25వ సామాన్య
ఆదివారము [YEAR A]
యెషయా 55:6-9;
ఫిలిప్పీ. 1:20-24, 27; మత్తయి 20:1-16
దేవుని న్యాయము - కృప
మొదటి పఠనము: యెషయా
55:6-7 వచనాలు - దేవుని మన్నింపు పొందుటకు ఆహ్వానం: “ప్రభువు దొరుకునప్పుడే
ఆయనను వెదకుడు. ఆయన చేరువలోనున్నప్పుడే ఆయనకు ప్రార్ధన చేయుడు” (6). “ప్రభువు
దొరుకునప్పుడే” మరియు “ఆయన చేరువలోనున్నప్పుడే” అను వాక్యములు, సత్వర ఆవశ్యకతను
[అత్యవసరము] గూర్చి యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయు చున్నాడు. ఇదే తగిన
సమయం! [అనగా, ప్రస్తుత కాలం చాలా ముఖ్యమైనది, దానిని సద్వినియోగ పరచుకోవాలి].
దేవుడు కనుగొనబడును. త్వరపడండి. ప్రభువును వెదకండి లేదా కనుగొనండి. దేవుడు ఎక్కడో
దాగియున్నాడని దీని భావం కాదు. ఆయన సర్వాంతర్యామి. అంతటా ఉంటాడు. మనం ఆయనను
చూడలేనిచో, ఆయన మనకు లేనట్లే కదా! కనుక, మన హృదయాలతో [కన్నులతో] ప్రభువును చూడాలి.
ప్రభువు చేరువలో నున్నప్పుడు మనం ఆయనను వెదకనిచో, ఆయనను పిలువనిచో [ప్రార్ధన],
వాగ్ధానము చేయబడిన దేవుని ఆశీర్వాదములను పొందలేము. “ప్రభువు చేరువలో నున్నప్పుడు”
అనగా మనం పాపమును వీడి, పశ్చాత్తాప హృదయాలతో దేవుని దరికి చేరడం.
“దుర్మార్గులు తమ మార్గమును
విడనాడుదురు గాక!” (7). ఈ వాక్యము ద్వారా పశ్చాత్తాప ఆవశ్యకతను లేదా అత్యవసరతను
గురించి యెషయా ప్రవక్త ప్రజలకు తెలియజేయు చున్నాడు. పశ్చాత్తాపము అనగా ‘దేవుని
వైపుకు మరలడం’; ‘మన మార్గమును [పాపము, దుర్మార్గము, దుష్టత్వము] వీడి దేవుని
మార్గము వైపు మరలడము’. మన జీవితములో దేవుని మహోన్నతమైన పునరుద్ధరణ మన పశ్చాత్తాపము
ద్వారా జరుగును. “దుర్మార్గులు తమ ఆలోచనను మార్చుకొందురు గాక!” (7). మన దుర్మార్గం
లేదా దుష్టత్వం మన ఆచరణలలో, చర్యలలో [మన మార్గము] ప్రదర్శిత మగును. అయితే,
అన్యాయపు బుద్ధి మన ఆలోచనలలోనే ఉంటుంది. ఏదైనా మన ఆలోచనల నుండియే వస్తుంది. దీనిని
ఎరిగిన పౌలు కొరింతీయులకు వ్రాసిన లేఖలో ఇలా వ్రాశాడు: “ఆలోచనలను బంధించి
క్రీస్తునకు విధేయములుగ చేయుదము” (2 కొరి 10:5). అలాగే రోమీయులకు వ్రాసిన లేఖలో,
“మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా [ఆలోచనలలో
మార్పుద్వారా] నూతనత్వమును కలుగజేయనిండు” (రోమీ 12:2) అని వ్రాసాడు.
“ప్రభువు వారి మీద దయ జూపును”
(7). ఇదొక మహోన్నతమైన దేవుని వాగ్ధానము! మనము ప్రభువు వద్దకు మరలి వచ్చినచో
[పశ్చాత్తాపము, మారుమనస్సు, హృదయ పరివర్తనము], ప్రభువు మనపై దయ చూపును. “మన దేవుడు
[మనలను] మిక్కుటముగా మన్నించును” (7).
మనతో నున్న సమస్య ఏమిటంటే, మనము
తిరిగి వచ్చినప్పుడు, ప్రభువును కనుగొనలేమని కాదు, కాని మనము ప్రభువు వద్దకు
తిరిగి వచ్చుటలో విఫలమగుచున్నాము.
తమ మార్గములను, ఆలోచనలను
మార్చుకొని, పశ్చాత్తాప పడి, ప్రభువు వైపుకు [ప్రభువు మార్గము, ఆలోచనలు] తిరిగి
వచ్చు వారికి, ప్రభవు చేరువలోను ఉండువాడు. దుర్మార్గులకు, దుష్టులకు ప్రభువు దూరమునను
ఉండువాడు. కనుక, సమస్య అంతా మనదే! దేవునిది కాదు! కనుక, ఆధ్యాత్మిక కన్నులను తెరచి
చూడుము. ప్రభువును చూచెదము. ఆయనను కనుగొనెదము.
యెషయా 55:8-9 వచనములు ప్రభువు
పలుకులు: “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ మార్గములు నా మార్గముల వంటివి
కావు.” దేవుడు మనలా ఆలోచించడు. మనము దేవుని పోలికలో సృజింప బడినాము, కనుక దేవుని
ఆలోచనలతో మన ఆలోచనలను కేవలము పోల్చుకొన వచ్చును కాని, దేవుని ఆలోచనలను మనము
ఎన్నటికిని కలిగి యుండలేము. అలాగే దేవుని వలె మన ఆచరణలు ఉండలేవు. ఆకాశము భూమికెంత దూరమో,
దేవుని మార్గములకు, ఆలోచనలకు మన మార్గములకు, ఆలోచనలకు అంత దూరము [“ఉన్నతముగా”]
ఉండును.
అయితే, క్రీస్తు ప్రభువు
ద్వారా, పరలోకము భూలోకమునకు ఏతెంచెను. తద్వారా, మన మార్గములు, ఆలోచనలు దేవుని మార్గములు,
ఆలోచనలు వలె రూపాంతరము చేసుకొన అవకాశము లభించెను. పౌలు మాటలలో ఇది నిరూపితమగు
చున్నది: “తన కుమారుని సారూప్యమును కలిగి యుండునట్లు దేవుడు ఏర్పరచెను” (రోమీ 8:29).
ఎప్పుడైతే మన రక్షణ పరిపూర్తి యగునో, అప్పుడు దేవునికి మనకు మధ్యన నున్న దూరము తరిగి
పోవును. దేవుని కుమారుడు ఈలోకములో జన్మించి, తన రక్షణ కార్య సాధన ద్వారా, దేవునికి-మనకు
మధ్యనున్న దూరమును తగ్గించి యున్నాడు. రక్షకుడైన క్రీస్తును విశ్వసించడం ద్వారా అది
కొంత వరకు ఈ లోకములోనే సాధ్యమగును. మన సంపూర్ణ రక్షణతో, మహోన్నతమున దేవునితో మనం
ఐక్యమగునప్పుడు, మన మార్గములు, ఆలోచనలు దేవుని మార్గములు, ఆలోచనలు అగును.
సువిశేష పఠనము: ద్రాక్షతోట-కూలీల
ఉపమానము (మత్తయి 20:1-16). కేవలం మత్తయి సువార్తలో మాత్రమే చెప్పబడినది. ఇది
దైనందిన జీవితాలకు సంబంధించిన [ఆనాటి సామాజిక పరిస్థితి] ఉపమానము. కనుక శ్రోతలు,
ఉపమానములోని వ్యక్తులలో తమ్ముతాము చూసుకొనెదరు. అలాగే, సమాజములో సాధారణముగా జరగని
విషయాలు కూడా ఈ ఉపమానములో చూడవచ్చు (ఉదా. వేతనముల చెల్లింపు). ఉపమానములోని నాలుగు
ముఖ్యమైనవి “ద్రాక్షతోట” [ఇశ్రాయేలు ప్రజలు], “యజమాని” [తండ్రి దేవుడు], “పనివారు”
[దేవుడు పిలుచుకొను ఎవరైనను], “వేతనము” [దేవుని బహుమానము – దైవరాజ్యము].
మత్తయి 20వ అధ్యాయములో ‘అనుగ్రహము’,
‘గొప్పతనము’ మరియు ‘సేవ’ అను అంశముల గూర్చి ప్రభువు బోధించు చున్నాడు.
మత్తయి 19:16-26లో ఒక ధనవంతుడైన
యువకుడు నిత్యజీవము పొందుటకు ఏమిచేయాలని ప్రభువు వద్దకు వచ్చాడు. తన సంపదలను దానము
చేసి వచ్చి, తనను అనుసరించమని యేసు ప్రభువు కోరినప్పుడు, తన సంపదలను వదులుకోలేక
పోయాడు. బాధతో వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తరువాత, మత్తయి 19:27వ వచనములో పేతురు, “మేము
[తాను మరియు ఇతర శిష్యులు] సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి
లభించును?” అని ప్రభువును ప్రశ్నించాడు. శిష్యుల అజ్ఞానం, ఆశ మనకి
కనిపిస్తున్నాయి. ఇదే చివరి సారి కాదు. మరల వెమ్మటే, మత్తయి 20:20-21లో ఇలాంటి
ప్రశ్నే ప్రభువును అడగటం చూస్తాం. ఇలాంటి ఆశలు నేడు మనలో లేవంటారా?
దీనికి సమాధానముగా, ప్రభువు మొదటిగా,
19:28లో ఒక గొప్ప వాగ్ధానమును [బహుమానము] శిష్యులకు చేసియున్నాడు: “పున:స్థితి
స్థాపన సమయమున, మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనపుడు, నన్ను
అనుసరించిన మీరును పండ్రెండు ఆసనములపై కూర్చుండి, యిస్రాయేలు పండ్రెండు గోత్రములకు
తీర్పు తీర్చెదరు” [ఇది కేవలం శిష్యులకు మాత్రమే కాదు; దేవుడు ఎవరికైనా దయచేయవచ్చు].
రెండవదిగా, ఆ బహుమానమును గురించిన హెచ్చరికను చేసి యున్నాడు: “అయినను
మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు. కడపటివారు మొదటివారు అగుదురు” (19:28). చివరిగా,
“ద్రాక్షతోట-కూలీల ఉపమానము” (20:1-16) ద్వారా ఆ హెచ్చరికను ప్రభువు వివరించుచున్నాడు.
బహుమానమును ఒసగుటలో దేవుని విధానము, క్రమము మానవులు అనుకున్న విధముగా ఉండదని అర్ధం
అగుచున్నది.
యజమానుడు పనివారలకై ప్రాత:కాలమున అంగడి వీధిలోనికి బయలు దేరెను (1-2): పనివారు, తమ పనిముట్లతో ఎవరైనా పనికి పిలుస్తారని ప్రాత:కాలముననే, అంగడి వీధిలో గుమికూడెడి వారు. పనివారు అవసరమై ఉన్నవారు అక్కడకు వచ్చి వారిని పిలుచుకొని వెళ్ళేవారు. ప్రాత:కాలము అనగా “వేకువ జాము” 6 గం.ల సమయము. రోజువారి కూలీ ఒక దీనారము [రోమనుల వెండి నాణెము – ఒకరోజు కూలి] చొప్పున ఒప్పందము చేసుకొనెడివారు. ఇది సాధారణముగా జరిగే విషయం.
రోజు మొత్తము కూడా యజమానుడు పనివారిని కూలీకి ఏర్పాటు చేయుచున్నాడు (3-7): ఉదయం తొమ్మిది గంటల సమయమున [గ్రీకులో మూడవ గంట], పండ్రెండు గంటల సమయమున [ఆరవ గంట], మధ్యాహ్నం మూడు గంటల సమయమున [తొమ్మిదవ గంట] మరియు సాయంకాలము ఐదు గంటల సమయమున [పదకొండవ గంట] కూడా యజమానుడు సంత వీధిలో పనిపాటులు లేక నిలిచి యున్న వారిని తన ద్రాక్షాతోటలో పనికి కుదుర్చు కొనెను.
వర్షాకాలము రాక ముందే పంటను
సమకూర్చు కొనకపోతే, పంట నాశనమగును. కనుక
వీలగుమంది పనివారిని పిలచుకొనేవారు, చివరికి ఒక గంటయైనా సరే! ఉపమానములో యజమానుడు తన
తోటలో అందరికి ఇవ్వదగిన పని యున్నట్లుగా కనిపిస్తున్నది. అలాగే, సాయంకాలము వరకు
కూడా పనిపాటులు లేనివారిని చూసి యజమానుడు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తపరచాడు. రోజంతయు
వారు పని లేక ఉండిరి. వారు సోమరులు కాదు కాని, వారికి పనిని ఎవరు ఇవ్వలేదు. ఇచ్చట
శ్రమ లేదా పని పట్ల గౌరవం గురించి కూడా ధ్యానించ వచ్చు [Dignity of Labour].
“న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను”:
మొదటగా పిలువబడిన వారికి నిర్దిష్ట వేతనముగా ఒక దీనారము చొప్పున ఒప్పందము చేసుకొనెను.
కాని, ఇతరులకు నిర్దిష్టమైన వేతనము ఏమీ లేదు. న్యాయముగా వారికి రావలసినది వారు పొందెదరని
వాగ్ధానము చేసెను.
యజమానుడు వేతనములను చెల్లించుట (8-10): యజమానుడు తన గృహ నిర్వాహకునితో, “చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి కూలినిమ్ము” అని చెప్పెను. రోజువారి కూలీలు కనుక, ఏ రోజు వేతనములను ఆ రోజే చెల్లించెడివారు. చివరిగా వచ్చిన వారికి [ఒక గంట పనిచేసిన వారు] కూడా తలొక దీనారమును ఇచ్చిరి. ఇది సాధారణముగా జరిగే విషయం కాదు. కనుక, వారు ఎక్కువగా ఆనంద పడిరి. మనము అలా చేయగలమా?
“తనకు ఎక్కువ కూలి వచ్చునని
తలంచిరి” (10) – మిగతా వారందరు, ముఖ్యముగా ఒక గంట పని చేసిన వారు కూడా తలొక
దీనారము పొందినందు వలన, రోజు మొత్తం పని చేసిన వారు, ఎక్కువ కూలి వచ్చునని
భావించారు. మనము కూడా అలాగే భావించే వారము కదా? ఇచ్చట వేతనాలు చెల్లించిన క్రమం
చాలా ముఖ్యం. రోజంతా పని చేసిన వారికి మొదటగా వేతనము ఇచ్చినచో, వారు ఆశ పడే అవకాశం
గాని, నిరీక్షించే అవకాశం గాని ఉండక పోయెడిది. వారి వేతనం తీసుకొని అక్కడ నుండి
వెళ్ళిపోయేవారు. బహుశా, మొదటగా పిలువనందున, ఆరంభములో వారి అహం దెబ్బతిని యుండవచ్చు.
కాని తరువాత, ఎక్కువ వేతనం లభించునని వారిలో ఆశ కలిగింది. “కాని చివరకు వారు కూడా
తలకొక దీనారమునే పొందిరి” (10). యజమానుడు ఒప్పందం చేసుకొన్న విధముగనే (20:2) వారికి
వేతనము ఇచ్చెను. ఎక్కువ వచ్చునని ఆశించిన వారికి నిరాశయే కలిగినది.
వారు ఫిర్యాదు చేసిరి / గొణుగుచు పలికిరి (11-15): వారు యజమానిపై ఫిర్యాదు చేసిరి [బహుశా, వేతనము చెల్లించుచున్న గృహ నిర్వాహకునితో]: “ఇతరులతో సమానముగా కూలి నిచ్చితివేమి?” మనము అలాగే ప్రశ్నించే వారమా? అందుకు అక్కడనే నున్న యజమాని వారితో, “నేను మీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దీనారము చొప్పున మీరు ఒప్పుకొనలేదా?” మీతో నేను చేసుకున్న ఒప్పందమును నేను మీరలేదు అని పలికెను. అలా ఎందుకు చేసాడో యజమాని వివరించలేదు. కాని, “నా ధనమును నా యిచ్చవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత మీకు కంటగింపుగా [కన్ను కుట్టుట అని కూడా అంటాము] ఉన్నదా?” అని పలికాడు. ఈ మాటలు యేసు సందేశమును తెలియజేయు చున్నాయి: యజమాని అన్యాయం చేయలేదు. తాను అంగీకరించిన దానిని చెల్లించాడు. అందరికి సమానముగా ఇవ్వాలనేది యజామని స్వనిర్ణయం. ఇతరులకు ఫిర్యాదు చేసే హక్కు ఎంతమాత్రము లేదు. న్యాయముగా ప్రవర్తిస్తూ, యజమాని తనకు చెందిన దానితో మంచి చేసే హక్కు అతనికి ఉన్నది. ఇతరుల మంచితనము పట్ల మనం ఎందుకు అసూయ పడాలి?
ప్రాచీన యూదులలో, ‘కంటగింపు’
కలిగిన వాడు అనగా అసూయపరుడు, అత్యాశపరుడు అని, తోటివారి సంపద పట్ల అసంతృప్తి
కలిగినవాడు అని, ధన ప్రేమికుడు అని, దేవుని పేరిట ఎలాంటి దానధర్మాలు చేయనివాడని భావించేవారు
[ద్వితీయో. 15:9లో “చిన్నచూపు చూచుట” అని, 1 సమూ. 18:9లో “కన్నుకుట్టుట” అని వాడబడింది].
ధనం దైవరాజ్య ప్రవేశానికి అడ్డంకియని బైబులులో
అనేక చోట్ల చూస్తున్నాము (ఉదా. మత్తయి 19:23-24). ఈవిధముగా, యజమాని తన ఉదారస్వభావము
పట్ల వారి అసూయను, ఆగ్రహాన్ని చూసి వారిని మందలించాడు.
దేవుని బహుమాన క్రమం, నిర్ణయం: “మొదటివారు కడపటివారగుదురు. కడపటివారు మొదటివారగుదురు” (20:16): పేతురు మరియు ఇతర శిష్యులు ప్రభువును అనుసరించుటకు ఎంతో త్యాగము చేసియున్నారని భావించారు. అందుకే, వారికి ఎలాంటి బహుమానం లభించునోయని తలంచి, ప్రభువును ప్రశ్నించారు! ఈ ఉపమానము ద్వారా వారికి తప్పక బహుమానము లభించునని ప్రభువు తెలియజేయు చున్నారు. కాని, దేవుని సూత్రం/నియమావళి ఏమిటంటే, “మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు. కడపటివారు మొదటివారు అగుదురు” (మత్తయి 19:30; 20:16). మనం ఆశించిన తీరుగా దేవుని మార్గములు, ఆలోచనలు ఉండవని (మొదటి పఠనము) అర్ధం అగుచున్నది.
ఈ ఉపమానమును ఎన్నో రకాలుగా
వివరించడం జరుగుతుంది: (1). ప్రజలు దేవుని దరికి వివిధ దశలలో వస్తారు అని – జీవిత ఆరంభములో,
యుక్తవయస్సులో, యవ్వనములో, వృద్ధ్యాప్యములో లేదా చివరి దశలో... (2). సువార్త
ఏవిధముగా ప్రకటింప బడినది – మొదటగా, బాప్తిస్మ యోహాను ప్రచారం, యేసు సువార్తా
ప్రచారం, పెంతకోస్తున ప్రచారం, యూదులకు, చివరిగా అన్యులకు ప్రకటింప బడుట... అయితే,
ఈ ఉపమానము ద్వారా దేవుని కృప, బహుమానము గురించి మనం ప్రధానముగా ధ్యానించాలి.
(1). దేవుని కృప, ఆశీర్వాదం ఆయన
చిత్తానుగుణముగా ఒసగ బడును. దేవుడు తన కృపతో తన ఇచ్చవచ్చినట్లుగా చేయును కాని, మన
యోగ్యతను బట్టి కాదు. శాశ్వత ఆనందం దేవుని ఉదారము యొక్క అనుగ్రహము!
(2). యజమాని ఎవరికీ అన్యాయము
చేయలేదు. కాగా, తన ఉదార స్వభావమును చాటుకున్నాడు. అలాగే దేవుడు కూడా ఎవరికీ
అన్యాయము చేయడు. మన చర్యలను దేవునిపై ప్రేమతో [క్రీస్తు నందు విశ్వాసము] మరియు
ఇతరుల రక్షణార్ధమై చేసినప్పుడు, చివరిగా వచ్చిన వారివలె దేవుని బహుమానమును పొందెదము.
(3). దేవుని కృప ఎల్లప్పుడూ
ధర్మబద్ధముగా ఒసగ బడును. దేవుని రాజ్యములో అందరూ సమానమే!
(4). దేవుని కృప మన చర్యలలో
ప్రదర్శితమవ్వ వలెను. మనం చేసే ప్రతీ కార్యము, సేవ, దేవునికి చెందినదే! సేవ చేసే
మన శక్తి దేవునిదే! సేవ చేయుటకు మన పిలుపు దేవుని అనుగ్రహమే! సేవ చేయు ప్రతీ అవకాశం
దేవుడు ఒసగు వరమే! సేవ చేయుటలో విజయం కూడా దేవుని కృపయే! కనుక, దేవుడు మనకు
ఒసగునది వేతనము [ప్రతిఫలము] కాదు, అది బహుమానము [ఉచితము], కృపానుగ్రహము!
మన దృష్టిని, మనము మొదటి వారమా?
కడపటి వారమా? అనే దానిపై గాక, మనకు అప్పగింప బడిన క్రైస్తవ బాధ్యతలపై, క్రైస్తవ
ధర్మముపై సారించాలి. దేవుని “ద్రాక్షాతోటలో” [పరలోక రాజ్యము] పని చేయాలి. మన
జీవితమును బట్టి మనం దేవుని మహిమలో పాలుపంచుకుంటాము.
మనమందరము కూడా క్రీస్తు
శరీరములో బాగస్థులము. క్రీస్తునందు ఒకే శరీరము. కనుక, తోటివారిపై అసూయ పడక, వారి
పట్ల ఆనందించుదాము. ‘సేవ’యనగా ‘త్యాగం’, ‘సమర్పణ’ అని గుర్తుంచుకుందాం!
దేవుని రాజ్యం [ప్రభువు] కొరకు త్యాగం చేయుటకు సిద్ధముగా ఉన్నానా?
ధ్యానించుదాం: “నా నిమిత్తము గృహములనుగాని, సోదరులనుగాని, సోదరీలనుగాని, తల్లినిగాని, తండ్రినిగాని, పిల్లలనుగాని, భూములనుగాని, త్యజించిన ప్రతివాడును నూరంతలు పొంది, నిత్యజీవమునకు వారసుడగును” (మత్తయి 19:29).
“నేను జీవించిననాళ్ళు నీ కరుణయు
ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభువు మందిరమున వసింతును” (కీ. 23:6).
“ఒకే గమ్యం చేరటానికి మానవులంతా పిలుపునందుకున్నారు. ఆ గమ్యం దేవుడే” (“కతోలిక సత్యోపదేశం” నం. 1878).
No comments:
Post a Comment