క్రైస్తవ విశ్వాస పోరాటం

క్రైస్తవ విశ్వాస పోరాటం

    దేవుడు తనను తాను క్రీస్తుని ద్వారా బహిర్గత మొనర్చి యున్నాడని క్రైస్తవమత మెరిగిని సత్యము, విశ్వాసము, అనగా, దేవుడు క్రీస్తు ద్వారా కాకుండా, ఏ మతములోను తనను తాను బహిర్గత మొనర్చలేదని అర్థము. దీని ప్రకారము, ఇతర మతములన్నియు కూడా దేవుని వెదకుటలో మానవుని కల్పితాలని, పిశాచి దుష్క్రియలని క్రైస్తవ మతం భావించి యున్నది. క్రైస్తవమతం అత్యున్నతమయిన మతమే కాకుండా, క్రైస్తవమతం ద్వారా మాత్రమే దేవుడు తననుతాను బహిర్గతమొనర్చినాడని లేక తెలియబరుచుకున్నాడని విశ్వసించి యున్నది. ఈ అభిప్రాయాన్ని అనేకలు వ్యతిరేకించారు. ఇలాంటి అభిప్రాయాలన్నియు కూడా, క్రైస్తవ మతాన్ని రక్షించుకోవడానికి, దృఢపరచు కోవడానికి చేసిన ప్రయత్నములని వాటిని తృణీకరించారు. ఎందుకనగా, ఆకాలములో క్రైస్తవ మతము రోమను పాలకుల చేత క్రూరాతి క్రూరముగా హింసించ బడినది. ఈ సమస్య దాదాపు 5,6 శతాబ్ధముల వరకు ఉన్నది. ఆ తరువాత, అదే సమస్య 15వ శాతాబ్ధములో ఉద్భవించినది. అప్పుడు, క్రైస్తవ మతము మరల తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినది. ఆ ప్రయత్నములోనే ‘‘ప్రాథమిక వేదాంతశాస్త్రము’’ జన్మించినది. ఈ శాస్త్రము యొక్క ముఖ్యోద్దేశము: క్రైస్తవ విశ్వాసాన్ని రక్షించుకోవడం.

    అదేవిధంగా, 21శతాబ్ధములోనున్న ఈనాటి క్రైస్తవమతము కూడా మూడు అతిముఖ్యమైన సమస్యలతో సతమతమగుచున్నది.

1. నాస్తికత: దేవుని ఉనికిని నమ్మకపోవటం.

2. ఇతర మతము.

3. దేవుని పితృత్వాన్ని నిరాకరించటం.

    నాస్తికత అనగా దేవునిని, ఆయన సన్నిధిని వ్యతిరేకించటం, తిరస్కరించటం. మానవుని వ్యక్తిగత జీవితములో దేవునికి స్థానమును ఇవ్వకపోవటం. దేవున్ని విశ్వసించక పోవడం, వ్యతిరేకించడం, ఒక రకమయిన నాస్తికత. మరొక రకమయిన నాస్తికత ఈనాడు ప్రబలి పోవుచున్నది. సిద్ధాంతము ప్రకారం, వారు దేవుని ఉనికిని నమ్మెదరు, విశ్వసించెదరు. కాని, వారు జీవించెడి జీవిత విధానమును బట్టి చూచినట్లయితే దేవుడు లేడుఅన్న రీతిలో జీవిస్తూ ఉంటారు. ఇలాంటి నాస్తికత ఈనాటి క్రైస్తవ మతానికి, విశ్వాసానికి పెద్ద సమస్యగా, సవాలుగా ఉన్నది.

    దేవుడు తన మతము ద్వారా తనను తాను బహిర్గత మొనర్చు తున్నాడని క్రైస్తవ ప్రధాన విశ్వాసము. మరియు ఈ విశ్వాసము అన్ని కాలములకు సమ్మతమయినది. అయితే, ఈ విశ్వాసాన్ని, అభిప్రాయాన్ని ఇతర మతములు వ్యతిరేకించాయి. వాస్తవానికి లోతుగా పరిశీలించి నట్లయితే, ఏ మతముకూడా క్రైస్తవమత  అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని త్రోసిపుచ్చడము లేదు. కాని, మా మతము ద్వారా కూడాదేవుడు బహిర్గత మొనర్చు తున్నాడని వాదిస్తున్నాయి. కాని, ఇస్లాం మతం ఒకప్పటి  క్రైస్తవమతం వలె, ‘మా మతం ద్వారా మాత్రమే రక్షణ సాధ్యమనివాదించింది. హిందూ మతం మాత్రము, మా మతం ద్వారా కూడా దేవుడు తనను తాను బహిర్గతమొనర్చు కున్నాడని, వాదిస్తుంది. ఈ రకముగా, క్రైస్తవమతానికి, ఇతర మతము సవాళ్ళుగా నిలుస్తున్నాయి. ఈనాడు, ఇతర మతాలలో దేవుడు లేడని, దేవుని ఉనికి లేదని, దేవుని ఆత్మలేదని, సత్యమే లేదని, రక్షణ లేదని వాదించలేము. దేవుడు అంతటను, అందరిలోను ఉన్నాడు.

    దేవుడు మన తండ్రి’  అనియు, మనము ఆయన బిడ్డలమని క్రైస్తవ విశ్వాసము. అయితే, ఈ విశ్వాసము ఈనాడు ఒక సవాలుగా ఉన్నది. ఏట్లన, ఈనాటి సమాజాన్ని క్షుణ్ణముగా పరిశీలించి చూసినట్లయితే, హీనమయిన, దైన్యమయిన పేదరికముతో కొట్టుమిట్టాడుచున్నది. ఉన్నవాడు సుఖభోగములతో జీవిస్తున్నాడు. లేనివాడు హీనమయిన స్థితిలో ఉన్నాడు. ఇలాంటి తునాత్మక మయిన పేదరికముద్వారా దేవుడు తండ్రి అను వాస్తవము నిరాకరింప బడుతుంది. మరియు దేవుని పితృత్వానికి అర్థము లేకుండా పోవుచున్నది. ఎందుకన, సమాజములో దేవుని బిడ్డలు సమానత్వముతో జీవించుట లేదు. మనం విశ్వసించే దేవుడు, తన బిడ్డలపై ఇలాంటి తారతమ్యములను చూపడం అసాధ్యము. దీని మూలముగా, క్రైస్తవ మతము విశ్వసించెడి, వాదించెడి వారిచే  దేవుని పితృత్వము ప్రశ్నించ బడుచున్నది.

మన బాధ్యత: 

    ఈ నాటి మన క్రైస్తవ విశ్వాసం ఏస్థాయిలో ఉన్నదో పరీక్షించు కోవాలి. క్రైస్తవులమై ఉండి క్రీస్తు నెరగని వారివలె ఉండకూడదు. నాస్తికులవలె ప్రవర్తించ కూడదు. అవిశ్వాసములో జీవించ రాదు. మన విశ్వాసాన్ని మన చేష్టల ద్వారా చూపించుదాం. అదే సమయంలో, ఇతర మతములను గౌరవించుదాము. ఇతర మతములలో కూడా విశ్వాసము, దేవుని ఉనికి, దేవుని ఆత్మ ఉన్నాయని తెలుసుకొందాం, వాటిలో నున్న పాపాన్ని ద్వేషించి, మంచిని అంగీకరించుదాం. దేవుని దృష్టిలో ఒకే ఒక మతమున్నది. అదియే మానవ మతము. అలాంటప్పుడు, మతాల పేరిట జగడాలు ఎందుకు!

    దేవుడు ఈ లోకాన్ని, సకల ప్రాణులకు సృష్టించాడు. కాని, మతాలను సృష్టించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలమే. సర్వమానవాళి ఆయన ప్రజలమే. కాబట్టి, రక్షణ అనెడిది అన్ని మతాలవారికి (సర్వమాన వాళికి) సాధ్యమగును. కాబట్టి, ఇతర మతస్తులు విశ్వాసాన్ని, అభిప్రాయాన్ని, వ్యక్తిత్వాని, బేధాలను గౌరవించడం నేర్చుకొందాం.

    ఈనాడు మనం క్రైస్తవ మతాన్నికాకుండా, ‘దేవుని రాజ్యాన్నిస్థాపించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని రాజ్యం అనగా దేవుని పరిపాలనదేవుని రాజ్యం, సర్వమానవాళికి నిలయము, ఈనాటి మన ప్రచారములో దైవరాజ్యముమూలమైనదిగా ఉండాలి. దైవరాజ్యాన్ని ఎలా స్థాపించగలం? స్వాతంత్య్రాన్ని కల్పించడం ద్వారా, మానవ వ్యక్తిత్వ వికాసానికి గౌరవాన్ని చూపడం ద్వారా, ఐకమత్యమును సాధించ డము ద్వారా న్యాయాన్ని స్థాపించడం మొదలగు వాటి ద్వారా దైవరాజ్యాన్ని స్థాపించగలము.

    మన సంఘములో ప్రబలిపోతున్న తారతమ్యములను వెర్లతో సహా పెకళించి వేద్దాం. ముందుగా నీనుండి, నీకుటుంబం నుండి ప్రార్థించండి. నీ పొరుగువారినుండి, నీగ్రామమునుండి ఆరభించు. ప్రస్తుత సమాజములో, ధనిక, పేద, పెద్దకులం, చిన్న కులం, ఆడ, మగ, దళితులు మొదగు తారతమ్యాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇలాంటి తారతమ్యాలు ఉన్నప్పుడు దేవుని పితృత్వానికి సంపూర్ణమయిన అర్థము ఉండదు. వీటన్నింటికి మనమే కారకులము, దేవుడు కాదు. కాబట్టి మనల్ని నాశనం చేసికొనక, అభివృద్ధి బాటలో పయనిద్ధాం.

    చివరిగా, మన విశ్వాసాన్ని కాపాడు కోవాలి. ‘‘మీయందున్న నమ్మకమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానము ఒసగుటకు సర్వదా సంసిద్ధముగా ఉండుడు (1పే.3:15). దేవుడు సృష్టి ఆరంభము నుండి, ప్రకృతి ద్వారా, ప్రవక్తల ద్వారా, క్రీస్తుద్వారా, చరిత్రద్వారా,శిష్యులు, అపోస్తలులద్వారా... తనను తాను మరియు తన రక్షణ కార్యమును బహిర్గత మొనర్చుకున్నప్పటికిని, దేవుని ప్రణాళికను మనం సంపూర్ణముగా అర్థము చేసుకొనలేక పోతున్నాము. కాబట్టి, దేవునికి, ఆయన ప్రణాళికకు లొంగి, లోబడి ఉండాలి. మన విశ్వాసానికి అడ్డు వచ్చెడి సమస్యలన్నింటిని జయించుటకు మన హృదయములో క్రీస్తుని ప్రతిష్ఠించుకొని, సంపూర్ణమయిన, నిర్మలమయిన హృదయముతో, సహనముతో, దేవుని చిత్తము ప్రకారం... పోరాడుదాం. క్రీస్తులో నిజమయిన విశ్వాసులుగా జీవిద్ధాం.

No comments:

Post a Comment