22వ సామాన్య ఆదివారము (Year A)
యిర్మియా 20:7-9; రోమీ 12:1-2;
మత్తయి 16:21-27
క్రీస్తు సువార్త – సిలువ -
శిష్యరికం
ఈరోజు మనం 22వ
సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. మొదటి పఠనము యిర్మియా
గ్రంథము నుండి వింటున్నాము. యిర్మియా బాలుడిగా నున్నప్పుడే దేవుడు పిలచియున్నాడు.
అందరిచే విడనాడబడినవాడు. ఇతనికి ‘విలపించే ప్రవక్త’ అని పేరుయున్నది. ఎందుకన, ప్రవక్తగా ఎన్నో
అవమానములను, బాధలను, శ్రమలను ఎదుర్కున్నాడు.
తన ప్రవచనములను (దేవుని వాక్కు) ప్రజలు ఆలకించక పోవుటచే, ప్రవక్త నిరాశకులోనై, అంతర్మధనముతో ప్రభువునకు
ఫిర్యాదు చేయుచున్నాడు. ప్రజలు అతనిని గేలిచేసియున్నారు. అతనిని చూసి
నవ్వియున్నారు. దౌర్జన్యమునకు, వినాశనమునకు పూనుకున్నారు. అవమానించి ఎగతాళి
చేసారు. అందుకే యిర్మియా ప్రవక్త, ప్రభువు తనను మోసము చేసియున్నాడని తలంచియున్నాడు. దేవుని
నామమున ఇక మీదట మాట్లాడ కూడదు అని అనుకున్నాడు. కాని, దేవునివాక్కు యొక్క
గొప్పశక్తిని గుర్తించిన అతను, దేవునివాక్కు ఎలాంటిదో తెలియజేయుచున్నాడు. “నీ వాక్కు నా హృదయములో
అగ్నివలె మండుచూ నా ఎముకలలోనే మూయబడినట్లు యున్నది. నేను ఆ వాక్కును లోలోపల అణచి
యుంచుకోవలెనని ప్రయత్నం చేసి చేసి విసుగు చెందితిని, దానినిక ఆపుకోజాలను.” దేవునివాక్కు ఎంతో శక్తిగలది, సజీవమైనది, చైతన్యవంతమునైనది
(హెబ్రీ 4:12). కనుక, విశ్వాసులు దేవునివాక్కును
తృణీకరించినను, ఎన్నిఅడ్డంకులు ఎదురైనను, సువార్త బోధకులు
(పిలువబడినవారు) వాక్యబోధనను ఆపివేయరాదు. ఎన్నికష్టాలు, ఇబ్బందులు ఎదురైనను, వాక్యము ప్రకటింప
బడవలెను, బోధింపబడ వలెను.
సువిశేష పఠనము: పేతురు తన విశ్వాసాన్ని ప్రకటించిన
తరువాత, యేసును క్రీస్తుగా, మెస్సయ్యగా ప్రకటించిన
తరువాత, ప్రభువు, తాను మెస్సయ్యగా
పొందబోవు బాధలను, తన మరణము గురించి తెలియ
జేయుచున్నాడు. శిష్యులు యేసును మెస్సయ్యగా గుర్తించారు, కాని ఇంకా లోతైన
భావాన్ని తెలుసుకొనలేదు. దైవరాజ్య ఆధ్యాత్మికతను ఇంకా వారు అర్ధం చేసుకొనలేదు.
యేసు ‘దేవునివాక్కు’గా ఈలోకములో నరవతారము ఎత్తాడు.
దేవుని రాజ్యముగూర్చి (దేవుని చిత్తము) బోధించాడు. దానివలన
ఎన్నో బాధలను, ఇబ్బందులను, అవమానములను
ఎదుర్కొన్నాడు. తన ప్రేషితకార్యము తన మరణము ఉత్థానముతో పరిపూర్తియగునని తెలియజేయుచున్నాడు.
“అప్పటినుండి
యేసు తన శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలవలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన
పెక్కుబాధలను అనుభవించి,
మరణించి మూడవ దినమున పునరుత్థానుడగుట అగత్యము” అని చెప్పాడు.
అప్పుడు పేతురు (సైతాను పేతురుద్వారా) ప్రభువును ప్రక్కకు
కొనిపోయి, “ప్రభూ! దేవుడు
దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక!” అని వారిస్తూ, ప్రభు మార్గమును
అడ్డుకొనడానికి ప్రయత్నం చేసాడు. సిలువకు దూరముగా ఉండమని శోధిస్తున్నాడు.
గుర్తుంచుకుందాం! ఎన్ని అడ్డంకులు వచ్చిన వాక్యం ప్రకటింప బడును. ‘వాక్యం’ ఈ లోకమునకు వచ్చిన
ధ్యేయాన్ని, చిత్తమును నేరవేర్చును.
మనుష్యులకు (సైతాను) సంబంధించిన భావములు దేవునికి
సంబంధించినవి కావు. ప్రాపంచిక చిత్తము, దేవుని చిత్తము కాదు. సైతాను ఆలోచనలు, కార్యములు ఎల్లప్పుడూ
దేవునికి వ్యతిరేకమైనవిగా యుంటాయి. పేతురువలె మనముకూడా సైతాను
ఆలోచనలకు, కార్యాలకులోనై, దేవుని చిత్తాన్ని, కార్యాన్ని
అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనం చేసే ప్రతీకార్యములో దేవునిచిత్తం
పైచేయిగా ఉండాలి.
యేసు తన సిలువ (శ్రమల) మార్గాన్ని శిష్యులకు
స్పష్టపరచుచున్నాడు. వారుకూడా ఇదే మార్గములో అనుసరించాలని తెలియ జేయుచున్నాడు.
క్రీస్తుమార్గం ప్రేమమార్గం. ఆత్మపరిత్యాగము లేకుండా నిజమైన ప్రేమ లేదు. “నన్ను అనుసరింప గోరువాడు
తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని
నన్ను అనుసరింప వలెను. తన ప్రాణమును కాపాడు కొనచూచువాడు, దానిని పోగొట్టు కొనును.
నా
నిమిత్తమై, తన ప్రాణమును
ధారపోయువాడు, దానిని దక్కించు కొనును.” సిలువను ఎత్తుకోవడం
అనగా, దేవుని చిత్తాన్ని, మన చిత్తముగా చేసుకోవడం. దేవునియొక్క ఆలోచనలను, మన ఆలోచనలుగా చేసుకోవడం.
మన జీవితం దేవుని దానం. తిరిగి దానిని దేవునికే కానుకగా ఇచ్చువాడు, సపూర్ణ (నిత్య) జీవితమును బహుమానముగా
పొందును. ఈ లోకములో మన జీవితాన్ని సైతానుకు లోబరచిన యెడల ధన్యజీవితాన్ని
శాశ్వతముగా కోల్పోతాము.
“నన్ను అనుసరింపగోరువాడు” – యేసు శిష్యరికంగూర్చి
బోధిస్తున్నాడు. యేసును అనుసరించడం అనగా విజయాన్ని సాధించడమో, హోదాను పొందడమో కాదు!
శ్రమలు, మరణము, జీవితము, మహిమలోనికి నడిపించును.
యేసును అనుసరింప గోరువాడు ఆయనతో శ్రమలను, కష్టాలను పొందుటకు సిద్ధముగా ఉండాలి. మానవ సంబంధమైన భావాలతో
ఆలోచిస్తే, శ్రమలు అర్ధరహితము అని
భావిస్తాము. యేసు శిష్యులు అలాగే భావించారు. మనము యేసువలె ఆలోచించడం నేర్చుకోవాలి!
క్రీస్తు సిలువ (శ్రమలు, మరణము) మనలను జీవములోనికి నడిపించును.
ఈనాటి లోకములో మనం యేసు ప్రవక్తలుగా, శిష్యులముగా జీవించుదాం!
యేసు శిష్యుడు (యేసును అనుసరించాలంటే) మూడు విషయాలు చేయాలి: 1. తనను తాను
పరిత్యజించు కోవాలి: మనలను మనం సంపూర్ణముగా
దేవునికి అర్పితం, అంకితం చేసుకోవాలి. దేవుడు మన సర్వం కావాలి. దేవునిపై ఆధారపడి
జీవించాలి. 2. తన సిలువను (లూకా-‘అనుదినము’) ఎత్తుకోవాలి: క్రైస్తవ జీవితం
సజీవయాగము. త్యాగమయ సేవాజీవితం. క్రీస్తుకొరకే జీవించడం, క్రీస్తుకొరకే మరణించడం.
క్రీస్తును సేవించుటకు తన వ్యక్తిగత ఆశయాలను, కోరికలను వదులు కోవాలి. తన సమయాన్ని, తీరికను త్యాగం చేయాలి.
దేవుడు మనలనుండి ఆశించే దానిని మరియు ఇతరుల అవసరాలను నిరంతరం తెలుసు కోవాలి.
క్రీస్తుకొరకు శ్రమలను, కష్టాలను, బాధలను అంగీకరించాలి. 3. క్రీస్తును అనుసరింప
వలెను: క్రీస్తుకు సంపూర్ణ విధేయత కలిగి జీవించాలి.
క్రైస్తవ జీవితం – నిరంతరం క్రీస్తును
అనుసరించడం. ఈ అనుసరణలో శోధనలు, బాధలు, కష్టాలు ఉంటాయి. ప్రభువు మాటలను గుర్తుకు చేసుకుందాం: “ధర్మార్ధము
హింసితులు ధన్యులు. దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినపుడు, హింసించినపుడు, నిందారోపణ గావించినపుడు
మీరు ధన్యులు” (మత్త 5:10-11). “నా నామము నిమిత్తము
మిమ్ము ఎల్లరు ద్వేషింతురు; కాని, చివరి వరకు సహించి
నిలచినవాడే రక్షింప బడును” (మత్త 10:22).
కనుక మంచి క్రైస్తవ పోరాటం పోరాడుదాం! “మంచి చేయుటలో మీకు
కష్టములే సంభవించినను మీరు ఎంత ధన్యులు!” (1 పేతు 3:14).
రెండవ పఠనము: క్రీస్తును అనుసరించడం
గురించి, (రోమీ 12:2) పౌలు ఇలా
తెలియ జేయుచున్నారు: “మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని, మీలో మానసికమైన
మార్పుద్వారా నూతనత్వమును కలుగజేయ నిండు. అపుడే మీరు దేవుని సంకల్పమును, అనగా ఉత్తమమైనదియు, ఆయనకు సమ్మతమైనదియు, సంపూర్ణమైనదియు అగు
దానిని తెలిసికొనగలరు.”
No comments:
Post a Comment