6. పౌలు
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ
6.1. ఉపోద్ఘాతము
6.2. ఫిలిప్పీ
6.3. ఫిలిప్పీ క్రైస్తవ సంఘము
6.4. లేఖ వ్రాయు సందర్భము
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ సంతోష కరమైన లేఖ. ఇది చాలా వ్యక్తిగతమైన లేఖ. పౌలు తన హృదయము నుండి ఈ లేఖను వ్రాసి యున్నాడు. ఒక తండ్రి తన బిడ్డలకు లేఖ వ్రాసిన విధముగా ఉంటుంది. ఈ లేఖలో పౌలు లోతైన మనో:భావాలను, అతని వ్యక్తిత్వము గురించి తెలుసుకోవచ్చు. ఈ లేఖను పౌలు చెరలో ఉండగా వ్రాసియున్నాడు. పౌలు ఫిలిప్పీయులతో చాలా ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధాన్ని కలిగి యున్నాడని ఈ లేఖ ద్వారా తెలుసుకోవచ్చు.
6.2. ఫిలిప్పీ
మాసిడోనియా యొక్క మొదటి మండలములో ముఖ్య పట్టణం ఫిలిప్పీ. ఇదొక పురాతన పట్టణం. క్రీ.పూ. 358-357 సంవత్సరములో, రెండవ ఫిలిప్పు రాజు తన పేరు మీదుగా ఫిలిప్పీ పట్టణాన్ని నిర్మించాడు. క్రీ.పూ. 168-167లో ఈ పట్టణం రోమీయుల వశమై, వారికి నివాస స్థానముగ ఉండెను. క్రీ.పూ. 148లో ఫిలిప్పీ రోమను మండలముగా లేదా ప్రాంతీయముగా మారినది (అ.కా. 16:12). క్రీ.పూ. 42లో క్రీ.పూ.30లో సైనిక స్థావరముగా మారినది. ఇలా రోముకు సన్నిహిత పట్టణముగా ఫిలిప్పీ పేరు గాంచినది. పౌలు సువార్తను బోధించి సంఘాన్ని స్థాపించిన మొదటి ఐరోపా పట్టణం ఫిలిప్పీ (అ.కా. 16:11-40).
6.3. ఫిలిప్పీ
క్రైస్తవ సంఘము
ఫిలిప్పీ పట్టణములో మాసిడోనియనులు, రోమనులు మరియు కొద్దిమంది యూదులు నివసించేవారు. నగరము వెలుపలనున్న నదీ తీరమున ‘సినగోగు’ (యూదుల ప్రార్ధనా స్థలము) ఉండేది (అ.కా. 16:13). పౌలు తన సహచరులైన సిలాసు, తిమోతి, లూకాతో కలిసి తన రెండవ ప్రేషిత ప్రయాణములో ఫిలిప్పీలో సువార్తను బోధించి క్రీ.శ. 50వ సంవత్సరములో క్రైస్తవ సంఘమును స్థాపించాడు (అ.కా. 16:9-40).
ఐరోపా పట్టణమైన ఫిలిప్పీలో
సువార్తను బోధించాలని దేవుడే చొరవ తీసుకున్నట్లుగా అపోస్తలుల కార్యములో అర్ధమగుచున్నది:
“ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుష్యుడొకడు
కన్పించి, మాసిడోనియాకు వచ్చి, మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలు కొనెను. ఈ
దర్శనము కలిగిన వెంటనే, మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయన, అక్కడ ఉన్న
ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచెనని మేము నిశ్చయించు
కొంటిమి” (16:9-10).
ఈవిధముగా, పౌలు మరియు అతని అనుచరులు త్రోయ నుండి సమోత్రాకు వెళ్లి, మరుసటి రోజు నెయాపొలికి వెళ్ళిరి (అ.కా. 16:11). అక్కడనుండి మాసిడోనియా యొక్క మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పీకి వెళ్ళిరి (అ.కా. 16:12). విశ్రాంతి దినమున (సబ్బాతు) నగర వెలుపలనున్న నదీ తీరమున నున్న ప్రార్ధనా స్థలమున (ప్రార్ధనాలయము, సినగోగు) కూడి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడిరి (అ.కా. 16:13).
పౌలు బోధనలను విన్నవారిలో తైయతీర నగరము నుండి ఊదా రంగు వస్తువులను అమ్ముకొను వ్యాపారస్థురాలు, దైవ భక్తురాలు అయిన లిదియా ఒకరు. ప్రభువు ఆమె హృదయమును తెరచి, పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. అప్పుడు లిదియా మరియు ఆమె ఇంటి వారలు జ్ఞానస్నానమును పొంది విశ్వాసుల సంఘములో చేరిరి (అ.కా. 16:14-15) త్వరలోనే క్రైస్తవుల సంఖ్య పెరిగినది. లిదియా ఇంటి వద్ద క్రైస్తవులు సమావేశ మయ్యెడివారు (అ.కా. 16:40).
పౌలు మరియు అతని సహచరులు వ్యతిరేకతను, తిరస్కారమును ఎదుర్కొనుట వలన, ఫిలిప్పీ పట్టణమును వీడి తెస్సలోనిక వైపునకు వెళ్ళిపోయిరి (చదువుము. అ.కా. 16:16-40). ఒక బానిస బాలికకు పట్టిన దయ్యమును యేసు నామమున పౌలు వెడల గొట్టెను. ఆమె భూతావిష్టురాలై సోదెచెప్పుచు తన యజమానులకు చాల డబ్బు సంపాదించి పెట్టుచుండెను ఇక వారికి డబ్బు సంపాదించుకొను అవకాశము పోయినదని, పౌలు, సిలాసులను పట్టుకొని, ప్రజాన్యాయ స్థానములోని అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయిరి. నగరములో కలతలకు కారకులైనారని, (రోమీయ) చట్టమునకు విరుద్ధమైన ఆచారములను ప్రచారము చేయుచునన్నారని నిందలు మోపిరి. బెత్తముతో క్రూరముగా కొట్టిన పిమ్మట, చెరసాల గుహ లోపలకు త్రోసి, కాళ్ళను రెండు కొయ్యదుంగల మధ్య బంధించిరి. (అ.కా. 16:16-24).
పౌలు, సిలాసులు క్రీస్తు
సువార్తను ప్రకటించు చున్నారని చెరసాలలో బంధించిరి. అయినప్పటికిని దేవుడు వారిని అద్భుతరీతిన
రక్షించెను. చెరలో వారు ప్రార్ధించుచు, దైవస్తుతి గీతములను పాడు చుండిరి.
హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా, తలుపులన్నియు తెరచుకొనెను. చెరసాల అధికారి
ఖైదీలందరు తప్పించుకొని పారిపొయి యుందురని భావించి, తననుతాను చంపుకొన బోయెను.
కాని, అలా జరగకపోవుట వలన, ఆ అధికారి పౌలు, సిలాసు పాదముల వద్ద పడెను. “రక్షణ
పొందుటకు నేను ఏమి చేయవలెను?” అని అడుగగా, “నీవు ప్రభువైన యేసు నందు
విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును, నీ కుటుంబమును రక్షింప బడుదురు” అని వారు
చెప్పిరి. అతనికిని, అతని ఇంటిలోని వారికిని ప్రభువు వాక్కును బోధించిరి. వెంటనే, చెరసాల
అధికారి, అతని కుటుంబము జ్ఞానస్నానము పొందిరి. దేవుని విశ్వసించి నందుచే అతడు
కుటుంబ సమేతముగా సంతోషభరితు డయ్యెను (అ.కా. 16:25-35).
పౌలు, సిలాసులు రోమా పౌరులు కనుక, న్యాయమూర్తులు భయపడి, వారిని క్షమాపణ వేడుకొని, చెరసాల నుండి వెలుపలకు తీసుకొని వచ్చి, నగరమును విడిచి పొండని బ్రతిమాలుకొనిరి. ఈవిధముగా ఫిలిప్పీలో పౌలు, సిలాసుల గొప్పతనమును అచ్చటివారు గ్రహించితిరి. పౌలు సిలాసులు లిదియా ఇంటికి వెళ్లి అక్కడ విశ్వాసులను కలుసుకొని, వారిని ప్రోత్సహించి అక్కడనుండి వెళ్ళిపోయిరి. (అ.కా. 16:36-40).
ఆరంభము నుండి కూడా ఫీలిప్పీయులు విశ్వాసముగా ఉంటూ పౌలుతో చక్కటి అనుబంధాన్ని కలిగి యున్నారు. పౌలు కూడా వారి చేత పోషింప బడుటకు ఇష్టపడినాడు (ఫిలిప్పీ. 4:10, 14-15, 2 కొరి. 11:8-9). ఇలాంటి ప్రత్యేక స్వతంత్రమును, హక్కును కొన్ని క్రైస్తవ సంఘములు మాత్రమే కలిగి యుండెను (1 తెస్స. 2:9, 2 తెస్స. 3:7-9, 1 కొరి. 4:12).
పౌలు మరల రెండు మార్లు ఫిలిప్పి క్రైస్తవ సంఘమును సందర్శించాడు (అ.కా. 20:1-2, 1 కొరి. 16:5-6, 2 కొరి. 2:13, 7:6 మరియు అ.కా. 20:6)
6.4. లేఖ
వ్రాయు సందర్భము
పౌలు ఈ లేఖ వ్రాయునప్పుడు చెరసాలలో ఉండెను (ఫిలిప్పీ. 1:7, 17). ఫిలిప్పీయులు మొదటి నుండి కూడా సువార్తా కృషి యందు పౌలుతో భాగస్వాములయ్యిరి (ఫిలిప్పీ. 1:5). తెస్సలోనికలో పౌలు సువార్తా ప్రచారం చేయుచుండగా, ఫిలిప్పీయులు పెక్కుమారులు పౌలుకు సాయము పంపియున్నారు (ఫిలిప్పీ. 4:16).
అయితే ప్రస్తుతం పౌలు చెరసాలలో ఉన్నాడని తెలుసుకొని ఫిలిప్పీ క్రైస్తవ సంఘస్తులు మరల సాయమును ఎపఫ్రోదితు ద్వారా పంపిరి (ఫిలిప్పీ. 2:25, 4:14,18). ఈ సందర్భముగా పౌలు ఈ లేఖను వ్రాయుచున్నాడు.
మొదటగా, వారి సాయమునకు లేదా
కానుకలకు కృతజ్ఞతలు తెలుపుటకు,
అలాగే, తనను గూర్చిన సమాచారమును
అందించుటకు,
ఫిలిప్పీ సంఘములో నున్న
వర్గములను గూర్చి హెచ్చరించుటకు,
అబద్ధపు బోధకుల నుండి
జాగ్రత్తగా ఉండవలెనని తెలుపుటకు,
ఫిలిప్పీయుల విశ్వాసమును
బలపరచుటకు,
ఫిలిప్పీయుల దూతయైన ఎపఫ్రోదితు
అనారోగ్యం పాలైనాడని తెలియజేయుటకు,
శ్రమలు, హింసలలో కూడా ప్రభువు
నందు ఆనందింపుడని కోరుటకు, పౌలు ఈ లేఖను ఫిలిప్పీయులకు వ్రాసి యున్నాడు.
No comments:
Post a Comment