యెరూషలేము సమావేశము

 యెరూషలేము సమావేశము

బహుశా, యెరూషలేము సమావేశము, మొదటి ప్రేషిత ప్రయాణం తరువాత, క్రీ.శ. 49లో జరిగి ఉండవచ్చు (చూడుము అ.కా. 15:1-29, గలతీ. 2:1-10). ఈ సమావేశములో, మోషే చట్ట ప్రకారం సున్నతి పొందిననే తప్ప రక్షణ రాదు అన్న వాదనను పౌలు తీవ్రముగా వ్యతిరేకించి (అ.కా. 15:1) రక్షణ కేవలం యేసు క్రీస్తు ద్వారా మాత్రమే అని గట్టిగా వాదించాడు. క్రైస్తవ విశ్వాసమును ఆలింగనం చేసుకొను అన్యులు సున్నతి స్వీకరించాలనే వాదనను కూడా తీవ్రంగా ఖండించాడు.

పేతురు, బర్నబా, పౌలు, యాకోబు వాదనలను వినిన తరువాత, పౌలు వాదనను అంగీకరించి, అన్యక్రైస్తవులు అనుసరించ వలసిన నియమముల గూర్చి వారికి తెలియజేయాలని సమావేశము నిర్ణయించినది. ‘‘విగ్రహములకు అర్పింప బడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింప రాదనియు, జారత్వమునకు దూరముగా ఉండవలెననియు, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు, రక్తమును త్రాగరాదనియు వారికి మనము వ్రాయవలయును’’ (అ.కా. 15:20, 29) అని తీర్మానించిరి.

అపోస్తలులు, పెద్దలు, క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి అన్యులకు సువార్తా ప్రచారం చేయాలని పౌలు, బర్నబాలను ఎన్నుకున్నారు (అ.కా. 15:22, గలతీ. 2:9). యెరూషలేములోని పేదలను ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొన వలెనని పౌలు, బర్నబాలకు ఆదేశము నిచ్చారు (గతీ 2:10). అందుకే పౌలు అనేక సంఘములనుండి పైకమును కూడి యెరూషలేములోని పేదలకు సహాయముగా అందించి యున్నాడు.

No comments:

Post a Comment