10. పౌలు ప్రేషిత ప్రయాణములు

 10. పౌలు ప్రేషిత ప్రయాణములు

“సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును” (1:16) అన్న పౌలు మాటలు సువార్త బోధనపట్ల, దేవుని ప్రేషిత కార్యము పట్ల తనకున్న దేనికి లొంగని చిత్తశుద్ధి మనకి కనిపిస్తుంది. దమస్కు సంఘటనలో, ఉత్థాన క్రీస్తు పౌలుకు రెండు విషయాలను స్పష్టముగా వెల్లడి చేసాడు: ఒకటి, సుదూర ప్రాంతములకు వెళ్ళవలసి ఉండటం, రెండవది ప్రధానముగా అన్యుల యొద్దకు పంపబడటం (అ.కా. 22:21, 26:16-18). ఉత్థాన క్రీస్తానుభవమును పొందిన పౌలు, “ప్రభువు నామమును అన్యులకు తెలియజేయుటకు సాధనముగా ఎన్నుకొనబడిన” (అ.కా. 9:15) అతని పిలుపు తన ప్రేషితత్వ కార్యానికి, ప్రయాణాలకు ఆయువు పట్టుగా మారినది.

క్రీస్తును ప్రభువుగా అంగీకరించిన పౌలు ఇక ఎన్నటికీ వెనుదిరిగి చూడలేదు. నిండైన ఉత్సాహముతో క్రీస్తు ప్రచారకునిగా ముందుకు సాగిపోయాడు. ప్రాథమికముగా తన అపోస్తలత్వమును ‘సువార్త ప్రకటనగా’ భావించాడు: “క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను కాని జ్ఞానస్నానమును ఒసగుటకు కాదు” (1 కొరి. 1:17). “క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటకు నేను త్రోయను చేరినపుడు...” (2 కొరి. 2:12).

కష్టతరమైన ప్రేషిత ప్రయాణాలకు ‘సువార్త బోధన’ గమ్యమైనది. “క్రీస్తును గూర్చిన సువార్తతో మేము మీ వద్దకు మొదటగా వచ్చితిమి” (2 కొరి. 2:12). “సున్నతి పొందిన వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురునకు అప్పగించినట్లే, సున్నతి పొందని వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు నాకు అప్పగించెను” (గలతీ. 2:7). పౌలు క్రీస్తును గూర్చిన సందేశమును శక్తివంతముగా, ఫలవంతముగా బోధించాడు. తుది ఉత్తర్వులు ఇస్తూ “నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును, ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము” (2 తిమో. 4:2) అని పౌలు తిమోతికి చెప్పియున్నాడు.   

పౌలు ప్రేషిత ప్రయాణముల గూర్చి అపోస్తలుల కార్యములులో చూడవచ్చు. పౌలు విస్తృతముగా యెరూషలేము నుండి రోము నగరము వరకు ప్రయాణిస్తూ సువార్తను బోధిస్తూ ఎన్నో క్రైస్తవ సంఘాలను స్థాపించి యున్నాడు. లోకమంతటిని (“భూదిగంతముల వరకు”) తన సువార్త ప్రేషిత క్షేత్రముగా ఆళింగనం చేసుకున్నాడు.

No comments:

Post a Comment