17వ సామాన్య ఆదివారము [YEAR A]


17వ సామాన్య ఆదివారము [YEAR A]
1 రాజు. 3:5, 7-12, రోమీ. 8:28-30, మత్తయి 13:44-52

క్రీస్తు నందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు మనం 17వ సామాన్య ఆదివారము లోనికి ప్రవేశించి యున్నాము.
మన జీవితములో, దైవరాజ్యం [క్రీస్తు] అతి ప్రధాన్యమైనదని, దానికోసం మన సమస్త జీవితాలను త్యజించాలని ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.
ఈనాటి సువిశేష పఠనములో ‘పరలోక రాజ్యము’ లేదా’ దైవరాజ్యము’ను గురించిన మరో మూడు ఉపమానములను చదువుచున్నాము: ‘దాచబడిన ధనము’, ‘ఆణిముత్యము’ మరియు ‘మంచి చేపలు – చెడు చేపలు’ [పట్టు వల].
పరలోక రాజ్యము / దైవ రాజ్యము అనగా ఏమి?
మత్తయి సువార్తీకుడు ఎప్పుడు కూడా ‘పరలోక రాజ్యము’ అను పదాన్ని వాడాడు. ఎందుకన, మత్తయి ప్రధానముగా యూదులను ఉద్దేశించి వ్రాసాడు. యూదులు దేవుని నామమును ఉచ్చరించరు కనుక ‘పరలోక రాజ్యము’ అనే పదాన్ని వాడాడు. మార్కు మరియు లూకా ‘దేవుని రాజ్యము’ అని వ్రాయడం చూస్తాం.
పాత నిబంధనలో దైవ రాజ్యము అనగా, ‘దేవుని పరిపాలన,’ ‘తాను ఎన్నుకున్న ప్రజలను దేవుడు రక్షించడం’. దైవరాజ్యములో ముఖ్యమైన ఐదు అంశాలు: 1. రాజు, 2. పరిపాలన, 3. ప్రజలు, 4. చిత్తము, 5. రాజ్యము (భూమి).
రాజు లేకుండా రాజ్యం ఉండదు. కనుక పరలోక రాజ్యములో దేవుడు లేదా క్రీస్తు “రాజు”. ఈ రాజు “పరిపాలన” చేయును. ఎలా పరిపాలించును? తన ప్రజలను రక్షించుట ద్వారా [పాత నిబంధనలో యావే ఇశ్రాయేలు ప్రజలను రక్షించెను; నూతన నిబంధనలో క్రీస్తు సిలువపై మానవాళిని రక్షించెను]; మరియు ప్రభువుగా తన ప్రజలపై సర్వాధికారము కలిగి యుండుట వలన. బైబులులో “రాజ్యము అనగా “ప్రజలు” [పాత నిబంధనలో ‘ఇశ్రాయేలు ప్రజలు’; నూతన నిబంధనలో ‘శ్రీసభ’ = రక్షింప బడిన ప్రజలు]. ఈ ప్రజలు రక్షింపబడి, క్రీస్తురాజు సర్వాధికారములో నున్నవారు. దైవరాజ్యములో దేవుని “చిత్తము” ప్రధానము [పాత నిబంధనలో ‘తోరా’; నూతన నిబంధనలో ‘క్రీస్తు బోధనలు’]. “రాజ్యము /భూమి” [పాత నిబంధనలో ‘వాగ్దత్త భూమి’; నూతన నిబంధనలో ‘నూతన భూమ్యాకాశములు’].
దైవ రాజ్య ఫలాలు: శాంతి, ప్రేమ, న్యాయము, దయ.
నూతన నిబంధనలో యేసు, “పరలోక రాజ్యము సమీపించి యున్నది” (మ. 4:17, మా. 1:15) అని బోధించాడు. అందులకే హృదయ పరివర్తనము చెంది, ‘జాకరూకులై’ ఉండవలయునని ప్రకటించాడు. పునీత పౌలు మరియు పునీత లూకా వారలు యేసు క్రీస్తు ప్రభువును పరలోక రాజ్యమునకు ప్రతిరూపముగా ప్రకటించారు. అనగా క్రీస్తే ఆ పరలోక [దేవుని] రాజ్యము అని అర్ధము.
పునీతులు అగస్తీను మరియు గ్రెగోరి ది గ్రేట్ వారలు పరలోక రాజ్యమును శ్రీసభతో పోల్చారు. అనగా శ్రీసభ, పరలోక [దేవుని] రాజ్యము అని అర్ధము. సంపూర్ణమైన పరలోక రాజ్యము అంత్యకాలమున వచ్చును. అప్పటి వరకు, గోధుమలు-కలుపు గింజలు, మంచి చేపలు-చెడు చేపలు ఉంటాయి. అనగా, మంచివారు-చెడ్డవారు, పునీతులు-పాపాత్ములు దేవుని రాజ్యములో కలిసి జీవిస్తారు. కాని, అంత్య కాలమున వారు వేరుచేయ బడుదురు (మ. 13: 40,49). శ్రీసభలో ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యమునకు చెందిన వారము. పరలోక రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు.
ఈనాడు మనము అర్ధం చేసుకునేది ఏమిటంటే, మొట్టమొదటిగా, పరలోక రాజ్యమనగా “భూలోకములో దేవుని పరిపాలన”. ఈ ‘పరిపాలన’ ద్వారా దేవుడు తన రక్షణాశీర్వాదములను మానవాళిపై క్రుమ్మరిస్తున్నాడు. రెండవదిగా, పరలోకరాజ్యము అనగా “మానవాళికి విముక్తిని కలిగించుట”. మానవాళి అంతిమ లక్ష్యం, ధ్యేయం, గమ్యం – పరలోక రాజ్యము. అచ్చట శాంతి, ప్రేమ, సత్యము, న్యాయము ఉండును. మూడవదిగా, పరలోక రాజ్యము అనగా “దేవుని శాశ్వతమైన పాలన”. అచ్చట ప్రేమ పాలించును. మానవులందరు అచ్చట పరిపూర్ణమైన ఆనందమును, సంతోషమును బడయుదురు.
పరలోక రాజ్యము అనగా, “దేవుని చిత్తమును నెరవేర్చడం.” “పరలోక ప్రార్ధన”లో ‘మీ రాజ్యము వచ్చును గాక [=] మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నేరవేరునుగాక!’ అని ప్రార్ధిస్తున్నాము [రెండు వాక్యాలు కూడా ‘సమాంతర’ అర్ధముతో వాడబడినవి]. కనుక, దేవుని చిత్తము ఎక్కడైతే నెరవేర్చ బడుతుందో, అదియే పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యము అని అర్ధం. కనుక, దేవుని చిత్తమును అంగీకరించి పాటించడమే దేవుని రాజ్యము. దైవరాజ్య విలువలైన సత్యము, న్యాయము, ప్రేమ, శాంతిని ప్రకటించడం. ఈ విలువలు ఎప్పుడైతే ప్రజలను [మనలను] పరిపాలించునో, వారి [మన] హృదయాలలో, సమాజములో, సంఘములో దైవ రాజ్యము పాలించు చున్నదని అర్ధము.
దైవరాజ్యమనగా ‘అనంతమైన లేదా శాశ్వతమైన దేవుని ప్రేమ’. అనంతమైన ప్రేమను కలిగి జీవించువారే పరలోక రాజ్యమున ప్రవేశింప గలరు.
మన చుట్టూ చూసినట్లయితే, దేవుని పరిపాలన, దైవరాజ్య పరిపాలన కొనసాగుచున్నదని చెప్పగలమా? “లేదు” అనేదే మన సమాధానం. ఎందుకన, ఎంతోమంది అధికారం, పలుకుబడి, ధనము, భద్రత కొరకు ప్రాకులాడు చుండటం మనం చూస్తున్నాము. మన జీవితములో పరలోక రాజ్యమును గుర్తించడం ఎలా? మనం జీవించే జీవిత విధానమును బట్టి గుర్తింపవచ్చు: మన సమయాన్ని, తాలెంతులను...
-అవసరములో నున్న వారికి ఇవ్వుము; -అందరిని ప్రేమింపుము; -రోగులను, చెరలోనున్న వారిని పరామర్శింపుము; -శోకములోనున్న వారిని ఓదార్చుము; -పాపాత్ములను మందలింపుము; -పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రకటింపుము; -సందేహములో నున్న వారికి సలహాలిమ్ము; -ఒంటరి వారిని ఒదార్చుము; -తప్పులను, నిందలను ఓపికగా భరింపుము; -ఇతరులను క్షమింపుము; -ద్వేషము నుండి మీ హృదయములను విముక్తి గావింపుము; -ఆందోళనల నుండి మీ మనస్సులను విడిపింపుము; -సాధారణముగా జీవింపుము
-అతిగా ఆశింపకుము; -ప్రార్ధన చేయుడి [...]. ఇలా జీవించినచో మన జీవితములో సంతోషము ఉండును. అదియే ‘పరలోక రాజ్యము’.
“దాచబడిన ధనము” మరియు “ఆణిముత్యము’ ఉపమానములు (మ. 13: 44-46)
“పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది” (మ. 13:44) మరియు “పరలోకము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది” (మ. 13:45). ఇచ్చట ‘ధనము’ మరియు ‘ఆణిముత్యము’వలె విలువైనది పరలోక రాజ్యము. అదియే మన ఆధ్యాత్మిక నిధి, ధనము, ఆణిముత్యము. యేసు ప్రభువు మాటలను గుర్తు చేసుకుందాం: “నీ సంపదలను పరలోక మందు కూడ బెట్టు కొనుము... నీ సంపదలున్న చోటనే నీ హృదయ ముండును” (మ. 6: 20-21).
ఈ లోక సంపదలైన ధనము, ఆణిముత్యాలు ఈ లోకములో ఎంతో మంది జీవితాలను, నాశనం చేసాయి. వీటి వలన వ్యక్తుల మధ్య, కుటుంబాలలో, బంధుత్వాలలో కలహాలు సృష్టించాయి. ఒకరి నుండి ఒకరు విడిపోవునట్లు చేసాయి. వీటి కోసం, ఎంతో మంది వారి విలువలను, శరీరాలను అమ్ముకోవడం జరిగింది! ఎందుకన, సంపదలున్న చోటనే మన హృదయం ఉంటుంది. లోకాశాలున్నచోట దురాశ తప్పక ఉంటుంది. ఈ లోక సంపదలను సంపాదించుకొను ప్రక్రియలో, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరచిన యెడల పాపాలతోనే మన జీవితం ముగుస్తుంది: పని చేయకుండా సంపద, ప్రవర్తన లేని జ్ఞానం, మానవత్వం లేని సైన్స్, నీతి లేని రాజకీయాలు...మొ.వి.
“ధనము” మరియు “ఆణిముత్యము” లాంటి దైవరాజ్యము కొరకు “ఉన్నదంతయు అమ్మివేయాలి”. దీనికి మొదటి అర్ధం “మరణమే” – మన స్వార్ధానికి, అహంనకు, మన సౌకర్య వంతమైన జీవితానికి, మన కోరికలకు... మొ.గు. వాటికి మరణించడం. ‘దైవ రాజ్యము’ అను ధనము, ఆణిముత్యము కొరకు మనం ఓ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే మనలను సంతోషానికి నడిపిస్తుంది.
రెండవదిగా, దైవ రాజ్యము కొరకు సర్వాన్ని త్యాగం చేయడం [వదులు కోవడం]. అలాంటి గొప్ప పునీతులలో అస్సీసి పుర ఫ్రాన్సిస్ వారు ఒకరు. దైవ రాజ్యము కొరకు, ఆయన అక్షరాల తనకు ఉన్నదంతయు అమ్మివేసాడు, సమస్తాన్ని త్యాగం చేసాడు. ఓ భిక్షగానిగా మారాడు. భిక్షమెత్తుకొనుటలో సంతోషాన్ని కనుగొన్నాడు. కనుక దేవుని రాజ్యము కొరకు నిర్ణయం చేయుటం చాలా ముఖ్యము. పునీతులే మనకు గొప్ప ఆదర్శం! వారు ఎంతో సంతోషముగా జీవించారు. ఎందుకన, దేవుడు ప్రేమిస్తున్నాడని వారు గుర్తించారు. అలాగే వారి ప్రయాణం దైవరాజ్యమని, అచట దేవున్ని సంపూర్ణముగా కలుసు కొందురని ఎరిగి యున్నారు.
దైవరాజ్యము కొరకు ఉపమానాలలోని వ్యక్తులవలె చురుకుతనముతో ఉండాలి. అదియే “జాగరూకులై ఉండుట”. మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి: శారీరక అవసరాలు, భద్రతాపరమైన అవసరాలు, సామాజిక అవసరాలు, గౌరవపరమైన అవసరాలు...మొ.వి. కాని సకల కోరికలను తీర్చు ఆ ఒకే ఒక్క కోరికయే ‘పరలోక రాజ్యము’. “మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింప బడును” (మ. 6:33) [“మొదట” మాత్రమే కాదు, దేవుని రాజ్యమును “మాత్రమే” వెదకాలి].
దేవుడు కలలో కనిపించి ఏదైనా ఒక్క కోరిక కోరుకోమని అడిగినచో, ఏమని కోరుకుంటావు? నీ వ్యక్తిగత జీవితములో ‘దేవుని పరిపాలన’ను, ‘దేవుని రాజ్యము’ను కోరుకొనెదవా? గుర్తుంచుకో! దేవుని రాజ్యమున్నచో, లేదా మనం దేవుని పరిపాలనలో, కాపుదలలో ఉన్నచో, మనం సకాలన్ని కలిగి యుందుము. రెండవ పఠనములు పౌలు గారు అంటున్నారు: ‘దేవుని ప్రేమించు వారికి, ఆయన ఆయన ఉద్దేశానుసారము [చిత్తము] పిలువబడిన వారికి, అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయును” (రోమీ. 8:28).
మొదటి పఠనములో సోలోమోను రాజు దేవున్ని ఏమి కోరుకున్నాడో వింటున్నాము. యువకుడైన సోలోమోను రాజుకు ఎన్నో కోరికలు, ఆశలు, ఆశయాలు ఉండి ఉండవచ్చు. దీర్ఘాయువు, సిరిసంపదలు, సైన్యము, పేరు ప్రతిష్టలు, భద్రత, శ్రేయస్సు...అవసరమై యుండవచ్చు. కాని దేవుడు ఒకే ఒక్క కోరికను కోరమన్నప్పుడు, వీటిని కాకుండా, “మంచి చెడ్డల నెంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము” (1 రాజు. 3:9) అని కోరుకున్నాడు. విజ్ఞానమును [దేవుడు] కోరుకున్నాడు. విజ్ఞానములోనే సకల వరములున్నవని సోలోమోను ఎరిగి యున్నాడు. దీనినే దేవుడు ఋజువు చేసియున్నాడు: “నీవు దీర్ఘాయువునుగాని, సిరిసంపదలనుగాని, శత్రువినాశనముగాని కోరుకో వైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగు కొంటివి. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందటి వారిలోగాని, నీ తరువాతి వారిలోగాని ఎవ్వరికి లేని వివేకము, జ్ఞానము నీకు ప్రసాదింతును. నీవు అడుగకున్నను ఈ వరముగూడ నీకిత్తును. ఏ రాజుకు లభింపని ఐశ్వర్యము, ప్రఖ్యాతి జీవిత కాలమెల్ల నీకు లభించును” (1 రాజు. 3: 11-13).
శిష్యరికము గురించిన ధ్యానం
ఈ రెండు ఉపమానాలు శిష్యరికము గురించి కూడా బోధిస్తున్నాయి. నిజమైన యేసు శిష్యులు మొదటి ఉపమానములోని వ్యక్తివలె, అలాగే రెండవ ఉపమానములోని వర్తకునివలె ఉండవలయును. వారిరువురు కూడా పరలోక బహుమానము కొరకు పోరాడితిరి. సర్వాన్ని త్యాగము చేసితిరి. మొదటి ఉపమానములోని వ్యక్తి రోజువారి కూలివాడు [ఇతరుల పొలములో పనిచేయుచూ ఉండగా ‘అదృష్టవశాత్తు’గ ధనమును కనుగొన్నాడు]. రెండవ ఉపమానములోని వ్యక్తి వర్తకుడు, అనగా ధనికుడు. కాబట్టి, ప్రభువునకు శిష్యులుగా ఉండుటకు అందరూ ఆహ్వానితులే! అని అర్ధమగుచున్నది.
కొంతమందికి ప్రభువు శిష్యరికం అనుకోకుండా అదృష్టవశాత్తు దొరుకుతుంది. కొంతమంది దానికోసం వెదక వలసి ఉంటుంది. దైవరాజ్యమును [క్రీస్తు] కనుగొన్నపుడు, వారిరువురివలె తక్షణమైన నిర్ణయం తీసుకోవాలి. వారు ఆశించిన దానిని పొందుటకు ఇరువురు కూడా వారికున్న సర్వాన్ని అమ్మి వేసితిరి.
ఈ ఉపమానాల ఆధారముగా, శిష్యరికమును మూడు భాగాలుగా చెప్పవచ్చు: ఒకటి దైవరాజ్య ఆగమనం. ఇదియే శిష్యరికమునకు పిలుపు. రెండు ఆ పిలుపుకు ప్రతిస్పందనగా గతాన్ని విడచి పెట్టడం, సర్వాన్ని వదిలి ప్రభువుని [దైవ రాజ్యము] అనుసరించడం. మూడు దైవరాజ్య ఆగమనముతో క్రొత్త అవకాశములు కలిగిన జీవితమును జీవించడం.
తన సమస్త ప్రజలకు, పరలోక తలుపులను తెరచుటకు క్రీస్తు సమస్తాన్ని సంపూర్ణముగా త్యాగం చేసాడు. మనము కూడా క్రీస్తు శిష్యులముగా, సంపూర్ణ నిబద్దతతో, సంతోషముగా, దైవ రాజ్యమును కనుగొనుటకు స్పందించాలి. దేవుని రాజ్యములో స్థానమును సంపాదించాలంటే, మనకున్న సమస్తాన్ని అమ్మి వేయాలి. ధనికుడైన యువకుడికివలె ఇది అసాధ్యం అనిపించవచ్చు. కాని, దేవునికి సమస్తమును సాధ్యమే!
ఇతర ధ్యానాంశాలు
Ø  ధనికుడైన యువకుడిని ప్రభువు ఆహ్వానించారు, కాని ‘దైవరాజ్యము’ కొరకు సంపదలను వదులుకోలేక బాధతో వెళ్ళిపోయాడు (మ. 19: 16-22). “దాచబడిన ధనము’ వంటి క్రీస్తును మనం పొందాలంటే, మన సంపదలను త్యాగం చేయాలి. లోక సంపదలపై నున్న వ్యామోహాన్ని త్యజించాలి.
Ø  “మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు?” (మ. 16:26).
Ø  ధ్యానించుదాం: “ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు. ఏలయనగా, వెడల్పైన ద్వారము, సులభముగా నున్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది. మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు” (మ. 7:13-14). ఆ కొద్ది మందిలో నేను ఉండ గలనా?
Ø  “నేను లాభముగా లెక్కించు కొనదగిన వానిని అన్నింటిని, క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించు కొనుచున్నాను. వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువ గల దానికి, అనగా నా ప్రభువగు యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగనే పరిగణించు చున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటిని చెత్తగా భావించు చున్నాను” (ఫిలిప్పీ. 3:7-8).
మంచి చేపలు – చెడు చేపలు ఉపమానము
“పరలోక రాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది” (మ. 13:47). ఈ ఉపమానం గత వారము ధ్యానించిన “గోధుమలు – కలుపు గింజలు” ఉపమానమును పోలియున్నది. ఇతరులను తీర్పు చేయరాదని ఉపమాన సారాంశం. దేవుడు మాత్రమే నిజమైన తీర్పరి. అంత్య కాలమందు మంచి వారిని, చెడ్డ వారిని వేరుచేసి తీర్పు విధించును. మంచి వారు ఇంకా నిబద్దతో జీవించునట్లుగా, చెడ్డవారు హృదయ పరివర్తన చెందునట్లుగా మనం తోడ్పడాలి. సహోదర ప్రేమ, దిద్దుబాటు భావములతో మంచి వారిని, చెడ్డవారిని అందరిని ఆదరిద్దాం. ఎవరిపై తీర్పు చేయక, అందరి దరి చేరడానికి ప్రయత్నం చేద్దాం. తీర్పును దేవునికి వదిలి వేద్దాం. ఆయనే తీర్పరి.
దేవుడు మన ‘ధనము’, మన ‘ఆణిముత్యము’. కనుక నిజ దేవుని కొరకు వెదకుదాము. మన జీవితాలలో దేవుని కనుగొందాం. మన జీవితాలలో దైవరాజ్యమునకు ప్రాధాన్యతను ఇద్దాం. మనం కనుగొనే ఆ దేవుడే మనకి సర్వాన్ని ఒసగునని, మనలను కాచి కాపాడునని, మనలను నడిపించునని విశ్వసించుదాం!
మనం కూడా మన జీవితాల ద్వారా, ఇతరులకు ‘ధనము’గా, ‘ఆణిముత్యము’గా, ‘వల’గా మారుదాం. మనం పొందిన క్రీస్తు అను ధనమును, ఆణిముత్యమును ఇతరులకు పంచుదాం.
పరలోక రాజ్య శిష్యత్వము (మ. 13:51-52)
“పరలోక రాజ్యమునకు శిక్షణ పొందటం (మ. 13:51) అనగా ఏమి? “పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మ శాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు (మ. 13:52). మత్తయి క్రీస్తు శిష్యులలో ఒకరు. ప్రభువు పిలువక ముందు సుంకరి, కోశాధికారిగా పనిచేసేవాడు. ఇప్పుడు అతను పరలోక రాజ్యమునకు ప్రభువు చేత శిక్షణను పొంది యున్నాడు. క్రీస్తు ఏవిధముగా పాత నిబంధన “నిధి”ని నూతన నిబంధనకు ఆపాదించాడో మత్తయి ఎరిగి యున్నాడు. ఆ తరువాత మత్తయి ఎంతోమందికి పరలోక రాజ్యమునకు శిక్షణను ఇచ్చి యుండవచ్చు. మత్తయి సంఘము [ఇల్లు] క్రీస్తు అను జ్ఞానము మరియు రాయిపై నిర్మింప బడినది. “ఇల్లు” తండ్రి దేవుడు తన ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధములోనికి ప్రవేశించు స్థలము. “ఇల్లు” నీతి విషయములను, మంచి నడవడికను గురించిన దేవుని జ్ఞానమును ఆలకించుట ద్వారా, దేవునితో సన్నిహిత సంబంధమును కలిగియుండు స్థలము.
‘దేవుని రాజ్య’ సాన్నిధ్య అనుభూతిని పొందుటకు ‘ఇల్లు’ [కుటుంబము] పరిపూర్ణమైన చోటు.  ఈ లోకమే దేవుని “ఇల్లు” [గృహము, కుటుంబము]. దేవుని రాజ్య నివాస స్థలము. దేవుని సాన్నిధ్య నివాస స్థానము. [శిక్షణ పొందినవారు] ఈ దైవ రాజ్యములో ప్రభువును, ఆయన తీర్పును తెలుసుకోవచ్చు. ఒక గొప్ప నమ్మకముతో మనము ఈ లోకములో [దేవుని కుటుంబము] జీవించవచ్చు. ‘దైవ వాక్కు’ను ఆలకించుట వలన, ప్రేమతో కూడిన క్రీస్తు సాన్నిధ్య అనుభూతిని మనం పొందవచ్చు. ఆ అనుభూతి మనం విశ్వాసములో, ప్రేమలో ఎదుగునట్లు చేయును.
ప్రభువు, “వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?” అని ప్రశ్నించినప్పుడు, శిష్యులు “అవును” అని సమాధాన మిచ్చిరి. మన సమాధానం ఏమిటి? ఎదేమైనప్పటికిని, పరలోక రాజ్య పరమ రహస్యాలను మనం తెలుసుకోవాలి. “అట్లే అంత్య కాలమందు జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి, అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కొరుకు కొందురు” (మ. 13:49-50).
క్రీస్తు వలె, ఆయన శిష్యులవలె మనము కూడా పరలోక రాజ్యమునకై ఇతరులకు శిక్షణ ఇవ్వగలగాలి: మన జీవితము ద్వారా, బోధనల ద్వారా, వ్రాతల ద్వారా...
క్రీస్తే మన పరలోక రాజ్యము. ఆమెన్.

1 comment:

  1. Thanks Praveen for the homily. A lot of effort to bring the scientific findings to our people in Telugu. Please give us also from time to time some exegesis. It will be helpful.
    Thanks again

    ReplyDelete