15వ సామాన్య ఆదివారము [YEAR A]

15వ సామాన్య ఆదివారము [YEAR A]

యెషయ 55:10-11, రోమీ. 8:18-23, మత్త. 13:1-23


క్రీస్తు నందు ప్రియమైన సహోదరీ సహోదరులారా! ఈ రోజు మనం 15వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. ఈనాటి పఠనాలు దేవుని వాక్యము, వాగ్ధానము, దాని శక్తిని గురించి బోధిస్తున్నాయి. దేవుని వాక్యము పట్ల మన దృక్పధం ఎలా ఉన్నదో, దానిని మన అనుదిన జీవితములో ఎలా స్వీకరిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలియజేయుచున్నాయి.


మొదటి పఠనము యెషయ గ్రంధము రెండవ భాగములోని 55వ అధ్యాయము నుండి వింటున్నాము. యెషయ తన ప్రవచనం, ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరం, అనగా క్రీ.పూ. 742లో ప్రారంభమై, క్రీ.పూ. 687 వరకు కొనసాగింది. యెషయ యూద రాజ్యము నందు (దక్షిణ దేశం) ప్రవచనం చేసాడు. ఉజ్జియా, తన 52 ఏండ్ల పరిపాలనలో ప్రజలు ఎంతగానో అభివృద్ధిని, శ్రేయస్సును చవిచూశారు. శత్రు దేశాలపై ఎన్నో విజయాలను సాధించారు. దీనికి ముఖ్య కారణం అస్సీరియా, సిరియా దేశాలు బలహీన పడటం కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. అయితే, అభివృద్ధి, విజయాలతో పాటు ప్రజలలో అవినీతి బాగా పెరిగి పోయింది. ఉజ్జియా రాజు ధర్మబద్ధముగా జీవించి యావేకు ఇష్టుడైనప్పటికినీ, విగ్రహముల పూజా మందిరములను తొలగించలేదు. దాని ఫలితముగా, ప్రభువు అతనికి కుష్టు వ్యాధితో పీడ కల్పించాడు. జీవితాంతము వరకు ఆ రోగము అతనిని వీడలేదు. ఇదే పరిస్థితి యోతాను, ఆహాసు కాలములో కూడా కొనసాగింది. వారు ప్రవక్త ప్రవచనాలను లెక్కచేయలేదు.


ఈలోగా అస్సీరియా బలాన్ని పుంజుకోవడముతో ఆహాసు కాలములో యుద్ధం సంభవించినది. సిరియా మరియు దమస్కసు (ఇస్రాయేలు ఉత్తర దేశం) యూదాకు అండగా ఉండి బలోపేతం చేయాలని అనుకున్నాయి, కాని, ఆహాసు అస్సీరియాతో జతకలిసాడు. ఫలితముగా, క్రీ.పూ. 735లో సిరియా అస్సీరియాను ఓడించి యూదాను ఆక్రమించుకుంది. ఆహాసు ఎంత దుష్టుడంటే, తన సొంత కుమారునే విగ్రహములకు దహన బలిగా సమర్పించాడు (2 రాజు. 16:3).

ఆహాసు కుమారుడు హిజ్కియా, తన పాలనలో కొండల మీది పూజా మందిరములను తొలగించాడు. విగ్రహములను నిర్మూలించాడు. అషేరా దేవతా విగ్రహములను నరికించాడు. అయితే, అస్సీరియా రాజుమీద తిరగబడి అతనికి కప్పము కట్టుటకు నిరాకరించాడు. యెషయ ప్రవక్త ప్రవచనాన్ని ప్రక్కనబెట్టి ఈజిప్టు దేశముతో ఒప్పందం చేసుకున్నాడు. ఈవిధముగా, అస్సీరియా ఈజిప్టు దేశమును ఓడించుటచే, యూదా బానిసత్వములోనికి కొనిపోబడినది.

 

అలా బానిసత్వములో నున్న ప్రజలకు యెషయ ప్రవక్త దేవుని వాక్యము గూర్చి, దేవుని వాగ్దానములు గూర్చి వారికి జ్ఞప్తికి చేయుచూ వారికి ఊరటను కలిగిస్తున్నాడు. వాన, మంచు ఆకాశము నుండి దిగివచ్చి భూమిని తడిపి, పైరును మొలిపించి, పంట పండించునో, అలాగే దేవుని వాక్యము కూడా దేవుని సంకల్పమును నేరవేర్చును. ఆయన ఉద్దేశించిన కార్యమును సాధించును. ఈ సందర్భములో, వాగ్ధానము చేసిన విధముగా, బానిసత్వములో నున్న ప్రజలు శాంతితో వారి యిండ్లకు తిరిగి వస్తారు అని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. కనుక, ప్రభువు వాక్కు శక్తి గలది. దేవుని నోటి నుండి వెలువడు వాక్కు, అనగా దేవుని వాగ్దానములు తప్పక నెరవేరును.


వాన భూమిని ఫలింప జేయును. మంచి పంటను పండించును. అలాగే భవిష్యత్తుకు విత్తనాలను కల్పించును. అలాగే దేవుని వాక్కు కూడా ఈ లోకమున ఫలించును. మన ఆధ్యాత్మిక జీవిత భూమిలో దేవుని వాక్కు పంట పండించును. బానిసత్వములో [మనం పాప దాస్యములో] నున్న ప్రజలు [మనం] జీవితముపై నమ్మకాన్ని, ఆశను కోల్పోయి నిరాశ నిస్పృహలో జీవిస్తున్నారు. దేవుని వాక్యము వారి హృదయము లోనికి ఆహ్వానించిన యెడల, విశ్వసించిన యెడల, వారి జీవితములో క్రొత్త ఆశ కలిగి వారు జీవింతురు. ఈ మార్పు తప్పక సంభవించునని యెషయప్రవక్త దృఢముగా, ఖచ్చితముగా నమ్ముచున్నాడు. ప్రజలలో మారుమనస్సు కలుగక పోయినను, దేవుడే వారి జీవితములో చొరవ తీసుకుంటాడు. దేవుడే మొదటి అడుగు వేస్తాడు.


ఈనాటి సువిశేష పఠనములో యేసు “విత్తువాని ఉపమానము”ను చెప్పుచున్నాడు. ఉపమాన సారాంశం “పరలోక రాజ్యము.” “వాక్కు” అయిన క్రీస్తు తండ్రి దేవుని నుండి భువికి ఏతెంచాడు. ఆ “వాక్కు” మానవుడై మనమధ్య నివసించెను. ఆ “వాక్కు” మన హృదయాలలో విత్తనమై నాటబడాలి. “వాక్కు”ను ఆలకించి, విశ్వసించువారు ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా ఫలించును. పంట విస్తారముగా పండాలంటే, సారవంతమైన నేల ఎంతో అవసరం. విత్తనము నేలను సారవంతము చేయలేదు. ఎన్ని విత్తనములు సారవంతమైన నేలలో పడినవో, నేల ఎంత వరకు స్వీకరించగలదో అన్న దానిపై పంట ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్కు ప్రకటింప బడినప్పుడు అది విశ్వాసుల హృదయాలలో నాటబడుచున్నది. అప్పుడు వారు దేవుని కొరకు ఆశను [ఆకలిని] కలిగి యుందురు. “జీవముగల ఆహారము” పరలోకము నుండి దిగివచ్చి స్వీకరించు నేలను కలుసుకొని నప్పుడు, అచట “పరలోక రాజ్యము” [విస్తారమైన పంట] నెలకొనును.

 

ఈ నాటి సువిశేష పఠనమును మూడు భాగాలుగా విభజించ వచ్చు: విత్తువాని ఉపమానము [13:1-9], ఉపమానముల ఉద్దేశము [13: 10-17], విత్తువాని ఉపమాన భావము [13:18-23]. 

ఉపమాన ఉద్దేశము గురించి తెలుసు కొనుటకు చదవుము


ఈ ఉపమానములో దృష్టి దేవుని వాక్యమును ఆలకించు వారిపై, దానిని స్వీకరించు వారిపై ఉంచబడినది. ‘వాక్యమును స్వీకరించుట’ అనగా, ఉపమానములో వివిధ రకాల నేలను పోలి యున్నది. ఉపమానములో చూచుచున్నట్లుగా, చాలాసార్లు ఆదరణలేని/సారవంతముకాని నేలలో పడుచున్నాయి. అయితే, కొన్ని విత్తనాలు సారవంతమైన నేలలో పడి ఫలవంతముగా పంటనిస్తున్నాయి. అందుకే యెషయ ప్రవక్త తన సందేశములో, “దేవుని నోటి నుండి వెలువడు వాక్కు నిష్ఫలముగా దేవుని యొద్దకు తిరిగి రాక, దేవుని సంకల్పమును నేరవేర్చును దేవుడు ఉద్దేశించిన కార్యమును సాధించును.”


ఈ ఉపమానము ద్వారా, శిష్యులు తమ ప్రేషిత కార్యములో కొద్ది ఫలితాలను చూసి నిరాశ చెందిన వారిని ప్రోత్సహిస్తున్నాడు. అలాగే వారి బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు. శిష్యులు [మనం కూడా] విత్తనాలను వెదజల్లెదరు, అనగా వాక్యమును ప్రకటించెదరు. కాని శిష్యులు పంటను సృష్టించలేరు. పంట ఎదుగుదలను వారు నియంత్రించ లేరు. అది దేవుని కార్యము. దాని ఎదుగుదలను దేవుడు చవిచూడును. విత్తనములన్ని ఫలింప లేవు. కొన్ని ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలిస్తాయి. కనుక, ఫలితము ఆశించినదిగా లేదని శిష్యులు (మనము) నిరాశ చెందరాదు. ఫలించిన దానిపట్ల సంతోషించ వలెను.


ఉపమానములో, యేసు ప్రజలను నాలుగు రకాల నేలలతో పోల్చాడు:

[1]. కొందరు త్రోవ ప్రక్కన నేలను పోలియున్నారు: కటిన నేల, విత్తనము మొలకెత్తలేదు. ఏ విత్తనము కూడా వేరును పొందుకోలేదు. పక్షులు వచ్చి విత్తనాలను తిని వేస్తాయి. కటిన హృదయాన్ని సూచిస్తుంది. కటిన హృదయులు సందేశమును వినెదరు కాని దానిని గ్రహింప లేరు. క్రొత్త విషయాలను అంగీకరింప లేరు. ఇలాంటి వారి చెవులు మొద్దు బారినవి, కన్నులు పొరలు క్రమ్మినవి [13:15]. వీరికి దేవుని వాక్కు, దివ్య సంస్కారాలు మొ.గునవి కాలం చెల్లినవి, పాతవి, సందర్భరహితమైనవి, అనవసరమైనవి, ఆవశ్యకత లేనివి, అప్రస్తుత మైనవి. వారి జీవితాలకు సంబంధం లేనివి. అందుకే వీరు గుడికి రాక ఇంటిలోనే ఉంటారు.


[2]. కొందరు రాతి నేలను పోలియున్నారు: చాలినంత మన్ను (సారము) లేని ప్రదేశము. నేల మందంగా ఉంటుంది. నీరు కూడా సరిగా అందదు. వేరు బలముగా ఉండలేదు. సూర్యుని వేడికి వాడిపోవును. రాతి నేల వంటి హృదయం కలవారు సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరిస్తారు. అయితే అది దృఢముగా, విశ్వాసముగా హృదయములో నాటుకొనక పోవుట వలన, అది కొలది కాలమే నిలుచును. శ్రమలు, హింసలు, సంభవించినప్పుడు వెంటనే తొట్రిల్లుదురు. ఇలాంటి వారు ఏవిషయాన్ని సీరియసుగా తీసుకొనరు. వీరిలో నిజమైన నిబద్ధత ఉండదు.


[3]. కొందరు ముండ్ల పొదలు కలిగిన నేలను పోలియున్నారు: ముండ్ల పొదలు మొక్క ఎదుగుదలను అణచి వేస్తాయి. వీరు సందేశమును వెంటనే ఆలకింతురు. కాని, ఐహిక విచారము, ధనవ్యామోహము దానిని అణచి వేయును కనుక నిష్ఫలులగుదురు. వీరికి ఆధ్యాత్మికముగా ఎదగాలనే ఆకాంక్ష, ఇష్టం, మంచిగుణం ఉంటుంది కాని లౌకిక ఆసక్తుల వలన, విషయాల వలన త్వరగా దృష్టిని మరల్చు కుంటారు. ఏకాగ్రతను కోల్పోతూ ఉంటారు. ఇలాంటి వారు రెండు పడవలపై ప్రయాణించే వారిని సూచిస్తుంది. సందేశం కావాలి, కాని దానిని జీవించలేరు. మంచి క్రైస్తవులుగా ఉండాలని ఆశిస్తారు కాని ప్రాపంచిక విషయాలపై ఎక్కువ శ్రద్ధను, ఆసక్తిని చూపుతూ అవే ముఖ్యమైనవిగా భావిస్తారు. ప్రార్ధన, ప్రేమ, సేవా భావాలను మరచి పోతారు.


[4]. కొందరు సారవంతమైన నేలను పోలియున్నారు: ఈ నేల విస్తారమైన పంటను ఇస్తుంది. వీరు సందేశమును వినేవారు, గ్రహించేవారు, జీవించేవారు. వీరు సకల అడ్డంకులను, శోధనలను, కష్టాలను, బాధలను, తట్టుకొని నూరంతలుగా, అరవదంతలుగా, ముప్పదంతలుగా ఫలిస్తారు. వారి జీవితములో మంచి కార్యాల ద్వారా, ఫలవంతముగా జీవిస్తారు.


ఈ సందర్భమున, ‘వేర్లు’ గురించి కూడా ధ్యానించడం ఎంతో అవసరం.

వేర్లు పైకి కనిపించవు. వాటికి గుర్తింపు ఉండదు. అవి అందవిహీనముగా ఉంటాయి. మురికిగా ఉంటాయి. అయితే, నేలపై అందాన్ని చేసేవి వేర్లే. చెట్లకు, మొక్కలకు వేర్లే బలం, ఆధారం.

వేర్ల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

[1]. మనం బాహ్య ప్రదర్శన (అందానికి) గూర్చి ఆందోళన చెందుతూ ఉంటాము. అందంగా కనిపించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే, చెట్లవలె, మొక్కలవలె, పుష్పాలవలె మన నిజ విలువ, గౌరవం ‘మనం దేవుని బిడ్డలము’ (మన వేర్లు) అను దాని నుండి వస్తుంది.

[2]. ఆత్మత్యాగమును నేర్చుకోవచ్చు. మనలను సంతోష పెట్టునదిగాక, దేవుణ్ణి (ఇతరులను) సంతోష పెట్టునది చేయటం. వేర్లవలె మురికిగా, గట్టిగా ఉంటూ (ఆత్మత్యాగం), బాహ్యముగా స్వయం నియంత్రణను (self-control), నిస్వార్ధమును (selflesssness) కలుగ జేయును.

[3]. వేర్లు ఒసగు బలం యేసు ప్రేమను, జ్ఞానమును సూచిస్తుంది. ఈ ప్రేమ, జ్ఞానము మన మాటలలో, చేతలలో కనిపించును.

కనుక, సువార్తపై ఆధారపడు మన వ్యక్తిగత జీవితాలను ధ్యానించుదాం: మనం ఏనేల వంటి వారము? మన వేర్లను ప్రశంసిస్తున్నామా? దేవుని వాక్యము నాలో ఫలించుటకు నన్ను నేను నా హృదయమును ఎలా మలచు కొనగలను? గురువులుగా, ఉపదేశకులుగా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనం దేవుని వాక్యమును ఎలా ప్రకటించు చున్నాము?


ముగింపు: దేవుని వాక్యమును గ్రహింపక పోవుటకు కారణం, వాక్యమును వినకపోవడమే (యోహాను. 8:43). వాక్కును వినుటకు ముందుగా దేవున్ని మన జీవితాలలో అంగీకరించాలి. దేవునితో వ్యక్తిగత బాంధవ్యాన్ని కలిగి యుండాలి. దేవుని చిత్తమును నెరవేర్చుటకు దృఢసంకల్పముతో నిశ్చయించాలి. “దేవుని చిత్తమును నేరవేర్ప గోరువాడు దేవుని బోధను తెలుసు కొనవలయును (యోహాను. 7:17).


“విత్తడం” నూతన నిబంధనలో జీవము, పునరుత్థానమును సూచిస్తుంది. విత్తనము నాటినప్పుడెల్ల మొలకెత్తి ఫలిస్తుంది. ఇది సృష్టిలో మరో గొప్ప అద్భుతం. దీనిలో దేవుని మంచితనము, దైవప్రసాదము కనిపిస్తుంది. దేవుని వాక్యము వలన కూడా మనం జీవితములో ఇలాంటి గొప్ప అద్భుతం జరుగుచున్నది.


దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. ఎందుకన, తన వాక్కుతో (యేసు) విశ్వాసమును మనలో నాటి, మనలను పాప బానిసత్వము నుండి, వినాశ దాస్యము నుండి విడిపించి, దేవుని బిడ్డల మహిమోపేతమైన స్వాతంత్ర్యము నందు పాలుపంచు కొనునట్లు చేసెను (రోమీ. 8:21).

No comments:

Post a Comment