా. 6:8; ఆమో. 5:4, హబ. 2:4లో చూడవచ్చు]. 

పైప్రశ్నకు సమాధానముగా, ఎలాంటి సంకోచంలేకుండా యేసు, “నీ దేవుడవైన ప్రభువును నీవు పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను (పూర్ణశక్తితోను అని ద్వితీయోపదేశ కాండములో చూస్తాము.) ప్రేమింపవలెను” అని చెప్పాడు. ఈ ఆజ్ఞను మనం ద్వితీయోపదేశకాండము 6:4-5 (11:13)లో చూడవచ్చు. యూదులు ఈ ఆజ్ఞను ‘షేమా’ అని పిలిచేవారు, అనగా దీనిని వారు అతిప్రాముఖ్యమైన ప్రార్ధనగ భావించేవారు (6:4-9 వరకు). యూదులు దీనిని వారి అనుదిన ప్రార్ధనగా చేసుకున్నారు. ఇది “మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు” (నిర్గమ 20:3) అను మొదటి ఆజ్ఞపైన ఆధారపడియున్నది. యేసు కేవలం ప్రధానమైన ఆజ్ఞలను మాత్రమే ఇవ్వక, వాటిని ఎలా జీవించాలోకూడా సూచిస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడికకు షరతుగా, సినాయి కొండపై 10 ఆజ్ఞలను ఇచ్చియున్నాడు. అయితే దైవప్రేమ-సోదరప్రేమ లేనిదే, ఈ ఒడంబడికకు నిజమైన విశ్వసనీయత ఉండదని యేసు స్పష్టంచేయుచున్నాడు. ప్రేమలేనిచో ఎన్ని ఆజ్ఞలు యున్నా ఫలితం ఉండదు! మనం ఎన్నికార్యాలైన చేయవచ్చు కాని, ప్రేమలేనిచో, వృధాయే! అందుకే ఇతరులపట్ల, ముఖ్యముగా బలహీనులపట్ల ప్రేమ కలిగియుండాలని మొదటి పఠనములో ధ్యానించాము. “ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే” (రోమీ. 13:10) అని పౌలుగారు చెప్పియున్నారు.

ఈ సమాధానము వలన, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి, ఇతర పరిసయ్యులకు వాదించదానికి ఇక ఏమీ లేకుండెను. ప్రభువు ఇంతటితో తన సమాధానమును ఆపివేసి యుండవచ్చు. కాని యేసు మరల, “నిన్ను నీవు ప్రేమించు కొనునట్లు నీ పొరుగు వానిని ప్రేమింప వలెను” అను రెండవ ఆజ్ఞను తెలిపియున్నాడు (చదువుము రోమీ. 13:9, గలతీ. 5:14). ఈ ఆజ్ఞను లేవీయకాండము 19:18లో చూడవచ్చు (మత్త. 5:43, 19:19లో కూడా చూడవచ్చు). “ఈ రెండవ ఆజ్ఞయు ఇట్టిదే” అని ప్రభువు అన్నారు. అనగా మొదటి దానికి ఎంత ప్రాముఖ్యత యున్నదో, రెండవ దానికి అంతే ప్రాముఖ్యతయున్నదని అర్ధము. రెండు ఆజ్ఞలుకూడా విడదీయరానటువంటి సంబంధాన్ని కలిగియున్నాయని, పరస్పర అధారితములని, ఒకటినొకటి పరిపూర్ణము చేయునని అర్ధము. దైవప్రేమ సోదరప్రేమకు నడిపించును. సోదరప్రేమ దైవప్రేమలో భాగము. 1 యోహా. 4:20 దీనిని చక్కగా వివరిస్తుంది:, “ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ఎటుల ప్రేమింపగలడు?” పునీత మదర్ తెరిస్సా పేదలకు సహాయం సేవచేయడం ద్వారా, దేవునిపట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు.

సోదరుని ప్రేమించడం అంటే ఏమిటో, లేవీయకాండము 19:9-18లో వివరించబడినది (చదువుము). వీనిలో ఆసక్తికరముగా, “పొరుగువాని తప్పిదమునుగూర్చి అతనిని మందలింపుడు” (17వ వచనం) అని కూడా చదువుచున్నాం. అనగా ఇది బాధ్యతతో కూడినటువంటి సోదరప్రేమ అని అర్ధమగుచున్నది. లేవీయకాండము, ప్రభువు బోధించెడు సోదరప్రేమ వారిపట్ల మనం చేయు కార్యాలపై ఆధారపడియున్నది. ప్రేమ కేవలం ఒక భావన (ఫీలింగ్) మాత్రమే కాదు. అది మన చేతలలో, కార్యాలలో నిరూపితమగును. నేను ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడంకన్న, నీ పక్కననున్న సోదరుని ప్రేమించగలగాలి.

“నిన్ను నీవు ప్రేమించు కొనునట్లు”అను వాక్యము “మూల ధర్మము”ను గుర్తుకు చేస్తుంది, “ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు” (మత్త. 7:12). సోదరప్రేమ యనగా (ప్రేమ = ఆగాపే’) ఇతరుల శ్రేయస్సుకోసం పాటుపడటం. యోహాను సువార్తలో, సోదరప్రేమకు ఇంకా లోతైన భావాన్ని చూస్తున్నాము, “మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు” (యోహాను. 13:34, 15:12). 

“మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడి యున్నవి” - మోషే ధర్మశాస్త్రము అనగా ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు; మొదటి ఐదు గ్రంథాలు; యూదులకు అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథాలు. తరువాత ప్రాముఖ్యమైనవి ప్రవక్తల గ్రంథాలు (యెషయానుండి మలాకీ వరకు). ఇవి దేవుని ప్రేమను చాలా స్పష్టముగా వ్యక్తపరుస్తున్నాయి. “నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దుచేయ వచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమొనర్చుటకేగాని, రద్దుచేయుటకు కాదు” (మత్త. 5:17) అని ప్రభువు స్పష్టం చేసియున్నారు. 

ప్రభువు దీనిని అక్షరాల జీవించాడు. ఆయన అందరిని అనంతముగా ప్రేమించాడు. మనము ప్రేమించుటకు, ప్రేమించబడటానికి సృష్టింపబడినాము. ప్రేమ కలిగిన దేవుడు ఆయనను ప్రేమించడానికి, ఆయన మనలను ప్రేమించడానికి, తోటివారిని ప్రేమించడానికి, తద్వారా ఆయన జీవితములో పాలుపంచుకోవడానికి మనలను సృష్టించాడు. దీనిని సార్ధకం చేయడానికి మనకు దైవానుగ్రహం కావాలి. ఆ దైవానుగ్రహం నిత్యం దివ్యపూజా బలిలో విదితమగుచున్నది. కనుక, ఈరోజు దివ్యపూజా బలిలో (క్రీస్తు ప్రేమ బలి) దేవుని అనుగ్రహం కొరకు ప్రార్ధన చేద్దాం.  

సందేశాలు: 

- దేవున్ని ప్రేమించడం అనగా, అన్నివిషయాలలో దేవుని చిత్తాన్ని పాటించడం; దేవునకు కృతజ్ఞత కలిగియుండటం; ఆయనపై ఆధారపడి జీవించడం; దేవుని వాక్యమును చదివి ధ్యానించడం; దివ్యపూజా బలిలో పాల్గొనడం... మన జీవితములో దేవునికి ప్రధాన స్థానాన్ని ఇవ్వడం [సాధారనముగా మనం పనికి, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము].

- సోదరులను ప్రేమించడం అనగా, వారికి సహాయం చేయడం, వారిని ప్రోత్సహించడం, మన్నించడం, వారికోసం ప్రార్ధన చేయడం... 

- నిజమైన ప్రేమ త్యాగముతో కూడుకున్నది. యేసు సిలువపై మరణించి తన అనంతమైన ప్రేమను నిరూపించారు. దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమలో ప్రదర్శితమవుచున్నది: “మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించుటనుబట్టి, దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు” (రోమీ. 5:8). దేవుని ప్రేమ సూర్యునివలె మనపై ప్రకాశించు చున్నదని గుర్తిస్తున్నావా

- నేను దేవున్ని ఎలా ప్రేమించగలను? తోటివారిని (భర్తను, భార్యను, పిల్లలను, తలిదండ్రులను, సంఘమును...) ఎలా ప్రేమించగలను? అని ప్రతీరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. 

- మనం పనిచేయు స్థలములో ఎంతోమంది వ్యక్తులను కలుస్తూ ఉంటాము. వారితో నా ప్రవర్తన ఏవిధముగా ఉన్నది? తోటివారు అనగా అందరు అని (కేవలము మనకు తెలిసిన వారు మాత్రమే కాదు!) తెలుసుకున్నావా

- పిల్లలకు ప్రేమించడం నేర్పించండి (మీ జీవితము ద్వారా, మాటల ద్వారా)

No comments:

Post a Comment