7. దమస్కు దర్శనం - పౌలు పరివర్తనం

 7. దమస్కు దర్శనం - పౌలు పరివర్తనం

“పరివర్తన” (గ్రీకు పదం metanoia) అనగా మనం సాధారణముగా అనైతిక జీవితమునుండి నైతిక జీవితమునకు మార్పు (ప్రవర్తనలో మార్పు) అని లేదా అవిశ్వాసము నుండి విశ్వాసమునకు మార్పు అని భావిస్తుంటాము. బైబులు పరముగా, “పరివర్తన’ కేవలము మేధోపరమైన మార్పు మాత్రమే గాక, దేవునితో ఒక వ్యక్తికి ఉన్న ప్రాథమిక బంధానికి సంబంధించినది. కనుక నిజమైన “పరివర్తన’ అనగా విశ్వాసములో దేవునికి లొంగిపోవడం. పిలచిన వానికి సంపూర్ణ బహుమతిగా మారడం. క్రీస్తును అంగీకరించి ఆయన రాజ్యమునకై పాటుబడటం. క్రీస్తు వ్యక్తిత్వములో మమేకమై, ఆయన కొరకు నిబద్ధత కలిగి జీవించడం.

‘పౌలు పరివర్తన’ గురించి లూకా స్వయముగా తన మాటలలో (అ.కా. 9:1-19) మరియు పౌలు తన ప్రసంగాల నేపథ్యములో (అ.కా. 22:1-21, 26:1-32) వివరించి యున్నారు. స్వయంగా పౌలుకూడా గలతీయుకు వ్రాసిన లేఖలో తన పరివర్తన, పిలుపు, ప్రేషిత కార్యమును గురించి ప్రస్తావించాడు (1:11-24). అలాగే, 1 కొరి. 9:1, 15:8, 10, 2 కొరి. 4:4-6, ఫిలిప్పీ. 3:7-8, 12లో కూడా చూడవచ్చు.

సిరియా రాజధాని అయిన దమస్కు పట్టణమునకు ప్రభువు మార్గమును అనుసరిస్తున్న వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకు బయలుదేరాడు. దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశమునుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టును ప్రకాశించెను. అప్పుడు అతడు నేలమీద పడిపోగా “సౌలూ! సౌలూ! నీవేల నన్ను హింసించు చున్నావు? అను స్వరము అతనికి వినబడెను. “ప్రభూ! నీవెవరు?’’ అని అతడు ప్రశ్నించెను. “నీవు హింసించుచున్న యేసును, నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము. అక్కడ నీవు ఏమి చేయవలయునో తెలుపుదును’’ అని ఆ స్వరము పలికెను (అ.కా. 9:4-5, 22:7-8, 26:14-15). ఇచ్చట ప్రభువు తననుతాను క్రైస్తవునిగా పోల్చాడు.

‘అపోస్తలుల కార్యములులోని వివరణ ప్రకారం, పౌలు పొందిన లోతైన క్రీస్తానుభవం, తన జీవితంలోనే ముఖ్యమైన మలుపుగా అర్ధమగుచున్నది. పౌలు ఈ సంఘటనను దైవపిలుపుగా స్వీకరించి అన్యజనులకు అపోస్తలుడుగ పిలువబడినాడని భావించాడు (రోమీ. 11:13). ఈ పిలుపు పన్నెండుమంది క్రీస్తు శిష్యుల (అపోస్తలుల) పిలుపుతో సమానముగా భావించాడు. దీనిద్వారా ‘‘క్రీస్తు యేసు సొంతమైతిని” అని ఫిలిప్పీయుకు వ్రాసిన లేఖలో (3:12) పౌలు తెలిపాడు. క్రీస్తు తనకు బయలుపరచిన ప్రేషితత్వ బాధ్యతను గూర్చి గలతీయలకు వ్రాసిన లేఖలో (1:12-16) ప్రస్తావించాడు.

ఉత్థాన క్రీస్తుతో ఈ పరిచయం పౌలు జీవితమును పూర్తిగా మార్చివేసింది. క్రైస్తవుల హింసితుడైన పౌలు, ఇప్పుడు వారి సంరక్షకుడిగా మారాడు. ఎన్నో క్రైస్తవ సంఘాల ఏర్పాటుకు మూలకారకుడయ్యాడు. తద్వార క్రైస్తవ మార్గంప్రపంచమంతట వ్యాప్తి చెందుటకు ప్రధాన వ్యక్తిగా మారాడు.

పౌలు పరివర్తనఉత్తాంతములో గమనించవలసిన ముఖ్యాంశాలు:
(అ). పౌలు ఈ అనుభవమునకు ఏవిధముగాను సంసిద్ధపడి యుండలేదు: దమస్కు నగరముకు వెళ్ళుచుండగా, తన అంతరాత్మలో అతను ఎలాంటి క్షోభకు గురికాలేదు. ఇది పశ్చాత్తాపపడు ఒక పాపాత్ముని పరివర్తన కాదు. ధర్మశాస్త్ర నేపధ్యంలో తాను చేయుచున్న కార్యము పట్ల, తన ఆసక్తి వలన తనకు లభించు రక్షణ పట్ల, సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి యున్నాడు (గలతీ. 1:13-14).

(ఆ). ప్రత్యక్షంగా, ఆకస్మికంగా ఉత్థాన క్రీస్తు జోక్యం చేసుకొని యుండెను: దమస్కు సంఘటన సంపూర్ణంగా సర్వశక్తిగల దేవుని పరిశుద్ధ కార్యం. క్రీస్తును, క్రీస్తు సంఘమును హింసించుచున్న పౌలును అతని అంతరాత్మకు వ్యతిరేకంగా ఆశ్చర్యకరంగా, ఊహాతీతంగా, ఆకస్మికంగా దేవుడు తరిమి పట్టుకున్నాడు. పౌలు పరివర్తనలో అతిముఖ్యంగా గమనింప వలసినది, అది ఆకస్మికంగా, సంసిద్ధత లేకయే జరుగుట. వేటగాడు వేటాడ బడెను.

(ఇ). హింసించువాడు క్రీస్తు వైపునకు మరలెను: సర్వాధికారి, మహిమాన్వితుడగు ప్రభువు పౌలును తనకు సాక్షిగా మరియు శిష్యునిగా చేసుకున్నాడు. ఈ సంఘటన పరిసయ్యుడైన పౌలును, ‘అపోస్తలుడు పౌలు’గా మార్చియున్నది. క్రీస్తు సంఘ వ్యతిరేకి క్రైస్తవ శిబిరంలోనికి తీసుకొని రాబడ్డాడు.

దమస్కు నగర మార్గమున పొందిన అనుభవంలో గమనింపదగిన అంశం, ‘‘ఆకాశము నుండి ఒక వెలుగుఅతని చుట్టును ప్రకాశించెను’’ (అ.కా. 9:3). ఇది అతీంద్రియ సంఘటన. ఈ వెలుగుదైవత్వమును సూచిస్తుంది. ఇదే వెలుగుక్రీస్తు ముఖముపై ప్రకాశించెను (2 కొరి. 4:6), అది నజరేయుడగు యేసు దైవ స్వభావమునకు సూచన. అప్పుడు పౌలు నేలపై పడిపోయెను. సర్వాధికారము గల మహిమాన్విత ప్రభువైన క్రీస్తు దృష్టి వలన అతడు ఏమియు చూడలేక పోయెను. ఆ ఉత్థాన క్రీస్తు యొక్క ప్రకాశవంతమైన వెలుగు పౌలులోనికి చొచ్చుకొని పోయెను. ‘యేసు క్రీస్తు తనను సొంతం చేసుకొనెను’ (ఫిలిప్పీ. 3:12) అని పౌలు భావించాడు.

(ఈ). పౌలు అపోస్తోలిక పిలుపును మరియు అధికారమును అందుకొని యున్నాడు: ఉత్థాన క్రీస్తు పౌలుకు ప్రేషితత్వ కార్యమును అప్పజెప్పెను. దమస్కులో నివసించుచున్న అననియాకు దర్శనములో ప్రభువు కనిపించి పౌలును కలుసుకొనమని, అతనిపై చేతులుంచమని, అప్పుడు మరల అతనికి చూపు కలుగునని చెప్పెను. ఎందుకన ప్రభువు పౌలును, ‘‘అన్యులకు, రాజులకు, యిస్రాయేలు ప్రజలకు ఆయన నామమును తెలియజేయుటకు అతనిని సాధనముగా ఎన్నుకొనెను’’ (అ.కా. 9:15, చూడుము అ.కా. 13:47, 18:6, 22:21, 26:17, 23). అన్యులకు బోధించుటకుగాను, దేవుడు తన కుమారుడుని పౌలుకు ప్రత్యక్ష పరచెను (గలతీ. 1:15-16, చూడుము రోమీ. 1:13, 11:13, 15:16, గలతీ. 2:1-10, ఎఫెసీ.3:1, 8, 1 తిమో. 2:7, 2 తిమో. 1:11).

పౌలు పిలుపు (గలతీ. 1:15-16) ప్రవక్తల పిలుపును జ్ఞప్తికి తెచ్చుచున్నది (యిర్మీ. 1:4-5, యెషయ 49:1). పిలుపు సువార్త బోధనకు పంపడం కొరకు. పౌలు తన పిలుపును గురించి ఇలా ప్రస్తావించాడు, “నేను తిరిగి యెరూషలేమునకు వెళ్లి, దేవాలయములో ప్రార్ధించు కొనుచుండగ పరవశుడైతిని. అప్పుడు ప్రభువు కనిపించి, ‘త్వరపడుము. వెంటనే లేచి యెరూషలేమును విడిచి వెళ్ళుము. ఏలయన, ఇచ్చటనున్న ప్రజలు నన్నుగూర్చి నీవు ఇచ్చు సాక్ష్యమును అంగీకరింపరు!అని నాతో చెప్పెను. “ప్రభువా! నేను ప్రతి ప్రార్ధనా మందిరమునకు వెళ్లి, నిన్ను విశ్వసించు వారిని పట్టి హింసించితినని వారికి బాగుగా తెలియును. నీ సాక్షియైన స్తెఫాను చంపబడినప్పుడు నేను అచ్చటనే ఉండి ఆ హత్యను ఆమోదించుచు, ఆ హంతకుల వస్త్రములకు కావలి యుంటిని’ అని మారు పలికితిని. అందుకు ఆయన నీవు పొమ్ము. చాల దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నానుఅని ఆదేశించెను’’ (అ.కా. 22:17-21).

అప్పటినుండి పౌలు తన అపోస్తోలికత్వ బాధ్యతను అధికారపూర్వకంగా కొనసాగించాడు. తన అపోస్తలత్వమును గురించి ధైర్యంగా చెప్పియున్నాడు. “నేను లాభముగా లెక్కించు కొనదగిన వానిని అన్నింటిని క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించు కొనుచున్నాను” (ఫిలిప్పీ. 3:7). “సలహా కొరకు ఏ మనుష్యుని వద్దకును పోలేదు. నా కంటే ముందు అపోస్తలులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు. కాని నేను వెంటనే అరేబియాకు వెళ్లి పోతిని. దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని’’ (గలతీ. 1:16-17).

ఈ దమస్కు అనుభవం పౌలు తన జీవితంలో ఎన్నటికి మరచి పోలేదు. ఈ అనుభవంలో, తనను సేవకునిగా చేసుకున్న (గలతీ. 1:10) ఉత్థాన క్రీస్తును కలుసుకున్నాడు (1 కొరి. 9:1). పరివర్తన తరువాత తన జీవితంలో సువార్త బోధనతప్పనిసరియైనది. “సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింప బడితిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును” (1 కొరి. 9:16) అని పౌలు ప్రకటించాడు.

పౌలు తన పరివర్తనతరువాత వెంటనే అరేబియాకు వెళ్లి దమస్కు నగరమునకు తిరిగి వచ్చాడు (గలతీ. 1:17). పౌలు వెంటనే అరేబియాకు ఎందుకు వెళ్ళాడో మనకు ఖచ్చితంగా తెలియదు. బహుశా, తన నూతన జీవితం, ప్రేషితకార్యం గూర్చి ధ్యానించుటకు, దైవపిలుపులో బలపడుటకు వెళ్లి ఉండవచ్చు. అరేబియానుండి తిరిగి రాగానే దమస్కు నగరంలోని సినగోగులోనికి వెళ్లి యేసు దేవుని కుమారుడుఅని బోధింప సాగాడు. అది విన్న యూదులు సౌలును చంపుటకు కుట్ర పన్నారు (అ.కా. 9:20-23) కాని సౌలు అక్కడున్న క్రైస్తవుల సహాయంతో తప్పించు కున్నాడు (అ.కా. 9:25, 2 కొరి. 11:33).

ఉత్థాన క్రీస్తునుండి పిలుపును, ప్రేషిత కార్యమును పొందిన మూడు సంవత్సరముల అనంతరం పౌలు అపోస్తలులను కలిసి వారితో సహవాసమును ఏర్పరచు కున్నాడు. అచ్చట కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉండి సిరియా, సిలీషియాలోని ప్రాంతాలకు వెళ్లి బోధించాడు (గలతీ. 1:18-23). అచ్చట పౌలు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించాడు (2 కొరి 11:23-29). అటుపిమ్మట పదునాలుగు సంవత్సరాలైన తరువాత పౌలు రెండవసారి యెరూషలేమును సందర్శించాడు (గతీ 2:1-10).

పౌలు అంతియోకియాలోని సువార్త బోధన గురించి అ.కా. 11:26లో చెప్పబడినది. ఇచ్చట పౌలు అన్యులకు సువార్తను బోధించాడు. విశ్వసించినవారు క్రైస్తవ సంఘములోనికి చేర్చబడ్డారు. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటి సారిగా క్రైస్తవులుఅని పిలవబడినారు. అంతియోకియాలో విశ్వాసులు అధికమగుట వలన అచటి సంఘ నాయకుడైన బర్నబా, పౌలును వెదకుటకై తార్సునకు వెళ్లి, అక్కడ పౌలును కనుగొని అంతియోకియాకు తీసుకొని వచ్చాడు. వారిద్దరు కలిసి అచట క్రీస్తు సంఘమును బలపరచారు (అ.కా. 11:25-26).

‘దమస్కు సంఘటన’తో మెస్సయ్య గురించిన పౌలు దృక్పధం పూర్తిగా మారిపోయినది. దేవుని సంపూర్ణ రక్షణ ప్రణాళికను ఉత్థాన మరియు మహిమ పరపబడిన క్రీస్తు వెలుగులో చూడగలిగాడు. దేవుని పరమ రహస్యాలు క్రీస్తు సువార్త బోధనా ప్రక్రియలో పౌలు స్పష్టముగా అర్ధం చేసుకోగలిగాడు. 

No comments:

Post a Comment