24వ సామాన్య ఆదివారము [YEAR A]: క్షమా ధర్మములు

 24వ సామాన్య ఆదివారము [YEAR A]

సీరా. 27:30-28:7; రోమీ. 14:7-9; మత్తయి 18:21-35

క్షమా ధర్మములు



ఉపోద్ఘాతము: క్రీస్తు నందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు మనం 24వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. ఈనాటి పఠనాలు “క్షమా గుణము” గురించి బోధిస్తున్నాయి. “మన్నించుట” క్రైస్తవ ధర్మం లేదా సుగుణం. క్రైస్తవ జీవితానికి మరియు క్రైస్తవ విశ్వాసానికి లక్షణం లేదా గురుతు. మన్నించుట యనగా ఇతరులను ప్రేమించడం మరియు ఇతరులపట్ల దయ, ఉదార స్వభావము కలిగి యుండటం లేదా వారిని సంరక్షించడం; ఇతరులకు మన చేయూతను అందించడం; వారిని తిరిగి నూతన స్నేహము, బంధములోనికి ఆహ్వానించడం. మన పట్ల తలపెట్టిన గత బాధ, గాయము మానక పోవచ్చు లేదా మనము దానిని మరచిపోవకపోవచ్చు. అయినప్పటికిని, మన్నించడము ద్వారా, ఇతరులను [అపరాధులను, నేరస్తులను] నూతన సాంగత్యము, బంధములోనికి మనం తీసుకొని రాగలము. వారిలో మారుమనస్సు, హృదయ పరివర్తనను కలిగించవచ్చును. మన్నింపు అనే సుగుణము ద్వారా కోల్పోయిన బంధాన్ని పునర్నిర్మింప వచ్చును. తద్వారా, క్రైస్తవ ప్రేమపై ఆధారపడు బంధాన్ని తిరిగి నిలబెట్టటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. క్రీస్తు సిలువపై పలికిన క్షమా పలుకుల ద్వారా క్షమా గుణము గురించి తెలియ జేశారు. తోటి వారి అపరాధములను మన్నించినచో మన అపరాధములను దేవుడు మన్నించును అని మొదటి పఠనములో చదువు చున్నాము. సువార్త పఠనములో, ప్రభువు పేతురుతో “ఏడు కాదు, ఏడు డెబ్బది సార్లు మన్నించాలి”, అనగా, లెక్కనేనన్ని సార్లు మన్నించాలి అని లేదా అనంతముగా తోటి వారి అపరాధములను మన్నించాలని తెలియజేయు చున్నారు. మనందరికీ క్షమ, మన్నింపు [అనంతముగా] అవసరమే! అలాగే ఇతరులను కూడా క్షమించమని ప్రభువు మనలను కోరుచున్నారు. “మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై యుండుడు” (లూకా 6:36) అని యేసు తెలియజేయు చున్నారు.

మొదటి పఠనము: ఈ జ్ఞాన గ్రంథము యొక్క నేపధ్యము ఏమనగా, ఆనాటి యూద మతము, యూద సంఘము, ఆర్ధిక స్థితి, ధనిక-పేద అను తారతమ్యాలతో విడిపోయినది. లింగ వివక్ష, ధర్మాన్ని పాటించేవారు-పాటించనివారు అనే విభజనలతో నిండి ఉన్నది. గ్రీకు సంస్కృతి ప్రభావం కూడా యూదులపై ఎక్కువగా ఉండెడిది. ఇలాంటి నేపధ్యములో, యూదులు వారి ఆధ్యాత్మిక జీవిత మూలాలను మరచిపోకూడదనే ఉద్దేశము కొరకు ఈ గ్రంధము వ్రాయబడినది.

ఈనాటి పఠన భాగములో పగ, కోపముతో నున్న సంఘమునకు క్షమాగుణము యొక్క గొప్పతనాన్ని రచయిత తెలియజేయు చున్నాడు. “పగ, కోపము అనునవి ఘోరమైనవి” (27:30). అవి కుటుంబాలను, సంఘాలను, సమాజాలను [శ్రీసభ] నాశనం చేయును, విభజనలు గావించును. క్షమాపణ, ప్రార్ధన [మొర] కుటుంబాలను, సంఘాలను, సమాజాలను [శ్రీసభ] ఏకము చేయును. విడిపోయిన బంధాలను కలుపును. అలాగే, దేవుడు మన పాపాలను క్షమించాలంటే, మనం తోటివారి [ఇతరుల] పాపాలను క్షమించాలి. దేవుని దయను మనము పొందాలంటే, మనం ఇతరుల పట్ల దయ కలిగి జీవించాలి. ఇతరులపై మనం పగ తీర్చుకొనిన, మనమీద ప్రభువు పగ తీర్చు కొనును(28:1).

పగ, కోపములను జయించాలంటే, అధిగమించాలంటే ఏమి చేయాలి? ఒకసారి, నెమ్మదించి మన జీవితాలను చవిచూడమని రచయిత [సీరా పుత్రుడైన యేసు] విజ్ఞప్తి చేయుచున్నాడు. “నీవు చనిపోవుదువని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను అణచుకొనుము. నీవు చనిపోగా నీ దేహము క్రుళ్ళిపోవునని గ్రహించి దైవాజ్ఞలు పాటింపుము. దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగువాని మీద కోపము మానుకొనుము. దేవుని నిబంధనమును తలచి అన్యుని తప్పిదములను మన్నింపుము” (28:6-7).

- పగను అణచుకొనుము: మనం ఈ లోకములో శాశ్వతము కాదు. ఏదో ఒకరోజు మరణించ వలసినదే! మరణం తరువాత శాశ్వతముగా ప్రభువులో జీవించాలంటే, తోటివారి పట్ల నిబద్ధతతో కూడిన జీవితమును జీవించాలి, అనగా మనకు కీడు, దోషము తలపెట్టిన వారి పట్ల మన కోపాన్ని అణచుకొన వలయును..

- దైవాజ్ఞలు పాటింపుము: మనం మానవులము కనుక మన దేహములు క్రుళ్ళిపోవును. కనుక దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించుదాం. ఎందుకన, మనం దేవునితో పాటు అమరత్వములో జీవించుటకు పిలువబడినాము. అమరత్వములో జీవించాలంటే, ఈ అశాశ్వతమైన జీవితమును జయించాలి. దైవాజ్ఞలు పాటించడం అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం.

- అన్యుని [ఇతరుల] తప్పిదములను మన్నింపుము: దేవుని ఆజ్ఞల సారాంశం ప్రేమ. [ప్రేమ: దైవ ప్రేమ, సోదర ప్రేమ] కనుక, దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా అనగా ప్రేమతో కూడిన జీవితాన్ని జీవించడం ద్వారా, అలాగే, దేవుని నిబంధనలను, వాగ్దానములను గుర్తుచేసుకొనుట ద్వారా, పొరుగువారి తప్పిదములను మన్నించగలము అనగా వారిని ప్రేమించ గలము.

కనుక, దేవుని నుండి దయ, కరుణను పొందిన మనము అదే దయను, కరుణను ఇతరులపై చూపాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధన, ఒడంబడిక నిమిత్తమై, దేవుడు వారిని ఎన్నోసార్లు క్షమించాడు. దేవుని పట్ల వారు అనేకసార్లు నమ్మకద్రోహం చేసినను, దేవుడు నిబంధన పట్ల విశ్వాసపాత్రుడై ఉన్నాడు. అలాగే వారు కూడా తోటి వారి పట్ల దయ కలిగి, క్షమించాలని ప్రభువు ఈ గ్రంథము ద్వారా వారికి [మనకు కూడా] తెలియజేయు చున్నాడు.

రెండవ పఠనము: దేవుడు తన కుమారుడు క్రీస్తు ద్వారా మనలను తనకు బిడ్డలుగా [దత్త పుత్రులుగా] చేసుకున్నాడని పౌలు గుర్తుచేయు చున్నాడు. క్రీస్తు తన మరణము ద్వారా లోక పాపాల కొరకు శాశ్వత బలిని అర్పించి, తద్వారా, తండ్రి దేవుని చిత్తాన్ని పరిపూర్ణముగా నెరవేర్చి మనలను దేవుని దత్త పుత్రులుగా చేసియున్నాడు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు శరీరములో భాగమై, క్రీస్తుకు మనము సోదరులముగా మారియున్నాము; క్రీస్తు మరణములోను, ఉత్థానములోను సన్నిహితముగా ఐక్యమై యున్నాము. కనుక, మనము జీవించినను, మరణించినను ప్రభువునకు చెందిన వారమే” (14:8) అని పౌలు చెప్పుచున్నాడు. జ్ఞానస్నానము పొందిన మనము క్రీస్తుకు [శాశ్వతముగా] చెందిన వారము. కనుక, మన శారీరక మరణము మనలను క్రీస్తు నుండి వేరు చేయలేదు. క్రీస్తు తన ఉత్థానము ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా, మానవాళికి ఉత్థానమును సంపాదించాడు. జ్ఞానస్నానములో మనము క్రీస్తుతో పాటు ఉత్థాన మగుచున్నాము.

సువిశేష పఠనము: ప్రభువు తన శిష్యులకు క్షమా గుణము యొక్క అవసరత గురించి తెలియజేయు చున్నాడు. పేతురు యేసు వద్దకు వచ్చి “ప్రభూ! నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? ఏడు పర్యాయములు క్షమిస్తే సరిపోతుందా?” అని ప్రశ్నిస్తున్నాడు  (18:21). యూద సంప్రదాయము ప్రకారం, ‘మూడు సార్లు [మూడు దోషములను] క్షమించాలి. నాలుగవ సారి తప్పు చేస్తే శిక్ష విధించాలి! పేతురు తన ఉదార స్వభావమును చాటు కోవడానికి, మూడుసార్లు అనికాక, ఏడుసార్లు అని అన్నాడు. అయితే, పేతురు [ఇతర శిష్యులు] ప్రభువును ఆకట్టుకోలేక పోయారు! ఆశ్చర్యకరముగా ప్రభువు “ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు క్షమించాలి” (18:22) అని సమాధాన మిచ్చాడు. ఈ నంబరుకు అర్ధం ఏమిటో చెప్పడం కష్టమే! ఇంకో విధముగా చెప్పాలంటే, ఎలాంటి అంకెలు [నంబరు], లెక్కలు లేకుండా, తోటివారిని అనంతముగా క్షమించాలి. పాపాత్ముల పట్ల అనంతమయిన ప్రేమను కలిగి ఉండాలి. అనంతమయిన ప్రేమలో ఎలాంటి కొలతలుగాని, కొలమానాలు గాని ఉండరాదు. దయను, ప్రేమను, క్షమాగుణమును చూపుటకు ఎలాంటి కారణాలను వెతకవలసిన అవసరం ఉండకూడదు అని స్పష్టముగా అర్ధమగు చున్నది.

పేతురు శిష్యులకు నాయకుడు. కనకు నేటి శ్రీసభలో, సంఘములో, సమాజములో నాయకులు కూడా “పశ్చాత్తాపపడే” పాపాత్ములను క్షమించ వలయును. దేవుని పరలోక రాజ్యము అనంతమైన ప్రేమ గల రాజ్యము. “పశ్చాత్తాపపడే” ఏ పాపాత్ముడ నైనను క్షమించే రాజ్యము. మనం క్షమించని సమాజములో జీవిస్తున్నాము. తప్పు చేసిన వారికి శిక్షను విధించే సమాజములో జీవిస్తున్నాము.  “పశ్చాత్తాపపడే” వారిని మనం గుర్తించి క్షమించ గలగాలి. క్షమించని యెడల, ప్రభువు మాటలను గుర్తు చేసుకుందాం: “మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయ పూర్వకముగా క్షమింపని యెడల పరలోక మందలి నా తండ్రియు మీ యెడల అటులనే ప్రవర్తించును” (18:35).

‘పాపము’నకు ‘నేరము’నకు మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. పాపాన్ని ఎప్పుడు క్షమించాలి, కాని నేరాన్ని కాదు. నేరం శిక్షింప బడాలి. ఉదాహరణకు, 1981 సం.లో రెండవ జాన్ పౌల్ పాపుగారు, పునీత పేతురు బసిలిక ఆవరణలోనికి ప్రవేశించు చుండగా, మెహమెత్ ఆలి అగ్కా అనే వ్యక్తి పోపుగారిని చంపాలనే ప్రయత్నములో పోపుగారిపై దాడి చేసాడు. కత్తితో నాలుగు సార్లు దాడి చేసాడు. గాయాల వల్ల ఎంతో రక్తం కారిపోయింది. వెమ్మటే ఇటాలియన్ పోలీసులు ఆ వ్యక్తిని నిర్భంధించి, జీవిత కారాగార శిక్షను విధించారు. ఆ తరువాత పోపుగారు కారాగారానికి వెళ్లి, ఆ వ్యక్తి చేతిని ఎంతో ఆప్యాయముగా పట్టుకొని ఆ వ్యక్తి యొక్క పాపాన్ని [పాపాత్ముడిని] క్షమించాడు. అయితే, ఆ వ్యక్తిని విడుదల చేయమని ఇటాలియన్ పభుత్వాన్ని పోపుగారు ఎప్పుడూ కోరలేదు, అనగా నేరం శిక్షింప బడింది. నేరములో నున్న పాపాన్ని క్షమించమని ప్రభువు కోరుచున్నారు.

క్షమకు మూలం దేవుడే! దేవుని క్షమాపణ గురించి యోనా ప్రవక్త గ్రంథములో చూస్తున్నాము. అలాగే, “ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఆయన మనలను నిత్యము చీవాట్లు పెట్టడు. మనమీద కలకాలము కోపపడడు. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు. మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. పడమరకు తూర్పు ఎంత దూరమో, అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును” అని కీ. 103:8-12 లో చదువు చున్నాము. దేవుని యొక్క క్షమించే ప్రేమను యెషయ ప్రవక్త గ్రంథములో చూస్తున్నాము (1:18; 43:25; 44:22). యూదులు [దైవ ప్రజలు] తమను దేవుడు పరిత్యజించెనని, విస్మరించెనని ఫిర్యాదు చేసినప్పుడు దేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు: “స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరచి పోవునా? తన ప్రేవున పుట్టిన బిడ్డ మీద జాలి చూప కుండునా? ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను మరువను” (49:15) అని, మరియు “నేను నీ పేరు నా అరచేతులమీద చెక్కుకొంటిని” (49:16) అని ప్రభువు పలికి యున్నారు. ఇలా దేవుడు కనికరము, క్షమ కలవాడని చూస్తున్నాము. ఈ దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ ద్వారా ఈ లోకమునకు [మనందరిపై] ప్రసాదించాడు. ఎందుకన, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను” (యోహాను 3:16). క్రీస్తుని ద్వారా వ్యక్తపరచ బడిన దేవుని క్షమను ఈనాటి సువిషేశములో ప్రభువు చెప్పిన ఉపమానము ద్వారా చెప్పబడు చున్నది.

ఉపమానములోని రాజు కోటి వరహాల ఋణస్థుడిపై [సేవకుడు] దయచూపి అతనిని విడచి పెట్టెను; అతని అప్పును కూడా క్షమించెను. కోటి వరహాల ఋణము తీర్చడానికి అతనికి ఎన్నో సంవత్సరాలు పట్టేది. చెల్లించక పోయినచో జీవితమంతా చెరసాలలో ఉండేవాడు. అయితే అదే సేవకుడు తనకు కొంత ధనము ఉన్న తోటి సేవకునిపై దయను చూపలేక పోయాడు. ఋణము తీర్చు వరకు అతనిని చెరసాలలో వేయించాడు. అప్పుడు రాజు మొదటి వానిని [తోటి వానిని క్షమింపని సేవకుడు] పిలిపించి, “నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోటి వానిపై దయ చూప వలదా?” అని ప్రశ్నిస్తూ, మండిపడి, బాకీనంత చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను.

ఉపమానములోని రాజు తండ్రి దేవుడు. ఆయన మనలను [మన పాపాలను] క్షమించాడు. దేవునికి ఎన్నటికి తిరిగి చెల్లించని మన అప్పును [పాపము] ఆయన క్షమించాడు. మన అప్పును చెల్లించుటకు, మన తరుపున దైవ కుమారుడైన క్రీస్తు సిలువలో తన ప్రాణాలను అర్పించాడు. తన పరిశుద్ధ రక్తముతో మన పాపాలను కడిగి వేసాడు. కనుక మన పట్ల తప్పులు చేసిన వారిని క్షమించమని ప్రభువు కోరుచున్నారు. దేవుడు మనలను క్షమించినట్లు, మనం ఒకరి పాపములను ఒకరము మన్నించ వలయును. దేవుని క్షమ యనగా దేవుడు మనలను తిరిగి తన సాంగత్యములోనికి అంగీకరించడం; మనలో మార్పును, మారు మనస్సును, హృదయ పరివర్తనను కలిగించడం; దేవుని జీవితంలో పాలుపంచుకోవడం; దేవునితో ఐఖ్యమవడం; నూతన సృష్టిగా మారటం. దేవుడు మాత్రమే పాపమును మన్నించ గలడు. కనుక, దేవుడు ఇతరులను క్షమించుటకు మనం ఇతరులను క్షమించుటద్వారా మార్గాన్ని సుగమం చేయాలి.

క్షమించుట ద్వారా రెండు గొప్ప ప్రయోజనాలు కలుగును: మొదటిది, ఇతరులను మనము క్షమించినప్పుడు, దేవుడు మనలను క్షమించును. అనగా, మనం స్వస్థతను [సంపూర్ణ ఆరోగ్యము, పరిపూర్ణత] పొందు చున్నాము. రెండదిగా, దేవుడు ఇతరులను క్షమించుటలో మనం సాధనాలుగా మారుచున్నాము. క్రీస్తు శిష్యుడు [అనుచరుడు] హృదయ పూర్వకముగా తోటి వారిని క్షమించని యెడల దేవుడు వారిని క్షమించడు. కనుక క్షమా గుణము క్రైస్తవుని [మన] జీవితములో విడదీయరాని భాగమై ఉండాలి.

ఈ ఉపమానము నుండి ఇంకో పాఠమును నేర్చుకోవాలి. రాజు [దేవుడు] మొదటి సేవకుడిని క్షమించాడు. ఆ తరువాత, ఆ సేవకుడు తోటి వానిని క్షమించ నందున, రాజు [దేవుడు] తన క్షమను ఉపసంహరించుకొని వానికి శిక్షను విధించాడు. మనమందరము కూడా క్రీస్తు ద్వారా క్షమించ బడి, దేవుని సన్నిధిలో జీవిస్తున్నాము. దేవుడు మనలను క్షమించిన విధముగా ఇతరులను క్షమించని యెడల, దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించని యెడల, దేవుని కోపానికి / శిక్షకు తిరిగి గురియయ్యే అవకాశం ఉన్నట్లుగా అర్ధమగు చున్నది. దేవుడు మనలను క్షమించగానే ఒప్పందం లేదా అంతా అయినట్లు కాదు, అదే క్షమను మన అనుదిన జీవితములో చివరి క్షణము వరకు చూపాలి. దేవుని క్షమ, మన క్షమ ద్వారా [అలాగే మన మారుమనస్సు, హృదయ పరివర్తన ద్వారా కూడా] ధృవీకరించ బడవలెను. ఇతరులను క్షమించనప్పుడు, మనం వారిపై తీర్పు విధిస్తూ ఉంటాము. ప్రభువు అంటున్నారు: “పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు. అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయ బడదు” (మత్తయి 7:1).

“తప్పు చేయడం మానవ నైజం, కాని క్షమించడం దైవత్వం” (అలెగ్జాండరు పోపు). క్షమించిన ప్రతీసారి మనం చెడును జయిస్తూ ఉంటాము. క్షమించిన ప్రతీసారి దేవుని నైజములో పాలుపంచు కొంటున్నాము. కనుక, అపరాధులను, నేరస్తులను, దోషులను, పాపాత్ములను క్షమించడానికి కావలసిన ఆధ్యాత్మిక బలమును దయచేయుమని దేవుణ్ణి మొర పెట్టుకుందాము.

No comments:

Post a Comment