పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ - 02

9. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ - 02

9.4. ఎఫెసు క్రైస్తవ సంఘము
9.5. ఎఫెసు నగరములో సంక్షోభము (అ.కా. 19:21-41)
9.6. పౌలు వీడుకోలు ప్రసంగము (అ.కా. 20:17-38)

9.4. ఎఫెసు క్రైస్తవ సంఘము

ఎఫెసులో పౌలు ప్రేషిత పరిచర్య, క్రైస్తవ సంఘ స్థాపన గురించి అ.కా. 19వ అధ్యాయములో చూస్తున్నాము. ఎఫెసు పట్టణం చేరుకున్న పౌలు, అక్కడ కొందరు విశ్వాసులను చూచి, వారు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా లేదాయని వారి బప్తిస్మమును గురించి ఆరా తీసెను. పౌలు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బప్తిస్మమును గురించి బోధించగా అది విని వారు యేసు ప్రభువు పేరిట జ్ఞానస్నానమును పొందిరి. పౌలు వారిపై చేతులు ఉంచగా, పవిత్రాత్మ వారిపై వేంచేసెను. వారు రమారమి పండ్రెండు మంది, కనుక చిన్న ఆరంభం (అ.కా. 19:1-7).

పౌలు అచ్చటి ప్రార్ధనా మందిరములోనికి వెళ్లి, మూడు మాసముల వరకు, ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు, తర్కించుచు, దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించు చుండెను. వారిలో కొందరు మూర్ఖులై విశ్వసింపక ‘ప్రభువు మార్గము’ గురించి చెడుగా మాట్లాడిరి. అందుచేత పౌలు, వారిని విడిచి, ప్రతిరోజు తిరాన్ను అనువాని ఉపన్యాస మందిరములో వాదించు చుండెను. ఇట్లు రెండేండ్లు గడచిన తరువాత, ఆసియా మండలములో నివసించు యూదులు, గ్రీకులు అందరు ప్రభువు వాక్కును వినిరి (అ.కా. 19:8-10). ఈ సమయములో అనేకమంది అనేక ప్రాంతాల నుండి వచ్చి పౌలు బోధను ఆలకించారు. వారిలో కొంతమంది వారి ప్రదేశాలకు వెళ్లి అక్కడ సువార్తను వ్యాప్తి చేసారు (ఉదా. చూడుము. కొలొస్సీ. 1:7).

ఎఫెసులో పౌలు అసాధారణమైన అద్భుతములను చేసెను. వ్యాధులను నయం చేసెను. అపవిత్రాత్మలను వెడల గొట్టెను. మాంత్రికులలో అనేకులు తమ గ్రంథములను ప్రోగుచేసి, అందరి ఎదుట వాటిని తగుల బెట్టిరి. ఇట్లు ప్రభువు వాక్కు ప్రబల మగుచు వ్యాపించెను (అ.కా. 19:11-20).

9.5. ఎఫెసు నగరములో సంక్షోభము (అ.కా. 19:21-41)

ఎఫెసులో సంఘమును నిర్మించిన తరువాత, పౌలు యెరూషలేమునకు వెళ్ళుటకు నిశ్చయించు కున్నాడు. పిదప రోము పట్టణమును కూడా తప్పనిసరిగా దర్శింప వలెనని అనుకున్నాడు. తన సహాయకులైన తిమోతి, ఎరాస్తు అనువారలను మాసిడోనియాకు పంపి, తాను ఇంకను కొంతకాలము ఆసియా మండలములోనే గడిపెను (అ.కా. 19:21-22).

ఆ కాలములో ఎఫెసు నగరములో “ప్రభువు మార్గము”ను (మెస్సయ్య అను క్రీస్తును అనుసరించడం, క్రీస్తు సంఘము) గురించి ఒక తీవ్రమైన సంక్షోభము చెలరేగెను. ఎఫెసు నగరములో ‘అర్తెమి’ దేవత పేర గుడి ఉండెను. దేవత క్షేత్రముల నమూనాలను వెండితో తయారు చేసెను. దీనివలన కంసాలులు మరియు ఇతర పనివారలు గొప్ప లాభములను గడించేవారు. ‘అర్తెమి’ దేవతయని పౌలు తన బోధనల ద్వారా నిరాకరించాడు. మానవులచేత చేయబడిన విగ్రహములు ఏ మాత్రము దేవుళ్ళు కాదని చెప్పాడు. పౌలు తన బోధనల ద్వారా ఎఫెసు నగరములొను. దాదాపుగ ఆసియా మండల మంతటను పెక్కుమంది ప్రజలను తన పక్షమున చేర్చుకున్నాడు.

అప్పుడు దేమేత్రియసు అను ఒక కంసాలి తన పనివారలను, అదే వృత్తియందున్న తదితరులను సమావేశ పరచి, “ఈ వృత్తి వలననే మనకు మంచి లాభము లభించుచున్నది. పౌలు చేయుచున్న పనిని మీరు స్వయముగా చూచుచు, వినుచున్నారు. అందుచే, మన వ్యాపారమునకు చెడ్డ పేరు వచ్చు ప్రమాదమున్నది. అంతేగాక,  ‘అర్తెమి’ అను మన గొప్ప దేవత గుడికి విలువలేకుండ పోవును. ప్రతివానిచేత పూజింప బడుచున్న ఆమె మహాత్మ్యము పడిపోవును” అని హెచ్చరిక చేసెను (అ.కా. 19:24-27).

దీనివలన మొదలైన కోలాహలము ఇంతై అంతై నగరమంతయు అలుముకున్నది. పౌలుతో పయనించిన మాసిడోనియా వాసులగు గాయు, అరిస్టార్కులను పట్టుకొని, ఈడ్చుకొని ఒక నాటక శాలలో చొరబడిరి. ఆ సమావేశ మంతయు గందర గోళమయ్యెను. అప్పుడు ఆ నగర పాలక సంస్థ కార్యదర్శి జనసమూహమును శాంత పరచెను. ఏదైనా ఫిర్యాదు చేయదలచినచో న్యాయ స్థానమునకు చెప్పుకొన వచ్చును అని పలికెను. పిదప సభ సమాప్తమాయెను (అ.కా. 19:28-41).

ఈ అల్లకల్లోలము అణగిన తరువాత, పౌలు విశ్వాసులందరును చేరబిలిచి, వారిని ప్రోత్సహించి, వారి యోద్ధ సెలవు తీసికొని, మాసిడోనియాకు వెళ్ళెను (అ.కా. 20:1).

9.6. పౌలు వీడుకోలు ప్రసంగము (అ.కా. 20:17-38)

పౌలు మిలేతులో ఉండగా ఎఫెసు క్రైస్తవ సంఘ పెద్దలను కలుసుకొని పౌలు వీడుకోలు ప్రసంగము చెప్పెను (అ.కా. 20: 17-38). ఈవిధముగా పౌలు మూడు సంవత్సరములో ఎఫెసులో తన సువార్తా పరిచర్యను కొనసాగించెను (అ.కా. 20:31).

ఈ ప్రసంగములో, “పాపముల నుండి దేవుని వైపునకు మరలి, ప్రభువైన యేసు క్రీస్తునువిశ్వసింప వలెను” అని పౌలు బోధించాడు (అ.కా. 20:21). “నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నాను” అనునది, పౌలు సువార్త కొరకు ఎదుర్కొనబోయే శ్రమలను సూచిస్తుంది. అయినను, “దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని, కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము” (అ.కా. 20:22-24) అని పౌలు తన పిలుపును, నిబద్ధతను ప్రకటించుచున్నాడు. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తకు సాక్ష్యమిస్తున్నాడు. “దేవుని రాజ్యము గురించి” బోధించాడు (అ.కా. 20:25). దేవుని సంపూర్ణ సంకల్పమును బోధించాడు (అ.కా. 20:27). “దైవ సంఘ కాపరులు”గా పవిత్రాత్మ అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొన వలయునని పౌలు ఎఫెసు పెద్దలకు గుర్తుచేయు చున్నాడు (అ.కా. 20:28). అబద్ద బోధకుల గురించి జాగ్రత్తగా ఉండడని వారిని హెచ్చరిస్తున్నాడు (అ.కా. 20:29-30). “పుచ్చుకొనుట కంటె, ఇచ్చుట ధన్యము” అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి, కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలెనని తన ఇచ్చిన ఆదర్శ జీవితమును గుర్తుచేయు చున్నాడు. (అ.కా. 20:32-35).

పౌలు వీడుకోలు ప్రసంగము మిగిసిన వెంటనే, వారందరితో తాను గూడ మోకరిల్లి ప్రార్ధించెను. వారు వీడుకోలు సూచనగా పౌలును కౌగిలించు కొనుచు, ముద్దుపెట్టు కొనుచు అందరును కన్నీరు కార్చిరి. మరల వారు ఎన్నటికిని అతనిని చూడబోరని, అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారి కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిరి. అంతతవారు ఓడవరకు అతనిని సాగనంపిరి (అ.కా. 20:36-38).

No comments:

Post a Comment