10.1. మొదటి ప్రేషిత ప్రయాణం

 10.1. మొదటి ప్రేషిత ప్రయాణం

పౌలు యొక్క మొదటి ప్రేషిత ప్రయాణము గురించి అ.కా. 13:1-14:28లో చూడవచ్చు. ఇది క్రీ.శ. 46-48 మధ్యకాలములో జరిగింది. ఈ ప్రయాణంలో పౌలు అనుచరులు: బర్నబాసు, మార్కు అను మారుపేరుగల యోహాను. ప్రదేశాలు: అంతియోకియా (ప్రారంభం), సెలూసియా, సైప్రసులోని సలామిసు, పాఫోసు, పంపీలియాలోని పెర్గా, పిసీదియా యందలి అంతియోకియా, ఇకోనియా, లికోనియాలోని లిస్త్రా, దెర్బె, పంఫీలియా, అతాలియా మరియు అంతియోకియా (ముగింపు).

పౌలు మరియు బర్నబాసు యూదులకు మరియు అన్యులకు సువార్తను ప్రకటించిరి. మార్కు అను మారుపేరుగల యోహానును వారి వెంట తీసుకొని మొదటగా సైప్రసులో వేదప్రచారము చేసిరి. సలామిసు యూదుల ప్రార్ధనా మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. పాఫోసులో దీవిని పాలించు సెర్జియ పౌలు బోధనను విని ప్రభువును విశ్వసించెను (అ.కా. 13:4-12).

తరువాత మధ్య ఆసియా మైనరు దక్షిణ తీరములోని పంపీలియాలోని పెర్గాకు వెళ్ళిరి. అక్కడనుండి యోహాను (మార్కు) వారిని విడచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుట వలన పౌలు నిరాశ చెందెను. పౌలు మరియు బర్నబాసు పెర్గా నుండి పిసీదియా యందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ ఒక విశ్రాంతి దినమున ప్రార్ధనా మందిరములోనికి వెళ్లి యూదులకు బోధించి, వారితో సంభాషించి, దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహంచిరి (అ.కా. 13:14-43).

మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. పౌలు బోధనను విన్న అన్యులు ఎంతో సంతోషించి, దేవుని వాక్కును ప్రస్తుతించిరి మరియు విశ్వాసులైరి. కాని యూదులు పౌలునకు, బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమి వేసిరి. వారు అక్కడనుండి సంతోషముతోను, పవిత్రాత్మతోను నిండి ఇకోనియాకి వెళ్ళిరి (అ.కా. 13:44-52).

ఇకోనియాలో యూదుల ప్రార్ధనా మందిరములో ప్రవేశించి బోధించినందున ఎందరో యూదులు, గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. విశ్వసింపని యూదులు అపోస్తలులకు విరుద్ధముగా అన్యులను పురికొల్పి వారి మనస్సులను మార్చివేసిరి. నగరములోని జనులు కొందరు యూదుల పక్షమున, కొందరు అపోస్తలుల పక్షమున చేరి రెండు వర్గములుగా చీలి పోయిరి. అపోస్తలులను బాధించి రాళ్ళతో కొట్టుటకు ప్రయత్నించిరి. ఈ విషయమును తెలుసుకొని లికోనియాలో నున్న లిస్త్రా, దెర్బెకు వెళ్లి సువార్తను బోధించిరి (అ.కా. 14:1-7).

లిస్త్రాలో కుంటివాడిని పౌలు స్వస్థపరచెను. అది చూసి జనసమూహము బలిని అర్పింప తలంచెను. కాని, ఆ జనసమూహములను తమకు బలి నర్పించు యత్నము నుండి అతి కష్టము మీద మరల్పగలిగిరి. కాని అంతియోకియా మరియు ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్ళతో కొట్టి అతడు మరణించి యుండెడని భావించి, పట్టణము బయటకు ఈడ్చివేసిరి. మరునాడు అతడు బర్నబాతో దెర్బెకు ప్రయాణమై పోయెను (అ.కా. 14:8-20).

దెర్బెలో సువార్తను బోధించి, అనేకులను తమ శిష్యులుగా చేసికొనిరి. తిరిగి లిస్త్రా, ఇకోనియా, అంతియోకియా వెళ్లి, అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసము నందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. ప్రతీ క్రీస్తు సంఘము నందు పెద్దలను నియమించిరి. (అ.కా. 14:21-23).

పిసీదియా భూభాగము మీదుగా పోవుచు వారు పంఫీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడనుండి అంతియోకియాకి తిరిగి వచ్చిరి (అ.కా. 14:24-28).

మొదటి ప్రేషిత ప్రయాణం అనంతరం పౌలు, బర్నబాలు అంతియోకియాలో ఉండిరి. యూదయా నుండి కొందరు అంతియోకియాకు వచ్చి, “మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు” అని బోధింప సాగిరి. ఈ విషయమై పౌలు, బర్నబా, మరికొందరు యెరూషలేమునకు వెళ్లి అపోస్తలులతోను, పెద్దలతోను మాట్లాడవలెనని నిశ్చయించిరి. అన్యులకు ‘సున్నతి’ అవసరము లేదని నిశ్చయించిరి (యెరూషలేము సమావేశము, చదువుము. అ.కా. 15వ అధ్యాయము).  

No comments:

Post a Comment