18వ సామాన్య ఆదివారము, YEAR A

18వ సామాన్య ఆదివారము, YEAR A
యెషయ. 55:1-3; రోమీ. 8:35, 37-39; యోహాను. 14:13-21

క్రీస్తు నందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు మనం 18వ సామాన్య ఆదివారము లోనికి ప్రవేశించి యున్నాము.

గత కొన్ని వారాలుగా మత్తయి 13వ అధ్యాయములో ‘పరలోక రాజ్యము’ గురించిన యేసు క్రీస్తు ఉపమానములను ధ్యానించి యున్నాము. ఈ ఉపమానముల ద్వారా పరమ రహస్యమైన ‘పరలోక రాజ్యము’లో భాగస్తులము కావాలని తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కార్యాలను ధ్యానించబోవు చున్నాము. యేసు యొక్క ప్రతీ మాట, ప్రతీ కార్యము ద్వారా ‘పరలోక రాజ్యము’ ఎలా పరిపూర్ణం గావింప బడుచున్నదో తెలుసుకొనబోవు చున్నాము. తన ప్రేషిత కార్యములో మనము కూడా భాగస్తులము కావాలని ప్రభువు కోరుచున్నారు.

దేవున్ని సంపూర్ణముగా నమ్మినప్పుడు, ఆయన ప్రేమ అనంతమైనదని విశ్వసించినప్పుడు, “దైవ రాజ్యము” వాస్తవమైనదగును, నిజమైనదగును, సత్యమైనదగును. తన పోలికలో సృజించిన తన ప్రజల జీవితాలపై దేవుడు తప్పక ఆసక్తిని [శ్రద్ధ, జాగ్రత్త] కలిగి యుండును. ఆయన వారి నిత్యావసరములను తీర్చును. వారిని పోషించును. తన చిత్తం ప్రకారం జీవించడానికి వారికి తగిన శక్తిని, అనుగ్రహమును ఒసగును. అలాగే వారిని ఆధ్యాత్మిక గమ్యం వైపు నడిపించును. మనిషి హృదాయాంతరములోని గాఢమైన [బలమైన] కోరిక దేవునిలో మాత్రమే పరిపూర్ణమగునని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియజేయు చున్నాయి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన యెడల నిరాశలో పడిపోతూ ఉంటాము.

మొదటి పఠనము: బాబిలోనియా ప్రవాసములో నిరుత్సాహములో, నిరాశలోనున్న ఇశ్రాయేలు ప్రజలకు యెషయ ప్రవక్త దేవుని ఓదార్పు పలుకులను ప్రవచిస్తున్నాడు. వారి జీవితాలలో దేవునికి ప్రధమ స్థానం ఇవ్వాలని వారిని ఆహ్వానిస్తున్నాడు: “నా మాట విని నా చెంతకు రండు. నా పలుకు లాలింపుడు” (55:3). ప్రభువు తన ప్రజల కొరకు ఉచితముగా ఏర్పాటు చేసిన ‘విందు”కు ఆహ్వానిస్తున్నాడు. ప్రజలు వారి మూర్ఖత్వమును, అవివేకమును, మూఢత్వమును విడచి ప్రభువు చెంతకు రావాలని ఆహ్వానిస్తున్నాడు. బానిసత్వము నుండి, వారి స్వతంత్రము కొరకు ఇతర రాజులపై ఆధారపడ ప్రయత్నించారు. కాని వారిని సృజించి నడిపిస్తున్న, సకల అవసరములను తీరుస్తున్న దేవునిపై వారు ఆధార పడాలని యెషయ తెలియజేయు చున్నాడు. అలా చేసినప్పుడు వారు లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందుదురు: “నీరు, ధాన్యము, ద్రాక్షారసము, పాలు...” వారి శారీరక ఆకలిదప్పులతో పాటు, దేవుడు వారి ఆధ్యాత్మిక ఆకలిదప్పులను కూడా [ముఖ్యమైనది] తీర్చును.

అందుకే ప్రభువు అంటున్నారు: “మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు... మీరు జీవము బడయుదురు.” ఇచ్చట యేసు ప్రభువు మాటలను గుర్తుకు చేసుకుందాము: “నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము” (యోహాను 4:34). కష్టకాలములో ఉన్నను దేవుని దయ వలన నానాటి భోజనమును మనం సమకూర్చుకోగలుగు తున్నాము. కాని, ఆధ్యాత్మికతను పొందుకోలేక పోవుచున్నాము. రోజురోజుకి దేవున్నుండి దూరమగు చున్నాము [ప్రవాసము]. అంతా అయ్యాక “దేవుడా!” అని అరుస్తున్నాము. అందుకే, ఈనాడు ప్రభువు యెషయ ప్రవక్త ద్వారా మనకు కనువిప్పు కలిగిస్తున్నాడు. ప్రభువుపై ఆధారపడి జీవించు వారికి నిరాశ కలుగదు. సకల అవసరములను సమృద్ధిగా పొందెదరు. దేవుడు వారిని బానిసత్వములో వదిలి మరచి పోయాడని ఇశ్రాయేలు ప్రజలు భావించారు. అనేకసార్లు మనము కూడా అలాగే భావిస్తూ ఉంటాము. కాని ప్రభువు వారిని ఎన్నడు ఎడబాయ లేదు. వారితో శాశ్వతమైన నిబంధనము చేసికొనెదనని, దావీదుకు వాగ్ధానము చేసిన దీవెనలు వారికిత్తునని పలికి యున్నాడు.

దేవుని ఆహ్వానం సార్వత్రికమైనది. బాబిలోనియా ప్రవాసములో కేవలం మంచిగా జీవించిన వారికి మాత్రమే కాదు, ప్రభువు తన “విందు”కు అందరిని ఆహ్వానిస్తున్నాడు. దేవుని సహవాసమునకు, సాంగత్యమునకు హద్దులు లేవు, ఉండవు. ప్రభువు “విందు”కు అందరూ ఆహ్వానితులే! ఈ “విందు” అపారమైనది. అందరికి సరిపోగా ఇంకా మిగిలి పోవును [నేటి సువార్త పఠనము]. అందుకే ఇది శాశ్వతమైన నిబంధనము. [నిత్య] “జీవము” బడయుటకే ఈ ఆహ్వానం! నేడు ఈ దేవుని ఆహ్వానం నీకు, నాకు కూడా! మరి దేవుని ఆహ్వానాన్ని గౌరవించుదామా! [మన్నించుదామా!]

అయితే దేవుని ఆహ్వానాన్ని స్వీకరించి ఆయనతో నిబంధనము చేసికొనుటకు రెండు నియమాలు తప్పని సరి. మొదటిది: దేవుని వాక్యమును ఆలకించుట” - తన మాటను వినమని దేవుడు తన ప్రజలను కోరుచున్నాడు. “నా మాట విని నా చెంతకు రండు. నా పలుకు లాలింపుడు, మీరు జీవము బడయుదురు” (55:3). దేవుని వాక్యమును ఆలకించినప్పుడు మనం జీవిస్తాము. జీవము దేవుని వాక్యమును ఆలకించుట నుండి వచ్చును: “మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు. కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును” (మత్తయి 4:4). దేవుని వాక్యమును ఆలకించుట యనగా, ఆయన ప్రవక్తలు, బోధకులు, గురువులు అన్నింటికన్న ముఖ్యముగా తన కుమారుడు, “వాక్కు” అయిన యేసు క్రీస్తు ఆజ్ఞలను, చట్టమును, సూచనలను, బోధనలను పాటించడం. రెండవదిగా: “దేవుని విందులో పాల్గొనుట” - “మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు” (55:2). దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించాలి. అప్పుడు ప్రభువు మంచి భోజనము, శ్రేష్టమైన అన్నము వడ్డించును. వ్యర్ధమైన వాటి కొరకు సమయాన్ని, ధనాన్ని వెచ్చించ రాదని దేవుడు హెచ్చరిస్తున్నాడు: “ఆకలి తీర్ప జాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేల? మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేల?” (55:2). అశాశ్వతమైన భోజనము కొరకు గాక, శాశ్వతమైన, జీవాహారమైన, జీవమునిచ్చు ఆహారము కొరకు తపించుదాము. ‘మన్నా’ను తిన్న ఇశ్రాయేలు ప్రజలు నశించారు. ‘అన్నము’ తింటున్న మనము నశిస్తాము. కాని పరలోకమును నుండి దిగి వచ్చిన జీవముగల ఆహారము అయిన క్రీస్తును [దివ్యసత్ప్ర సాదము] భుజించిన యెడల నిత్యజీవము పొందెదము. జీవమును బడయుదము. త్రిత్వైక దేవుని సహవాసములో జీవించెదము (యోహాను 6వ అధ్యాయము).

సువార్త పఠనము: బాప్తిస్మ యోహాను మరణ వార్త విని, యేసు పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణ మాయెను. దీనిని తెలుసుకొన్న [గమనించిన] ప్రజలు సరస్సు తీరమున కాలి నడకన యేసును వెంబడించారు. యేసు ‘గొప్ప ఆవేదన’లో ఉన్నను, పడవ దిగి, జనసమూహమును చూచి, వారిపై జాలిపడి, వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాడు.

పడవ దిగటం: ప్రజల కోసం తన మహిమను, ఉన్నత స్థానము నుండి దిగి రావటం. తండ్రి ఒడినుండి దిగి రావడం. దిగి రావడం అనగా ఇతరుల కొరకు తన పనులను పక్కన పెట్టడం.

చూచుట: గమనించుట, తెలుసుకొనుట, గుర్తించుట, అర్ధంచేసుకొనుట. ప్రజల దుర్భల స్థితిని, అవసరతలను [శారీరక, ఆధ్యాత్మిక, మానసిక, సాంఘీక...] చూడటం, పాపపు ఊభిలోనున్న వారిని చూడటం, ప్రజల బాధలను చూడటం. కనిపించటం అనగా వినటం అని కూడా అర్ధం
(మార్కు 1:44)
.

జాలి పడటం: ఆయన దయ, కరుణ, కనికరము అనంతమైనది. ఇది అందరిని హత్తున చేర్చు కొనును. జాలిపడటం అనగా ఇతరులతో ఉండటం. ‘నేనున్నాను’ అనే భరోసా ఇవ్వడం.

వ్యాధిగ్రస్తులకు స్వస్థత: జాలి, కనికరము కలిగిన వ్యక్తి సహాయం చేయు చేతిని తప్పక అందిచును. ప్రభువు తన బోధన ద్వారా మాత్రమే గాక, స్వస్థత వరము ద్వారా కూడా ప్రజలకు రక్షణను [శారీరక-ఆధ్యాత్మిక సంపూర్ణత] ఒసగు చున్నాడు.

యేసు నిజమైన కాపరి కదా! “కాపరి లేని గొర్రెల వలె నున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధించాడు” అని మార్కు సువార్తీకుడు వ్రాసాడు (6:34). స్వస్థత చేకూర్చడం కూడా ఒకలాంటి బోధనయే కదా! తన బోధనల ద్వారా ప్రజల ఆధ్యాత్మిక ఆకలి దప్పులను తీర్చి యున్నాడు. యేసు ఎప్పుడు కూడా ప్రజల[ను] ఆత్మ-శరీరములను పునరుద్దరించుటకు, పరిపూర్ణము గావించుటకు లక్ష్యపెట్టి యున్నాడు. ఇదియే కదా రక్షణ, పరలోక రాజ్యము, దైవ రాజ్యము! ప్రజలపై జాలి, కనికరము కలిగిన యేసు వారి అవసరములను తీరుస్తున్నాడు. కొంతమంది శారీరక స్వస్థత కొరకు, కొంతమంది ఆధ్యాత్మిక పునరుద్ధరణ కొరకు, కొంతమంది వాక్యము కొరకు ... వచ్చియున్నారు. ఈవిధముగా ఆత్మ స్వస్థతను పొందియున్నారు. మొదటి పఠనములో చెప్పబడిన దేవుని “విందు”కు ఆహ్వానాన్ని అందుకొని వచ్చి యున్నట్లుగానే అనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక విందు, కనులకు కనిపించే శారీరక విందులో [ఐదువేల మందికి ఆహారమును పెట్టుట] చూడగలుగు చున్నాము.

అది నిర్జన ప్రదేశము, ఎడారిలాంటి ప్రాంతము. వేళ అతిక్రమించినది. ‘ఐదువేల మందికి ఆహారము పెట్టుట’, ఎడారిలో అద్భుత రీతిన యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ‘మన్నా’ను కురిపించిన సంఘటనను తలపిస్తుంది. ఆకలితో నున్న వారికి ఆకలిని తీర్చాలని ప్రభువు నిర్ణయించారు. ఆపదలో నున్న వారికి సహాయము చేయ ప్రభువు నిర్ణయించారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఉంటే, ఏమి చేస్తాం? ఇతరులపై జాలి, కనికరము కలిగి ఉంటామా? మన సమయాన్ని ఇతరులకు కేటాయిస్తూ, సహాయం చేస్తున్నామా? లేక ఇతరుల సహాయం కొరకు మాత్రమే ఎదురు చూస్తామా? ప్రపంచములో నున్న వారందరికీ మనం ‘సహాయం’ చేయలేము కాని, అవకాశము వచ్చినప్పుడు, ఇతరులకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉండాలి. నిర్జన ప్రదేశములో నున్న ప్రజల అవసరాలకు ప్రభువు తక్షణమే స్పందించాడు. అలాగే ప్రభువు తన శిష్యులను కూడా ఈ అద్భుత కార్యములో భాగస్తులను చేసాడు. శిష్యులు ఐదు రొట్టెలను, రెండు చేపలను ప్రభువు వద్దకు తీసుకొని వచ్చారు. అలాగే వాటిని ప్రజలకు పంచి పెట్టారు.

ఇక్కడ జరిగిన గొప్ప అద్భుతం, ప్రభువు ప్రజలకు ‘ఆత్మ విశ్వాసాన్ని’ నేర్పించాడు. వారికి ఉన్న కొద్ధిని ఇతరులతో పంచుకొమ్మని నేర్పించాడు. ప్రజలు నేర్చుకున్నారు. అందుకే అది గొప్ప అద్భుతముగా మారింది. ప్రభువు శిష్యులముగా ప్రభువునకు-ప్రజలకు మధ్యవర్తులముగా సంపూర్ణ దాతృత్వము కలిగి మనం జీవించాలి.

ఎలీషా ఇరువది రొట్టెలను ఒక వెయ్యి మందికి పంచగా ఇంకను కొన్ని రొట్టెలు మిగిలెను అని 2 రాజుల గ్రంథము 4:42-44లో చదువుచున్నాము. ఇంతకన్న గొప్ప అద్భుతాన్ని ప్రభువు చేసియున్నారు. ఈ అద్భుతము ఎలా జరిగింది అని ఆలోచించే బదులుగా, అవసరతలో నున్న ప్రజలపట్ల ప్రభువు జాలి, కనికరము గురించి ధ్యానించి, మనం ప్రభువువలె ఉండటానికి ప్రయత్నం చేద్దాం.

దీనిని బట్టి, దేవుడు ఎప్పుడు మన అవసరతలో ఆపద్భాందువుడై ఉంటాడు అని అర్ధమగుచున్నది. అలాగే ఇంకో గొప్ప సత్యం ఈ సంఘటన మనకు బోధిస్తుంది. రాబోవు దినాలలో ప్రభువు ఏవిధముగా తన శరీరమును, తన రక్తమును మనకు ఆధ్యాత్మిక భోజనముగా [దివ్యసత్ప్రసాదము] ఒసగుననే సత్యాన్ని బోధిస్తుంది, తేటతెల్లము చేస్తుంది: “ఆ అయిదు రొట్టెలను, రెండు చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి, త్రుంచి శిష్యులకు ఇచ్చెను” (14:19). ఇచ్చట “ప్రభువు భోజనము” [దివ్యబలిపూజ] సంజ్ఞలను గమనింప వచ్చు. అలాగే, ఈ అద్భుతం, అంత్యకాలములో ప్రభువు మనకొరకు ఏర్పాటు చేయబోవు “మెస్సయా విందు”ను కూడా సూచిస్తుంది.

ప్రభువు ప్రజలపై జాలి, కనికరము కలిగి యున్నాడు. కాని ఆయన శిష్యులు ఆందోళన పడ్డారు: “సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము. వేళ అతిక్రమించినది. ఇక వారిని పంపి వేయుడు. పల్లెపట్టులకు వెళ్లి, వారికి కావలసిన ఆహార పదార్ధములను సమకూర్చు కొందురు అని మనవి చేసిరి” (14:15). కాని ప్రభువు, “వీరిని పంపి వేయవలసిన అవసరము లేదు. మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు” (14:16) అని అన్నాడు. అప్పుడు వారు తమ అశక్తతను వ్యక్తపరచారు. కాని ప్రభువు శిష్యుల చేతుల మీదుగానే ఐదు వేల మందికి పైగా ఉన్న జనసమూహానికి భోజనం పంచి పెట్టాడు. వారి అశక్తతను గొప్ప శక్తిగా, దీవెనగా మార్చాడు. విందును ఏర్పాటు చేయడానికి సంకోచించిన వారినే ప్రభువు విందును వడ్డించే వారిగా మార్చాడు. ఆహా! చేపలు పట్టువారిని మనుష్యులను పట్టువారిగా మార్చడం అంటే ఇదేనేమో కదా! జనసమూహము సంతృప్తిగా భుజించిన పిదప మిగిలిన ముక్కలను పండ్రెండు గంపల నిండ ఎత్తిరి (14:20). 12 గంపలు ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రములను సూచిస్తుంది. అలాగే నూతన ఇశ్రాయేలు ప్రజలలో భాగమై, ప్రజలను నడిపించు 12 మంది శిష్యులను సూచిస్తుంది. ప్రజలపై దేవుని ఉదారమైన కృపావరాలకు వీరు 12 ఆధారాలుగా, మూలాలుగా మారుదురు.

ఈ అద్భుతమును మూడు విధాలుగా చూడవచ్చు: ఒకటి, సువార్తలలో వివరించ బడిన విధముగా ఒక సాధారణమైన అద్భుతము. రొట్టెలను, చేపలను వృద్ధి చేయటము. రెండు, జనసమూహము [కనీసం కొంతమంది అయిన] ముందుగానే ఊహించి ఎంతో కొంత భోజనమును వారితో తెచ్చుకొని యుండవచ్చు. ప్రభువు ఆ భోజనమును ఆశీర్వదించి, ఉన్నవారు లేనివారితో పంచుకొనే విధముగా చేసియుండవచ్చు. స్వార్ధపరులు ఉదార స్వభావులుగా మారారు [ఇదీ అద్భుతమే కదా!] మూడు, ఈ అద్భుతాన్ని యేసు ‘మెస్సయా కార్యము’నకు సూచకముగా చూడటము. ఈ అద్భుతం “ప్రభువు భోజనము” [దివ్య బలి] నకు ముందస్తు సూచనగా చూడటము.

ఇది మెస్సయా యుగ సమృద్ధిని సూచిస్తుంది. ప్రభువు చేసిన ఈ అద్భుతము [ప్రభువు భోజనము] మన సకల అవసరములను సమృద్ధిగా తీర్చుటకు సూచన. అలాగే, ఇది ఐఖ్యత, ఒకరితోనొకరు పంచుకోవడంతో కలగలిపిన దివ్యసంస్కారమైన ‘దివ్యసత్ర్పసాద భోజనము’ను సూచిస్తుంది. దైవ సంఘము తమకున్న దానిని ఇతరులతో పంచు కోవాలి. తద్వారా ప్రతీ ఒక్కరు సమృద్ధిగా ఉండెదరు.

దేవుడు తన ప్రజల సకల అవసరములను ఎరిగి యున్నాడు. అందరికి సరిపడా సంపద ఈ లోకములో ప్రభువు సమకూర్చారు. అయితే ఇది ఉదార స్వభావము కలిగి ఉండి, ఇతరులతో పంచు కున్నప్పుడే సాధ్యమగును. అందుకే ప్రభువు శిష్యుల చేత పంచాడు. ఇప్పటికీ ప్రభువు చేస్తూనే ఉన్నాడు. మనం ఈ లోకములోని సమస్యలను చూసి, ఇతరులను [ప్రభుత్వాలను, ఇతర అధికారులను] నిందిస్తూ ఉంటాము. కాని సమస్య ఇతరులదే కాదు, మనందరిది కూడా. ఈనాడు మనము కొనియాడుతున్న ఈ దివ్యపూజా బలికి అర్ధం అదే: క్రైస్తవులుగా ఉదారస్వభావము కలిగి జీవించుదాం. ప్రభువు వలె జాలి, కనికరము కలిగి జీవించుదాం. ఇతరులతో పంచుకుందాం – సంపదలు, సమయం, మన నైపుణ్యాలను...మొ.వి. శ్రీసభలో విశ్వాసులముగా ఆ ఐదు రొట్టెలు రెండు చేపలుగా మనం మారాలి. అప్పుడే ఇతరుల ఆకలిదప్పులను తీర్చగలము.

రెండవ పఠనము: కష్ట కాలములో క్రీస్తు నందు విశ్వాసముంచి, ధైర్యముగా ఉందాము. “క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని, అట్లు చేయ కలదా? క్రీస్తు నందు మనకు విజయము కలదు. క్రీస్తు ప్రేమ మనపై గొప్పది, అనంతమైనది. ఆ ప్రేమ సర్వ శక్తులను జయించును. మనలను కాపాడును. దేవునికి స్తోత్రం. ఆమెన్!

No comments:

Post a Comment