9. పౌలు ప్రేషితత్వములో శ్రమలు
“అతడు నా నామము నిమిత్తము ఎన్ని
బాధలు పడవలయునో నేను అతనికి చూపించెదను” (అ.కా. 9:16) అని ప్రభువే స్వయముగా
దర్శనములో పౌలు గురించి అననియాకు తెలియ జేసెను. దీనినిబట్టి, పౌలు
జీవితములో “సిలువ” (శ్రమలు) యొక్క
ప్రాధాన్యత అర్ధమగుచున్నది. పౌలు పరివర్తన నుండి రోము నగరములో వేదసాక్షి మరణము
వరకు శ్రమలు ఆయన జీవితములో భాగమయ్యెను. ఈ వాస్తవానికి అపోస్తలుల కార్యములు మరియు
పౌలుగారి లేఖలే సాక్ష్యాలు.
సువార్తను గొప్ప శ్రమల మధ్యన
పౌలు బోధించాడు (కొలొస్సీ. 1:24). ఆసియా మండలములో “శక్తికి మించిన కష్టములకు గురియైతిమి.
అందుచేత మేము జీవితముపై ఆశ వదులు కొంటిమి” (2 కొరి. 1:8) అని పౌలు తనకు ఎదురైన
కష్టముల గురించి తెలియజేయు చున్నాడు. 2 కొరి. 11:24-28లో క్రీస్తు కొరకు తాను
పొందిన శ్రమల గురించి స్పష్టముగా తెలియ జేశాడు: కొరడా దెబ్బలు, బెత్తములతో
దెబ్బలు, రాళ్ళతో
కొట్టబడుట, ఓడ
పగిలిన ప్రమాదం, వరద
బాధలు, దొంగల
వలన ఆపదలు, యూదులు, అన్యులు
కలిగించిన అపాయములు, నిద్రలేకపోవడం, ఆకలిదప్పులు, సంఘములను
గూర్చిన వేదన... మొ.వి.
శారీరక బాధలే కాకుండా, పౌలు
మనోవేదనను కూడా పొందాడు (చదువుము. 2 కొరి. 12:7-8). “మాకు ఎట్టి
విశ్రాంతియును లేకపోయెను. అన్ని చోటుల ఇబ్బందులు, అన్యులతో కలహములు, మా హృదయములందు
భయములు ఉండెను” (2
కొరి. 7:5) అని పౌలు మాటలలోనే వినవచ్చు.
పౌలు ఈ శ్రమలను ఎలా
స్వీకరించాడు? క్రీస్తు
యొక్క సిలువ శ్రమలలో పాలుపంచు కుంటున్నట్లుగా భావించాడు: “మీ కొరకు నేను
పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు
పడిన బాధలలో కొదువగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను” (కొలొస్సీ.
1:24). “క్రీస్తు
శ్రమలలో పాల్గొనవలెననియు,
మృత్యువు నందు ఆయనను పోలియుండ వలయుననియు మాత్రమే నా కోరిక” (ఫిలిప్పీ.
3:10).
అన్ని కష్టములను పొందిన పౌలు, “మేము
అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొను చున్నాము. కాని, అణచివేయబడ లేదు. మేము హింసింపబడినను
దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను, తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింప లేదు” (2 కొరి.
4:8-9) అని చెప్పగలిగాడు.
జీవించడమైనా, మరణించడమైనా
క్రీస్తు కొరకే అని పౌలు భావించాడు. “నాకు జీవించడం క్రీస్తు, మరణించడం లాభం” (ఫిలిప్పీ.
1:21) అని పౌలు తన జీవితాన్వేషణను క్లుప్తంగా చెప్పాడు. క్రీస్తు తన జీవితానికి
కేంద్రబిందువు అయ్యాడు. మన శ్రమలన్ని క్రీస్తు కొరకే, మన శ్రమలలో
క్రీస్తు మరణాన్ని మన శరీరాలలో మోయుచున్నాము. క్రీస్తుతో ఐఖ్యమగు మన శ్రమలు
రక్షణకు మరియు జీవితానికి సాధనాలు అగును. అందుకే, పౌలు క్రీస్తు కొరకు శ్రమలను పొందడం, గొప్ప
అవకాశముగా, అదృష్టముగా
భావించాడు. అందుకే, “క్రీస్తు
నందు విశ్వాసము కలిగియుండుట మాత్రమేకాక, ఆయన కొరకై శ్రమలను అనుభవించుటకు, మీకు విశేషమైన
అవకాశముగా ప్రసాదింప బడినది” (ఫిలిప్పీ. 1:29) అని ఫిలిప్పీయులకు తెలిపి యున్నాడు.
క్రీస్తు యేసునందు ప్రదర్శింప
బడిన దైవ ప్రేమ లేనిచో క్రైస్తవ శ్రమలు అర్ధరహితం. మనలను ప్రేమించే దేవునికి
స్పందించడములో మన శ్రమలను మనము భరించగలుగు చున్నాము. అందుకు పౌలు, “క్రీస్తుతో
పాటు నేనును సిలువ వేయబడితిని. కనుక, నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన
దేవుని పుత్రుని యందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును
గడుపుచున్నాను” (గలతీ.
2:19-20) అని అన్నాడు. ఈ నమ్మకము వలననే ఎఫెసీయులకు, “క్రీస్తు మనలను ప్రేమించునటుల, దేవుని
సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మనకొరకై తన ప్రాణములను సమర్పించినటుల మీరును
ప్రేమతో నడుచుకొనుడు”
(ఎఫేసీ. 5:2) అని బోధించాడు.
No comments:
Post a Comment