10.2. రెండవ ప్రేషిత ప్రయాణం

 10.2. రెండవ ప్రేషిత ప్రయాణం

పౌలు యొక్క రెండవ ప్రేషిత ప్రయాణము గురించి అ.కా. 15:36-18:22లో చూడవచ్చు. ఇది క్రీ.శ. 49/50-52 మధ్యకాలములో జరిగింది. ఈ ప్రయాణములో పౌలు అనుచరులు: సిలాసు, తిమోతి (లిస్త్రా నుండి), లూకా (త్రోయ నుండి). ప్రదేశాలు: అంతియోకియా (ప్రారంభం), సిరియా, సిలీషియా, దెర్బె, లిస్త్రా, ఇకోనియా, గలితీయ-ఫ్రిగియా ప్రాంతములు, త్రోయ, సమోత్రా, నెయాపొలి, ఫిలిప్పీ, ఆంఫిపోలి, అపొల్లోనియా, తెస్సలోనిక, బెరయా, ఏతెన్సు, కొరింతు (18 మాసాలు), కెంక్రేయా, ఎఫెసు, కైసరియా, యెరూషలేము, అంతియోకియా (ముగింపు).

మార్కు (యోహాను) విషయములో బర్నబా నుండి వేరయిన పౌలు సిలాసును (సిల్వానుసు) తీసుకొని ఆసియా మైనరులోని సిరియా మరియు సిలీషియా మీదుగా వెళ్ళుచు అక్కడ తాను స్థాపించిన క్రీస్తు సంఘములను బలపరచెను (అ.కా. 15:36-41).

పౌలు దెర్బె, లిస్త్రాలకు ప్రయాణము చేసెను. లిస్త్రానుండి పౌలు తిమోతిని తనతో తీసుకొని అక్కడనుండి ఫ్రిగియా, గలతియా ప్రాంతముల మీదుగా పయనించి, సువార్తను బోధించి క్రీస్తు సంఘములను నిర్మించెను. బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నింపగా యేసు ఆత్మ వారికి అనుమతి ఈయలేదు. అందుకు వారు మిసియా మీదుగా పయనించి త్రోయకు వెళ్ళిరి. త్రోయలో లూకా పౌలుతో జత కలిసెను (అ.కా. 16:1-8).

త్రోయలో ఉండగా పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుష్యుడు ఒకడు కనిపించి, మాసిడోనియాకు వచ్చి, మాకు సహాయ పడుడు అని బ్రతిమాలుకొనెను. దర్శనము కలిగిన వెంటనే, త్రోయలో ఓడనెక్కి సమోత్రాకు పయనించెను. మరునాడు నెయాపొలికి వెళ్ళెను. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలములోని, రోమీయులకు నివాస స్థావరమైన ఫిలిప్పీకి వెళ్ళిరి. అచట “సువార్తను ప్రకటించితిరి” (1 తెస్స. 2:2). అయితే, యూదులు తీవ్రమైన వ్యతిరేకతను సృష్టింపడము వలన, బెత్తముతో క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చేరలో వేసిరి. విడుదల చేసిన తరువాత పౌలు, సిలాసులు అచట నుండి వెళ్ళిపోయిరి (అ.కా. 16:9-40).

వారు ఆంఫిపోలి, అపొల్లోనియాల మీదుగా పయనించి, తెస్సలోనికకు వచ్చిరి. పౌలు తన అలవాటు చొప్పున ప్రార్ధనా మందిరమునకు వెళ్లి బోధించెను. యూదులు కొందరు విశ్వసించి పౌలు, సిలాసులతో చేరిరి. అలాగే చాలామంది గ్రీసు దేశస్థులు, ప్రముఖులైన స్త్రీలు పలువురు వారి పక్షమున చేరిరి (అ.కా. 17:1-4). అది చూచి యూదులకు కన్నుకుట్టుటచే , వీధులలో తిరుగు దుష్టులను ప్రోగుచేసి నగరమంతట అల్లకల్లోలమున ముంచిరి. అప్పుడు వారు బెరయాకు వెళ్ళిరి. అక్కడ కూడా దేవుని వాక్కును బోధించిరి. తెస్సలోనికలోని యూదులు అచటకు వచ్చి జన సమూహములను రెచ్చ గొట్టి కలవర పరచిరి (అ.కా. 17:5-13).

సిలాసు, తిమోతీలను బెరయాలోనే వదిలి పౌలు ఏతెన్సుకు వెళ్ళెను. అచట ప్రార్ధనా మందిరములో మాత్రమేగాక, సంత వీధులలో కూడా బోధించెను. ఎపిక్యూరీయులలోను, స్తోయికులలోను తత్వవేత్తలు కొందరు పౌలు బోధనలను వినిరి. వారు పౌలును అరెయోపాగసు అను సభకు తీసుకొని వచ్చిరి. ఆ సభ యెదుట పౌలు బోధించెను. మృతుల పునరుత్థానమును గురించి విన్నప్పుడు కొందరు పౌలును ఎగతాళి చేసిరి. కొందరు అతనిని విశ్వసించిరి (అ.కా. 17:14-34).

తరువాత పౌలు ఏతెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు అక్విలా, ప్రిసిల్లాతో నివసించెను. వారు పౌలు ప్రేషిత కార్యములో భాగస్తులైరి. విశ్రాంతి దినమున ప్రార్ధనా మందిరములో బోధించెను. పౌలు అచట పదునెనిమిది మాసములు ఉండెను. చాలమంది దేవుని వాక్యమును విని విశ్వసించెను. పౌలు అంతియోకియాకు తిరుగు ప్రయాణములో కెంక్రేయ, ఎఫెసు, కైసరియా, యెరూషలేము సందర్శించెను (అ.కా. 18:1-22).

No comments:

Post a Comment