పోపుగారి సందేశము: కుటుంబము – పవిత్రత

పోపుగారి సందేశము: కుటుంబము – పవిత్రత
ఒక కుటుంబము పవిత్రముగా ఎలా జీవించగలదు? పవిత్రముగా జీవించాలంటే, ఈ క్రింది మూడు అంశములను కలిగి ఉండాలి:
1. ప్రార్ధించే కుటుంబము: ప్రియ కుటుంబములారా! మీరు ప్రతీ రోజు ప్రార్ధన చేస్తున్నారా? మీలో కొంతమంది ప్రార్ధన చేస్తున్నారని నాకు తెలుసు. కాని, చాలామంది కుటుంబములో ప్రార్ధన ఎలా చేయగలము; సమయము ఉండటము లేదు, కుటుంబములో శాంతి సమాధానం లేవు అని చెప్పుచున్నారు. కాని, ప్రియులారా! దేవుడు మన కుటుంబములో ఎంతో అవసరమని వినయముతో గుర్తించాలి. దేవుని బలము, సహాయము, ఆశీర్వాదము, కరుణ, క్షమాపణ మనకు ఎంతో అవసరము. కాబట్టి, కుటుంబముగా మనం దీనతతో ప్రార్ధన చేయాలి. ‘పరలోక ప్రార్ధన’ ను అందరము కలసి జపించడము కష్టమేమి కాదు! సులభతరమే! ‘జపమాల’ ను ప్రార్ధించడం ఎంతో లావణ్య కరము! మరియు మన బలానికి మూలము. కుటుంబములో ఒకరికొరకు ఒకరము ప్రార్ధన చేయాలి; భర్త భార్య కోసం, భార్య భర్త కోసం, వారిరువురు తమ పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం, పెద్దవారికోసం ప్రార్ధన చేయాలి. ఇలా చేసినప్పుడు కుటుంబాలు అధ్యాత్మికముగా బలపడతాయి. కాబట్టి ప్రతీ క్రైస్తవ కుటుంబము ప్రార్ధించే కుటుంబమై ఉండాలి.
2. విశాసము కల్గిన కుటుంబము: ప్రతీ క్రైస్తవ కుటుంబము విశ్వాసము కలిగి జీవించాలి. కుటుంబములో మన విశ్వాసాన్ని ఎలా జీవించగలము? పునీత పౌలుగారు తన జీవిత చివరిదశలో ఇలా అన్నారు: “నా విశ్వాసమును నిలుపు కొంటిని” (2 తిమో 4:7). మన విశ్వాసాన్ని ఎలా నిలుపుకొనగలము? విశ్వాసాన్ని మనలోనే దాచుకోకుండా, ఇతరులకి సాక్ష్యమిస్తూ జీవించాలి. క్రైస్తవ కుటుంబాలు వేదవ్యాపక కుటుంబాలు. ఈనాటి కుటుంబాలు అనేక కారణాల వలన, ఒక ప్రాంతమునుండి, మరొక ప్రాంతమునకు మారుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో, వెళ్ళిన చోటల్ల విశ్వాసాన్ని చాటాలి.
3. సంతోషము కల్గిన కుటుంబము: మీ కుటుంబములలో సంతోషము, ఆనందము, శాంతి ఉన్నాయా? ప్రియ కుటుంబములారా! నిజమైన ఆనందము ఈ లోక వస్తువులనుండి రాదని మనకు తెలుసు. నిజమైన ఆనందము కుటుంబ సభ్యులమధ్య ఉండే బాంధవ్యమునుండి వస్తుంది. నిజమైన ఆనందాన్ని మన హృదయములలో మాత్రమే అనుభవించగలము. ఒకరికొకరము సహాయము చేయటములో ఆనందము కలుగుతుంది. అయితే, నిజమైన ఆనందానికి మూలం – మన కుటుంబములలో ‘దైవ సాన్నిధ్యం’. దైవ సాన్నిధ్యం, ప్రేమ మన కుటుంబములలో ఉన్నప్పుడే, నిజమైన ఆనందాన్ని చవిచూడగలము. కుటుంబములో ప్రేమను కలిగి జీవించాలి, ముఖ్యముగా, సహనము కలిగి ఉండాలి. కుటుంబములో దేవుని ప్రేమ లేనిచో, కుటుంబములో పొందిక, ఐకమత్యం, స్నేహం ఉండవు. ఆనందము నశిస్తుంది.
ప్రియ కుటుంబములారా! నజరేతు తిరు కుటుంబమువలె, ఎల్లప్పుడూ విశ్వాసములో మరియు వినయముతో జీవించండి!
ప్రభుని శాంతి, ఆనందము మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక!

No comments:

Post a Comment