నూతన నిబంధనము – రచన

 నూతన నిబంధనము – రచన

నూతన నిబంధన గ్రంథాల ఆవిష్కరణకు లేదా రచనకు ప్రాముఖ్యమైన కారణము – క్రీస్తు పాస్కా పరమ రహస్యము మరియు క్రీస్తు సంఘ ఆవిర్భావము (నూతన ఇస్రాయేలు, శ్రీసభ).

క్రీస్తు పాస్కా పరమ రహస్యము

క్రీస్తు పాస్కా పరమ రహస్యము అనగా క్రీస్తు మనుష్యావతారం, ప్రేషితకార్యం, శ్రమలు, మరణము, పునరుత్థానము. ఈ పాస్కా పరమ రహస్యము ద్వారా క్రీస్తు పాపము అనే బానిసత్వము నుండి మానవాళిని రక్షించాడు. మానవాళిని స్వతంత్రమగు క్రొత్త జీవితములోనికి నడిపించాడు. ఈ స్వతంత్రము వలన మనము దేవున్ని ‘అబ్బా! తండ్రీ!’ అని పిలచుచున్నాము.

“కాలము పరిపక్వ మయినపుడు దేవుడు తన కుమారుని పంపెను.
ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను.
మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విముక్తులను చేసెను.
మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశ పెట్టెను.
ఆ ఆత్మ ‘అబ్బా! తండ్రీ!’ అని పిలచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు.
నీవు ఆయన పుత్రుడవు కనుక, వారసుడవు కూడ.” (గలతీ. 4:4-7)

ఇంకో మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తునందు, యేసు క్రీస్తుద్వారా, పాపము అనే బానిసత్వము నుండి మానవాళి దాటి, దేవుని ప్రేమలో నూతన జీవితమును పొందియున్నది. ఈవిధముగా యేసు నూతన పాస్కాగా, నూతన నిబంధనముగా మూర్తీభవించి యున్నాడు. యేసు రక్తములో, నూతన నిబంధనము ఆమోదించబడినది, నూతన ఇస్రాయేలు ఆవిర్భవించినది.

క్రీస్తు సంఘ ఆవిర్భావము

పెంతకోస్తు పండుగ రోజున ఉత్థాన క్రీస్తు పవిత్రాత్మతో శిష్యులను నింపెను. పవిత్రాత్మ శక్తిని పొందగా, వారి విశ్వాసం బలపడినది, వారి ఆత్మలు బలపడినవి. క్రీస్తు ఉత్థానము గురించి ప్రకటించడానికి వారు శక్తిని, ధైర్యమును పొందియున్నారు. దీనిద్వారా, అనేకమంది క్రీస్తునందు విశ్వసించి క్రీస్తు సంఘములో చేరిరి. విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. తద్వారా క్రీస్తు సంఘము ఆవిర్భవించినది (అ.కా. 2:1-47).

యెరూషలేము, అంతియోకియా, కొరింతు, ఎఫెసు, గలతీయ, రోము మొదలగు ప్రదేశాలలో క్రైస్తవ సంఘాలు ఏర్పడినవి. ఈ సంఘాలు తమ క్రైస్తవ జీవితాన్ని ఎంతో వీరోచితముగా, ఉత్సాహముగా జీవించాయి. వారు ప్రతి రోజు కూటముగా దేవాలయములో కలిసి కొనుచు, తమ ఇండ్లలో అందరు కలిసి రొట్టెను విరచుచు (ప్రభువు భోజనము) సంతోషము, వినయముగల హృదయములతో భుజించుచు, దేవుని స్తుతించుచు ప్రజల కందరకును ప్రీతిపాత్రులైరి. ప్రభువు భోజన సమయములో, పాస్కా పరమ రహస్యముల గురించి, ప్రభువు బహిరంగ జీవితములోని సంఘటనలను, అద్భుతాలను, ఉపమానములను, బోధనలను, ఉపదేశములను వివరించేవారు. కాలక్రమేణా, వీటన్నింటిని, చిన్నచిన్న సేకరణలుగా వ్రాయడం జరిగింది.

అపోస్తోలిక బోధనలు

అపోస్తోలిక / శిష్యుల బోధనల (గ్రీకులో కెరిగ్మ) ద్వారా అనేకమంది క్రీస్తునందు విశ్వాసములోనికి నడిపింపబడి, క్రీస్తు పేరిట సంఘాలుగా ఏర్పడి యున్నారు. ఈ విధముగా, అన్యులకు మొదటిగా సువార్త ప్రకటింప బడినది. అపోస్తలులు ఏమి బోధించారు? వారి బోధనల సారాంశం ఏమిటి? మొదటిగా వారు క్రీస్తు పాస్క పరమ రహస్యమైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానము, ఉత్థాన క్రీస్తు దర్శనాలను ప్రకటించారు. సిలువలో కొట్టబడిన క్రీస్తు మృతులలోనుండి లేపబడినాడని బోధించారు. అలాగే, ప్రభువు బహిరంగ జీవితములోని సంఘటనలను, అద్భుతాలను, ఉపమానములను, బోధనలను, ఉపదేశములను బోధించారు.

నూతన నిబంధనములో మొదటగా వ్రాయబడిన గ్రంథాలు పౌలుగారి లేఖలు. కొన్నిసార్లు పౌలుగారు కూడా అపోస్తలుల బోధనలను (కెరిగ్మ) ప్రస్తావించారు (1 కొరి. 15:1-5; ఫిలిప్పీ. 2:6-11; 1 తెస్స. 1:9-10). అపోస్తలుల కార్యములులో పేతురు, పౌలుల ‘మిషనరీ ప్రసంగాలను’ చూస్తున్నాము. వీటి సారాంశం అపోస్తలుల బోధనల (కెరిగ్మ) నుండి సంగ్రహించినట్లుగా స్పష్టమగుచున్నది.

నూతన నిబంధన రచనకు కారణాలు

క్రైస్తవు జీవిత ఆరంభములో యూదుల పవిత్ర గ్రంథము తప్ప (అప్పటికి ఇంకా నూతన నిబంధనము అని పిలువబడ లేదు) వారికి వేరే గ్రంథము ఏదీ లేదు. యూద మతం ‘దేవాలయము’ (బాబిలోనియా ప్రవాసమునకు ముందు) మరియు ‘ధర్మశాస్త్రము’పై (బాబిలోనియా ప్రవాసమునకు తరువాత) కేంద్రీకృతమైయున్న మతము. కాని, క్రైస్తవ మార్గం క్రీస్తు అను వ్యక్తిపై కేంద్రీకృతమై యున్నది. దేవుని రాజ్యమును గురించి బోధించమని అపోస్తలులు నియమించబడినారు. క్రీస్తునకు విశ్వాసులకు మధ్యన అపోస్తలులు వారధులుగా ఉన్నారు. వారు భౌగోళికముగా, కాలక్రమాను సారముగా అనాధి విశ్వాసులకు చేరువలో ఉండుట వలన క్రైస్తవ రచనలు అంతగా అవసరం రాలేదు. అందులకే, క్రీ.శ. 30-50 సంవత్సరముల మధ్యన ఎలాంటి క్రైస్తవ రచనలు లేకపోవడం చూస్తున్నాము.

మిషన్ విస్తరణ: అపోస్తలులు మొదటగా, పాలస్తీనాలోని యూదులకు బోధించారు. పౌలు యూదులకు సువార్తా బోధన మార్గమును సుగమము చేసిన తరువాత, యెరూషలేము సమావేశములో (క్రీ.శ. 50) యూదులకు సువార్తను ప్రకటించడానికి అపోస్తలులు అధికారపూర్వకముగా అనుమతి ఇచ్చిరి. ఆ తరువాత, సుదూర ప్రదేశాలు సువార్తా బోధనా ప్రదేశాలుగా మారాయి. ఆయా ప్రదేశాలలో క్రైస్తవ సంఘాల ఏర్పాటు వలన, అపోస్తలుల నిరంతర ప్రయాణముల వలన, వ్రాతపూర్వకమైన సమాచారాలు తప్పనిసరి అయినది. అపోస్తలుల బోధనలు, సూచనలు లేఖల రూపములో ఆయా క్రైస్తవ సంఘాలకు పంపించడం జరిగింది. మొదటగా వ్రాయబడినవి పౌలుగారి లేఖలే.

క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షులు కనుమరుగవడం: అపోస్తలులు మరియు ఇతర ప్రత్యక్ష సాక్షులు, వివిధ సుదూర ప్రదేశాలకు వెళ్ళిపోవడం వలన లేదా మరణించడం వలన, క్రీస్తు పాస్కా పరమ రహస్యాల జ్ఞాపకాలను, క్రీస్తు బోధనలను, అద్భుత కార్యాలను పదిలపరచుటకు, వాటిని భావితరాల వారికి అందించుటకు గ్రంథ రచన ఎంతగానో ఆవశ్యకమైనది. సువార్తా రచయితలు, అప్పటికే అందుబాటులో నున్న వ్రాతపూర్వకమైన సేకరణల ఆధారముగా, సువార్త గ్రంథాలను వ్రాసి యున్నారు.

‘ప్రభువు రాకడ’ ఆలస్యము: ‘ప్రభువు దినము’ లేదా ‘రెండవ రాకడ’ త్వరగా వచ్చునని, కడరా దినములలో నివసించు చున్నారని అనాధి క్రైస్తవులు విశ్వసించారు (1 తెస్స. 4:15). ఎప్పుడైతే ప్రభువు రెండవ రాకడ (2 కొరి. 4:14) ఆలస్యమవునని గ్రహించారో, క్రీస్తు బోధనలను, కార్యములను భద్రపరచుటకు క్రైస్తవులు ఎక్కువగా ఆసక్తిని చూపారు.

నూతన క్రైస్తవులకు బోధించుటకు: ఎంతోమంది నూతనముగా క్రీస్తును విశ్వసించి, సంఘములో చేరుతున్న సందర్భములో, నూతన క్రైస్తవులకు సత్యోపదేశము చేయుటకు, క్రమ పద్ధతిలో క్రీస్తు పాస్క పరమ రహస్యాలను తెలుయజేయడానికి అప్పటివరకు ఉన్న మౌఖిక సాక్షాలను (oral testimonies) అక్షర రూపములో పెట్టడం ప్రారంభమైనది.

మారిన పరిస్థితులు, కొత్త సమస్యల ఆవిర్భావము: తప్పుడు బోధనలు, శ్రమల పరిస్థితులలో, విశ్వాసాన్ని పటిష్ట పరచుటకు క్రైస్తవ రచనల ఆవిర్భావం ప్రారంభమైనది. నూతన నిబంధనములోని ప్రతీ గ్రంథము ఒకానొక ప్రత్యేక సందర్భమును బట్టి రచించడం జరిగింది.

No comments:

Post a Comment