బైబులు వివరణలు
పెషర్: ఇది
యూదుల బైబులు వివరణ పద్ధతి. ఈ పద్ధతిని కుమ్రాన్ (Qumran) సంఘంవారు
ఉపయోగించేవారు. ఒక బైబులు వాక్య పరమార్ధమును అర్ధము చేసుకోవడానికి ఈ వివరణ
పద్ధతిని ఉపయోగిస్తారు. హీబ్రూ పదమైన పెషర్ కు అరమాయిక్ సమాంతర పదం “పెషార్”.
అరమాయిక్ బైబులులోని దానియేలు గ్రంథములో, పెషార్ అను పదం31 సార్లు
ఉపయోగించడమైనది. నెబుకద్నేసరు కలలను గూర్చి దానియేలు వివరణలో మరియు 7వ
అధ్యాయములోని దానియేలు కలలో గాంచిన రేయి దర్శనములో, పెషార్ అనే పదం వాడబడినది.
ఈ బైబులు వివరణ దైవీక వెలుగుతో (దైవ ప్రేరణ) సాధ్యమవుతుంది.
అలాగే
దానియేలు గ్రంథములో (అరమాయిక్) “రాజ్” (raz)
అనే పదము 9 సార్లు వాడబడినది. దీనికి ‘రహస్యము’ అని అర్ధము. నెబుకద్నేసరు మహావిగ్రహము
గురించి కన్న కలను, దైవప్రేరణతో దానియేలు ఆ రహస్యమును రాజుకు తెలియ జేసాడు. అలాగే,
ఆ కల భావమును కూడా రాజుకు వివరించాడు (దాని. 2). “పెషార్”, “రాజ్”
అనే పదాలు, కుమ్రాన్ లేదా మృత సముద్రపు ప్రతులలో ఉపయోగించబడిన సాధారణ పదాలు.
మత్తయి
సువార్తీకుడుకూడా, తన సువార్తలో ఈ పెషర్ బైబులు వివరణ పద్ధతిని 1:18-23లో
ఉపయోగించాడు. యేసు క్రీస్తు పుట్టుక, వ్యక్తిత్వం, కార్యములలో, ఏవిధముగా పూర్వ
నిబంధన ప్రవచనాలు నెరవేరాయో వాదించుటకు మత్తయి ఈ పద్ధతిని ఉపయోగించడం జరిగినది.
మిద్రాష్:
ఇది రబ్బినిక్ వివరణ లేదా వ్యాఖ్యానము. ఇది ప్రాముఖ్యముగా, వ్రాయబడిన తోరా
(TANAK) కు మౌఖిక వివరణ. మిద్రాష్ అను పదము, హీబ్రూ పదమైన దరష్
మూలము. దీనికి ‘అన్వేషణ’, ‘అర్ధమును కనుగొనుట’ అని అర్ధము. కనుక మిద్రాష్ అనగా
‘వివరణ’ అని అర్ధము. వివరణలను బోధకులు చేసేవారు. సినాయి కొండపై వ్రాయబడిన చట్టముతోపాటు,
మౌఖిక చట్టముకూడా ఇవ్వబడినది అను సంప్రదాయము నుండి మిద్రాష్ వచ్చినట్లుగా
తెలియుచున్నది. రబ్బీలు (పరిశుద్ధ గ్రంథ పండితులు) ఈ రబ్బినిక్ వివరణకు రూపును
కల్పించారు. నూతన నిబంధనలో మౌఖిక చట్టమును ‘పూర్వుల సంప్రదాయము’గా చెప్పబడినది
(మార్కు. 7:1-13).
యూద
వ్యాఖ్యానములు
మిష్నా: వ్రాయబడిన
మిద్రాష్ ప్రతుల సేకరణ లేదా మౌఖిక వ్యాఖ్యానములను మిష్నా అని పిలువబడుచున్నది.
క్రీ.శ. 200ల సంవత్సరాల మధ్యకాలములో మిష్నాగా గ్రంథస్తం చేయబడినది. ఇది
ముఖ్యముగా హీబ్రూ బైబులు యొక్క చట్టపరమైన నిబంధనలకు, నమ్మకాలకు సంబంధించిన సేకరణ. ఇది
సంక్షిప్తమైన హీబ్రూ భాషలో వ్రాయబడినది. మిష్నా ప్రకారం, దీనిని 150 మంది
అధికారులు, క్రీ.పూ. 50నుండి క్రీ.శ. 200ల మధ్యకాలములో రూపొందించినట్లుగా
తెలియుచున్నది. మిష్నా అనగా ‘నేర్చుకొనుట’ అని అర్ధము. కనుక, మిష్నా
అనగా మౌఖిక చట్టమును నేర్చుకొనుట లేదా కంఠస్థం చేయుట అని అర్ధము. మిష్నా
బోధకులచేత మౌఖికముగా బోధింపబడేది. తరువాత కాలములో గ్రంథముగా వ్రాయబడినది. మొట్టమొదటిగా
క్రీ.శ. 1485వ సంవత్సరములో స్పెయిన్ దేశములో, మిష్నా ముద్రింపబడినది.
క్రీ.శ. 1698-1703 మధ్యకాలములో లతీను భాషలోనికి, క్రీ.శ. 1760-1763 మధ్యకాలములో
జర్మన్ భాషలోనికి, క్రీ.శ. 1933, 1951-1956 మధ్యకాలములో ఆంగ్లములోనికి అనువదింప
బడినది.
తాల్ముద్: మిష్నాకు
వ్యాఖ్యానమును తాల్ముద్ అని పిలుస్తాము. తాల్ముద్ అనగా ‘అధ్యయనం’
లేదా ‘నేర్చుకొనుట’ అని అర్ధము. ‘బబులోనియ తాల్ముద్’ బాగా ప్రాచుర్యము
పొందినది. మిగతావి: ‘పాలస్తీన తాల్ముద్’ మరియు ‘యెరూషలేము తాల్ముద్’.
యూద బోధనా
పద్ధతులు
హగ్గడా: హగ్గడా
మరియు హలకా అను రెండు యూద బోధనా పద్ధతుల ద్వారా మిద్రాష్ (వివరణ,
వ్యాఖ్యానము) సంప్రదాయము అభివృద్ధి చెందినది. హగ్గడా అనగా ‘పురాణము’, ‘కధ’
అని అర్ధము. దీనిలో, ఆదర్శవంతమైన జీవిత గాథల ద్వారా దేవుని మార్గము గురించి నేర్చుకోవలసిన
పాఠాలు ఉంటాయి.
హలకా: హలకా
అనగా ‘బోధన’ అని అర్ధము. ఇది ముఖ్యముగా నీతిపరమైన నియమాలు, చట్టాల గురించి
వివరిస్తున్నది.
No comments:
Post a Comment