యేసు ఉపమానములు

యేసు ఉపమానములు


యేసు తన బోధనలో ప్రధానముగా నాలుగు పద్ధతులను​ ఉపయోగించాడు: ⁠సరళత, సమర్థవంతమైన ప్రశ్నలు, సహేతుకమైన తర్కము, సరైన ఉపమానములు. 'ఉపమానము' అనగా "పోల్చడము" అని అర్ధము. ఏ వస్తువునైతే వర్ణిస్తామో, ఆ వస్తువు 'ఉపమేయము', దేనితో పోల్చుతామో, ఆ వస్తువును 'ఉపమానము' అని అంటాము.

ఈ వ్యాసములో 'ఉపమానము' గురించి చర్చించుదాం.

“యేసు జనసమూహములకు ఈ విషయములన్నియు ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమియు బోధింపడాయెను” (మత్త. 13:34), "నేను ఉపమానములతో బోధించెదను" (మత్త. 13:35). దీనికి రెండు కారణాలు చెప్పవచ్చు: ఒకటి, ప్రవక్తల ప్రవచనాలు నెరవేరుటకు: “ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు యేసు ఈ రీతిగ బోధించెను: నేను ఉపమానములతో [సూక్తులతో] బోధించెదను. సృష్టి ఆరంభమునుండి గుప్తమైయున్న వానిని బయలు పరచెదను” (మత్త. 13:35 = కీర్తన. 78:2). రెండవది, “మీరు ప్రజలతో ప్రసంగించునపుడు ఉపమానములను ఉపయోగించుచున్నా రేల?” అని శిష్యులు యేసును ప్రశ్నించినప్పుడు, అందులకు ఆయన, “పరలోకరాజ్య పరమరహస్యములను తెలిసికొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఏలయన, ఉన్న వానికే మరింత ఇవ్వబడును. వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు; వినియు వినరు, గ్రహింపరు. కనుక, నేను వారితో ఉపమాన రీతిగా మాటలాడు చున్నాను" అని చెప్పెను (మత్త. 13:10-13; చూడుము. యెషయ 6:9-10). స్పందించని హృదయం [చూడనివారు, గమనింపనివారు, విననివారు, గ్రహింపనివారు] గలవారిని వేరుపర్చడానికి తాను ఉపమానాలను ఉపయోగించానని దీని అర్ధము.

ఉపమానాలను ఉపయోగించడంలో యేసుక్రీస్తు చూపించిన నైపుణ్యం కంటే ఎక్కువ నైపుణ్యాన్ని ఈ లోకములో ఎవరు కూడా చూపించలేదు. యేసు ఉపమానాలు చెప్పి, దాదాపు రెండు వేల సంవత్సరాలు అయినను, వాటిలో అనేక ఉపమానాలు సులభముగా మనకు గుర్తుకు వస్తాయి, గుర్తుండి పోతాయి. కారణాలు: 

మొదటిది, యేసు ఉపమానములో వివరాలను పరిమితముగా, జాగ్రత్తగా [అవసరానికి తగినంతగనే] ఉపయోగించాడు. ఉదాహరణకు, “త్రోవ తప్పిన గొర్రె” ఉపమానములో (మత్త. 18:11-14) - ఎన్ని గొఱ్ఱెలను యజమాని వదలి వెళ్ళాడో, “ద్రాక్షతోట – కూలీలు” ఉపమానములో (మత్త. 20:1-16) - పనివారలు ఎన్నిగంటలు పని చేసారో, “సేవకుని కర్తవ్యము – నిర్వహణ విధానము” ఉపమానములో (మత్త. 25:14-30) సేవకులకు ఎన్ని లక్షల వరహాలు ఇవ్వబడినాయో ఖచ్చితంగా చెప్పాడు.

రెండవదిగా, ఉపమానాల భావాన్ని గ్రహించడానికి అంతగా ప్రాముఖ్యత లేని విషయాలను యేసు ప్రస్తావించలేదు. ఉదాహరణకు, మత్తయి 18:​23-35లోని ఉపమానంలో, ఆ సేవకుడు కోటి వరహాలు అప్పు ఎలా చేశాడన్న విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక్కడ ‘క్షమా ధర్మములు’ అను అంశమును ప్రాధాన్యముగా యేసు నొక్కిచెప్పాడు. అతని అప్పు ఎలా క్షమించబడింది, అలాగే తన తోటి సేవకుడు తనకు అతి తక్కువ డబ్బు అప్పుపడినందుకు ఆయన తన తోటి సేవకుడితో ఎలా ప్రవర్తించాడన్నది ముఖ్యమైన విషయముగా ప్రస్తావించబడినది. అదేవిధముగా, “తప్పిపోయిన కుమారుడు” ఉపమానములో, చిన్నవాడు ఆస్తి పంచి ఇవ్వమని అకస్మాత్తుగా ఎందుకు అడిగాడో, దానిని దుర్వినియోగం ఎందుకు చేశాడో, వివరాలు చెప్పబడలేదు. కాని తన కుమారుడు, మనసు మార్చుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలా భావించాడో, ఎలా స్పందించాడో వివరముగా తెలపడము జరిగినది. దేవుడు “బహుగా క్షమించును” అని యేసు చెప్పదలచుకున్న ముఖ్యాంశానికి, తండ్రి ప్రతిస్పందనను గురించిన అలాంటి వివరాలు ప్రాముఖ్యముగా వివరించ బడినవి (లూకా. 15:​11-32; ⁠యెషయ 55:⁠7 ).

మూడవదిగా, ఉపమానములలోని పాత్రలను వర్ణించే తీరులో కూడా, యేసు వివేచనను ఉపయోగించాడు. పాత్రలు కనిపించే తీరు గురించి, వివరాలను అధికముగా ఇచ్చేబదులు, యేసు తరచుగా ఆ పాత్రలు ఏమి చేశాయి లేదా అవి ఎలా ప్రతిస్పందించాయి అన్నవాటికే ప్రధానముగా అవధానమిచ్చాడు. ఉదాహరణకు, “మంచి సమరీయుని ఉపమానము”లో స్నేహశీలియైన సమరయుడు ఎలా ఉంటాడన్నది వర్ణించకుండా, యేసు మరింత ముఖ్యమైన విషయాన్ని, అనగా దారిలో గాయాలతో పడియున్న యూదునికి సహాయం చేయడానికి సమరీయుడు కనికరముతో ఎలా ముందుకు వచ్చాడన్న విషయాన్నే ప్రాధాన్యముగా చెప్పాడు. “పొరుగువారిపై ప్రేమ చూపడం” అనేది మన సొంత జాతి ప్రజలనూ, దేశ ప్రజలనూ ప్రేమించడమే కాకుండా ఇతరులను కూడా ప్రేమించాలన్న విషయాన్ని బోధించడానికి అవసరమైన వివరాలనే యేసు ఇక్కడ ప్రస్తావించాడు (⁠లూకా. 10:​29, 33-37).

యేసు, వివరాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించడం, ఆయన ఉపమానములను సంక్షిప్తముగా, గజిబిజి లేకుండా ఉంచాయి. ఆవిధముగా, ఆయన తన మొదటి శతాబ్దపు శ్రోతలకేగాక, ప్రేరేపిత సువార్తలను, ఆ తర్వాత చదివే అసంఖ్యాక ప్రజానీకానికి కూడా ఆ ఉపమానములను, వాటిద్వారా బోధించిన ఎంతో విలువైన పాఠాలను జ్ఞాపకం చేసుకోవడాన్ని సులభతరం చేశాడు.

యేసు ఉపమానములు అనేక రకాలైనవి. వాటిలో ఉదాహరణలు, పోల్చడాలు, సారూప్యాలు, రూపకాలంకారాలు ఉన్నాయి. 'దృష్టాంతము'ను ఉపయోగించడంలో ఆయన పేరు గాంచాడు, అది, “ఏదైనా ఒక నీతిని లేదా మతసంబంధమైన ఒక సత్యాన్ని తెలియజేసే చిన్న కథ, సాధారణంగా 'దృష్టాంతము' అనగా 'కల్పిత కథనం' అని నిర్వచించ బడింనది.

దైనందిన జీవితానికి సంబంధించిన ఉపమానములు:

ప్రజల జీవితాలకు సంబంధించిన ఉపమానములను ఉపయోగించడములో యేసు ప్రావీణ్యుడు. ఆయన చెప్పిన అనేక ఉపమానములలో ప్రతిబింబించిన విషయాలు, బహుశా ఆయన గలిలయలో పెరుగుతుండగా గమనించిన విషయాలై ఉండవచ్చు. ఉదాహరణకు, “పులిసిన పిండి ఉపమానము” (మత్త. 13:33), “జాలరులు గలిలయ సముద్రపులో వలలు వేయడం” (మత్త. 13:47), “అంగడి వీధులలో కూర్చుండియున్న పిల్లలు” (మత్తయి 11:16), “విత్తనాలు విత్తడం” (మత్త. 13:3-8), “మొలకలు, వెన్ను, కంకులు పుట్టటం” (మార్కు. 4:26-29), “ఆనంద భరితమైన వివాహ విందులు” (మత్త. 25:1-12).

అలాంటప్పుడు, యేసు చెప్పిన అనేక ఉపమానములలో, దైనందిన జీవితపు పరిస్థితులు, స్థితిగతులు మిళితమై ఉన్నాయంటే అందులో ఆశ్చర్యం లేదు! కాబట్టి, ఈ బోధనా పద్ధతిని ఉపయోగించడములో ఆయనకున్న నైపుణ్యాన్ని, సంపూర్ణముగా అర్థము చేసుకోవడానికి, ఆయన మాటలు, ఆనాటి యూదులైన శ్రోతలకు ఏ భావాన్నిచ్చాయో పరిశీలించడం ఉపయుక్తముగా ఉంటుంది.

సృష్టినుండి రూపొందించిన ఉపమానములు:

యేసు చెప్పిన అనేక ఉపమానములు, దృష్టాంతాలు, మొక్కలతోనూ, జంతువులతోనూ, ప్రకృతిలోని మార్పులతోనూ, ఆయనకు పరిచయముందన్న విషయాన్ని వెల్లడి చేస్తాయి (మత్త. 6:​26, 28-30;16:​2, 3). గలిలయలో పెరుగుతుండగా దేవుని సృష్టిని గమనించడానికి ఆయనకు తగినంత అవకాశం దొరికిందనడంలో సందేహము లేదు! అంతేగాక, యేసు ‘సర్వసృష్టికి ఆదిసంభూతుడు,’ దేవుడు మిగిలినన్నింటినీ సృష్టించడంలో ఆయనను “ప్రధానశిల్పి”గా ఉపయోగించు కున్నాడు అన్నది వాస్తవము (కొలొస్సీ. 1:​15, 16; సామె. 8:​30, 31). యేసుకు సృష్టితో బాగా పరిచయమున్నది. ఈ పరిజ్ఞానాన్ని ఆయన తన బోధనలలో ఎంతో నైపుణ్యంగా ఉపయోగించాడు. ఉదాహరణకు, యోహాను. 10:1-16, గొర్రెల మంద దృష్టాంతము.

తన శ్రోతలకు తెలిసిన సంఘటనలనుండి రూపొందించిన ఉపమానములు:

శ్రోతలకు బాగా తెలిసియున్న సంఘటనలను యేసు ఉపమానములలో పేర్కొన్నాడు. చదువుము: లూకా. 13:4; ⁠మత్త. 12:​1-8 (1 సమూ. 21:​3-6). నిజముగానే యేసు ఒక గొప్ప బోధకుడు! ప్రాముఖ్యమైన సత్యాలను, తన శ్రోతలకు అర్థమయ్యే విధముగా తెలియజేసే అసమానమైన సామర్థ్యము ఆయన సొంతము.

‘ఉపమానము’ అనగా “పోల్చడం” [దేనితో పోలుస్తున్నామో]. 'ఉపమాన రీతిలో బోధన' ఒక శక్తివంతమైన బోధనా పద్ధతి. అది గొప్ప ప్రభావముతో, తరచూ అవధానాన్ని ఆకర్షించి, నిలిపి ఉంచుతాయి. అవి ఆలోచనా సామర్థ్యాలను ప్రేరేపిస్తాయి. ఉపమానములు మాటలకు ప్రాణం పోయగలవు. ఆవిధముగా, బోధించబడే పాఠాలు, మన స్మృతిపథంలో స్థిరముగా నిలిచిపోతాయి. అవి భావోద్వేగాలను పురిగొల్పుతాయి. ఆవిధముగా, మనస్సాక్షిని, హృదయాన్ని కదిలిస్తాయి [ఉదాహరణకు, నాతాను పవక్త, దావీదు హృదయాన్ని స్పృశించాడు, దానిఫలితముగా, దావీదు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాడు 2 సమూ. 12:1-14]. 

కొన్నిసార్లు, ఉపమానములు ప్రజల్లో ఉన్న దురాభిమానాన్ని అధిగమించడానికి ఉపయోగించవచ్చు. అవి జ్ఞాపక శక్తికి కూడా సమర్థముగా దోహదపడతాయి. వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే, చాలా మట్టుకు వివరించకుండానే అర్థం అవుతాయి. కాని, బోధకుడు క్లుప్తమైన వివరణ ఇవ్వడముద్వారా వాటి విలువను మరింత పెంచుతాడు. బైబులులో, ఈ పద్ధతికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. సాధారణముగా, ఉపమానములలో [ఉపమాలంకారాల్లో] “లాంటి” లేదా “వలె” [పోలియుండుట] వంటి పదాలు ఉపయోగించ బడతాయి. పూర్తి భిన్నముగా ఉన్న రెండు విషయాలను, ఒకదానితో ఒకటి పోల్చేటప్పుడు, ఆ రెంటికీ మధ్య ఉన్న సామ్యాన్ని గురించి ఉపమానాలు [ఉపమాలంకారాలు] నొక్కిచెబుతాయి. 

బైబులులో, అలంకారిక భాష సమృద్ధిగా వాడబడటం చూస్తున్నాము - అందుకు సృష్టిలోని చెట్లు, జంతువులు, సూర్యచంద్ర నక్షత్రాదులు వంటివాటిని ఉపయోగిస్తుంది - అలాగే మానవుల అనుభవాలను కూడా ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, "ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు, రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు, ఆకులు వాడిపోని చెట్టువంటి వాడు” (కీర్తన. 1:2-3). “దుష్టుడు పొదలో దాగుకొనియుండి, అభాగ్యుని కొరకు పొంచి చూచే సింహమువలె ఉండును” (కీర్తన. 10:9). అబ్రాహాము సంతానం “ఆకాశము నందలి నక్షత్రముల వలె” “సముద్రతీరము నందలి ఇసుకరేణువుల వలె” విస్తరిల్లజేయునని దేవుడు వాగ్దానం చేశాడు (ఆది. 22:17).

ముగింపు

ఉపమానములను, ఉదాహరణలను సమర్థవంతంగా ఉపయోగించే సామర్థ్యాన్ని పెంపొందించు కోవడానికి సమయం పడుతుంది, కానీ కృషికి తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి. చక్కగా ఎంపిక చేసుకున్న ఉపమానములు, అటు మేధాపరంగాను ఇటు భావోద్వేగపరంగాను రంజింప జేస్తాయి. ఫలితముగా, వాస్తవాలను సాదాసీదా మాటల్లో చెప్పినప్పుడు ఉండని బలం, ఉపమానములతో చెప్పిన మీ సందేశానికి ఉంటుంది.

కొన్నిసార్లు, ఒక అంశానికి నిజజీవిత, ఆధునిక అనుభవాన్ని జోడించడం ద్వారా, దానికి బలాన్ని చేకూర్చడం ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహింపవచ్చు. అయితే, ఇలా చేస్తున్నప్పుడు, కేవలం ధృవపరచబడిన అనుభవాలను మాత్రమే ఉపయోగించేలా, ప్రేక్షకుల్లో ఎవరినైనా అనవసర ఇబ్బందికి గురిచేసేవి లేదా మీ చర్చాంశానికి సంబంధించని ఒక వివాదాస్పద విషయమువైపు అవధానాన్ని ఆకర్షించేవి చేర్చకుండా జాగ్రత్త పడండి. ఆ అనుభవం ఒక ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా కూడా ఉండాలని గుర్తుంచుకోండి. మీ లక్ష్యంనుండి అవధానాన్ని మళ్ళించే అనవసరపు వివరాలను చెప్పకండి.

మనం చర్చిస్తున్న అంశానికి అన్వయించడం ఎంతో అవసరం. అప్పుడే, మన లక్ష్యాన్ని సాధించగలం. ఉదాహరణగా, యేసు తన శిష్యులు “లోకమునకు వెలుగైయున్నారు” అని చెప్పిన తర్వాత, దీపాన్ని ఎలా ఉపయోగిస్తారో వ్యాఖ్యానించి, దాన్నిబట్టి వారి బాధ్యత ఏమిటో అర్థం చేసుకునేలా వారికి వివరించాడు. (మత్త. 5:15,16). తప్పిపోయిన గొఱ్ఱె గురించిన ఉపమానం చెప్పిన తర్వాత, ఆయన పశ్చాత్తాప పడిన ఒక పాపి విషయమై పరలోకంలో ఎలా సంతోషం కలుగుతుందో వ్యాఖ్యానించాడు. (లూకా. 15:7). మంచి పొరుగువాడైన సమరీయుడి కథ చెప్పిన తర్వాత యేసు తను చెప్పేది వింటున్న వ్యక్తిని సూటిగా ఒక ప్రశ్న అడిగాడు, ఆ తర్వాత సూటిగా ఒక సలహా ఇచ్చాడు. (లూకా. 10:36,37).

కొన్నిసార్లు, అన్వయింపు అవసరమా? అవసరమైతే ఎంతమట్టుకు అన్వయించాలి? ఉపమానం ఎలాంటిది? ప్రేక్షకుల వైఖరి ఎటువంటిది? మీ లక్ష్యం ఏమిటి" అన్నవాటిపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణగా, వివిధ రకాల నేలల గురించిన  ఉపమానమును, నమ్రతతో అడిగినవారికి మాత్రమే వివరించాడు, జనసమూహానికి వివరించలేదు (మత్త. 13:1-30, 36-43). యేసు తన మరణానికి మూడు రోజులు ముందు, హంతకులైన ద్రాక్షతోట కాపుల గురించిన ఉపమానాన్ని చెప్పాడు. ఆయన దాని అన్వయింపును గురించి చెప్పలేదు; అది అవసరం లేకపోయింది, ఎందుకన, ‘ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయన తమను గూర్చియే చెప్పెనని గ్రహించిరి’ (మత్త. 21:33-45).

మీ చుట్టూ ఉన్న లోకాన్ని గమనిస్తుండగా, మనసులోనే, ప్రజల వైఖరులను, వారి చర్యలను, మీరు మాట్లాడాలనుకునే విషయాల్లో జోడించండి.

సమర్థమైన ఉపమానములు, ఉదాహరణలు, ఒక ఫైలులో సేకరిస్తూ దాన్ని అభివృద్ధి చేయండి. మీరు చదివే పుస్తకాలనుండి, వినే ప్రసంగాలనుండి, వ్యక్తిగత పరిశీలనలనుండి వీటిని సేకరించండి. భవిష్యత్తులో ఉపయోగించేందుకు దాచిపెట్టండి.

No comments:

Post a Comment