ఎడారి అనుభవము
ఈ లోకములో మన జీవితం ఒక ప్రయాణం వంటిది. ఈ ప్రయాణం ఒక గమ్యముతో, ఒక లక్ష్యముతోకూడిన ప్రయాణం. ఈ గమ్యాన్ని చేరుకోవడానికి, మనం ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ ప్రయత్నములో రెండు ముఖ్య అంశాలు ఎంతగానో అవసరం. ఒకటి, మన జీవితములో 'నిరంతర పరివర్తన' అవసరం. అనగా, మన జీవిత ప్రతీ అంశములో మనము దేవునివైపు తిరిగిరావడానికి ప్రయత్నం చేయాలి. రెండు, మన జీవితములో 'నిరంతర ఆధ్యాత్మిక పునరుద్ధరణ' అవసరం.
మనకు తెలిసినవిధముగా, ఈ మన ప్రయాణం పూలపానుపు వంటిది కాదు. ఈ ప్రయాణములో ఎన్నో
కష్టాలు, శోధనలు, బాధలు ఉంటాయి. వీటిని జయించాలంటే, జీవితములో నిరీక్షణ,
పట్టుదల, ధైర్యం, అంకితభావం ఎంతో అవసరం.
వీటితోపాటు, మన ఆధ్యాత్మిక జీవితములో 'ఎడారి అనుభవం' ఎంతో అవసరం. ‘ఎడారి
అనుభవం’ అనగా, నిశబ్ధములో, ఏకాంతములో జీవించడం. ఈనాటి ప్రస్తుత సమాజ పరిస్థితులలో
గందరగోళంలో ఉన్నాము. గమ్యములేని బ్రతుకులను సాగిస్తున్నాము. బయటి ప్రపంచములోని
ఎన్నో సమస్యల, ఒత్తిడులమధ్య జీవనం
సాగిస్తున్నాము. ఎప్పుడు ఏమి జరుగుతుందోయని భయముతో ఉన్నాము. ఏకాగ్రతలేక
విచ్చలవిడిగా జీవిస్తున్నాము. ఇలాంటి పరిస్థితులలో 'ఎడారి అనుభవం' మనకు తప్పనిసరి! ఎడారి అనుభవము అనగా, హృదయ నిశబ్ధతలో మనలోనికి మనం తొంగిచూచుకోవడం, ఆత్మపరిశీలన చేసుకోవడం. ఏకాంతములో, మన వ్యక్తిగత దేవుని సన్నిధిని గుర్తించగలము.
‘ఎడారి’ అనగానే మనకు గుర్తుకు వచ్చేది
ఆకలిదప్పులు, భయం, జీవంలేనిది, మార్గం లేనిది, నిరాశ. కాని, ఆధ్యాత్మికభావముతో
చూసినట్లైతే, ‘ఎడారి’ దేవుని కలుసుకొనే
చోటుగా మనం చూస్తాము. ఉదాహరణకు, ఇశ్రాయేలు ప్రజలు 40 సం.లు ఎడారిలో ప్రయాణం
చేసారు. వారి గమ్యం, దేవున్ని తెలుసుకొని, వాగ్ధత్తభూమికి
చేరుకోవడం. కనుక, ‘ఎడారి అనుభవము’ మన
ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో అవసరం. ఈ ‘ఎడారి అనుభవము’ద్వారా, మనము మనలోనికి, దేవుని వైపునకు ప్రయాణం చేయగలము.
యేసు ఎడారి అనుభవము
యేసుప్రభువుకూడా సువార్తా పరిచర్యకు ముందుగా 'ఎడారి అనుభవము'ను చవిచూసాడు. ప్రభువు
జీవితములో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభువు ఎడారికి నిశబ్దతలో, ఏకాంతములో వెళ్ళినది. ప్రార్ధనలో తండ్రి దేవునియొక్క
సన్నిధిలో ఉండుటకు, తన జీవిత పిలుపు పరమార్దమును తెలిసికొనుటకు లేదా తండ్రి
దేవుని చిత్తమును తెలుసుకొనుటకు. అయితే, మనం గమనింపవలసిన విషయం
ఏమంటే, "యేసు పవిత్రాత్మతో
పరిపూర్ణుడై యోర్దానునుండి తిరిగివచ్చి, ఆత్మప్రేరణ వలన ఎడారి
ప్రదేశమునకు నడిపింపబడెను" (లూకా. 4:1).
పవిత్రాత్మశక్తి
వలన, ఆత్మ తేజోవంతుడై యేసు
ఎడారిలో సైతానువలన పొందిన శోధనలను జయింపగలిగాడు. "ఆ రోజులలో ఆయన ఏమియు
తినలేదు" (లూకా. 4:2).
మన ఆధ్యాత్మిక ప్రయాణములోకూడా పవిత్రాత్మతో
నింపబడాలి, నడిపింపబడాలి. అలాగే దైవవాక్కు అనే ఖడ్గమును కలిగియుండాలి. ప్రభువుకూడా శోధనలలో సైతానుకు దేవుని
వాక్యముతో సమాధానమిచ్చి శోధనలను జయించాడు (లూకా. 4:4,8,12). “దేవుని వాక్కు సజీవమును, చైతన్యవంతమునైనది. అది పదునైన రెండంచుల ఖడ్గముకంటెను
పదునైనది...” (హెబ్రీ. 4:12). పవిత్రాత్మ, వాక్కు, ప్రార్ధన, ఉపవాసము కలిగి, ఆత్మపునరుద్ధరణ గావింపబడిన వారమైయున్నయెడల, సైతాను శోధనలను
జయింపగలము.
కనుక, 'ఎడారి అనుభవము' (నిశబ్ధం, ఏకాంతం) ఈ లోకాశలను, శోధనలను జయించి దేవునియొక్క రాజ్యములో, ఆధ్యాత్మిక ధ్యేయమున జీవించులాగున తోడ్పడును. ఇలా ఈ 'ఎడారి అనుభవము' మన ఆధ్యాత్మిక జీవితమును
బలపరుస్తుంది. దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవునితో మనకుగల సంబంధాన్ని
బలపరస్తుంది.
మనము ప్రభువు ప్రేమలో నెలకొని ఉండాలి (యోహాను. 15:9). ప్రభువు ఆజ్ఞలను పాటించినచో ప్రభువు ప్రేమలో నెలకొని ఉందుము
(యోహాను. 15:10). ప్రభువు ఆజ్ఞ ఏమనగా: ఒకరినొకరు ప్రేమించు కొనుడు
(యోహాను. 15:12). పునీత పౌలుగారు ఒక మంచి
ఆధ్యాత్మిక సూత్రాన్ని తెలియజేస్తున్నాడు: "క్రీస్తు అనుగ్రహించు శక్తిచే
నేను అన్నింటిని చేయగలను" (ఫిలిప్పీ. 4:13).
క్రీస్తు
అనుగ్రహించు శక్తిని పొందాలంటే 'ఎడారి అనుభవాన్ని' సక్రమంగా జీవించాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఈ 'ఎడారి అనుభవం'ద్వారా బలపడాలి. ఈ 'ఎడారి అనుభవం' మనలో మార్పును తీసుకొనిరావాలి. ఈ మార్పే మనలో హృదయపరివర్తన కావాలి. ప్రభువు సువార్త పరిచర్య 'హృదయ పరివర్తన' పిలుపుతోనే ప్రారంభమైనది: "కాలము సంపూర్ణమైనది. దేవుని
రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది,
సువార్తను
విశ్వసింపుడు" (మార్కు. 1:15).
No comments:
Post a Comment