8.5. ప్రధాన అంశము: క్రీస్తు శాస్త్రము

 8.5. ప్రధాన అంశము: క్రీస్తు శాస్త్రము
8.6. శుభాకాంక్షలు మరియు ముగింపు (4:7-18)

క్రీస్తును గూర్చిన తప్పుడు బోధనలు, కొలొస్సీ సంఘములోనున్న ప్రధాన సమస్య.

క్రీస్తును గూర్చిన తప్పుడు తత్వవాదనలు ఏమనగా,

- దేవునకు మరియు లోకమునకు మధ్యన మధ్యవర్తులు ఉన్నారు. వారు ‘దేవదూతలు’గా, ‘ఆదిభూతమైన ఆత్మలు’గా పిలువబడు చున్నారు (2:8,18).
- వారు దేవుని పరిపూర్ణతను కలిగి యున్నారు (1:19, 2:9)
- సృష్టిని చేయుటలో సాధనాలుగా ఉన్నారు (1:15-17)
- వారు భువిని మరియు మానవాళి విధిని నియంత్రించును
- కనుక, వీరిని గురించి తెలుసుకోవడానికి, కొలొస్సీయులు జ్ఞానమును కలిగి యుండవలయును.
- వారిని ప్రసన్నం చేయుటకు, శాంతింప జేయుటకు, కొలొస్సీయులు కొన్ని పండుగ దినములను, క్రొత్త చంద్రోత్సవమును, విశ్రాంతి దినమును కొనియాడ వలెను (2:14,16,20-21).

‘క్రీస్తు శాస్త్రము’ను గూర్చిన ఈ తప్పుడు బోధనలను పౌలు ఖండించి, సరిచేయు చున్నాడు. పౌలు ప్రకారం, ఈ తప్పుడు బోధనలు మనుష్యుల సంప్రాదాయాలకు, ప్రాపంచిక ప్రాధమిక నియమములకు చెందినవి (2:8). ఇలాంటి బోధనలు చాలా ప్రమాదకరమైనవి.

దేవదూతలు మరియు ఆత్మలు సృష్టిని చేయుటలో సాధనాలైతే, లోకము, మానవాళి వారి ఆధీనములో ఉన్నట్లయితే, మరి క్రీస్తు పాత్ర ఏమిటి? క్రీస్తు అనావశ్యకమేనా! తప్పుడు బోధకుల వాదన ప్రకారం, క్రీస్తు కూడా వారివలె ఒక మధ్యవర్తియే! బహుశా! అందరిలోకేల్ల శక్తివంతమైన మధ్యవర్తియని బోధించారు. పౌలు ఈ తప్పుడు వాదనలను తీవ్రముగా ఖండించాడు.

క్రీస్తును గూర్చిన పౌలు తత్వవాదనలు ఏమనగా,

- క్రీస్తు దేవుని పరిపూర్ణము: “కుమారునిలో దేవున్ సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది” (1:19). “దివ్య స్వభావపు పరిపూర్ణత్వము శారీరకముగా క్రీస్తు నందు ఉన్నది” (2:9).
- తన మరణ పునరుత్థానముల ద్వారా, క్రీస్తు సర్వశక్తులను జయించాడు. “సిలువపైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను నిరాయుధులును చేసాడు. వారిని బందీలుగా చేసి, తన విజయ యాత్రలో నడిపించి, అందరకును ఆయన బహిరంగముగా ప్రదర్శించాడు” (2:15).
- క్రీస్తు ఏకైక మధ్యవర్తి: “సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు” (1:15). “దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించెను” (1:16). “క్రీస్తు అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు” (1:17). “సమస్తమున క్రీస్తే ప్రథముడు, మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు” (1:18).
- కనుక, క్రీస్తు ఒక్కడే చాలు, వేరే ఏ మధ్యవర్తిత్వం అవసరం లేదు (చూడుము. 2:8).
- కనుక, ‘దేవదూతలు మరియు ఆత్మల’ గూర్చిన జ్ఞానము అవసరము లేదు. అలాగే వారిని ప్రసన్నం చేయవలసిన అవసరము కూడా లేదు (2:8,23).

అందుకే పౌలు, క్రీస్తు స్వరూపమును, కృషిని ప్రదర్శించు “క్రీస్తుశాస్త్ర గీతము” (1:15-20)ను ఎన్నుకున్నాడు. ఇది ‘క్రైస్తవ విశ్వాసము’ను చాటి చెప్పుచున్నది. క్రీస్తు మరణ పునరుత్థానాలు లోక రక్షణకు కేంద్రం.

8.6. శుభాకాంక్షలు మరియు ముగింపు (4:7-18)

తుది పలుకులలో మనం అనేక వ్యక్తుల పేర్లను ప్రస్తావించడం చూస్తున్నాము.

1. తుకికు: పౌలు అనుచరుడు. ఇతను ఆసియా మండలమునుండి వచ్చెను (అ.కా. 20:4). “దైవ సేవలో ప్రియ సోదరుడు, విశ్వాసపాత్రుడైన సేవకుడు” (ఎఫెసీ. 6:21). “ప్రియ సోదరుడు, నమ్మకమైన పరిచారకుడు, ప్రభువు కార్యమందు తోడి సేవకుడు (కొలొస్సీ. 4:7).

2. ఒనేసిము: కొలొస్సీ క్రైస్తవ సంఘ సభ్యుడు. పౌలు ఫిలేమోను లేఖలో చెప్పిన పారిపోయిన బానిస (కొలొస్సీ. 4:7).

3. అరిస్టార్కు: మాసిడోనియా వాసుడు. పౌలు ప్రేషిత ప్రయాణములో తోడి సహచరుడు. ఒక కంసాలి వలన ఎఫెసు నగరములో జరిగిన సంక్షోభములో పౌలుతో పయనించిన ఇతనిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిరి (అ.కా. 19:29). అ.కా. 27:2 ప్రకారం, ఇతను తెస్సలోనిక నుండి వచ్చిన మాసిడోనియా నివాసి మరియు పౌలుతో కలిసి రోము నగరమునకు ప్రయాణం చేసెను. ఇచ్చట కొలొస్సీ. 4:10లో “నాతో పాటు కారాగారము నందున్న అరిస్టార్కు” అని వివరించ బడినది. “నా తోడి పనివాడు” (ఫిలే. 1:24).

4:మార్కు, బర్నబా, యుస్తు: మార్కు (కొలొస్సీ. 4:10, చూడుము. 2 తిమో. 4:11), “తోడి పనివాడు” (ఫిలే. 1:24). బర్నబా (అ.కా. 14:14, 1 కొరి. 9:5-7, కొలొస్సీ. 4:10). యుస్తు అనెడి యోషువా పౌలుతో కలిసి పనిచేసి యున్నాడు (కొలొస్సీ. 4:11).

5. ఎపఫ్రా: పౌలు సహచరుడు. కొలొస్సీ వాస్తవ్యుడు (కొలొస్సీ. 4:12). పౌలు ఎఫెసు సందర్శనలో బహుశా క్రైస్తవుడిగా మారియుండ వచ్చు (అ.కా. 19:8-10). కొలొస్సీలో అన్యులను క్రైస్తవులుగా మార్చాడు (కొలొస్సీ. 1:7, 4:12, ఫిలే. 1:23).

6. లూకా: “ప్రియతమ వైద్యుడు” (కొలొస్సీ. 4:11, ఫిలే. 1:24). మూడవ సువార్తీకుడు.

7. డెమాసు: పౌలును విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు (2 తిమో. 4:10, చూడుము. కొలొస్సీ. 4:14, ఫిలే. 1:24).

8. సుంఫాకు: లవోదికయలో ఆమె యింట దైవ సంఘము గుమికూడెడిది (కొలొస్సీ. 4:15).

9. అర్కిప్పు: ఫిలేమోను కుటుంబ సభ్యుడుగాని, అతని గృహములో కూడు దైవ సంఘములో సభ్యుడై యుండవచ్చు (కొలొస్సీ. 4:17, ఫిలే. 1:2).

No comments:

Post a Comment