1. ఉపోద్ఘాతము

 1. ఉపోద్ఘాతము

పౌలు భక్తిగల మరియు అత్యంతాసక్తిగల యూదుడు (ఫిలిప్పీ. 3:6). పౌలు తన యూద మతమును హృదయపూర్వకముగా ప్రేమించాడు. తన మతమును, ముఖ్యముగా ధర్మశ్రాస్త్ర దృక్పధమును, గౌరవనీయ సంప్రదాయాలను, ఆరాధనను, రక్షణను సవాలు చేసి, నూతనముగా ఆవిర్భవించిన “మార్గము” (క్రైస్తవ మార్గము లేదా క్రీస్తు మార్గము)ను అతడు సహించలేక పోయాడు. అందువలన, స్వమతమందు అతి మూర్ఖాభిమానుడై క్రైస్తవ సంఘమును నాశనం చేయ ప్రయత్నం చేసాడు.

స్తెఫానుపట్ల హింసను, హత్యను ప్రోత్సహించాడు. “స్తెఫానును నగరము బయటకు తరుముకొని పోయి, రాళ్ళతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రమును తీసివేసి సౌలు అను యువకుని పాదములచెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్ళతో కొట్టుచుండగా స్తెఫాను, ‘యేసు ప్రభూ! నా ఆత్మను గైకొనుముఅని ప్రార్ధించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ‘ప్రభూ! ఈ పాపము వీరిపై మోపకుముఅని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను” (అ.కా. 7:58-60).

ఆనాటినుండి యెరూషలేములో “సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింట జొరబడి విశ్వాసులయిన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చికొనిపోయి వారిని చెరసాలో వేయించుచుండెను” (అ.కా. 8:3). యెరూషలేములోనేగాక, దమస్కు నగరములోకూడా ప్రభువు మార్గమును అవలంబించుచున్న వారిని పట్టుకొనాలని తలంచి, ప్రధానార్చకునినుండి అచటి యూదుల ప్రార్ధనా మందిరములకు పరిచయ పత్రములతో బయలుదేరాడు (అ.కా. 9:1-2).

కాని దమస్కు నగరమునకు వెళ్ళు మార్గమధ్యలో ఉత్థాన క్రీస్తును ఆకస్మికముగా ‘కలుసుకొనుట’ వలన (అ.కా. 9:1-9), తన జీవితములో సంపూర్ణ మార్పును చవిచూసాడు. క్రీస్తుకు శత్రువు అయిన పౌలు ఇప్పుడు అత్యంత ప్రియునిగా మారాడు. యేసును దేవునిగా, ప్రభువుగా అంగీకరించాడు (అ.కా. 9:10-20). క్రీస్తు సువార్తకు ప్రచారకునిగా మారాడు. క్రీస్తు విశ్వాసులను విస్మరించి హింసించే సౌలు, వారి పక్షాన వాదించి, వారిని నిర్మించుపౌలుగా మారాడు. ఈవిధముగా, ప్రభువు పౌలును “తన నామమును తెలియజేయుటకు ఒక సాధనముగా ఎన్నుకొనెను” (అ.కా. 9:15).

ఆసియా మైనరు, అరేబియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో సిలువ వేయబడిన ఉత్థాన క్రీస్తునుగురించి ప్రకటించాడు. అనేకచోట్ల క్రైస్తవ సంఘాలనుస్థాపించాడు. క్రైస్తవ విశ్వాసుల బాగోగులు చూసుకొనుటకు, వారిని నడిపించుటకు ఆధ్యాత్మిక నాయకులను నియమించాడు. నోటిమాటగా, వ్రాతపూర్వకముగా క్రైస్తవ పరమ రహస్యాలను క్రీస్తానుచరులకు వివరించియున్నాడు.

నూతన నిబంధనములో మొట్టమొదటిగా వ్రాయబడినవి పౌలు లేఖలే! ఈ లేఖలద్వారా క్రీస్తు బోధనలను ముఖ్యంగా దేవరహస్యములను, దైరాజ్యమును గూర్చిన పరమ రహస్యములను విశదపరచుటకు ప్రయత్నం చేసాడు. పౌలు తన లేఖలద్వారా, తనకు తెలియకనే నూతన నిబంధన సాహిత్యమునకు దోహదపడ్డాడు. ఈ లేఖలు, ప్రధమ ఆధారాలుగా ఆదిమ క్రైస్తవ సంఘ ముఖ వైఖరిని మనకు బహిర్గత మొనర్చుతున్నాయి.

సర్వకాలములయందు శ్రీసభ నిర్మాణములో పౌలు ఒక గొప్ప శిల్పిగా క్రైస్తవ చరిత్రలో నిలిచిపోతాడు. ఈనాడు మనం చూస్తున్న శ్రీసభ కట్టుబాట్లు, పరిపాలన విధానములను పౌలు ఆనాడే రూపకల్పన చేసియున్నాడు. వివిధ అంతస్తులో శ్రీసభ పరిపాలనను ఇతర నాయకులకు అప్పగించి చక్కటి పరిపాలన వ్యవస్థకు బాటలు వేసాడు. క్రైస్తవ సంఘ (మత) గుర్తింపునకు పౌలు ఎంతగానో కృషి చేసాడు.

నజరేయుడైన యేసు క్రీస్తు సందేశమును తన నాటి ప్రపంచమంతటికిని వ్యాపింప జేసాడు. “క్రీస్తు యేసునందు దేవుని కొరకై నేను చేసిన వానిని గూర్చి గర్వింప వచ్చును. క్రీస్తు నా ద్వారా, నా మాటల వలనను, చేతల వలనను, సూచక క్రియల చేతను, అద్భుతముల చేతను, ఆత్మయొక్క శక్తి మూలమునను, అన్యజనులను దేవునకు విధేయులను చేయుటకై చేసిన దానిని గూర్చి మాత్రమే ధైర్యము వహించి పలికెదను. కనుక, యెరూషలేమునుండి ఇలూరికం వరకు పయనించుట వలన క్రీస్తును గూర్చిన సువార్తను సంపూర్ణముగా ప్రకటించితిని” (రోమీ. 15:17-19) అని పౌలు తన సువార్తా ప్రేషితత్వమునుగూర్చి చెప్పియున్నాడు. స్త్రీలు, పురుషులు, బానిసలు, స్వతంత్రులు, పునీతులు, పాపాత్ములు, ధనికులు, పేదవారు, అమాయకులు, విద్యావంతులు అందరునూ కలిసి సామరస్యంగా జీవించగల బహుళజాతి, జాత్యంతర, వివక్షతలేని సమాజ స్థాపనకు పౌలు ఎంతగానో కృషి చేశాడు.

పౌలు గొప్ప పండితుడు, వేదాంతి, బోధకుడు, కాపరి, నాయకుడు, ‘అపోస్తలుడు’, ఉత్సాహపూరితుడైన మిషనరీ, మార్మికుడు, పునీతుడు, క్రీస్తు సేవకుడు, క్రైస్తవ రచయిత... అయితే, పౌలు జీవితమును తెలుసుకోవడం ఎలా? ఆయన జీవిత సమాచారమును తెలుసుకొనుటకు మనకున్న ముఖ్యమైన ఆధారాలు ఏమిటి?

పౌలును గూర్చి తెలుసుకొనుటకు మనకున్న ముఖ్యమైన ఆధారాలు రెండు: వాటిని ప్రధమ ఆధారాలు, ద్వితీయ ఆధారాలుగా చెప్పుకొనవచ్చు.

ప్రధమ ఆధారాలు:
సహజముగానే, పౌలుగారి లేఖలే ప్రధమ ఆధారాలు - గలతీ. 1:15-23, 2:1-14, ఫిలిప్పీ. 3:5-6, 4:16, 1 కొరి. 7:7, 16:5-8, 2 కొరి. 2:9-13, 11:32-33, రోమీ. 11:1, 15:22-28. 

ద్వితీయ ఆధారాలు:
అ.కా.
7:58-8:3, 9:1-30, 11:25-30, 13-28 అధ్యాయాలు, పౌలుగారి కార్యాలు, 1, 2 క్లెమెంటుగారి లేఖలు, చరిత్ర కారుడు యుసేబియుస్‌ (క్రీ.శ. 264-324), పునీత జెరోము.

పౌలు లేఖలు నూతన నిబంధనములోనే మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథాలు అగుటచే ఆయన గూర్చి, ఆయన సువార్త ప్రచారం గురించి ఈ ఆధారాలద్వారా తెలుసుకోవచ్చు! అయితే పౌలు లేఖలనుండి పూర్తి సమాచారం మనకు లభ్యం కాదు, ఎందుకన, పౌలు తన లేఖలను ఎప్పుడుకూడా తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ప్రధానంగా చేసుకొని తన ఆత్మకథను వ్రాయలేదు. కనుక, మనం ద్వితీయ ఆధారాలపై ఆధారపడవసి ఉన్నది.

No comments:

Post a Comment