6. యూదమత ప్రచారకుడు - క్రైస్తవ ద్వేషి
పరిసయ్యుల సంస్కృతి, ఆచారవ్యవహారాల పెంపకంలో పెరిగి, యెరూషలేములో ధర్మశాస్త్రమును, యూదమత సంప్రదాయాలను అభ్యసించిన పౌలు, యూదమతం పట్ల ఎంతో భక్తిని, ఆసక్తిని పెంచుకొని, అత్యంత ఉత్సాహ యూదమత ప్రచారకుడిగా మారాడు.
పెంతకోస్తు దినమున పవిత్రాత్మ రాకతో ఓ నూతన ‘మార్గము,’ ఉద్భవించినది. అ.కా. 9:2, 19:9, 23, 22:4, 24:14, 22లో ‘సంపూర్ణ మార్గము’ అయిన ‘ప్రభువు మార్గము’గా చెప్పబడినది. అ.కా. 18:25లో ‘‘రక్షణ మార్గము’’గా, అ.కా. 18:26లో ‘‘దేవుని మార్గము’’గా చెప్పబడినది.
ఈ ‘మార్గము’ ఉత్థాన క్రీస్తును ప్రభువుగా, రక్షకునిగా ప్రకటించు చుండెను (లూకా. 1:69, 71, 79, 19:9, అ.కా. 4:12, 7:25, 13:26, 47).
పాత నిబంధన గ్రంథములో ‘‘మార్గము’’ అనగా ‘‘జీవన విధానము’’ను సూచిస్తుంది (కీర్తన. 1:1, 6, 2:12, 119:29). ఇదే అర్ధాన్ని నూతన నిబంధన గ్రంథములో కూడా చూడవచ్చు (రోమీ. 3:17, 1 కొరి. 12:31, యూదా. 11).
ఈ భిన్నమైన ‘మార్గము’నే తరువాత పౌలు వెంబడించాడు (అ.కా. 24:14). ఈ ‘మార్గమే’ నేడు శ్రీసభగా, క్రైస్తవమతంగా పిలువబడు చున్నది. ‘అపోస్తలుల కార్యములు’లో, లూకా ఆరంభంలో దీనిని ‘మార్గము’ అని పిలిచాడు. ఆ తరువాత, అంతియోకియాలో శిష్యులు మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అని పిలువబడి యున్నారు (అ.కా. 11:26).
ఈ క్రైస్తవ మతమును ద్వేషించానని, హింసించానని పౌలు స్వయంగా తన లేఖలో తెలిపాడు: “నా మత ఆసక్తిచే దైవసంఘమును హింసించితిని” (ఫిలిప్పీ. 3:6). “పూర్వము నేను యూద మతమునందున్న రోజులో దేవుని సంఘమును ఎంతగ హింసించి, దానిని నాశనము చేయ ప్రయత్నించితినో మీరు వినియున్నారుగదా!’’ (గలతీ. 1:13). “దేవుని సంఘమును హింసించిన వాడను” (1 కొరి. 15:9).
‘అపోస్తలుల కార్యములు’లో కూడా లూకా, సౌలును దేవుని సంఘమును హింసించిన వానిగా ప్రస్తావించాడు (7:58-60, 8:3, 9:1-2, 22:4-5, 26:9-11). అయితే పౌలు యెరూషలేములో క్రైస్తవులను ఎలా హింసించినది స్పష్టంగా చెప్పబడలేదు. మనకున్న సమాచారము ప్రకారం, పౌలు సమక్షంలో స్తెఫానును రాళ్ళతో కొట్టిరి. పౌలు అతని మరణమును ఆమోదించెను (అ.కా. 7:58-60). సౌలు ఇంటింట జొరబడి విశ్వాసులయిన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చికొనిపోయి వారిని చెరసాలలో వేయించెను (అ.కా. 8:3). ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేసెను. ఇంకను ప్రభువు ‘మార్గము’ను అవలంబించుచున్న పురుషులు, స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్ధనా మందిరములకు పరిచయ పత్రమును ఇమ్మని ప్రధానార్చకుడిని అర్ధించెను (9:1-2). ప్రభువు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాలగునట్లు హింసించెను, వారని చెరసాలలో పడవేయించెను. యెరూషలేములో శిక్షించు నిమిత్తము దమస్కులోనున్న విశ్వాసులను బంధించి, తీసుకొని వచ్చుటకై అచటకు వెళ్ళెను (22:4-5). నజరేయుడగు యేసు నామమునకు వ్యతిరేకముగా ఎంతో చేయవలెనని తలపెట్టెను. యెరూషలేములో అట్లే చేసెను. ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది, దైవ ప్రజలను అనేకులను చెరసాలలో వేసెను. వారికి మరణ దండన విధింప బడినప్పుడు దానికి సమ్మతించెను. ప్రార్ధనా మందిరములన్నింటి యందును వారిని పలుమారులు శిక్షించెను. వారు వారి విశ్వాసమును విడనాడునట్లు ప్రయత్నించెను. వారిపై ఆగ్రహించి హింసించుటకై వారిని ఇతర నగరములకుకూడా వెన్నంటి తరిమెను (26:9-11).
క్రైస్తవును
హింసించడానికి గల ముఖ్య కారణాలు
(అ). యూదులు ‘యావే’ను మాత్రమే ప్రభువుగా అంగీకరిస్తారు. సిలువలో కొట్టబడిన యేసును క్రైస్తవులు ప్రభువుగాను మరియు క్రీస్తుగాను ప్రకటించుచున్నారు (అ.కా. 2:36). యేసును ‘యావే’తో సమానంగా పరిగణించుటను యూదులు జీర్ణించుకొనలేక పోయారు. యూదులు కూడా ‘మెస్సయ్య’ కొరకు ఎదురు చూసారు. అయితే, వారు రాజకీయ పరమైన ‘మెస్సయ్య’ కొరకు ఎదురు చూసారు. రోమను సామ్రాజ్యాన్ని కూలదోసి ప్రతీ ఒక్కరు ధర్మశాస్త్రాన్ని అనుసరించు వారిగా చేసే ‘మెస్సయ్య’ కొరకు వారు ఎదురు చూసారు. కనుక, సిలువపై యేసు మరణం ఒక ఓటమిగా వారు భావించారు. “చెట్టుకు వ్రేలాడబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు” (ద్వితీయ. 21:23) అని ధర్మశాస్త్రం చెబుతుంది. యూదులు యేసును ‘మెస్సయ్య’గా అంగీకరించలేదు. కాని, ‘‘క్రీస్తు మన కొరకు ఒక శాపమై, ధర్మశాస్త్రము తెచ్చి పెట్టిన శాపమునుండి మనలను విముక్తులను చేసెను’’ (గలతీ. 3:13) అని, ‘‘యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు, సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించు చున్నాము’’ (1 కొరి. 1:23) అని పౌలు తరువాత తెలుసుకున్నాడు.
(ఆ). యూదులు, మరీ ముఖ్యముగా
పరిసయ్యులు సున్నతి, సబ్బాతు
(విశ్రాంతి దినము), ధర్మశాస్త్రము, ఆహార నియమాలు, సంప్రదాయాలను
కఠినంగా పాటించేవారు. వీటిని పాటించటం ద్వారా, ‘రక్షణ’ను పొందుతారని నమ్మెడివారు. వీటిని
పాటించలేదని, మోషే వద్దనుండి పారంపర్యముగా వచ్చిన ఆచారములను యేసు మార్పుచేయునని
చెప్పియున్నాడని, న్యాయసభ ఎదుట స్తెఫానుపై నిందలు మోపి, అబద్ద
సాక్ష్యమును చెప్పించారు (అ.కా.6:13-14).
No comments:
Post a Comment