23వ సామాన్య ఆదివారము [YEAR A]

 23వ సామాన్య ఆదివారము [YEAR A]

యెహెజ్కేలు 33:1,7-9; రోమీ. 13:8-10; మత్తయి 18:15-20

క్రైస్తవ బాధ్యత: సోదరుని సరిదిద్దుట


క్రీస్తు నందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు మనం 23వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. ఈనాటి పఠనాలు ఇతరుల పట్ల మనకున్న వ్యక్తిగత బాధ్యతల గురించి బోధిస్తున్నాయి. క్రైస్తవులుగా మనం ఏ స్థితిలో ఉన్నను [పెద్దలు. తల్లిదండ్రులు, పిల్లలు, గురువులు, ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవ్యాదులు...] ఇతరుల పట్ల [ముఖ్యముగా మనం ఉంటున్న సంఘములో ... మేత్రాసనము, విచారణ, మఠసభ సంఘము...] మనం ఎన్నో బాధ్యతలను కలిగి యున్నాము. ఇతరుల పట్ల బాధ్యత, జవాబుదారితనము కలిగి యున్నాము. ఎందుకన, క్రైస్తవులముగా, మనం వ్యక్తులమేగాక, క్రీస్తు శరీరములో [శ్రీసభ] సభ్యులము. కనుక ఒకరిపట్ల ఒకరికి వ్యక్తిగత బాధ్యతలు ఉన్నాయని ఈనాడు తెలుసుకుందాము. ప్రస్తుత కాలములో, ‘ఎవరు ఎటు పోతే నాకేమిటి? ఎవరికి ఏమైతే నాకేమిటి? నేను బాగుంటే చాలు!’ అనే స్వార్ధమైన ధోరణితో జీవిస్తున్నాము.

మొదటి పఠనము: బైబులులో, ప్రవక్తలను దేవుని ‘ప్రతినిధులుగా’, దేవుని వాక్కు ‘ప్రచారకునిగా’ చూస్తున్నాము. దేవుడు యెహెజ్కేలును యిస్రాయేలీయులకు ‘కావలివానినిగా’ ప్రభువు నియమించాడు. సంరక్షించుట, గస్తీకాయుట, కావలికాయుట ప్రవక్తల బాధ్యత. కావలివాడు గస్తీ కాయుచు రానున్న ప్రమాదమును ముందుగానే పసిగట్టి ప్రజలను హెచ్చరించును. ఎలా? ప్రవక్తలు ప్రభువు హెచ్చరికలను ప్రజలకు వినిపించ వలయును. ఎవరైన పాపములో జీవించుచున్న యెడల, వారిని హెచ్చరించి వారి మార్గమును మార్చుకొనునట్లు, పశ్చాత్తాప పడునట్లు చేయవలయును. యిస్రాయేలు ప్రజలకు ఆధ్యాత్మిక ‘పోషకుడిగా’ ఉండు బాధ్యతను ప్రభువు ప్రవక్తలకు అప్పగించెను. ప్రవక్తలు ప్రజలను అనైతికత నుండి నైతిక జీవితములోనికి, పాపమునుండి పవిత్రతలోనికి నడిపించ వలయును. ప్రవక్తల ప్రవచనాలు [దేవుని మాటలు] సంఘ నిర్మాణానికి, సంఘ అభివృద్ధికి పునాదులు! దేవుని వాక్కును ఆలకించిన యెడల జీవమును బడయుదురు. కనుక, ప్రవక్త తన బాధ్యతగా అవిశ్వాసులకు, అనైతిక పరులకు ఉపదేశము [‘ఉపదేశకుడు’] చేయవలయును. వారి అవిశ్వాసమును, అనైతికతను, పాపమును, దుష్టత్వమును, చెడును... ఖండించి వారు మారుమనస్సు, పశ్చాత్తాప పడునట్లు చేయవలయును. ఈవిధముగా, ప్రవక్త పాపము వలన రానున్న దండనను [దేవుని తీర్పు] ముందుగానే పసిగట్టి ప్రజలను హెచ్చరించి వారిని ఆధ్యాత్మికత లోనికి నడిపించ వలయును.

సువిశేష పఠనము: ‘సోదర ప్రేమ’ క్రైస్తవ జీవితమును గుర్తించే లక్షణం. ‘సోదర ప్రేమ’ ‘దైవ ప్రేమ’ను వ్యక్తపరచును. ప్రభువు కొండపై ఉపదేశములో (మత్తయి 5, 6, 7 అధ్యాయాలు) ‘సోదర ప్రేమ’ను గురించి బోధించాడు. ‘సోదర ప్రేమ’ కేవలము క్రైస్తవ సోదరులపట్ల మాత్రమేగాక, అందరిపట్ల చూపవలయును. మత్తయి 18వ అధ్యాయము అంతయు కూడా సంఘములో సోదరుల పట్ల గల బాధ్యతల గురించి చర్చిస్తున్నది.

ఇతరులను మనం ఎందుకు సరిదిద్దాలి? ఇతరులు చెడ్డవారని, మనం మంచివారమని కాదు. కాని వారిని తిరిగి పొందుటకు. ఈనాటి సువిశేష పఠనము సోదరులను సరిదిద్దుటలో మూడు అంశాలను ప్రస్తావిస్తున్నది.

1). నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన సోదరుని దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధిచెప్పుట: నీ పట్ల చేసిన సోదరుని దోషము, సంఘమునకు కూడా హానికరమైనదిగా ఉండవచ్చు. కనుక, సోదరుని సరిదిద్ధుటలో మొదటి ప్రయత్నముగా, ఒంటరిగా సరిదిద్దుటకు ప్రయత్నం చేయాలి. ప్రభువు చెప్పిన ఈ మాటలలోని ముఖ్య సారాంశం సోదరుని శిక్షించుట [ఖండించుట] గాక, సోదరుని పునరుద్దరించుటయని మనం గుర్తించాలి. ఈవిధముగా సోదరుడిని బహిరంగముగా అవమానించక, సోదరుని పట్ల బాధ్యతను కలిగి యుందుము. ఇలా మొదటిగా, వ్యక్తిగతముగా, మన సోదరుని తప్పిదమును సరిదిద్దుటకు ప్రయత్నం చేయాలి. సోదరుడు తన తప్పును అంగీకరించి, పశ్చాత్తాప పడిన యెడల ఆ సోదరుని తిరిగి మనం సంపాదించుకొనిన వారమవుతాము. “తిరిగి సంపాదించుకొనుట”యే “మారుమనస్సు.” ఆ సోదరుడు తన తప్పును, దోషమును సరిచేసుకోవడం మాత్రమేగాక, తన చెడు ప్రవర్తనను మార్చుకోవాలి. తన దోషముతో బాధపెట్టిన సోదరునితో సఖ్యత పడాలి. ఇదియే నిజమైన “హృదయ పరివర్తన.”

2). రెండవదిగా, నీ మాటలను అతడు ఆలకింపని యెడల ఒకరిద్ధరను నీ వెంట తీసుకొని పొమ్ము. ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతిమాట స్థిరపడును: దీనిని మనం ద్వితీయోపదేశ కాండము 19:15లో చూస్తున్నాము: “మానవుని దోషిగా నిర్ణయించుటకు ఒక్కని సాక్ష్యము చాలదు. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యము పలికిననే గాని ఎవనినైన దోషిగా నిర్ణయింపరాదు.” దీనిని ప్రార్ధనా పూర్వకముగా చేయాలి. ఆ వ్యక్తిపై ఎలాంటి ద్వేషముగాని, ప్రతీకార భావముగాని ఉండరాదు.

3). అతడు వారి మాట కూడా వినని యెడల సంఘమునకు తెలుపుము: ఈ సోదరుడిని స్థానిక సంఘములో సరిదిద్దుటకు ప్రయత్నం చేయవలయును. సోదరుడి దోషమును క్రైస్తవ ప్రార్ధన, క్రైస్తవ ప్రేమ, క్రైస్తవ సహవాసములో సరిచేయ వలయును. ఆ వ్యక్తిని ఏవిధముగను వేధింపరాదు. అతనిపై కోపముగాక ప్రేమను చూపవలయును.

సంఘమును కూడా అతడు లెక్కచేయని యెడల, అతనిని అవిశ్వాసునిగ, సుంకరిగ పరిగణింప వలయును. దీని అర్ధం ఏమిటి? ప్రభువు పాపాత్ములను, సుంకరులను ఆదరించాడు. వారితో భోజనం చేసాడు. అలాగే, మన సోదరుడిపై మనం ప్రేమను, ఆప్యాయతను చూపవలయును. తద్వారా, మన ప్రేమగల ఆదరణ, మన్నింపు వలన, సోదరుడు హృదయ పరివర్తన చెంది దేవునితోను, మనతోను సఖ్యత పడును.

దేవుని సంఘం [శ్రీసభ] క్రీస్తు శరీరము. సంఘ సమగ్రతను కాపాడుటకు ప్రభువు సంఘమునకు అధికారమును ఇచ్చెను. మొదటగా దీనిని ప్రభువు పేతురుకు, ఆ తరువాత శిష్యులకు ఇచ్చెను. సంఘములో అధికారమును దుర్వినియోగము చేయకూడదు. సంఘముపై నున్న బాధ్యతను నెరవేరుస్తూ సంఘ శ్రేయస్సు, ఐక్యత కొరకు కృషి చేయవలయును. సువార్తా విలువలను సంఘములో కాపాడవలయును మరియు జీవించునట్లు చూడవలయును. అందుకే ప్రభువు అంటున్నారు: “భూలోక మందు మీరు వేనిని బంధింతురో అవి పరలోక మందును బంధింప బడును. భూలోక మందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడును.”

“భూలోకమున మీలో ఇద్దరు [సంఘ ప్రార్ధన] ఏకమనస్కులై ఏమి ప్రార్దించినను, పరలోకమందుండు నా తండ్రి వారికి అది ఒసగును. ఏలయన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్యన ఉన్నాను” అని ప్రభువు అంటున్నారు. వ్యక్తిగతముగా మన ప్రయత్నాలన్నీ చెడినప్పుడు, సంఘము, సంఘ ప్రార్ధన మనకు ఉపకరించును. సంఘ ప్రార్ధన చాలా బలమైనది. మన ప్రార్ధన స్వార్ధమైనదిగా ఉండరాదు అని అర్ధమగుచున్నది. స్వార్ధపూరితమైన ప్రార్ధనలను దేవుడు ఆలకింపడు. సంఘ అవసరాలకై ప్రార్ధన చేయాలి (శాంతి, సామరస్యం, ఆరోగ్యం, సోదరభావము, ఐఖ్యత...). కుటుంబములో, సంఘములో ప్రభువు ఉంటారు. ఈ సందర్భముగా మనకు విరుద్ధముగా తప్పిదము చేసిన వారి కొరకు ప్రార్ధన చేయాలి.

ఇతరులను ప్రేమించాలంటే, వారిని వస్తువులుగా కాక, వ్యక్తులుగా చూడాలి. ప్రేమ ద్వారా మాత్రమే మనం ఇతరులతో అనుబంధాన్ని కలిగి ఉంటాము. నిజమైన ప్రేమ ఇతరుల పట్ల బాధ్యత కలిగే లాగున చేస్తుంది. “పాపాత్ముడిని హెచ్చరించి, అతడు తన మార్గమును మార్చుకొనునట్లు చేయవేని, అతని మరణమునకు బాధ్యుడవగుదవు” అని యెహెజ్కేలు ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. సువిశేష పఠనము కూడా ఇదే సందేశాన్ని ఇస్తుంది. సోదరుని సరిదిద్దటం, సోదర ప్రేమ రెండు కూడా సంబంధాన్ని కలిగి యున్నాయి. ఒకరిని ప్రేమించడం అంటే, వారి తప్పులను సమర్ధించడం కాదు. వారి దోషములను హెచ్చరించాలి, సరిచేయాలి, సన్మార్గములో నడిపించాలి. వారిపట్ల బాధ్యత కలిగి యుండటమే సోదర ప్రేమ.

ఇతరుల దోషములను సరిదిద్ధడం అంత సులువైన పని కాదు. దానికి ధైర్యము, దయ, కరుణ, శాంతం, ఓపిక, మర్యాద, వినయం, నిజాయితి, గౌరవం, ఇతరుల మంచితనాన్ని కాపాడాలనే మనస్తత్వం, వివేకం, సున్నితత్వం, వ్యూహం, పరస్పర సంభాషణ, శ్రద్ధగా ఆలకించడం ఎంతో అవసరం.

కొన్ని సార్లు మన సంఘములోని పెద్దలు దోషముల పట్ల మౌనము వహిస్తూ ఉంటారు. ఈ ధోరణి మంచిది కాదు. సంఘములోని వ్యక్తుల దోషములను సరిదిద్దడం అనగా వారిని విమర్శించడం కాదు, కాని వారి దోషములను సరిచేసి తద్వారా సంఘమునకు కీర్తి కలిగించడం, సంఘములో పవిత్రతను కాపాడటం, వ్యక్తులను తిరిగి సంపాదించు కోవడం... తుది తీర్పు దినమున ప్రభువుతో కలసి ఆయన చెప్పిన మాటలను మనము చెప్పగలగాలి: “నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు” (యోహాను 17:12).

ఈనాటి రెండవ పఠనములో కూడా చూస్తున్నాము: మనకు ఉండవలసిన ఇకే ఒక అప్పు ఒకరినొకరిని అన్యోన్యము ప్రేమించు కొనుటయే. నిన్ను నీవు ప్రేమించు కొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము. తోటివానిని ప్రేమించువాడు, వానికి ఏ కీడును చేయడు.

మన్నించుట, క్షమించటం: క్షమించటం అనగా ఇతరులను నిందించటాన్ని ఆపివేయటం; వారిపైనున్న ఆగ్రహాన్ని నిగ్రహించటం. ‘సోదరుని సరిదిద్ధుట’లో క్షమాగుణం ఎంతో ముఖ్యమైనది. క్షమాగుణం అనేది ఒక నిర్ణయం, ఒక భావన / భావోద్వేగం కాదు. క్షమించలేని హృదయం విషపూరితమైనది; అది మన ప్రాణాలకే ప్రమాదం. క్షమించలేనప్పుడు, మనల్ని మనమే శిక్షించుకుంటున్నామని తెలుసుకుందాం. క్షమించలేని వారు అపరాధ భావము, అభద్రతాభావం, ప్రతీకారం, అసంతృప్తి, ద్వేషం, ఈర్ష్య, కోపముతో జీవిస్తూ ఉంటారు. దేవుడు క్రీస్తు సిలువ బలిద్వారా మనలను క్షమించినట్లే, మనము కూడా ఇతరులను క్షమించుదాం.

దేవుని వాక్యమును బట్టి, ఆత్మపరిశీలన చేసుకుందాం. నేను జీవిస్తున్న సంఘములో, నాకు అప్పజెప్పబడిన బాధ్యతను, అధికారమును బట్టి, నా సహోదరీ సహోదరుల పట్ల ఏవిధముగా నా క్రైస్తవ బాధ్యతలను నెరవేరుస్తున్నాను? వారి తప్పులను, దోషములను సమర్ధిస్తున్నానా లేక వారిని సరిదిద్దుటకు ప్రయత్నం చేయుచున్నానా? వారిని సరిచేసి, వారితో సఖ్యతపడి వారిని తిరిగి పొందుటకు ప్రయత్నం చేయుచున్నానా? నా పట్ల దోషము, కీడు తలపెట్టు వారి కొరకు ప్రార్ధన చేయుచున్నానా? వారిని మన్నించుటకు సిద్ధముగా ఉన్నానా?

దేవుడు మనకు కావలసిన మంచి బుద్ధిని, దైవజ్ఞానమును ఒసగునుగాక! ఆమెన్!

2 comments:

  1. Thank you Anna, your reflection is helpful and is the best reminder of our purpose of being. Here, through your reflection, I am also reminded of the words of Cardinal Razsinger: "We are not ordained to isolation; but to a relationship"

    ReplyDelete
  2. Very good message. Thank you Fr. Praveen

    ReplyDelete