3. పౌలు తీతుకు వ్రాసిన లేఖ

3. పౌలు తీతుకు వ్రాసిన లేఖ
3.1. ఉపోద్ఘాతము
3.2. ప్రధానాంశాలు
3.2.1. శ్రీసభ ‘నిర్మాణం’ లేదా క్రమము (1:5-9)
3.2.1.1. పెద్దలు:
3.2.1.2. సంఘాధిపతులు లేదా పీఠాధిపతులు:
3.2.2. అసత్యపు బోధకులు (1:10-16)
3.2.3. దైవసంఘములో సంబంధాలు, విశ్వాసము (2:1-3:11)
3.2.3.1. సంబంధాలు మరియు బాధ్యతలు (తీతు. 2:1-10):
3.2.3.2. వృద్ధులైన పురుషులు (2:2):
3.2.3.3. వృద్ధ స్త్రీలు (2:3):
3.2.3.4. యువతులు (2:4-5):
3.2.3.5. యువకులు (2:6):
3.2.3.6. సేవకులు (2:9-10):
3.2.3.7. కాపరులు (2:7-8):
3.2.3.8. సంఘ నిర్వహణకు సూచనలు (తీతు. 2:11-3:11):
3.2.3.8.1. సమాజ బాధ్యత (3:1-2)
3.2.3.8.2. జ్ఞానస్నాన అముగ్రహము (3:3-8)
3.2.3.8.3. తీతుకు తుది ఉత్తర్వులు (3:9-11)
3.2.4. తుది శుభాకాంక్షలు (3:12-15)

3.1. ఉపోద్ఘాతము

తీతు పౌలు పరిచర్య వలన విశ్వాసమును పొందెను. పౌలు తీతును యెరూషలేము సమావేశమునకు (క్రీ.శ. 49) తీసుకొని వెళ్ళాడు. తీతు గ్రీసు దేశస్థుడు. సున్నతి పొందని విశ్వాసముగల క్రైస్తవుడు (గలతీ. 2:1-3). పౌలుకు తోటి మిషనరి (2 కొరి. 8:23), నమ్మదగిన ప్రతినిధి (2 కొరి. 12:18). మొదటి ప్రేషిత ప్రయాణములో, తీతు అంతియోకు నుండి యెరూషలేము వరకు పౌలును, బర్నబాసును వెంబడించాడు.

కొరింతు సంఘములో సంక్షోభం నెలకొన్నప్పుడు, పౌలు తన లేఖను ఎఫెసు నుండి కొరింతుకు తీతుతో పంపించాడు. కొరింతు ప్రజలు మారుమనస్సు పొందుటలో తీతు విజయవంతుడైనాడు. ఈ మంచి వార్తను తీతు మాసిడోనియాలో నున్న పౌలుకు అందచేశాడు. ఈవిధముగా కొరింతు ప్రజలు మరియు పౌలు మధ్య సఖ్యతను నెలకొల్పడములో ముఖ్యపాత్ర పోషించాడు (2 కొరి. 2:1, 7:6-16).

మరల యెరూషలేములోని ప్రజలకు సహాయమును సమకూర్చుటకు పౌలు తీతును కొరింతునకు పంపియున్నాడు (2 కొరి. 8:6, 16, 22, 12:17-18). తీతు. 1:5 ప్రకారం, తీతు పౌలుతో క్రీటులో ఉన్నాడు. అచటి సంఘములో ఇంకను తీర్చి దిద్దబదవలసిన వానిని క్రమపరచుటకును, ప్రతి నగరము నందును దైవ సంఘమునకు పెద్దలను నియమించుటకును, తీతును పౌలు క్రీటులోనే వదిలి వచ్చాడు.

ఈ లేఖను పౌలు “విశ్వాసము నందు నా నిజమైన కుమారుడు” అని తీతును సంబోధిస్తూ వ్రాయుచున్నాడు. కుమారుడు, తండ్రి కార్యమును కొనసాగించు నట్లుగా, పౌలు ఆరంభించిన అపోస్తోలిక ప్రేషిత కార్యమును తీతు కొనసాగించ వలెనని ఈ లేఖ ద్వారా ఆజ్ఞాపించు చున్నాడు (తీతు. 1:1-4).   

3.2. ప్రధానాంశాలు
3.2.1. శ్రీసభ ‘నిర్మాణం’ లేదా క్రమము (1:5-9)

క్రీటులో నున్న తీతు నెరవేర్చవలసిన బాధ్యతలను గురించి పౌలు తెలియజేయు చున్నాడు: (అ). దైవ సంఘములో ఇంకను తీర్చి దిద్దబడవలసిన వానిని క్రమపరచుటకు, (ఆ). ప్రతి నగరము నందును దైవ సంఘమునకు పెద్దలను (పెద్దలు, సంఘాధిపతులు లేదా పీఠాధిపతులు) నియమించుటకు (తీతు. 1:5). దీనిని బట్టి పౌలు క్రీటులో నున్నప్పుడు వీరిని నియమించలేదని అర్ధమగు చున్నది. ఆ బాధ్యతను తీతుకు అప్పగించాడు. శ్రీసభ నిర్మాణక్రమము విషయములో సమర్ధవంతముగా వ్యవస్థాపించ బడాలని ప్రయత్నం చేయుచున్నాడు.

శ్రీసభ నిర్మాణక్రమము యొక్క అవసరత ఏమి? గమనింప వలసిన విషయం ఏమనగా, అసత్య బోధకుల నేపధ్యములో శ్రీసభ నిర్మాణక్రమము ఎంతగానో అవసరమై యుండెను. అందులకే పౌలు పెద్దను (లను) నియమించు విషయమును వివరముగా విశదపరచు చున్నాడు. “సిద్దాంతముతో ఏకీభవించు సందేశమును అతడు దృఢముగ అంటిపెట్టుకొని ఉండవలెను. ఈ విధముగ ఇతరులను సత్య బోధనలచే ప్రోత్సహించుటకు, దానికి వ్యతిరేకులైన వారి దోషములను చూపెట్టుటకు అతడు సమర్ధుడుగా ఉండవలెను” (తీతు. 1:9).

“పెద్దలు” (తీతు. 1:5) అనగా ఎవరు? ఎలా అర్ధము చేసుకోవాలి? కాపరి లేఖల ప్రకారం, రెండు రకాల క్రైస్తవ సంఘ నాయకులను నియమించవలసి ఉన్నది.

3.2.1.1. పెద్దలు: వీరు ప్రతీ దైవ సంఘమున నియమించ బడినారు. వీరు వయసులో పెద్దవారును, అనుభవజ్ఞులై మరియు స్థానిక సంఘస్థులై ఉండవలయును. వీరు నిర్వహించ వలసిన విధులు, బాధ్యతలు ఏమనగా:

- దైవ సంఘమునంతకు మర్గచూపరులై ఉండవలయును, అనగా మంచి నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయాలి మరియు ఆర్ధిక విషయాలను పర్యవేక్షించడం. వివిధ గృహాలలో ప్రార్ధనకై సమావేశమైన విశ్వాస ప్రార్ధన సంఘాలకు అధ్యక్షత వహిస్తూ,

పర్యవేక్షిస్తూ ఉండేవారు.

- విశ్వాస విషయములోను మరియు నైతిక విషయములలోను క్రైస్తవ విశ్వాసులకు కాపరులై, సంరక్షణలో ఉంచి నడిపించ వలయును (చదువుము. 1 తిమో. 5:17, 1 తెస్స. 5:12, రోమీ. 12:8).

3.2.1.2. సంఘాధిపతులు లేదా పీఠాధిపతులు: సంఘ పెద్దలలో నుండి ఒకరు సంఘాధిపతిగా లేదా పీఠాధిపతిగా ఎన్నుకొనబడే వారు. వీరిని ‘పర్యవేక్షకులు’ అని కూడా పిలువ వచ్చు.

“పెద్దలు” దేవుని పనికి యాజమాన్యము వహించాలి కనుక వారికి ఉండవలసిన అర్హతలు తీతు. 1:7-9లో చూడవచ్చు:

- సంఘాధిపతి నిందారహితుడై ఉండ వలెను.
- అతడు అహంకారియు, ముక్కోపియు, త్రాగుబోతు, దౌర్జన్యము చేయువాడు, దురాశా పరుడును కారాదు.
- అతడు అతిధులను సత్కరించు వాడు, మంచిని ప్రేమించు వాడు కావలెను.
- ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఋజు మార్గమున నడుచువాడు, పవిత్రుడు, క్రమశిక్షణ కలవాడునై ఉండవలెను.
- సిద్దాంతముతో ఏకీభవించు సందేశమును అతడు దృఢముగ అంటిపెట్టుకొని ఉండవలెను. ఈ విధముగ ఇతరులను సత్య బోధనలచే ప్రోత్సహించుటకు, దానికి వ్యతిరేకులైన వారి దోషములను చూపెట్టుటకు అతడు సమర్ధుడుగా ఉండవలెను.

3.2.2. అసత్యపు బోధకులు (1:10-16)

అసత్యపు బోధకులపై మరియు వారి బోధనలపై పౌలు దాడిచేయు చున్నాడు: వారు అవిధేయులు, శూన్యవాదులు, మోసగాండ్రు మరియు సున్నతి సంబంధులు. ధన సంపాదనము అను నీచ వ్యామోహముతో వారు దుర్భోదలు చేయుచు, కుటుంబములకు కుటుంబములనే తలక్రిందులు చేయుచున్నారు. వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు. కాని వారు చేయు కార్యములు దానికి విరుద్ధములు. వారు కలుషాత్ములు, అవిధేయులు, మంచి చేయుటకు అసమర్ధులు (తీతు. 1:10-11, 16).

అసత్యపు బోధకులు చేసిన బోధనల గురించి మనకు కొద్ది సమాచారము మాత్రమే ఉన్నది:

- సున్నతి సంబంధులు లేదా సున్నతి గురించి బోధించెడి వారు (తీతు. 1:10).
- తీతు. 1:12 ప్రకారం, వారు క్రీటు వాస్తవ్యులు అని అర్ధమగు చున్నది: “క్రీటు దేశీయులు సర్వదా అసత్యమాడు వారు, దుష్ట మృగములు, సోమరులు, తిండిపోతులునై ఉన్నారు” అని ఎపిమెనిదెస్ అనే కవి వారి గురించి చెప్పిన మాటలను పౌలు చెప్పియున్నాడు.
- “పవిత్రులకు సమస్తమును పవిత్రమే. కాని వారి బుద్ధియు, అంత:కరణమును మలినములగుటచే, అపవిత్రులు, విశ్వాసము లేనివారు అగు వారికి ఏదియును పవిత్రము కాదు” అని తీతు. 1:16లో చూస్తున్నాము. దీనిని బట్టి వారు మోషే చట్టమును వివరించుటకు, కఠినమైన సంప్రదాయాలను ఉపయోగించుచున్న వారుగా అర్ధమగుచున్నది. ఇలాంటి వారు దేవుని ఆజ్ఞను నిరాకరించి, మానవ నియమములను అనుసరించువారు (మార్కు. 7:8).

ఇలాంటి అసత్యపు బోధకులను ఎలా ఎదుర్కొన వలయును?

- వారి నోళ్ళు మూయింపవలసి ఉన్నది (తీతు. 1:11)
- వారు మంచి విశ్వాసమును కలిగి ఉండవలెనని హెచ్చరించవలెను (తీతు. 1:13)

పెద్దలు, సంఘాధిపతులు ఈ బాధ్యతను నిర్వర్తించ వలెను. ముఖ్యముగా సున్నతి గురించి బోధించెడి వారి నోళ్లను మూయించ వలసి యుండెను.

3.2.3. దైవసంఘములో సంబంధాలు, విశ్వాసము (2:1-3:11)

దీనిని మనము రెండు భాగాలుగా విభజింపవచ్చు: దైవ సంఘములో ఒకరిమధ్య ఒకరికి ఉండవలసిన సంబంధాలు మరియు బాధ్యతలు (తీతు. 2:1-10) మరియు సంఘ నిర్వహణకు సూచనలు (తీతు. 2:11-3:11).

3.2.3.1. సంబంధాలు మరియు బాధ్యతలు (తీతు. 2:1-10): ఈ భాగములో, క్రైస్తవ సంఘములో పాటించవలసిన ఆచరణాత్మకమైన మార్గదర్శకాలను పౌలు నిర్దేశిస్తున్నాడు.

3.2.3.2. వృద్ధులైన పురుషులు (2:2): విజ్ఞత కలవారు, తెలివికలవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు కావలెను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అను వానియందు దృఢత్వము కలిగి ఉండవలెను.

3.2.3.3. వృద్ధ స్త్రీలు (2:3): ఇతరులపై అపవాదములు వేయక, మద్యమునకు బానిసలు కాక, భయభక్తులతో ప్రవర్తింపవలెను. యువతులను తీర్చిదిద్దవలెను.

3.2.3.4. యువతులు (2:4-5): తమ భర్తలను, బిడ్డలను ప్రేమించవలెను. ఇంద్రియ నిగ్రహమును, శుచిత్వమును కలిగి ఉండవలెను. మంచి గృహిణులుగ, కనికరము గలవారై భర్తలకు విధేయులు కావలెను.

3.2.3.5. యువకులు (2:6): ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలెను.

3.2.3.6. సేవకులు (2:9-10): యజమానులకు విధేయులై అన్ని పనులు వారికి తృప్తికరముగా చేయవలెను. వారికి ఎదురు పలుకరాదు. వారినుండి దొంగిలింపరాదు. అన్ని విషయములందును వారు సర్వదా మంచి వారును విశ్వాస పాత్రులని నిరూపించు కొనవలెను. గమనించ వలసిన ముఖ్య విషయం: కొన్ని శతాబ్దాల క్రితం వరకు ‘బానిసత్వము’ను సమర్ధించుటకు ఇలాంటి ప్రస్తావనలు ఉపయోగించు కోవడం జరిగింది. కాని ఈనాడు ‘బానిసత్వము’ ఒక చెడు వ్యవస్థ. ‘బానిసత్వము’ అనగా సామాజిక ఆచారాన్ని అమానుషముగా మార్చడమే! నూతన నిబంధన రచయితలు సమాజములోనున్న చెడును గాక, స్థిరత్వము, క్రమము గూర్చి ఎక్కువగా ఆందోళన చెందినట్లుగా కనిపిస్తున్నది. అంతేగాని, ‘బానిసత్వము’ను వారు సమర్ధించ లేదు (చదువుము. పౌలు ఫిలేమోనునకు వ్రాసిన లేఖ).

3.2.3.7. కాపరులు (2:7-8): క్రీటు దీవి యందుగల క్రైస్తవ సంఘాలకు కాపరిగా తీతు దృఢమైన సిద్ధాంతమునకు అనుగుణముగా ఉన్నదానినే బోధించాలి. పైన చెప్పబడిన విషయములను వృద్ధులైన పురుషులకు, స్త్రీలకు, యువతీయువకులకు మరియు సేవకులకు బోధించాలి. అన్ని విషయములలోను కాపరి వారికి మంచి పనులయందు ఆదర్శము కావలెను. బోధనల యందు మోస పూరితముగా కాక గంభీరముగ ఉండాలి. విమర్శించుటకు వీలులేని మంచి పదములనే ఉపయోగించాలి.

మిగతా లేఖలలో పౌలు తనను ఆదర్శముగా అనుసరించవలెను (ఫిలిప్పీ. 3:17) అని చెప్పిన విధముగా, కాపరి లేఖలలో కూడా, తనను ఆదర్శప్రాయుడుగా దేవుడు చేసెనని తెలియజేయు చున్నాడు (1తిమో. 1:16, 2 తిమో. 1:13). కాని తీతుకు వ్రాసిన లేఖలో మాత్రము, క్రీటులోని విశ్వాసులకు అన్ని విషయములలోను తీతుయే వారికి ఆదర్శము కావలయునని పౌలు తెలియజేయు చున్నాడు (తీతు. 2:7).

3.2.3.8. సంఘ నిర్వహణకు సూచనలు (తీతు. 2:11-3:11): విశ్వాసము మరియు నైతిక జీవితమునకు సంబంధించిన సూచనలను పౌలు చేయుచున్నాడు. కారణం, “సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప (క్రీస్తు ఈ లోకములో జన్మించడం) ప్రత్యక్షమయ్యెను” (2:11). అందువలన, “భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి, ఋజు మార్గమున, పవిత్రమయిన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించు చున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు, సర్వోన్నతుడగు మన దేవుని (క్రీస్తు దైవత్వం), రక్షకుడగు యేసు క్రీస్తు మహిమ (క్రీస్తు రెండవ రాకడ) ప్రత్యక్షమగు శుభ దినము కొరకు నిరీక్షణతో వేచియుండ వలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి, సత్కార్యముల యందు ఆసక్తిగలవారినిగ తన కొరకు పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మన కొరకు అర్పించుకొనెను” (2: 12-14).

క్రైస్తవ ప్రవర్తన గురించి తీతు 3:1-11లో చూస్తున్నాము:

3.2.3.8.1. సమాజ బాధ్యత (3:1-2)

- అధికారులకు లొంగి యుండవలెను, విధేయులై ఉండవలెను (చూడుము. రోమీ. 13: 1-7, 1 తిమో. 2: 1-2)
- ఎట్టి సత్కార్యము చేయుటకైనను సంసిద్ధులై ఉండవలయును
- అందరితో శాంతముగ ఉండి, సౌమ్యముగ ప్రవర్తించవలెను, చెడుగా మాట్లాడ కూడదు, జగడ మాడరాదు. క్రీస్తే మనకు ఆదర్శం (చూడుము. 2 కొరి. 10:1).

కనుక, క్రైస్తవులు సామాజిక సంక్షేమమునకై తమను తాము అంకితం చేసుకోవాలి.

3.2.3.8.2. జ్ఞానస్నాన అముగ్రహము (3:3-8)

క్రైస్తవులు ఇతరుల పట్ల ఎందుకు దయకలిగి ప్రవర్తించ వలెను? ఎందుకన, దేవుడు క్రీస్తు ద్వారా తన దయగల ప్రేమను వ్యక్తపరచి యున్నాడు (తీతు. 2:11, చూడుము. 2 తిమో. 1:9-10). ఈ కృప సర్వ మానవాళికి (క్రైస్తవులు, క్రైస్తవేత్తరులు) ఒసగబడినది. “ఒకప్పుడు” క్రైస్తవులు పాపములో జీవించిరి (చదువుము. తీతు. 3:3, ఎఫెసీ. 2:3). “కాని ఇప్పుడు” దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమగుటతో దేవుని కృపయు, ప్రేమయు పొందుకొని పాపము నుండి విడుదల పొందెను (తీతు. 3:4). ఈ రక్షణ జ్ఞానస్నానము (“నూతన జన్మము”, “నూతన జీవితము”) ద్వారా లభించెను (తీతు. 3:5). తద్వారా, నీతిమంతులై నిత్యజీవమునకు వారసులైతిరి (తీతు. 3:7, చూడుము. 1 కొరి. 6:11). ఇచ్చట మనం త్రిత్వైక దేవుని (పిత, పుత్ర, పవిత్రాత్మ - మత్త. 28:19) మహిమకార్యమును చూస్తున్నాము. తీతు. 3:4-7 ప్రకారం, జ్ఞానస్నానము మనలో పవిత్రాత్మ యొక్క కార్యఫలితమే, “పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మము, నూతన జీవము” (తీతు. 3:5). ఈ జ్ఞానస్నాన వరము సత్కార్యములు చేయుటకు, తద్వారా నైతిక జీవితమును జీవించుటకు ప్రోత్సహించును (తీతు. 3:1, 8).

3.2.3.8.3. తీతుకు తుది ఉత్తర్వులు (3:9-11)

ఈ ఉత్తర్వులు ప్రత్యేకముగా దైవ సంఘములోనున్న అబద్ధపు బోధకులను ఉద్దేశించి ఇవ్వబడినవి. “మూర్ఖపు వాదములకును, వంశావళులకును, తగవులకును, చట్టమును గూర్చిన వివాదములకును దూరముగా ఉండవలయును” (తీతు. 3:9). క్రైస్తవ సంఘములో ఆందోళనలను సృష్టించు ఇలాంటి వారితో ఎలా ప్రవర్తించాలి? (అ). మొదటిగా, వారు ప్రత్యేక ఆసక్తిని కనబరచు యూదుల ధర్మశాస్త్రమును గూర్చిన అవివేక వాదములకు దూరముగా ఉండాలి (తీతు. 3:9, 1 తిమో. 1:7). (ఆ). రెండవదిగా, విరోధులైన వారిని సాత్త్వికముగ సరిదిద్దాలి. ఎందుకన, పశ్చాత్తాపపడి, సత్యమును గ్రహించు అవకాశమును దేవుడు వారికి అనుగ్రహించునేమో! (2 తిమో. 2:25-26). (ఇ). మూడవదిగా, మత భేదములను సృష్టించు అట్టి వారితో ఎట్టి సంబంధము లేక సంఘము నుండి దూరముగా ఉంచవలయును (తీతు. 3:10).

3.2.4. తుది శుభాకాంక్షలు (3:12-15)

తీతు యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి పౌలు వ్యక్తిగత సూచనలను చేయుచున్నాడు: “మన ప్రజలు నిష్ఫలులు కాకుండ అవసరమును బట్టి సమయోచితముగా సత్కార్యములను శ్రద్ధగా చేయుట నేర్చుకొన వలెను” (3:14). దీని ద్వారా పౌలు మరొక సారి ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రస్తావిస్తున్నాడు. పౌలు తీతును కలువాలని తెలియజేస్తూ, తన తోడి వారి శుభాకాంక్షలను తెలియజేయు చున్నాడు. అలాగే విశ్వాసులందరికి తన శుభాకాంక్షలను తెలియజేయు చున్నాడు.

No comments:

Post a Comment