9. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ - 03

9. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ - 03
9.7. ప్రధానాంశములు
9.7.1. ప్రార్ధన మరియు క్రీస్తునందు నూతన జీవితము (1:3-3:21)
9.7.1.1. ‘ఆశీర్వాదము’ (1:3-14)
9.7.1.2. ‘కృతజ్ఞత’ మరియు ‘ప్రార్ధన’ (1:15-23)
9.7.1.3. ‘క్రీస్తునందు నూతన జీవితము’ (2:1-10)
9.7.1.4. ‘క్రీస్తులో ఐఖ్యము’ (2:11-22)
9.7.1.5. అన్యుల కొరకు పౌలు కృషి (3:1-13)
9.7.2. మంచి ప్రవర్తనకు పిలుపు (4:1-6:20)
9.7.2.1. భిన్నత్వములో ఏకత్వం (4:1-16)
9.7.2.2. క్రైస్తవ మరియు క్రైస్తవేత్తర జీవితము  (4:17-5:20)
9.7.2.3. నైతిక బోధన (5:21-6:9)
9.7.2.3.1. భార్యలు-భర్తలు (5:21-33)
9.7.2.3.2. బిడ్డలు-తల్లిదండ్రులు (6:1-4)
9.7.2.3.3. సేవకులు-యజమానులు (6:5-9)
9.7.2.4. క్రైస్తవ జీవితం-సైతానుతో పోరాటం (6:10-20)

9.7. ప్రధానాంశములు

9.7.1. ప్రార్ధన మరియు క్రీస్తునందు నూతన జీవితము (1:3-3:21)

9.7.1.1. ‘ఆశీర్వాదము’ (1:3-14)

పాత నిబంధన (చూడుము. తోబీ. 13:1 మొ.వి.) నమూనా ఆధారముగా కూర్చబడినది. కొంతమంది పండితుల ప్రకారం, ఇది యూద-క్రైస్తవ ‘దీవెన’ లేదా ‘ఆశీర్వాదము’ (హీబ్రూ భాషలో “బెరఖాహ్”). ఇచ్చట క్రీస్తునందు మనము పొందిన దీవెనలు లేదా ఆశీర్వాదములు గురించి పౌలు తెలియజేయు చున్నాడు. ఈ దీవెన ప్రకారం, “దేవుని ఎదుట మనము పవిత్రులముగను, నిర్దోషులముగను ఉండుటకు లోకసృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తు నందు తన వారిగా ఎన్నుకొనెను” (1:4).

9.7.1.2. ‘కృతజ్ఞత’ మరియు ‘ప్రార్ధన’ (1:15-23)

ఈ ప్రార్ధన (1:17-19) లేఖ యొక్క ఇతివృత్తమయిన ‘సార్వత్రిక శ్రీసభ’ గురించి పరిచయం చేస్తుంది. క్రైస్తవ విశ్వాసులను తన ప్రార్ధనలో స్మరించుకుంటూ, వారికి వివేకమును మరియు దేవున్ని విదిత మొనర్చు ఆత్మను ప్రసాదింప వలసినదిగ, పౌలు అర్ధించు చున్నాడు. వివేకముగల ఆత్మను పొందినప్పుడు, (అ). వారిని చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, (ఆ). దేవుడు తన పరిశుద్ధులకు వాగ్ధానము చేసిన దీవెనలు ఎంత మహత్తర మైనవో, (ఇ). విశ్వాసులగు వారిలో ఉన్న దేవుని శక్తి ఎంత అతీతమైనదో తెలిసికొన గలరు (1:18-19).

తరువాతి భాగములో,  ప్రాథమిక క్రైస్తవ విశ్వాసమును పౌలు జోడించు చున్నాడు: “క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడిప్రక్కన కూర్చుండబెట్టు కొనినపుడు ఆయన ఉపయోగించిన మహా శక్తియే అది. ఉత్థానమైన మరియు మహిమాన్వితుడైన క్రీస్తు సర్వ శక్తులను పరిపాలించును, ఎందుకన, ఇహపర లోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. క్రీస్తు శ్రీసభకు శిరస్సు. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము.”

9.7.1.3. ‘క్రీస్తునందు నూతన జీవితము’ (2:1-10)

“గతమున,” లోకము పోకడను అనుసరించినపుడు, అపరాధముల వలనను, పాపముల వలనను ఆధ్యాత్మికముగా మృతులైతిరి. కాని “ఇప్పుడు” క్రైస్తవులు క్రీస్తునందు నూతన జీవితమును ఆనందించు చున్నారు. రాబోవు కాలములో కూడా క్రీస్తునందు వారు అనంతమైన ‘సంపదల’ను చవిచూచెదరు. గతమున వారు దేవుని ఆగ్రహమునకు గురికాలసిన వారైతిరి. వారి స్వయంకృతం గాక, వారు చేసిన కృషికి ఫలితము గాక, వారి విశ్వాసము ద్వారా రక్షింప బడితిరి. విశ్వాసము దేవుని వరమే.

9.7.1.4. ‘క్రీస్తులో ఐఖ్యము’ (2:11-22)

యూద-క్రైస్తవులు దేవుడు చేసిన వాగ్దానములకు వారసులు. వీరితో ఇప్పుడు అన్య-క్రైస్తవులు కూడా చేరి, క్రీస్తు ద్వారా ఒసగబడిన అనుగ్రహాలను పంచుకొనుచున్నారు.

అన్య-క్రైస్తవులు “ఒకప్పుడు” సున్నతి లేని వారిగా పిలువ బడితిరి. దేవునిచే ఎన్నుకొనబడిన యిస్రాయేలీయులు వారిలోని వారు కారు. దేవుడు తన ప్రజలకొనర్చిన వాగ్దానములపై ఆధారపడిన నిబంధనలతో సంబంధము లేదు. నిరీక్షణగాని, దేవుడుగాని లేకుండ ప్రపంచమున జీవించితిరి. అందువలన, క్రీస్తు నుండి వేరుచేయ బడితిరి. పరదేశీయులై యుండిరి. కాని “ఇప్పుడు” క్రీస్తు యేసు నందు ఏకమగుటతో, దూరముగనున్న వీరు, క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొనిరాబడితిరి.

తద్వారా,

- క్రీస్తు మన సమాధానము అయ్యెను
- ఆయన ఇరువురిని ఏకమొనర్చెను
- వారిని వేరు చేసిన మధ్యగోడను
- విరోధమును తన శరీరముతో ధ్వంసమొనర్చెను
- శాసనములతో, సూత్రములతో కూడిన ధర్మశాస్త్రమును తొలగించెను
- తద్వారా రెండు జాతులను తనతో ఏకమొనర్చెను
- ఒకే నూతన జాతిని సృజింఛి, శాంతి నెలకొల్పెను
- సిలువపై వైరమును రూపు మాపుటద్వారా
-  మరల ఇరువురిని దేవుని దరికి చేర్చెను
- కనుక, ఇరువురు కూడా క్రీస్తు ద్వారా ఒకే ఆత్మ యందు తండ్రి సముఖమునకు చేరగలుగు చున్నారు.

క్రీస్తు “మన సమాధానము” అయ్యెను. యిస్రాయేలు ప్రజల శాంతి (హీబ్రూ భాషలో “షాలోం”) యేసులో పరిపూర్ణమయ్యెను. “రోమను శాంతి”కి (సైనిక శక్తి, బలత్కారము, భయము బెదిరింపుల వలన ప్రేరేపించ బడిన సమాధానము / శాంతి) క్రీస్తు నిజమైన ప్రత్యామ్నాయం అయ్యెను. దీని అర్ధం క్రీస్తు బలిద్వారా దేవునితో మన సమాధానము, శ్రీసభలో యూదులు, అన్యులమధ్య సమాధానము, సమాజములో సమాధానము మరియు ప్రేమగల దేవుడు మానవాళికి ఒసగిన సమాధానము.

2:19-22లో పౌలు అన్యులను సంబోధిస్తున్నాడు: వారిప్పుడు పరదేసులును, పరాయివారును కాదు. వారు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేతను, ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై వారుకూడా నిర్మింప బడితిరి. “భవనము” అయిన క్రైస్తవులు క్రీస్తు నందు “పవిత్ర దేవాలయము”గా పెంపొందును. అన్య-క్రైస్తవులు కూడా క్రీస్తుతో ఏకత్వము వలన అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడు చున్నారు.

9.7.1.5. అన్యుల కొరకు పౌలు కృషి (3:1-13)

పౌలు ‘అన్యులకు అపోస్తలుడు’ మరియు పరమ రహస్యములను విశదపరచును అన్న విషయం ఇచ్చట స్పష్టమగు చున్నది. పౌలు యొక్క అపోస్తోలికత్వము ఉత్థాన క్రీస్తును కలవడములో పాతుకుపోయినది. ఉత్థాన క్రీస్తు పౌలును ఆదేశించి పరమ రహస్యమును తెలియ జేసెను. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుప బడలేదు. కాని, నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులగు అపోస్తలులకును (పౌలు కూడా), ప్రవక్తలకును తెలియ జేసెను.

ఆ పరమ రహస్యము మరియు సువార్తా సారాంశం, క్రైస్తవ సందేశముగా ఈ లేఖలో వివరించ బడినది: “ఆ పరమ రహస్యము ఏమనగా, సువార్త వలన అన్యులకును యూదులతోపాటు దేవుని దీవెనలతో పాలు లభించును. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్తు లగుదురు” (ఎఫెసీ. 3:6).

9.7.2. మంచి ప్రవర్తనకు పిలుపు (4:1-6:20)

మొదటి మూడు అధ్యాయాలు దేవుని ప్రణాళిక ప్రకారం క్రీస్తునందు మానవాళి ఐఖ్యత గురించి నొక్కి చెప్పాయి. తరువాతి మూడు అధ్యాయాలు కూడా దేవుని ప్రణాళిక ప్రకారం జీవించడానికి ఆచరణాత్మకమైన సలహాలను ఇస్తున్నాయి.

9.7.2.1. భిన్నత్వములో ఏకత్వం (4:1-16)

దేవుడు పిలచిననాడు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగ జీవించాలని పౌలు అర్ధించు చున్నాడు (4:1). ఎల్లప్పుడును సాధువులుగను, సాత్త్వికులుగను, సహనశీలురుగను ఉండవలెను (4:2) అని చెప్పిన తరువాత, పౌలు ఐఖ్యత గురించి నొక్కివక్కాణించి చెప్పుచున్నాడు: “శరీరము ఒకటే. ఆత్మయు ఒకటే.  ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము. ఒకే దేవుడు. మానవులందరకు ఒకే తండ్రి” (4:4-6).

4:8లో కీర్తన. 68:18ని పౌలు ప్రస్తావిస్తున్నాడు: “ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలమంది బందీలను వెంట తీసుకొని పోయెను. మనుజులకు వరములను ఒసగెను.”  యూదులు దీనిని మోషేకు అన్వయించారు. మోషే దేవుని చట్టమును (ఆజ్ఞలను) స్వీకరించుటకు సినాయి పర్వతము ఆరోహించెను. అయితే, ఇక్కడ పౌలు క్రీస్తును ‘నూతన మోషే’గ అనువర్తించు చున్నాడు. రక్షణ ఫలాలను వారికి కూడా విస్తరింప జేయుటకు క్రీస్తు పాతాళమునకు దిగి (అ.కా. 2:27, 31) మరియు తనను విశ్వసించు వారందరిపై తన వరములను (కొందరిని అపోస్తలులుగను, ప్రవక్తలుగను, సువార్తీకులుగను, కాపరులుగను, బోధకులుగను) కుమ్మరించుటకు పరలోకమునకు ఎక్కెను. క్రైస్తవులు సేవకులగుటకు, తద్వారా విశ్వాసము విషయములోను, దేవుని కుమమరుని గూర్చిన జ్ఞానము విషయములోను, ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషులు కాగలుగుటకు క్రీస్తు వివిధ వరములను ఒసగెను (4:12).

అప్పుడు క్రైస్తవులు పసి బిడ్డలు కారు, కనుక తప్పుడు బోధకుల బోధనలను, ఇతరులను తప్పు త్రోవన నడుపు మోసగాండ్ర బోధలను తిప్పికొట్ట వలయును (4:14).

9.7.2.2. క్రైస్తవ మరియు క్రైస్తవేత్తర జీవితము  (4:17-5:20)

అన్యజనుల వలె ఇక క్రైస్తవులు ప్రవర్తింపరాదని పౌలు వక్కాణించు చున్నాడు. అంధకార మయమగు మనస్సులు కలవారుగాక, అవివేకులుగగాక, మూర్ఖులుగగాక, అన్నివిధములైన అసహ్యకరములగు పనులను చేయక, వెలుగు పుత్రులుగా జీవించ వలయును. అన్యులు క్రైస్తవులుగా మారినప్పుడు, పూర్వ జీవితపు పాత (పాప) స్వభావమును మార్చుకొని, మనస్తత్వమును నూత్నీకరించుకొని, సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింప బడిన క్రొత్త స్వభావమును ధరింప వలెనని వారికి బోధింప బడినది (4:20-24).

ఆచరణాత్మకమైన సూచనలు (4:25 నుండి)

ప్రతికూలమైనవి:

-   కోపము మిమ్ము పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకొనుడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారి పోవలెను. సైతానునకు అవకాశము ఒసగకుడు.
- దొంగతనము మానివేయుడు
- సంభాషణలలో దుర్భాషలు రానీయకుము
- దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు
- మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోభితనము ఉండకూడదు. అసహ్యకరములును, అవివేక పూరితములును, అపవిత్రములునైన పదములను వాడుట తగదు.
- ఎవరును మిమ్ము వ్యర్ధపు మాటలతో మోసపుచ్చకుండ చూచుకోనుడు.
- చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములగు పనులు చేయు వారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు.
- జ్ఞానహీనులవలె జీవింపకుడు.
- మూర్ఖులుగా ఉండకుడు.
- జారత్వమునకు దారితీయు మద్యపానముతో మత్తిల్లకుడు.

సానుకూలమైనవి:

- అసత్యములు పలుకరాదు
- సత్యమునే పలుక వలెను
- అక్కరగల వారికి పంచి పెట్టగలందులకై తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడ వలెను.
- నీ సంభాషణలు వినువారికి మేలు కలుగునట్లు చూడుము. దైవానుగ్రహము ప్రసాదింపగల అనుకూల వచనమునే పలుకుడు.
- వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరుపులుగాని, అవమానములు గాని ఉండరాదు. ఏవిధమైన ద్వేష భావము ఉండరాదు.
- పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఇకరు క్షమింపుడు.
- దేవుని ప్రియమైన బిడ్డలుగా, ఆయనను పోలి జీవింపుడు.
- క్రీస్తు మనలను ప్రేమించినట్లుగను, సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించినట్లే, మీరును ప్రేమతో నడుచు కొనుడు.
- వెలుగునకు సంబంధించిన ప్రజలవలె మీరు జీవింప వలెను. ప్రభువును ఆనందపరచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు.
- మీరు ఎట్లు జీవించు చున్నారు అని దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. వివేకవంతులవలె జీవింపుడు. దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసికొనుడు.
- దేవుని చిత్తమును గ్రహించుటకు ప్రయత్నింపుడు.
- ఆత్మపూరితులు కండు. ఒకరితో ఒకరు కీర్తనలతోను, స్తోత్రముల తోను, పవిత్ర గీతములతోను సంభాషింపుడు.

9.7.2.3. నైతిక బోధన (5:21-6:9)

ఈ భాగములో భార్యలు-భర్తలు, బిడ్డలు-తల్లిదండ్రులు మరియు సేవకులు-యజమానులు మద్యన ఉండవలసిన బంధాన్ని, నైతికతను గూర్చి పౌలు వివరిస్తున్నాడు. ఇదే విషయాన్ని మనం కొలొస్సీ. 3:18-4:1లో కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ కొత్త బోధన ఏమిటంటే, భార్యలు-భర్తల బంధాన్ని వివరిస్తూ, అది క్రీస్తుకు-శ్రీసభకు మద్యగల సంబంధానికి వర్తించునని పౌలు వివరిస్తున్నారు.

9.7.2.3.1. భార్యలు-భర్తలు (5:21-33)

భార్యలు: ప్రభువునకు విధేయులైనట్లే, భర్తలకు ధేయులై ఉండవలయును. క్రీస్తు శ్రీసభకు అధికారియైనట్లు, రక్షకుడైనట్లు భర్త భార్యకు అధికారి (5:22-24).

భర్తలు: క్రీస్తు శ్రీసభను వాక్కుచే కడిగి, శుద్ధిచేసి పవిత్ర పరచుటకు, ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో, భర్తలు భార్యలను అట్లే ప్రేమింప వలయును. తమ దేహములను తాము ప్రేమించునట్లే భర్తలు భార్యలను కూడా ప్రేమింప వలయును (5:25-33).

9.7.2.3.2. బిడ్డలు-తల్లిదండ్రులు (6:1-4)

బిడ్డలు: ప్రభువునందు బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది వారి ధర్మము. ఇది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ (6:1-3).

తల్లిదండ్రులు: పిల్లల కోపమును రేపకుడు. వారిని క్రమశిక్షణలోను, ప్రభువు బోధనలోను పెంచ వలయును.

9.7.2.3.3. సేవకులు-యజమానులు (6:5-9)

సేవకులు: మానవులగు యజమానులకు హృదయ పూర్వకముగ విధేయత చూప వలయును. క్రీస్తునే సేవించు చున్నట్లుగ హృదయ పూర్వకముగ అట్లు చేయ వలయును (6:5-8).

యజమానులు: బానిసల పట్ల అట్లే ప్రవర్తింప వలయును. వారిని భయపెట్టుట మానివేయ వలయును. ఎందుకన, ఇరువురు పరలికము నందలి ఒకే యజమానునికి సంబంధించిన వారు (6:9).

9.7.2.4. క్రైస్తవ జీవితం-సైతానుతో పోరాటం (6:10-20)

క్రైస్తవ జీవితం ఒక పోరాటం. అనుదినం సైతాను మాయాపూరిత జిత్తులను ఎదుర్కొను చున్నారు. సైతానును ఎదుర్కొనుటకు దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింప వలయును. సిద్ధపడ వలయును. కనుక, సత్యమును నడుమునకు తోలుదట్టీగా బిగింప వలయును. నీతిని కవచముగా ధరింప వలయును. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైన సంసిద్ధతను పాద రక్షలుగ చేసికొన వలయును. విశ్వాసమును డాలుగ  చేసికొన వలయును. రక్షణను శిరస్త్రాణముగను, దేవుని వాక్కును ఆత్మ యొసగు ఖడ్గముగను గ్రహింప వలయును.

ముఖ్యముగా, క్రైస్తవులు అన్ని సమయములందును, విజ్ఞాపనములతో ప్రార్ధింప వలయును. పట్టుదలతో మెలకువగా ఉండ వలయును.

No comments:

Post a Comment