19వ సామాన్య ఆదివారము, Year A

19 వ సామాన్య ఆదివారము, Year A

1 రాజు. 19:9, 11-13; రోమీ. 9:1-5; మత్త. 14:22-33

దేవునిపై మన దృష్టిని ఉంచుదాం!

క్రీస్తు నందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈరోజు మనం 19వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. ఈనాటి పఠనాలు, మన దృష్టిని దేవుని వైపు, ప్రభువు వైపు, క్రీస్తు వైపు మరల్చి ఉంచాలని మరియు దేవుని స్వరమును ఆలకించాలని బోధిస్తున్నాయి.

మొదటి పఠనము:
ఏలియా నలుబది రోజులు నడచి దేవుని కొండ హోరెబుకు చేరు కొనెను. కొండ గుహ ప్రవేశించి అచట రాత్రి గడిపెను. ప్రభువు వాణి అతనితో, "నీవు కొండమీద కెక్కి పోయి అచట నా ముందట నిలబడుము" అని ఏలియా కొండపైకి ఎక్కగా, ప్రభువు అతని ముందట సాగి పోయెను. అప్పుడు ఏలియా ప్రభువును కనుగొనాలని ఆశతో ఎదురు చూచెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. తరువాత, భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రభువు ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ మెల్లని స్వరములో ఏలియా దేవుని సన్నిధిని గుర్తించెను, తన అంగీ అంచుతో తన ముఖమును కప్పుకొని, దేవుణ్ణి ఆరాధించెను. 

దేవుని సాన్నిధ్యమును అనుభవించాలంటే, మన హృదయపు లోతులలో దేవుని స్వరమును ఆలకించాలి. ఇతర [బాహ్య మరియు అంతర్గత] స్వరాలను, శబ్దాలను నెమ్మదించ వలయును. మన హృదయాలు, ఆలోచనలు శాంతిప బడాలి. ఇతర శబ్దాలు - పెనుగాలి, భూకంపము, నిప్పు - మనలో విజృంభించుట వలన, దేవుని మెల్లని స్వరమును మనం ఆలకించలేక పోవుచున్నాము. ఈ లోక విషయాలలో మునిగి తేలిపోయి దేవుణ్ణి కనుగొనలేక పోవుచున్నాము.

ఏలియా ఉదంతము నేడు మనకి చక్కటి ఉదాహరణ. ఏలియా ప్రవక్త, కర్మెలు కొండపై 400 మంది బాలు ప్రవక్తలను ఓడించి, వారిని పట్టుకొని వధించెను. అది తెలుసు కొనిన యెసెబెలు రాణి ఏలియాను వధించెదనని శపథం చేసెను. ఏలియా యెసెబెలు రాణి మాటలకు భయపడి, ప్రాణములను దక్కించు కొనుటకు పారిపోయెను. అతడు అడవిలో ఒకరోజు ప్రయాణం చేసెను. ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణము విడువ గోరెను [దేవుని సహాయముతో గొప్ప కార్యాలు చేసిన ప్రవక్త దేవుణ్ణి మరచేనా? నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయెనా?] "ప్రభూ! ఈ బాధలు ఇక చాలు! నా ప్రాణమును తీసికొనుము. మా పూర్వుల వలె నేనును జీవములు విడిచెదను" అని పలికెను.

ఏలియా చూచిన పెనుగాలి, భూకంపము, నిప్పు అతని హృదయ స్థితిని తేటతెల్లము చేయుచున్నాయి. వానివలె శబ్దాలతో నిండి పోయింది. అతనిలో భయము, ఆందోళన, నిస్సహాయత చోటుచేసుకున్నాయి. ఇవి తన ప్రాణములను సైతము తీసుకోవాలనే స్థితికి చేర్చాయి. అయితే ప్రభువు అతని పట్ల గొప్ప ప్రణాళికను కలిగి యున్నాడు. కష్ట సమయములో దేవుడు ప్రవక్త వెన్నంటే ఉన్నాడు. ప్రభువే అతనిని కాపాడాడు, రక్షించాడు. 'అలసిపోయిన' ఏలియాకు దేవదూత ద్వారా, భోజనమును [కాల్చిన రొట్టె, ముంతెడు నీళ్లు] సమకూర్చాడు. ప్రవక్త బలమును పుంజుకొని, ఆ బలముతోనే దేవుని కొండ యైన హోరేబుకు చేరుకున్నాడు. [మోషే ఈ కొండపైకి వెళ్లి ఇశ్రాయేలు ప్రజల తరువున దేవుని క్షమాపణ కొరకు ప్రార్ధించాడు]. 

మన కష్ట సమయాలలో కూడా దేవుడు మన వెన్నంటే ఉంటున్నాడు. మన సకల అవసరాలను తీర్చుతున్నాడు. తన దూతల కాపుదలలో ఉంచుతున్నాడు. పెనుగాలి, భూకంపము, అగ్ని వంటి పెను ప్రమాదముల నుండి మనలను కాపాడు చున్నాడు. అయినను మనం దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించలేక పోవుచున్నాము. ఎందుకన, మన దృష్టి దేవుని మీద లేకపోవడమే! మన దృష్టిని ఈ లోకాశలపై సారిస్తున్నాము. కష్టాలపై, బాధలపై, వ్యాధులపై మన దృష్టిని ఉంచుతున్నాము! చావడానికి సిద్ధపడిన ప్రవక్తకు దేవుడు మరెన్నో బాధ్యతలను అప్పజెప్పాడు. అలాగే, దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రణాళికను సిద్ధం చేసాడు. మన ద్వారా దేవుడు దానిని తప్పక నెరవేరుస్తాడు.

రెండవ పఠనము:
పౌలు యూదుల పట్ల గాఢమైన హృదయ వేదనను, విచారమును తెలియజేయు చున్నాడు. ఎందుకన, వారు మెస్సయ్య అయిన క్రీస్తుపై దృష్టిని సారించక, ఆయనను తృణీకరించారు. యూదులు దేవుని చేత "ఎన్ను కొనబడిన ప్రజలు". దేవుడు వారిని తన "పుత్రులుగా" చేసుకున్నాడు. తన "మహిమ"ను వారితో పంచుకున్నాడు. వారితో "నిబంధనలు" చేసుకున్నాడు. వారికి "ధర్మశాస్త్రము"ను ఒసగాడు. నిజమైన "ఆరాధన" వారిదే. దేవుని "వాగ్ధానములను" వారు పొంది యున్నారు. వారు మన "పితరుల" వంశీయులే. "క్రీస్తు" మానవరీత్యా వారి జాతి వాడే.

అయినను వారు "క్రీస్తు"ను తృణీకరించిరి. క్రీస్తును ప్రభువుగా, దేవుని కుమారునిగా, మెస్సయ్యగా, లోక రక్షకునిగా గుర్తించలేక పోయారు, అంగీకరించ లేకపోయారు.

కారణం: వారి దృష్టి మరల్చ బడినది. పూర్వ కాలము నుండియే వారికి మెస్సయ్య గురించి ప్రవచించ బడినది, బోధింప బడినది. మెస్సయా రాక కోసం ఎంతగానో ఎదురు చూసారు. కానీ వారి దృష్టి ప్రక్క దారులు పట్టింది. వారి దృష్టి మెస్సయాపై గాక, ఇహలోక రాజు, రాజ్యముపై మరల్చ బడినది. అందుకే వారు సిలువపై ఒక 'శాపము'గా మరణించిన యేసును మెస్సయాగా గుర్తించలేక పోయారు, అంగీకరించలేక పోయారు. ఆయన స్వరమును [బోధనలు, అద్భుత కార్యాలు] ఆలకించలేక పోయారు. వారి ఆలోచనలు, హృదయాలు, మనస్సులు, లోకాశలపై మరల్చ బడ్డాయి.

మనం కూడా, అనేక సార్లు వీరివలె ప్రవర్తిస్తూ ఉంటాము. ఆత్మ పరిశీలన చేసుకుందాము. మన "జ్ఞానస్నానము" ద్వారా:
- దేవుడు మనలను పవిత్ర పరచి, తనతో ఐక్య పరచుకున్నాడు (1 కొరి. 6:7); 
- క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడి, క్రీస్తుతో పాటు లేపబడితిమి (కొలొస్సీ 2:12);
- ఒకప్పుడు ఆధ్యాత్మికంగా మరణించినను, ఇప్పుడు క్రీస్తుతో పాటు ప్రాణమును పొందితిమి; దేవుడు మన పాపములన్నింటిని క్షమించెను (కొలొస్సీ 2:13);
- ఒక నూతన జాతిగా సృజించ బడితిమి (ఎఫెసీ 2:15);
- నూతన సృష్టిగా చేయ బడితిమి (గలతీ 6:15);
- మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును ఒసగెను (2 కొరి. 5:1);
- క్రీస్తు యేసు నందు విశ్వాసము వలన, మనమందరము దేవుని బిడ్డలముగా మారితిమి (గలతీ 3:26);
- క్రీస్తును ధరించి యుంటిమి (గలతీ 3:27; రోమీ 13:14);
- క్రీస్తుకు సంబంధించిన వారమైతిమి (గలతీ 3:29);
- పవిత్రాత్మకు ఆలయములుగా మారితిమి (1 కొరి. 6:19);
- ఆధ్యాత్మికంగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో పునర్జీవులను చేసెను (ఎఫెసీ 2:5-6; కొలొస్సీ 3:1-4). 
- క్రీస్తుతో ఏకమగుట వలన, మనము అందరమూ ఒకే శరీరము (రోమీ 12:4-5; 1 కొరి. 12:12-27);
- మన మధ్య నున్న విభేధములన్ని తొలగించ బడెను (గలతీ 3:28; 1 కొరి. 12:13);

అయినను అనేకసార్లు మనం మన దృష్టిని మరల్చుతున్నాము. క్రీస్తును, ఆయన సన్నిధిని గుర్తించలేక పోవుచున్నాము.

సువార్త పఠనము:
యేసు నీటిపై నడచుట; గాలిని అణచి శిష్యులను కాపాడుట
ఈ అద్భుతము ద్వారా, యేసు తన దైవత్వమును ప్రదర్శించి యున్నాడు. "ఐదు వేల మందికి ఆహారము"ను అద్భుత రీతిన పంచిన తరువాత, తాను జనసమూహమును పంపివేయులోగా, శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలెనని ఆజ్ఞాపించెను. జనసమూహములను పంపించి వేసిన పిమ్మట యేసు ప్రార్ధించు కొనుటకై ఏకాంతముగ కొండమీదకి వెళ్లెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగ అచటనే ఉండెను. వేకువ జామున యేసు నీటిపై నడచుచు శిష్యుల వద్దకు వచ్చెను.

బహుశా, అచట నుండి శిష్యులకు వెళ్లడం ఇష్టం లేక ఉండవచ్చు. ఎందుకన, గొప్ప అద్భుతముతో అందరి మన్ననలను, పొగడ్తలను పొంది యున్నారు. యోహాను సువార్త ప్రకారం, అప్పుడు ప్రజలు యేసును రాజును చేయాలని భావించారు. ఎందుకన, వారి దృష్టి ఈ లోకాశలపై, అధికారముపై మరల్చ బడినది. అందుకే యేసును రాజుగా చేయాలని భావించారు. యేసును వారు అర్ధం చేసుకోలేక పోయారు. బహుశా, ఈ కోరిక శిష్యులలో కూడా ఉండి ఉండవచ్చు. యేసు రాజు అయితే, వీరికి కొన్ని పదవులు, అధికారాలు ఉంటాయి కదా మరి!

అందుకే ప్రభువు శిష్యులను ముందుగానే పంపివేసి, తాను ప్రార్ధనకై ఏకాంతముగ కొండపైకి వెళ్లిపోయాడు. రెండు విషయాలు గమనించుదాం: శోధనలు సమయములో, ఒకటి ఆ పరిస్థితికి దూరముగా ఉండటం; రెండవది శోధనను ప్రార్ధతో జయించడం.

ఈ సమయములో గాలి ప్రతికూలంగా వీచుట వలన, శిష్యులు ప్రయాణం చేయుచున్న పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము వెళ్లెను. ఇచట 'పడవ'ను "శ్రీసభ"గా చూడవచ్చు. యేసు ప్రభువు ఆ పడవలో లేకుండెను. శిష్యుల ఆధ్వర్యములో తిరుసభ, లోక అలల మధ్యన సాగుచున్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తిరుసభ అను 'పడవ' ఈ లోక సముద్రములోని అలల  - శోధనలు, హింసలు, కష్టాలు, అవహేళనలు, నిందలు, స్వయంపరాధాలు, భయాందోళనలు, అలజడులు, స్వార్ధం, అధికారం, ద్వేషం, అసూయ - మధ్యన కొనసాగుచున్నది.

కష్టములో నున్న తన శిష్య సమూహమును కాపాడుటకు ప్రభువు కొండ దిగి, నీటిపై నడచు కొంటూ వారి చెంతకు వస్తూ ఉన్నాడు. నేడు తిరుసభ కూడా, కష్టాల కడలిలో ప్రభువు ఉన్నాడని ఎన్నటికీ మరువ కూడదు. దేవుడైనప్పటికిని మానవునిగా మన మధ్యకు దిగి వచ్చిన ఆయన, మనం కష్టములొ ఉన్నచో రాడా?

అయితే, శిష్యులు ప్రభువు సాన్నిధ్యమును గుర్తించలేక పోయారు. వారి ఆలోచనలు, హృదయాలు, మనసులు దృష్టి మరల్చాయి. భయభ్రాoతులై, "ఇది భూతము" అని కేకలు వేశారు. బహుశా, సముద్రములో అలల వలె, వారి హృదయాలు, గందర గోళములో ఉన్నాయి; వారిలో ప్రశాంతత, నిలకడ లోపించింది. కారణం: యేసును ఈ లోక రాజుగా చూడాలనే వారి కోరిక తీరలేదు; వారి దృష్టి లోకపై, లోకాశలపై మరలింది. అందుకే ప్రభువును వారు గుర్తించలేక పోయారు. అలాంటి పరిస్థితిలో నున్న శిష్యులతో ప్రభువు, "భయపడకుడు. ధైర్యము వహింపుడు. నేనే" అని తన స్వరాన్ని వినిపించాడు. తన దివ్య సాన్నిధ్యాన్ని తెలియ జేశాడు.

మనము కూడా కష్టాల కడలిలో, వ్యాధి, వైరస్ కడలిలో ఈదుచున్నాము. భయాందోళనలతో బ్రతుకుచున్నాము. ఈ రోజు ప్రభువు మనందరితో, "భయపడకుడు. ధైర్యము వహింపుడు. నేనున్నాను" అని తన స్వరమును వినిపిస్తున్నాడు. ఆ యేసు స్వరమును మనం వినగలగాలి. ఈ లోకాశలను జయించినప్పుడు, ముఖ్యముగా మన దృష్టిని ప్రభువుపై నిలిపినప్పుడు, ఆయన స్వరమును [బోధనలు, వాక్యము, ఆజ్ఞలు, ప్రణాళిక] వినగలము. ఆయన సన్నిధిని గుర్తించగలము. మన కష్టాల సమయములో ప్రభువు "కొండ దిగి, నడచి" మన దరికి వచ్చును. మనకు 'చేయి' అందించును. అభయ మిచ్చును. కనుక, ప్రభువును నమ్ముదాం! విశ్వసించుదాం!

ఇచ్చట "విశ్వాసము"నకు సంబంధించిన గొప్ప విషయాన్ని కూడా చూడవచ్చు. పేతురు మనందరిలాగే బలహీనుడు, సందేహించాడు, శోధనలకు గురయ్యాడు. అయితే పేతురులో గొప్పతనం ఏమిటంటే, పడిపోయిన ప్రతీసారి, తిరిగి లేచాడు. తిరిగి మరల ప్రభువుపై దృష్టిని సారించి, తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటించాడు. ఎప్పుడయితే, యేసు శిష్యులతో, "నేనే" అని తెలిపాడో, అంతట పేతురు, "ప్రభూ!" అని సంబోధించాడు [విశ్వాసం]. కాని ఇంకా అతనిలో సందేశం, అనుమానం! "నిజముగా నీవే అయిన నీటి మీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము" అని అన్నాడు. ప్రభువునే పరీక్షింప గోరాడు. ఋజువుగా నీటిపై నడవాలనే కోరిక, తప్పు పేతురులో కలిగింది. 

అయినను ప్రభువు పేతురును "రమ్ము" అని ఆహ్వానించాడు. రమ్మనగానే, పేతురు ఆ పడవ దిగి, నీటిపై నడచి యేసు యొద్దకు వచ్చు చుండెను [పేతురు ధైర్యాన్ని చూడవచ్చు]. కాని పేతురు మరొక తప్పు చేసాడు. తన దృష్టిని ప్రభువు నుండి మరల్చాడు. తద్వారా, నీటిలో మునిగిపోసాగాడు. విశ్వాసం లేని జీవితం శూన్యమే! మరణం వైపుకు వెళుతుంది. జీవితం ముగుస్తుంది. కాని పడిపోయిన పేతురు విశ్వాస పరంగా, "ప్రభూ! నన్ను రక్షింపుము" అని కేకలు వేసాడు. వెంటనే ప్రభువు చేయి చాచి పేతురును పట్టుకొని, పడవ నెక్కించి, పెను గాలిని అణచి వేశాడు. తన విశ్వాసమే తనను రక్షించింది. నీటిలో మునిగి మరణపుటంచుల వరకు వెళ్లిన పేతురు, ప్రభువుపై విశ్వాసము వలన, అదే నీటి నుండి ప్రభువు సహాయముతో లేచి ప్రభువుతో జీవమును, పునర్జీవమును పొంది యున్నాడు. పడవలో నున్న శిష్యులు, 'నీవు నిజముగ దేవుని కుమారుడవు" అని పలికి ఆయనను ఆరాధించిరి.

పేతురు మరియు ఇతర శిష్యులవలె మనం కూడా విశ్వాసులమే! ప్రభువును నమ్ముకొని జీవిస్తున్న వారమే! కాని, అప్పుడప్పుడు, మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అలాగే ప్రభువును సందేహిస్తూ ఉంటాము. "అల్ప విశ్వాసులు"గా మారుతూ ఉంటాము. పడిపోవడం మానవ నైజం. అయితే పేతురు వలె తిరిగి లేచి, ప్రభువు సహాయమునకై అర్ధించుదాం! ప్రార్ధించుదాం! సందేహములోనే ఉండి పోక, మనలోనున్న విశ్వాసాన్ని, ప్రభువు సహాయముతో బలపరచుకుందాం. అర్ధించిన ప్రతీ సారి, ప్రభువు తన చేతిని చాచడానికి సిద్ధముగా ఉన్నాడు. వాస్తవానికి మనకై ప్రభువు ఎదురు చూచుచున్నారు. పడిపోయినప్పుడు, ప్రభువు చేయిని అందుకునే భాగ్యాన్ని పొందుదాం.

ప్రభువు మన చేతులనే కాదు, మన భుజాలను తట్టి, లేపి 'పడవ' [శ్రీసభ] లోనికి చేర్చును. అవసరమైతే, తన అరచేతులతో మనలను ఎత్తి పట్టు కొనును. ఒక్క 'కేక', ఒక్క 'ప్రార్ధన [విశ్వాసం] చాలు. ప్రభువు సహాయాన్ని పొందుతాం. మునిగి పోవుచున్న మనలను, ఆధ్యాత్మికంగా క్షీణించి పోవుచున్న మనలను, ఆయన లేవనెత్తును. జీవింప జేయును. అలాగే కష్టాల కడలిలో నున్న శ్రీసభను కూడా ప్రభువు లేవనెత్తును. కష్టాల [అలలు] సమయములో, శోధనల సమయములో, శ్రీసభను ['పడవ'] వీడక అంటిపెట్టుకొని ఉండాలి. దృఢమైన విశ్వాసము కలిగి జీవించాలి. ప్రభువును పరీక్షింప నేల! 

శిష్యుల పడవకు సంతోషకరమైన ముగింపు ఉన్నట్లే, మన కష్టాల కడలికి కూడా సంతోషకరమైన ముగింపు ఉంటుందని విశ్వసించుదాం. అంతేగాని, తల్లి శ్రీసభను వీడిపోకూడదు. ఏలియావలె లేదా ప్రభువువలె కొండపైకి వెళ్లి [ప్రభువు సాన్నిధ్యము] ప్రార్ధన చేయాలి. ఎందుకన, ప్రభువు మాత్రమే మనలను రక్షింప గలడు; మనకు శాంతి, సమాధానము చేకూర్చును. ప్రభువు పడవ లోనికి ఎక్కగనే శాంతి నెలకొనెను. ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. కనుక ప్రభువుపై మన దృష్టిని ఉంచుదాం!

No comments:

Post a Comment