8. అన్యజనులకు అపోస్తలుడు

 8. అన్యజనులకు అపోస్తలుడు

“అన్యులుఅనగా బైబులులో యిస్రాయేలు ప్రజలు కానివారులేదా యూదేతరులు’. సాధారణ భాషలో, అన్యులు అనగా నిజమైన విశ్వాసములోనికి మారనటువంటి వారు’ (మత్త. 10:18, అ.కా. 21:21, 26:17). యూదులు మానవాళిని రెండు వర్గాలుగా చూసారు: యూదులు మరియు యూదేతరులు లేదా సున్నతి పొందినవారు మరియు సున్నతి పొందనివారు. వారు అన్యులను అనైతిక ప్రజలుగా పరిగణించారు. వారిని విగ్రహారాధకులు అని, భూతాలను ఆరాధించేవారని పిలిచేవారు. వారు దేవుని ఆగ్రహమునకు” (రోమీ. 1:18) అర్హులని భావించారు. యావే చేత ఎన్నుకొనబడిన జాతిగా యూదులు, అన్యులను దేవుడు తృణీకరించినట్లుగా వారిపట్ల వ్యవహరించారు. ఇలాంటి ప్రజల యొద్దకు దేవుడు పౌలును అపోస్తలునిగా పంపాడు.

“అపోస్తలుడుఅనగా ప్రాథమికముగా పంపబడినవాడుఅని అర్ధం. వార్తాహరుడు, ప్రతినిధి అనే అర్ధాలు కూడా ఉన్నాయి. సువార్తలలో అపోస్తలుడుసాధారణముగా క్రీస్తు ఎన్నుకున్న పన్నెండ్రు శిష్యులకు వర్తిస్తుంది (మత్త. 10:2-4, మార్కు. 3:16-19, లూకా. 6:13-16, అ.కా. 1:13). ఈ పన్నెండ్రు మంది శిష్యులు నూతన యిస్రాయేలుఅయిన శ్రీసభకు పునాది వేసారు. పౌలు భావన ప్రకారం, తన ఉత్థానమునకు సాక్ష్యులుగా క్రీస్తు చేత పంపబడిన ప్రతీ క్రైస్తవుడు అపోస్తలుడే!

దేవుడు తనను ప్రత్యేకమైన ప్రేషిత కార్యమునకు పిలిచాడని పౌలు దృఢముగా నమ్మాడు. అందుకే, తన లేఖలలో అనేక సార్లు తననుతాను అన్యజనులకు అపోస్తలుడుగా చెప్పుకున్నాడు. “అన్యజనులకు నేను అపోస్తలుడనైనంత కాలము నా ప్రేషిత కార్యమును గూర్చి గొప్పలు చెప్పు కొందును” (రోమీ. 11:13). తన పిలుపు గురించి, తన ప్రేషితోధ్యము గురించి పౌలు చక్కగా చెప్పాడు, “నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించుటకుగాను, దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్ష పరచెను” (గలతీ. 1:15-16). “ప్రత్యేకించ బడటంఅనగా ఒక వ్యక్తిని సంఘమునుండి ఎన్నుకొని దేవుని సేవకు (ప్రజా సేవకు) అంకితం చేయడం’.

పౌలు తన పిలుపును, ప్రేషిత బాధ్యతను స్వయముగా దేవుని నుండి పొందినట్లుగా వక్కాణించి చెప్పాడు. అందుకే పౌలు, “నేను వెంటనే సలహా కొరకు ఏ మనుష్యుని వద్దకును పోలేదు. నా కంటె ముందు అపోస్తలులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు” (గలతీ. 1:16-17) అని అన్నాడు. పౌలు ప్రకారం, “పిలువ బడుటమరియు పంప బడుటఏకకాలములో జరుగును (రోమీ. 1:1). అపోస్తలుడు పిలువబడునది, పంపబడుటకే అని అర్ధమగుచున్నది.

ఈ పిలుపును పౌలు దేవుని ఉచిత వరముగా స్వీకరించాడు. నేను ప్రచారకునిగాను, అపోస్తలునిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింప బడితిని” (1 తిమో. 2:7).

దమస్కు నగర మార్గమున పౌలు పొందిన క్రీస్తానుభవం ద్వారా, క్రీస్తు పరమ రహస్యాలను, క్రీస్తు మరణ, ఉత్థాన రక్షణ విలువలను గుర్తించాడు (గలతీ 1:16, 3:13, 1 కొరి. 1:22-25). ఇకనుండి తను ఒక నూతన పాత్రను పోషించవలసి యున్నదని, అదియే అన్యజనులకు అపోస్తులుడుఅని పౌలు తెలుసుకున్నాడు (రోమీ. 11:13).

ఇదే విషయాన్ని పౌలు యెరూషలేములో సాక్ష్యమిచ్చి యున్నాడు, “అందుకు ఆయన నీవు పొమ్ము. చాల దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నానుఅని ఆదేశించెను” (అ.కా. 22:21). ప్రభువు అననియాతో పౌలు గురించి ఇలా తెలిపెను, “నీవు వెళ్ళుము. ఏలయన, అన్యులకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని” (అ.కా. 9:15).

పౌలు తాను పొందిన ఈ దైవపిలుపుకు, దైవ ప్రేషిత కార్యానికి కట్టుబడి యున్నాడు మరియు ఏ విషయములోను రాజీ పడలేదు. అబద్ధపు బోధకులను ధైర్యముగా ఎదుర్కొన్నాడు (గలతీ. 2:4). క్రీ.శ. 49లో జరిగిన యెరూషలేము సమావేశములో తన వాదనలను వినిపించి క్రైస్తవత్వమును యూద మూలాల నుండి స్వతంత్రము చేయుటకు తనవంతు కృషి చేసాడు (అ.కా. 15, గలతీ. 2:1-10).

పౌలు ప్రేషిత కార్యము కేవలము సువార్తను ప్రకటించడం మాత్రమేగాక, దేవునకు -అన్యులకు మధ్యన క్రీస్తు రాయబారిగా, క్రీస్తు దూతగా ఉన్నాడని, సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనికి దేవుడు తనను నియమించాడని తలంచాడు (చదువుము. 2 కొరి. 5:19-20, ఎఫెసీ. 2:11-18). పౌలు క్రీస్తు రాయబారి మాత్రమేగాక, క్రీస్తు అర్చకుడు కూడా. క్రీస్తు యేసు సేవకుడనై అన్యుల కొరకు పని చేయుటకే నేను అనుగ్రహమును పొందితిని. అన్యులు పవిత్రాత్మ ద్వారా దేవునకు అంకితము కావింపబడి, ఆయనకు అంగీకార యోగ్యమైన నైవేద్యము అగుటకై, దేవుని సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగ పని చేయుచున్నాను” (రోమీ. 15:16) అని రోమీయులకు వ్రాసిన పత్రికలో తెలిపి యున్నాడు. మీరు క్రీస్తుకు నాచే ప్రధాన మొనర్ప బడిన నిష్కళంకయగు కన్య వంటివారు” (2 కొరి. 11:2) అని కొరింతీయులకు వ్రాసిన లేఖలో తెలిపి యున్నాడు. అలాగే సువార్తా కృషి యందు తనతో భాగస్తులైన వారికి కృతజ్ఞతలు తెలిపి యున్నాడు (ఫిలిప్పీ. 1:5). వారు ఇచ్చిన కానుకలను సువాసనా భరితమై దేవునకు అర్పింపబడి, ఆయనకు ఆమోదయోగ్యమైన, ప్రీతికరమైన” (ఫిలిప్పీ. 4:18) కానుకలుగా భావించాడు.

ఈవిధముగా పౌలు యూదేతరులకు రక్షణ సువార్తను ప్రకటించుటకు, వారిని క్రీస్తు దరి చేర్చుటకు ఎన్నుకొనబడెను. పౌలు వారికి ఆదర్శమంతుడు, ఎందుకన కేవలం క్రీస్తును బోధించడమే గాక, క్రీస్తును జీవించాడు.

No comments:

Post a Comment