జేసు తిరు హృదయ పండుగ

జేసు తిరు హృదయ పండుగ

ఈ రోజు జేసు తిరు హృదయ పండుగను కొనియాడుచున్నాము. ఈరోజు మనం యేసు తిరు హృదయాన్ని పూజించి గౌరవిస్తున్నాము. ఆరాధిస్తున్నాము.
హృదయం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ప్రేమ. కనుక జేసు తిరు హృదయాన్ని ధ్యానించడం అంటే, దేవుని ప్రేమను, దయను/కనికరమును ధ్యానించడమే!

బైబిలులో హృదయం అనే పదం ఒక వెయ్యి సార్లు వాడబడింది. కొన్ని సార్లు మాత్రమే శరీరములో ఒక భాగంగా వాడబడింది. మిగతా అన్నిసార్లు, ప్రత్యేకమైన అర్థాలతో వాడబడింది. అనగా హృదయం సంపూర్ణ వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, అంత:రంగాన్ని సూచించే విధంగా వాడబడింది.

దేవుడు ప్రేమ. ఈ లోకములో జన్మించిన దేవుని ప్రేమ యేసు క్రీస్తు ప్రభువు. దేవుని హృదయాన్ని అనగా దేవుని ప్రేమను, ఆయన దయను యేసు ఈలోకంలో చూపించాడు. "ఎవరును ఎప్పుడును దేవుని చూడ లేదు. తండ్రి వక్ష స్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియ పరచెను" (యో. 1:18). యేసు తిరు హృదయం గురించి యో. 19:34 లో కనులకు కట్టినట్లుగా చూడవచ్చు. "సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను". ఇది దేవుని ప్రేమకు గొప్ప నిదర్శనం. క్రీస్తు మన రక్షణ కోసం తనను తాను అర్పించుకున్నాడు. ఆయన ప్రేమ, దయ, కనికరము, ఏవిధముగా మనపై కుమ్మరింప బడినదో తెలియుచున్నది.

యేసు హృదయం కనికరము గల హృదయం. బైబిలులో కనికరము అనగా లోతైన, హృదయంతరాలలోని భావము. ఒక తల్లి తన బిడ్డల బాధను అనుభవించ గలదు. అలాగే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఫలితం జీవము. మనము జీవించునట్లు చేయుచున్నది. ఈ విషయాన్ని లూకా 7:11-17 లో చూడవచ్చు. నాయినులో వితంతువు ఏకైక కుమారుడు మరణించినప్పుడు, ఆ తల్లిని చూచి, యేసు కనికరించి, "ఏడవ వద్ధమ్మా" అని ఓదార్చి, మరణించిన ఆ బిడ్డను జీవముతో లేపాడు.

ప్రభువు ఎల్లప్పుడూ మనలను ప్రేమతో, కనికరముతో చూస్తూ ఉంటాడు. ఆయన హృదయం కనికరమైనది. మనలోని పాపాలను, గాయాలను, ఆయనకు చూపిస్తే, వాటిని క్షమిస్తాడు. మన పాపాల వలన ఆయన హృదయం గాయపరచ బడింది. కాని, మానవ హృదయంతో మనల్ని ప్రేమించాడు. మనల్ని రక్షించాడు. అందుకే ఆయన హృదయం ప్రేమకు గుర్తుగా, సంకేతంగా నిలిచింది.

మనపై దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన మనలను తన పవిత్ర ప్రజలుగా, సొంత ప్రజగా ఎన్నుకొన్నాడు. దేవుని కనికరమును పొందాలంటే, ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటించాలి (మొదటి పఠనము, ద్వితీయ 7:6-11).

దేవుని ఆజ్ఞ ప్రేమించడం. కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించు వాడు దేవుని ఎరిగిన వాడగును. దేవుని ఎవరును, ఎన్నడును చూడలేదు. మనము ఒకరి యెడల ఒకరము ప్రేమ కలవార మైనచో, దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణ మగును (రెండవ పఠనము, 1 యో 4:7-16).

యేసు తిరు హృదయం మనలను ఈవిధంగా ఆహ్వానిస్తుంది: "భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్ధకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీ రెత్తుకొనుడు. సాధుశీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు" (మ. 11:28-29). కనుక మన హృదయాలను దేవునికి తెరుద్ధాం. తిరు హృదయానికి అంకితం చేద్దాం. దేవునితో, తోటి వారితో సఖ్యపడుదాం.

వినయ, విధేయతతో తిరుహృదయానికి అంకితం చేసుకున్నయెడల, శాంతి, ఆనందము పొందెదము. అలాగే, మన కుటుంబాలను తిరుహృదయానికి అంకితం చేద్దాం. మన సంపూర్ణ నమ్మకాన్ని ఆయనలో ఉంచుదాం. మనపై ప్రేమాగ్నితో రగిలి పోతున్న తిరు హృదయం మనలను రక్షించును, శాంతి సమాధానము ఒసగును.
జేసు తిరు హృదయము మనలను ప్రేమించి, ఆశీర్వదించును గాక!

No comments:

Post a Comment