పోపుగారి సందేశము: క్రిస్మస్

పోపుగారి సందేశము: క్రిస్మస్

మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎందుకన, వారికి సత్రములో చోటు లేకుండెను (లూ 2:7). లూకా సువార్తీకుడు, ఈ వచనము ద్వారా, ఆ అర్ధరాత్రి యొక్క ముఖ్యభావాన్ని వ్యక్తపరచియున్నాడు. మరియ కుమారుని కనెను. ఈ లోకమునకు వెలుగునైన యేసును మనకు ఇచ్చెను. ఇదియే మానవ చరిత్రను మార్చివేసెను. ఈ రాత్రి మానవాళి ఆశకు మూలాధారమయ్యెను.

తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరించవలెనని సీజరు ఆగస్తు చక్రవర్తి ప్రకటించుట వలన మరియ యోసేపులు గలిలయ సీమలోని నజరేతునుండి, యూదయా సీమలోని బెత్లేహేమునకు వెళ్ళిరి. గర్భవతియైన (స్త్రీ) మరియతో ప్రయాణం అంత సులువైనదికాదు. అయినప్పటికిని వారు ఓ గొప్ప ఆశతో పయనమయ్యిరి. బెత్లేహేమునకు చేరిన వారికి కష్టాలు మొదలయ్యెను. మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. ఏ సత్రములోను చోటులేకపోవుటచే, పశువుల తొట్టిలో కుమారున్ని పరుండబెట్టెను (లూ 2:1-7). బెత్లేహేము ప్రజలు ఎవరుకూడా రక్షకుని రాకకోసం ఎదురు చూడని పరిస్థితి. అలాంటి కష్ట సమయములో మరియమ్మ “ఇమ్మానుయేలు” ను ఈ లోకమునకు ఒసగెను. “ఆయన తన వారి యొద్దకు వచ్చెను కాని తన వారే ఆయనను అంగీకరింపలేదు” (యో 1:11). అంధకారము, పాపము, నిరాశ ఉన్నచోట...అదిగో...అక్కడే దేవుని ప్రేమ వెలసి యున్నది. భూమి, దేశం, కలలను కోల్పోయిన వారి జీవితాలలో ఓ ఆశ చిగురించినది. మరియ యోసేపు అడుగుజాడలలో ఇంకా ఎన్నో అడుగులు అక్కడికి చేరుకున్నాయి. లక్షలాది మంది ప్రజలు ఆశతో, మనుగడ కొరకు అచటకు వచ్చియున్నారు.

ఈ లోక రక్షకున్ని వారి కౌగిలిలో బంధించిన ప్రధములు మరియ యోసేపులు. నిజమైన శక్తి, ప్రామాణికమైన స్వేచ్చ, బలహీనులకి సహాయం చేసినప్పుడు ఉంటుందని పేదరికము, దీనస్థితిలోనున్న బాలయేసు మనకు తెలియ జేయుచున్నారు. జన్మించుటకు చోటు లేని రక్షకుడు, ఈ లోకములో చోటు లేనివారికి తన సందేశమును తెలియజేసియున్నాడు. ఈ సువార్తను విన్న మొదటివారు గొర్రెల కాపరులు. వారు చేసే పనినిబట్టి, వారు సమాజములో తక్కువ స్థాయివారిగా పరిగణింప బడ్డారు. వారి జీవన స్థితి, స్థలము కారణముగా మతపరమైన శుద్ధీకరణ ఆచారాలు వారిని అడ్డుకొన్నాయి. వారిని అపవిత్రులుగా భావించారు. వారిని అన్యులుగా, పాపులుగా, విదేశీయులుగా పరిగణించారు. కాని దేవదూత వారికి సుభసమాచారాన్ని తెలియజేయడం జరిగింది. “మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభసమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు (లూ 2:10-11). ఇదే ఆనందాన్ని, సంతోషాన్ని మనము కూడా ఇతరులతో పంచుకోవాలి మరియు ప్రకటించాలి. దేవుడు తన ప్రేమతో, అనంతమైన దయతో, అన్యులము, పాపులము, విదేశీయులమైన మనలను ఆలింగనము చేసుకొనియున్నాడు.

ఈ రాత్రి వెలసిన దేవుడు, మన విశ్వాసములో, సకల స్థితిలోనూ మనలను చూడగలడు. ఇదే విశ్వాసం ఓ నూతన జీవితాన్ని, సమాజాన్ని, నూతన బంధాలను సృష్టిస్తుంది. క్రిస్మస్ అనేది భయాన్ని దాటి ప్రేమలో జీవించడం. మనం ఈ క్రిస్మస్ కాలములో భయపడకుండా క్రీస్తు కొరకు మన హృదయ తలుపులను తెరచి యుంచాలి.

బెత్లేహేములోని బాలుని ద్వారా దేవుడు మనలను కలుసు కొనుటకు మరియు మన చుట్టూ ఉన్న వారి జీవితాలలో భాగస్తులను చేయుటకు వచ్చియున్నాడు. ఆయన తనకు తానుగా సర్వాన్ని మనకు ఇస్తున్నాడు. తద్వారా ఆయనను మనము మన చేతులలోనికి తీసుకొని ఆలింగనము చేసుకొని ఆదరించుచున్నాము, ఆరాధించుచున్నాము. ఈ బిడ్డలో దేవుడు మన ఆతిధ్యాన్ని స్వీకరించి యున్నాడు.

క్రిస్మస్ సంతోశములోనున్న మనము భాదపడుచున్న వారిపట్ల మన కన్నులను తెరచియుంచాలి. మన జీవితములోనికి వచ్చే ప్రతీఒక్కరిలో ఆ దివ్య బాలయేసును చూడగలగాలి.

వాటికన్, 24 డిశంబర్ 2017

No comments:

Post a Comment