16వ సామాన్య
ఆదివారము [YEAR A]
సొ.జ్ఞా.
12;13, 16-19, రోమీ. 8:26-27, మత్తయి 13:24-43
క్రీస్తు నందు ప్రియమైన సహోదరీ
సహోదరులారా! ఈ రోజు మనం 16వ సామాన్య ఆదివారము లోనికి ప్రవేశించి యున్నాము.
ప్రస్తుత కాలములో మనలో ఓర్పు,
సహనం చాలా తక్కువ. ప్రతీ సమస్యకు తక్షణ పరిష్కారం కావాలని కోరుకుంటాము. ఎవరైనా మన
వద్దకు సలహా కోసం వస్తే, వారు చెప్పేది శ్రద్ధగా వినకుండా, వారు చెప్పేది పూర్తి అవకుండానే,
మనం సలహాలివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. వేగవంతముగా పరిష్కారం కావాలని చూస్తూ
ఉంటాము. సమస్యను విశ్లేషించడానికి తగిన సమయాన్ని కూడా ఇవ్వము. క్షణాలలో ముగింపునకు
పరుగెడుతూ ఉంటాము. ఎవరైనా ఏదైనా ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచినప్పుడు, ఆ వ్యక్తిపై
వెమ్మటే ఒకలాంటి ‘ముద్ర’ వేస్తూ ఉంటాము. ఈనాటి ప్రసార మాధ్యమాలు కూడా అలాగే ఉన్నాయి.
ఇలాంటి హింసాత్మకమైన / అహంకార సంస్కృతిలో మనం ఉన్నాము. ఇతరులపై తీర్పు చేయుటలో చాలా
వేగంగా, ఉషారుగా ఉంటాము. ఒక్కోసారి అది మనకి నవ్వులాటగా కూడా ఉంటుంది. ఇదీ లోకం
తీరు! ఈ సంస్కృతికి వ్యతిరేకముగా, తమను తాము నీతిమంతులుగా, ఇతరులకంటే మెరుగైన వారిగా
భావించే మనకు, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ఓపికగా, సహనముగా ఉండాలని ప్రభువు
తెలియజే యుచున్నారు.
ఓర్పు, సహనం, మారుమనస్సు దేవుని
తీరు! దేవుడు ఓర్పుగల వాడు, దయగల వాడు. ఆయనే తీర్పరి. దేవుని తీర్పు న్యాయ మైనదని,
అలాగే, దేవుడు అందరిని దయతో కాపాడునని, ఆయన కరుణగల న్యాయాధిపతి అని ఈనాటి మొదటి
పఠనములో వింటున్నాము. బలహీనులమైన మనకు ఆత్మ సాయపడును. మన కొరకై ఆత్మయే దేవున్ని
ప్రార్ధించును అని ఈనాటి రెండవ పఠనములో వింటున్నాము. కనుక మనం మనతోను, ఇతరులతోనూ
ఓర్పుగా, సహనముగా ఉండ వలయును. మనలో నున్న ‘కలుపు గింజలు’ [చెడు] నుండి మారు మనస్సు
పొంది, దేవుని వైపు తిరిగి వస్తామని దేవుడు ఆశాజనకముగా ఓర్పుతో, సహనముతో ఎదురు
చూస్తున్నాడని ఈనాటి సువిశేష పఠనము ద్వారా ప్రభువు తెలియజేయు చున్నారు. ‘కలుపు
గింజలు’ వంటి అంశాలను మన కుటుంబములో గాని, సమాజములో గాని, దైవ సంఘములో గాని నిర్మూలించుటకు
గాని, ఖండించుటకు గాని తొందరపాటు చేయరాదు. తీర్పు చేయునది దేవుడు మాత్రమే.
గోధుమలు – కలుపుగింజలు
ఉపమాన ధ్యానం (మ. 13:24-30, 36-43)
[ఉపమానము శ్రద్ధగా చదువుము]. “గోధుమలు – కలుపుగింజలు” ఉపమానము ద్వారా దేవుడు జ్ఞానియని, ఓర్పు, సహనము గలవాడని, మంచివారిని, చెడ్డవారిని ఒకే విధముగా చూడునని, అయితే చెడ్డవారిలో నున్న, కొద్దిపాటి మంచిని బట్టి, “తీర్పు దినము” కల్ల, వారు మారుమనస్సు పొందుదురేమోనని, దేవుడు ఎదురు చూస్తున్నట్లు ప్రభువు తెలియ జేయుచున్నారు. “పంట కాలము వరకు రెంటిని పెరగనిండు” (మ. 13:30). ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు పశ్చాత్తాప పడే పాపి కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు. అదే సమయములో పాపి బలహీనతలో తనతో సఖ్యపడుటకు కావలసిన బలాన్ని, సంకల్పాన్ని కూడా ఒసగును.
ఆరంభములోనే యజమాని ఎందుకు
కలుపు మొక్కలను పెరికి వేయనీయ లేదు? మొదటగా, కలుపు మొక్కలు ఉన్నను, గోధుమ
మొక్కలు పెరగ గలవు అని యజమానికి తెలుసు. కలుపు మొక్కలు కొంత వరకు గోధుమ మొక్కలకు
ఆటంకం కలిగిస్తాయి, వాటి ఎదుగుదలకు అడ్డుపడతాయి, కాని, వాటిని పూర్తిగా నాశనం
చేయలేవు. లోకములో చెడ్డవారు ఉన్నను, వారు మంచి వారికి కొంత వరకు ఆటంకం, అడ్డంకులు కలిగించినను,
మంచివారు కూడా జీవించ గలుగుచున్నారు, ఎదుగు చున్నారు. మంచికి అంతము లేదు. “మంచితనం
అనేది ఒక మహా వృక్షం లాంటిది. ఎవరెంత నరికినా ... అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే
ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది.”
రెండవదిగా, కలుపు మొక్కలను,
గోధుమ మొక్కలను గుర్తించడం చాలా ముఖ్యం. రెండు ఇంచుమించు ఒకే రకముగా ఉంటాయి. “పంట
కాలము” వచ్చినప్పుడు వాటి ఫలములను బట్టి తప్పక గుర్తించడం జరుగుతుంది. “కలుపు
తీయబోయి, గోధుమను కూడ పెల్లగింతురేమో!” (మ. 13:29) అని యజమాని సేవకులను హెచ్చరించాడు.
అలాగే, ఈ లోకములో మంచి, చెడు రెండు కూడా పెనవేసుకొని ఉంటాయి. రెండింటిని విడదీసి
చెడును పూర్తిగా అంతమొందించడం మనకు అసాధ్యమే! దేవుడు మాత్రమే దానిని ‘తుది తీర్పు’న
[కోత కాలము] చేయగలడు [చదువుము. మలాకీ 4:1-3, దానియేలు 3:6, మత్తయి 16:27-28,
25:31-46]. అలాగే పాపము, చెడు, శ్రమల వలన
మనము పరీక్షింపబడి, దృఢముగా మారతాము. బలవంతులముగా మారతాము. మనలో ‘కలుపు మొక్కలు’
పెరిగే కొద్దీ, మన విశ్వాసానికి పెద్ద పరీక్షయే!
ప్రభువు ఈ ఉపమాన తాత్పర్యమును
తన శిష్యులకు తెలియ జేసాడు (మ. 13:36-43). “పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము
రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము (మ. 13:38). బైబులులో ‘పొలము’
ప్రజల హృదయాన్ని సూచిస్తుంది. ‘విత్తనము’ దైవ రాజ్యమును గూర్చిన దేవుని వాక్యమును
సూచిస్తుంది.
మనలో చాలా మందిమి, ఉపమానములోని
సేవకులవలె ప్రవర్తిస్తూ ఉంటాము. సంఘములో, శ్రీసభలో చెడ్డవారిని నిర్మూలించాలని
విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాము. కాని చివరకు, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా
ప్రవర్తిస్తున్నామని తెలుసు కుంటాము. అలాంటి వారిలో సౌలు ఒకడు అని చెప్పు కోవచ్చు.
తాను ఎంతగానో ప్రేమించిన యూద మతము కొరకు ‘క్రైస్తవ మార్గము’ను సమాధి చేయాలని ప్రయత్నించాడు...కాని,
చివరికి పౌలుగా మారటం జరిగింది. అలాగే, సేవకులవలె, ‘కలుపు గింజలకు’ కారణం ఇతరులపై
నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. “అయ్యా! నీ పొలములో మంచి విత్తనములు
చల్లితివి కదా! [వాస్తవానికి చల్లినది సేవకులే కదా!] అందులో, కలుపు గింజలు ఎట్లు
వచ్చి పడినవి?” (మ. 13:27). నింద ఎప్పుడూ ఇతరులపైనే! సేవకులు ఆప్రమత్తముగా ఉండిరా
అని ఎప్పటికీ ఆత్మ పరిశీలన చేసుకోరు.
[క్రైస్తవులు] ఈ లోకమున నున్న
చెడ్డవారిని నిర్మూలించుటకు ప్రయత్నం చేయరాదు. విశ్వస నీయమైన దేవుని సేవకులుగా
ఉండాలంటే, మంచి వారితో పాటు చెడ్డ వారిని కూడా ఉండనీయ వలెను. ఇరువురు కూడా ‘తీర్పు
దినము’ వరకు ఉండవలయును. వారి కార్యములను [ఫలములను] బట్టి, దేవుడు వారికి తీర్పు చేయును. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో,
ఖచ్చితముగా చెప్పగలిగే శక్తి మనకు లేదు. అది దేవునికి మాత్రమే సాధ్యమగును.
దేవుడొక్కడే న్యాయ తీర్పరి. మనం ఇతరులపై తీర్పు చేయక, ప్రభువు చెప్పినట్లు
చేయవలెను: “మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు.
అప్పుడు మీరు పరలోక మందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయన, ఆయన
దుర్జనులపై, సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింప జేయుచున్నాడు.
సన్మార్గులపై, దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింప జేయుచున్నాడు” (మ. 5:44-45).
ఇతరుల జీవితాలపై దృష్టిని
సారించే బదులు, మన జీవితాలలోనికి తొంగి చూసుకుంటే [ఆత్మ పరిశీలన] చాల మేలు! చీకటిని
చీదరించే బదులు, ఒక క్రొవ్వొత్తిని వెలిగించడం మేలు! లోకములో చెడును నిందించే
బదులు, నేను ఏమి మంచి చేయగలను అని ఆలోచించుట మేలు! మనలో మంచి ఉన్నదన్నది ఎంత
వాస్తవమో, చెడు ఉన్నదన్నది కూడా అంతే వాస్తవము! మనలో కూడా వివిధ రకాలైన ‘కలుపు
గింజలు’ ఉన్నాయన్నది వాస్తవం! “పొలము”ను మన ప్రవర్తన [హృదయం]తో పోల్చవచ్చు. అనుమానము, చెడుస్నేహాలు, దుష్టత్వము, పాపము, మత్తుపదార్ధాలు, మద్యం, అవిధేయత, ఆరు మరియు
తొమ్మిది ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించడం ... మొదలగు కలుపు గింజలు మనలో వెదజల్ల బడుతూ
ఉంటాయి. వీటి ఫలితమే, నేడు మన సమాజములో చూస్తున్న విడాకులు, విచ్చిన్నమైన
కుటుంబాలు, జూదం, అశ్లీలత మొదలగు కలుపు మొక్కలు... పొలములో
కలుపు మొక్కలను చివరి వరకు పెంచ వచ్చునేమో [రైతు కూడా తగిన సమయములో కలుపు మొక్కలను
ఏరి పారేస్తాడు] కాని, మన ప్రవర్తనలో, హృదయములో, జీవితములో కాదు. వాటిని ఎంత
త్వరగా సరిదిద్దుకుంటే అంత మంచిది.
“పాపము యొక్క వేతనం మరణం”
(రోమీ. 6:23). అవును మరణమే!!! మన జీవితములో, ప్రవర్తనలో ‘కలుపు మొక్కలు’ పెంచడం
అంటే, మన కుటుంబములో, స్నేహములో బంధుత్వాలను చంపి వేయడమే! మన ఎదుగుదలను చంపి వేయడమే!
పొలములో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే, పంట ఫలవంతముగా ఉండదని రైతుకు [యజమాని]కి
తెలుసు. అలాగే మన జీవితమనే పొలములో కూడా!!! మనం సంతోషముగా ఉండాలంటే, మనలో నున్న
కలుపు మొక్కలను గుర్తించి, వాటిని నిర్మూలించాలి.
ఉపమానములో సంతోషకరమైన వార్త ఏమిటంటే, దేవుడు దయాపూరితుడు, సహనం, ఓర్పు కలవాడు. మనలో చెడు [కలుపు మొక్కలు] ఉన్నదని మనకు తక్షణమే తీర్పు విధించి మనలను శిక్షించుట లేదు. మన మారుమనస్సుకు, తగినంత సమయాన్ని ఇస్తున్నాడు. ఎంత సమయమంటే, ‘తుది తీర్పు’ దినము వరకు. ఎంత గొప్ప దేవుడో కదా! ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు అయినను, ఆయన న్యాయ తీర్పరి కూడా. కనుక, “మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటిని, దుష్టులను అందరును ప్రోగుచేసి, అగ్ని గుండములో పడద్రోయుదురు... నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యునివలె ప్రకాశింతురు” (మ. 13: 41-43).
‘కలుపు గింజలు’ను విత్తు శత్రువు
సైతాను గురించి తెలుసుకుందాం:
[1]. సైతాను ఈ లోకము లోనికి “ఎలా”
ప్రవేశించినది? “ఇది శత్రువు చేసిన పని” (మ. 13:28) అని, ఈ “శత్రువు సైతాను” (మ.
13:39) అని స్వయముగా ప్రభువే చెప్పడం చదివియున్నాము. సృష్టి ఆరంభము నుండి కూడా
సైతాను / దుష్టత్వము అనే వాస్తవము ఉన్నది. అది ఎప్పుడు కూడా దేవుడు తలపెట్టు
మంచికి వ్యతిరేకముగా పనిచేస్తూ ఉంటుంది. ఈ దుష్టత్వము మన చుట్టూ కూడా ఉన్నదనేది
వాస్తవము!
[2]. సైతాను “ఎప్పుడు”
మన జీవితాలలోనికి ప్రవేశించును? “జనులు నిద్రించు వేళ పగవాడు [“శత్రువు సైతాను”]
గోధుమలలో కలుపు గింజలు చల్లి పోయెను” (మ. 13: 25). “జనులు నిద్రించు వేళ’యే సైతాను
వేళ. ఆధ్యాత్మిక నిద్ర చాలా అపాయము. ఆధ్యాత్మిక నిద్రయనగా ప్రార్ధనా జీవితాన్ని
నిర్లక్ష్యం చేయడం, ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యతను ఇవ్వక పోవడం.... ఇలాంటి
ఆధ్యాత్మిక నిద్ర [లేమి]లోనికి వెళ్ళినప్పుడు, సైతాను దానిని అవకాశముగ తీసుకొని,
మన జీవితాలలోనికి ప్రవేశించును [‘కలుపు గింజలు’ను వెదజల్లును]. మన బలహీనతలను
అవకాశముగ చేసుకొని, దేవుని రాజ్యము నుండి మనలను తోసివేయడానికి, మనలను నాశనం
చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక మనం ఎల్లప్పుడూ [ఆధ్యాత్మిక] మెళకువతో
ఉండాలి. ఎందుకన, “మనం వెలుగు బిడ్డలము. పగటి బిడ్డలమై ఉన్నాము. మనము రాత్రికిగాని, చీకటికిగాని సంబంధించిన వారముకాము” (1 తెస్స. 5:5). జాగరూకులమై ఉండాలి.
సైతానుకు, దుష్టత్వమునకు ఎలాంటి అవకాశము ఇవ్వకూడదు. అనుకోకుండా, హఠాత్తుగా, మన
జీవితములో “కలుపు మొక్కలు” కనిపిస్తుంటాయి. ఎందుకన, మన బలహీనతలను, ఆధ్యాత్మిక
నిర్లక్షతను సైతాను సదవకాశముగ చేసుకొని యున్నది. అయితే మనం గుర్తుంచుకోవలసినది
ఏమనగా, “బలహీనమైన మనకు ఆత్మ సాయపడును. మనము యుక్తముగా ఎట్లు ప్రార్ధింపవలెనో
మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని
ప్రార్ధించును” (రోమీ. 8:26-27). దేవుని ఆత్మ సాయముతో సైతానుపై యుద్ధం చేయాలి. మన
విశ్వాసాన్ని అణగ ద్రోక్కాలని ప్రయత్నం చేసే ప్రతీ ‘కలుపు మొక్క’పై మనం యుద్ధం
చేయాలి.
[3]. “ఎంత కాలము” సైతాను
తన శక్తిని ప్రదర్శించును? దేవుడు ఎందుకు సైతాను, దాని దుష్క్రియల పట్ల మౌనముగా
ఉన్నాడు? దానిని ఎందుకు నాశనం చేయడం లేదు? “పంట కాలము వరకు” (మ. 13:30) అని
ప్రభువు తెలియ జేయుచున్నాడు. దేవుని మౌనాన్ని మనం ప్రశ్నించలేము, తీర్పు చేయలేము.
దేవుని ప్రేమను మనం పూర్తిగా అర్ధంచేసుకోలేము. దేవుని దయను మనం అంత సులువుగా
కొలవలేము. ఆయన దయ, కనికరము ఎంత గొప్పవంటే, ‘కలుపు మొక్కలు’ కలిగినవారు మారుమనస్సు
పొంది తన యొద్దకు తిరిగి వచ్చుటకు ‘మరొక అవకాశము’ ఒసగును. దేవుడు పాపాన్ని
ద్వేషిస్తాడు, కాని పాపిని కాదు. దేవుడు పాపి మరణాన్ని కోరుకోడు. అందరిని రక్షించాలన్నదే
దేవుని రక్షణ ప్రణాళిక. దీని నిమిత్తమై, దేవుడు ఎంతో ఓర్పును, సహనమును కలిగియున్నాడు. కనుక చెడు, దుష్టత్వము మన జీవితములో వాస్తవమని గుర్తించాలి. ఈ వాస్తవ
సందర్భమున, ఆధ్యాత్మికముగా జాగరూకులమై, మెళకువగా ఉందాము. దేవునివలె ఓర్పును, సహనమును
కలిగి జీవించుదాము. ఎంత వరకు అంటే, “తుది తీర్పు” వరకు. దేవుడే న్యాయ నిర్ణేత,
న్యాయాధిపతి. న్యాయమైన తీర్పును చేయును (సొ.జ్ఞా. 12:13).
చివరిగా, కొన్నిసార్లు
తొందరపాటు చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు, బాగా ఆలస్యం చేస్తూ ఉంటాము. తగిన సమయములో
తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తగిన సమయములో కలుపు మొక్కలను గుర్తించి వాటిని
తొలగించాలి. ఇదియే “తీర్పు కాలము”.
ఆవగింజ ఉపమానము (మ. 13: 31-32): ఆవగింజ అన్ని విత్తనముల కంటె అతి చిన్నది. కాని పెరిగినప్పుడు [నాలుగు మీటర్ల నుండి పదిహేను మీటర్ల వరకు పెరుగుతుంది] అది పెద్ద గుబురై, వృక్షమగును. పక్షులు గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రభువు “ఆవగింజంత విశ్వాసము” (లూకా 17:6) అని చెప్పినప్పుడు – ఆవగింజ మన కొద్దిపాటి విశ్వాసాన్ని సూచిస్తుంది. ఇచ్చట ప్రభువు నొక్కి వక్కాణించునది: చిన్న ఆరంభము కాని గొప్ప ముగింపు. దైవరాజ్యము [దేవుని పరిపాలన] ఇలాగే గొప్పగా ఉంటుంది. పక్షుల వలె, అనేకులు [అన్యులు] దైవరాజ్యములో తలదాచు కొందురు లేదా వారసులగుదురు [చదువుము. దానియేలు 4:12, యెహెజ్కేలు 17:23, 31:6]. దీనిని బట్టి, పరలోక రాజ్యము అందరికి అని అర్ధమగుచున్నది. ప్రభువు వేదప్రచారము చిన్న ఆరంభమైనను, మహిమోపేతమైన పరలోక రాజ్యముగా మారును.
పులిసిన పిండి ఉపమానము (మ. 13;33-35): పరలోక రాజ్యము ‘పులిసిన పిండి’ని పోలియున్నది. కొద్దిపాటి ‘పులిసిన పిండి’ పిండినంతా కూడా పులియునట్లు చేయును. అప్పుడే రుచికరమైన రొట్టెలను చేయవచ్చు. చిన్న ఆరంభము కాని గొప్ప ముగింపు. ఆవగింజవలె పులిసిన పిండి పెరగదు, కాని దాని వలన మిగతా పిండి అంతాకూడా రొట్టెల పిండిగా రూపాంతరం చెందుతుంది. అలాగే దైవరాజ్యము కూడా చిన్న ఆరంభమైనను, సంపూర్ణ మార్పును కలిగించును.
Good reflection fr. U r reflection are thought provoking.
ReplyDeleteThank you! God bless us!
DeleteFather it is very good homily
ReplyDeleteLiving words
ReplyDeletePractical actions are well explained dear father. Thank you so much
ReplyDeleteVery good explanation father. Congratulations.
ReplyDeleteGood homily Father Praveen!!
ReplyDelete