పూర్వ నిబంధనము - రచన

 పూర్వ నిబంధనము - రచన

బైబులునందు, రక్షణ చరిత్ర అబ్రహాము పిలుపుతో, బహుశా క్రీ.పూ. 19వ శతాబ్దములో ప్రారంభమవుతుంది. అబ్రహాము, ఆయన సంతతివారు దేవుని వాగ్దానాలను పొందియున్నారు. క్రీ.పూ. 13వ శతాబ్దములో మోషే నాయకుడు ఇశ్రాయేలును ఒకప్రజగా నడిపించాడు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చియున్నాడు. ఇది దేవుడు మానవాళికి ఇచ్చిన అరుదైన కానుక. ఈ ధర్మశాస్త్రమునే ‘తోరా’ (బైబులులోని మొదటి ఐదు గ్రంథాలు) అని పిలువబడుచున్నది.

పూర్వ నిబంధనములోని గ్రంథాలను నాలుగు భాగాలుగా విభజించుకొనవచ్చు:

(1). ‘తోరా’ లేదా చట్టము

(2). చారిత్రక గ్రంథాలు

(3). జ్ఞాన గ్రంథాలు

(4). ప్రవక్తల గ్రంథాలు

తోరా’ లేదా ‘పెంటెట్యుక్

 బైబులులోని మొదటి ఐదు గ్రంథాలను హీబ్రూ భాషలో “తోరా” అని పిలుస్తాము. “తోరా” అనగా ‘చట్టం’ (law) లేదా ‘ఉపదేశం’ (instruction) అని అర్ధము. సంప్రదాయం ప్రకారం, ఇది ‘మోషే చట్టము’ లేదా ‘మోషే ధర్మశాస్త్రము’ అని పిలువబడుచున్నది.

బైబులులోని మొదటి ఐదు గ్రంథాలు గ్రీకు భాషలో “పెంటెట్యుక్” అని పిలువబడుచున్నది. “పెంటెట్యుక్” అనే పదం ‘పెంటా’, మరియు ‘ట్యూకోస్’ అను రెండు గ్రీకు పదాలనుండి ఉత్పన్నమైనది. ‘పెంటా’ అనగా ‘ఐదు’ అని, ‘ట్యూకోస్’ అనగా వివిధ అర్ధాలు ఉన్నప్పటికిని, చివరిగా ‘గ్రంథము’ అని అర్ధము. అందువలన, “పెంటెట్యుక్” అనగా ‘ఐదు గ్రంథాలు’ అని అర్ధము.

మొదటి ఐదు గ్రంథాలు: (1). ఆది కాండము (2). నిర్గమ కాండము (3). లేవీయ కాండము (4). సంఖ్యా కాండము (5). ద్వితీయోపదేశ కాండము.

దీనిలోనున్న చట్టాలు, నియమాలు, ఆజ్ఞలు యూదుల జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ, వారి జీవితానికి కేంద్ర బిందువులయ్యాయి. మోషే వీటి గ్రంథకర్తయని సంప్రదాయము తెలియజేస్తుంది. మోషే రచయితయని చెప్పడానికిగల ఆధారాలను బైబులులోనే చూడవచ్చు: నిర్గమ. 17:14; 24:4; 34:4,27-28; ద్వితీయ. 31:9,24; ఎజ్రా. 3:2; 2 రా.ది.చ. 25:4. ఈ సంప్రదాయాన్ని యేసు కూడా మార్కు. 10:2-5లో ప్రస్తావించారు. యేసు ఈ ఐదు గ్రంథాలను ‘మోషే గ్రంథము’ అని మార్కు. 12:26లో సంబోధించి యున్నాడు.

మోషే గ్రంథకర్తయను సంప్రదాయం చాలా శతాబ్దాలు కొనసాగినను, నేటి బైబులు పండితులు, ఈ గ్రంథాలు క్రీ.పూ. 6-5 శతాబ్దాలలో సంపూర్ణ రూపకల్పన చేయడం జరిగిందని తెలియజేయు చున్నారు. మోషే గ్రంథకర్త కాదని నేటి బైబులు పండితులు చెప్పే కొన్ని వాదనలు ఏమనగా: (1). ఎన్నో కాలజ్ఞాన దోషములు, విభేదాలు ఉన్నాయి. (2). ఆది. 36:31-39లో ఎదోము రాజుల పేర్ల జాబితాను చూస్తున్నాము. వాస్తవానికి వీరు మోషే కాలము తరువాత జీవించి యున్నారు (3). ద్వితీయ. 34:1-8లో మోషే మరణము గురించి చదువుచున్నాము. (4). మోషే కాలమైన క్రీ.పూ. 13వ శతాబ్దములో ఈ గ్రంథాలు వ్రాయబడలేదు. చాలా శతాబ్దాల తరువాత వ్రాయబడినవి. (5). ఆది. 12:6, 13:7లలోని “ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించు చుండిరి” అను వాక్యము మోషే తరువాత కాలములో వ్రాయబడినది అనుటకు సాక్ష్యముగా ఉన్నది. (6). సంఖ్యా. 12:3లో “భూమిమీద సంచరించు నరులందరిలోను మోషే మహా వినయవంతుడు” అను వాక్యము మోషే రచయిత కాదని ధృవీకరిస్తున్నది.

మోషే గ్రంథరచయిత కానప్పుడు, మరి తోరా / పెంటెట్యుక్ రచయిత ఎవరు? తోరాకు ఒక రచయిత గాక ఒక సంపాదకీయ వర్గం ఉన్నట్లుగా అర్ధమగుచున్నది. దీనిని మనం ‘సంప్రదాయం’ లేదా ‘మూలము’ అని పిలువవచ్చు. తోరాలోని గ్రంథాలు నాలుగు సంప్రదాయాల సమూహం అని చెప్పవచ్చు. ఈ నాలుగింటిని నాలుగు రకాల పేర్లతో గుర్తించడం జరిగింది: యాహ్విస్తిక్ – Yahwistic (J), ఎలోహిస్తిక్ – Elohist (E), డ్యూటెరానొమిస్ట్ –Deuteronomist (D), ప్రీస్ట్లీ- Priestly (P).

చారిత్రక గ్రంథాలు

చారిత్రక గ్రంథాలు, యెహోషువాతో క్రీ.పూ. 13వ శతాబ్దములో ప్రారంభమై, క్రీ.పూ. మొదటి శతాబ్దపు ఆరంభములో వ్రాయబడిన మక్కబీయులు రెండు గ్రంథాలతో ముగుస్తుంది.

బైబులులో చారిత్రక గ్రంథాలు: (1). యెహోషువా (2). న్యాయాధిపతులు (3). రూతు (4). సమూవేలు మొదటి గ్రంథము (5). సమూవేలు రెండవ గ్రంథము (6). రాజులు మొదటి గ్రంథము (7) రాజులు రెండవ గ్రంథము (8) రాజుల దినచర్య మొదటి గ్రంథము (9). రాజుల దినచర్య రెండవ గ్రంథము (10). ఎజ్రా (11). నెహెమ్యా (12). తోబీతు (13). యూదితు (14). ఎస్తేరు (15) మక్కబీయులు మొదటి గ్రంథము (16). మక్కబీయులు రెండవ గ్రంథము.

జ్ఞాన గ్రంథాలు

సొలోమోను రాజు ఆధ్వర్యములో క్రీ.పూ. 10వ శతాబ్దములో సామెతలను సంగ్రహిచుట వలన జ్ఞాన గ్రంథాల కూర్పు ప్రారంభమైనది. సామెతల గ్రంథము యొక్క కూర్పు క్రీ.పూ. 5వ శతాబ్దములో పూర్తి కావడం జరిగింది. ఈ కాలములో వెలుగులోనికి వచ్చిన యోబు గ్రంథము వలన జ్ఞాన గ్రంథాల సాహిత్యానికి స్వర్ణ యుగమని పేరిడినది. జ్ఞాన గ్రంథాల తుది కూర్పు క్రీ.పూ. 1వ శతాబ్దములో ముగిసినది.

బైబులులో జ్ఞాన గ్రంథాలు: (1). యోబు గ్రంథము (2). కీర్తనల గ్రంథము (3). సామెతల గ్రంథము (4). ఉపదేశకుడు (5). పరమగీతము (6). సొలోమోను జ్ఞాన గ్రంథము (7) సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము.

ప్రవక్తల గ్రంథాలు

ప్రవక్తల సాహిత్యం ఆమోసు, హోషేయలతో క్రీ.పూ. 8వ శతాబ్దములో ప్రారంభమై, జెకర్యా, యోవేలు, యోనాలతో క్రీ.పూ. 4వ శతాబ్దములో ముగుస్తున్నది. ‘ప్రవక్త’ అను పదానికి హీబ్రూలో ‘నబి’ అందురు. ప్రవక్త అనగా ‘దేవుని వాక్కును ప్రకటించేవాడు’, ‘దేవునిచే పిలువబడి, పంపబడినవాడు’, ‘ఆత్మచే నింపబడినవాడు’, ‘దైవ సేవకుడు’, ‘మధ్యవర్తి’, ‘దర్శనకారి’.

బైబులులో ప్రవక్తల గ్రంథాలు: (1). యెషయా (2). యిర్మియా (3). విలాప గీతాలు (4). బారూకు (5). యెహెజ్కేలు (6). దానియేలు (7). హోషేయ (8). యోవేలు (9). ఆమోసు (10). ఓబద్యా (11). యోనా (12). మీకా (13). నహుము (14). హబక్కూకు (15). జెఫన్యా (16). హగ్గయి (17). జెకర్యా (18). మలాకీ.

No comments:

Post a Comment