6.5. ప్రధానాంశాలు
6.5.1. ఫిలిప్పీయులకు సూచనలు, క్రీస్తు విశ్వస్తుతి గీతము (1:27-2:18)
- “క్రీస్తు విశ్వస్తుతి గీతము” (ఫిలిప్పీ. 2:6-11)
6.5.2. అబద్ద బోధకులకు పౌలు హెచ్చరిక (3:1-21)
6.5.3. ఐఖ్యత కొరకు వేడుకోలు (4:1-9)
6.5.1.
ఫిలిప్పీయులకు సూచనలు, క్రీస్తు విశ్వస్తుతి గీతము (1:27-2:18)
ఫిలిప్పీయుల జీవిత విధానము క్రీస్తు సందేశాను సారముగ ఉండవలెనని పౌలు ఆదేశిస్తున్నాడు. విశ్వాసముతో జీవించాలి. ఈ విశ్వాసము కొరకు శ్రమలను కూడా అనుభవించ వలయును. ఈ శ్రమల ద్వారా క్రీస్తు శ్రమలలో పాలుపంచు కొంటున్నామని పౌలు ఫిలిప్పీయులకు గుర్తుచేయు చున్నాడు.
ప్రేమతో ఐఖ్యమై యుండి ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి జీవించాలని కోరుచున్నాడు. “వినయాత్ములై ఇతరులను మీ కంటె అధికులుగా భావింపుడు” (ఫిలిప్పీ. 2:3) అని ఆచరించదగిన మంచి సలహాను ఇస్తున్నాడు. క్రీస్తు వినయం మనకు ఆదర్శం అని చెబుతూ, “క్రీస్తు విశ్వస్తుతి గీతము”ను పౌలు ప్రస్తావిస్తున్నాడు (ఫిలిప్పీ. 2:6-11). ఈ స్తుతి గీతములో క్రీస్తు యొక్క వినయము, దానికి ప్రతిఫలముగ దేవుడు క్రీస్తును ప్రభువుగా అత్యున్నత స్థానమునకు లేవనెత్తుటను చూస్తున్నాము.
“క్రీస్తు విశ్వస్తుతి గీతము” (ఫిలిప్పీ. 2:6-11) తర్వాత, పౌలు ఫిలిప్పీయులకు ఇతర సూచనలను తెలియజేయు చున్నాడు (ఫిలిప్పీ. 2:12-18). “భయముతోను, జాగరూకతతోను మీ రక్షణముకై శ్రమింపుడు” (2:12) అని ఫిలిప్పీయులను కోరుచున్నాడు. ఫిలిప్పీయులు విశ్వాసములో ఎదుగుట వలన పౌలు ఎంతగానో ఆనందించాడు. ఒకవేళ వారి విశ్వాసమనెడు బల్యర్పణపై తననుతాను ఒక పాన బలిగా ధారపోయ వలసి వచ్చినప్పుడు తాను ఆనందముతో అర్పించుటకు సోద్ధముగా ఉండెను.
“క్రీస్తు
విశ్వస్తుతి గీతము” (ఫిలిప్పీ. 2:6-11)
ఈ స్తుతి గీతము ద్వారా, యేసు ఎవరు, దేవునితో యేసుకు ఉన్న సంబంధము ఏమిటి, క్రైస్తవులు అనగా ఎవరు, దేవునితో వారి సంబంధము ఏమిటి అను విషయాల గురించి తెలుసు కుంటాము. క్రీస్తు విశ్వ స్తుతి గీతాలు ఇక్కగే గాక, కొలొస్సీ. 1:15-20, 1తిమో. 2:5-6, 3:16, 1 పేతు. 3:18, యోహాను. 1:1-5లో కూడా చూడవచ్చు.
ఈ స్తుతి గీతం బహుశా అనాధి
క్రైస్తవ సంఘమునకు చెందినదై యుండవచ్చు. దానిని పౌలు ఇచ్చట సందర్భాను సారముగ
ప్రస్తావించి యున్నాడు.
దేవుడు తన సొంత కుమారున్ని పంపుట ద్వారా పాపమును ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరము వంటి స్వభావముతో వచ్చెను (రోమీ. 8:3). దేవుడు తన సొంత కుమారుని కూడ మన అందరి కొరకై సమర్పింప వెనుదీయ లేదు (రోమీ. 8:32). ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించ బడినది (1 కొరి. 8:6).
యేసు ‘ప్రభువు’. ఇది పాస్కా
దినమున ఇవ్వబడిన పేరు (చూడుము. లూకా. 24:34, యోహాను. 20:18,20,25). యేసు ఈ
భూలోకములో నున్నప్పుడు ఇవ్వబడిన పేర్లు; మెస్సియా, ఇస్రాయేలు రాజు, మనుష్య
కుమారుడు, రక్షకుడు.
వాస్తవానికి ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలోని ఈ స్తుతి గీతం తండ్రి దేవునికి అర్పించిన గీతము. తండ్రి దేవుని మహిమ కొరకే యేసు సర్వాన్ని చేసాడు.
స్తుతి గీతములోని మూడు ముఖ్యాంశాలు:
(అ). “ఆయన ఎల్లప్పుడును
ఉన్నవాడు” (ఫిలిప్పీ. 2:6, యోహాను. 1:18). మనుజులవలె యేసు కూడా దేవుని రూపములో,
స్వభావములో సృజింప బడెను. “ఆయన ఎల్లప్పుడును దైవ స్వభావమును కలిగి ఉండెను”. దేవుడు
తన గొప్ప వరాలను, శక్తిని, అధికారమును ఆయనతో పంచుకొనెను.
(ఆ). తననుతాను రిక్తునిగా
చేసికొనెను (ఫిలిప్పీ. 2:7-8). దైవ స్వభావము కలిగి ఉన్నను, దేవునితో తన
సమానత్వమును గణింపలేదు. తననుతాను రిక్తునిగా చేసికొని, సిలువ మరణము వరకు
విధేయుడాయెను. “ఆయన అన్ని విధముల మానవమాతృడై ఉండి, అంత కంటె వినయముగలవాడై, మరణము
వరకును, సిలువపై మరణము వరకును, విధేయుడాయెను.
(ఇ). ఉత్థాన క్రీస్తు
(ఫిలిప్పీ. 2:9-11). దేవుడు ఆయనను లేవనెత్తి అత్యన్నత స్థానములో ఉంచెను. అన్ని
నామముల కంటె ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. తననుతాను సంపూర్ణముగా రిక్తునిగా
చేసికొనిన యేసును దేవుడు తన సంపూర్ణ ప్రేమతో నింపి, పరలోక భూలోక పాతాళ లోకముల
యందలి సమస్త జీవులకు ఆయనను రక్షకుడైన ప్రభువుగా చేసెను.
మరణము వరకు వినయ విధేయతలు కలిగిన, తనకుతాను రిక్తునిగా చేసికొని తండ్రి దేవునకు అర్పించుకొనిన యేసును మహోన్నతమైన నిదర్శనముగా పౌలు ఫిలిప్పీ క్రైస్తవులకు చూపుచున్నాడు. ఈ యేసు స్వభావమునే ఫిలిప్పీయులు కూడా ఒకరిపట్ల ఒకరు కలిగి యుండాలని పౌలు ఆశిస్తున్నాడు. ఈ స్తుతిగీతము ద్వారా, ఫిలిప్పి సంఘములో ఐఖ్యత గూర్చి పౌలు సూచనలను ఇస్తున్నాడు.
6.5.2. అబద్ద
బోధకులకు పౌలు హెచ్చరిక (3:1-21)
ప్రభువు నందు ఆనందింపుడని పౌలు
ఫిలిప్పీయులను కోరుచున్నాడు. ఆతరువాత వారి విశ్వాసమును నాశనము చేయువారి పట్ల
జాగ్రత్తగా ఉండవలెనని హెచ్చరిస్తున్నాడు. అబద్ద బోధకులను కుక్కలని, దుష్టకార్యములు
చేయువారని, సున్నతి చేసుకొను వారని సంబోధిస్తున్నాడు. వారిపట్ల మెలకువగా,
జాగ్రత్తగా ఉండుమని ఫిలిప్పీయులను కోరుచున్నాడు.
ఈ అబద్ద బోధకులు ఫిలిప్పీయులను ఆకర్షిస్తూ, వారిని ప్రభావితం చేస్తూ సున్నతి తప్పక అవసరమని, కనుక నిజమైన సున్నతిని పొందినది క్రైస్తవులేగాని, యూదులు కాదు అని, క్రైస్తవులు దేవుని ఆత్మ ద్వారా దేవుని పూజింతురని పౌలు స్పష్టము చేయుచున్నాడు.
వ్యతిరేకుల వాదనలకు స్పందిస్తూ, తన యూద నేపధ్యమును ప్రస్తావిస్తున్నాడు: “నేను పసి బిడ్డగా ఉన్నప్పుడే ఎనిమిదవ రోజున నాకు సున్నతి కావింప బడినది. పుట్టుకచే యిస్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను. స్వచ్చమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను. నా మత ఆసక్తిచే దైవసంఘమును హింసించితిని. ధర్మశాస్త్రమునకు విధేయుడై మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశము ఉన్నదో, అంతవరకు నేను నిర్దోషిని” (ఫిలిప్పీ. 3:5-6).
కాని, యేసు క్రీస్తునందు విశ్వాసముతో పోల్చితే అవన్నియు కూడా విలువలేనివి. క్రీస్తును గురించి తెలుసు కొనుటలో ఇంకా పరిపూర్ణుడను కాలేదు, దానికొరకై సదా ప్రయత్నించెదను (ఫిలిప్పీ. 3:12) అని పౌలు ఎంతో వినయముగా అంగీకరించు చున్నాడు.
అబద్ద బోధకులపై దాడిని పౌలు కన్నీటితో చెప్పి ముగిస్తున్నాడు (ఫిలిప్పీ. 3:18). ఎందుకన, క్రీస్తు సిలువ మరణమునకు శతృవులుగ జీవించువారు అనేకులు ఉన్నారని పౌలు ఎరిగియున్నాడు. తుదకు వారికి మిగులునది వినాశనమే అని పౌలు ఎలాంటి సందేహము లేకుండా చెప్పుచున్నాడు. ఎందుకన, వారు దేహవాంఛలనే దైవముగా భావిస్తున్నారు. కేవలం, లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచిస్తున్నారు. అనగా, భోజనమునకు, సున్నటి ఆచార నియమాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు (చదువుము. హబ. 2:16, హోషె. 4:7, మీకా. 1:11, నహూ. 3:5, సీరా. 4:21).
యూదులకు వ్యతిరేకముగా, క్రైస్తవులు పరలోక పౌరులని, వారి సంపద పరలోకమున ఉన్నదని, అది శాశ్వతమైనదని పౌలు గుర్తుచేయు చున్నాడు.కనుక అబద్ధపు బోధకుల మాయలో, వారి ప్రలోభాలలో పది తిరిగి యూద మతములోనికి పోనవసరము లేదు. దానికి బదులుగా పునరుత్థానమున ఉత్థాన క్రీస్తు శరీరమువలె క్రైస్తవుల శరీరములను కూడా దివ్యముగ చేయుననే నమ్మకముతో ఉండవలయును.
6.5.3. ఐఖ్యత
కొరకు వేడుకోలు (4:1-9)
“సోదరులారా! మిమ్ము చూడవలెనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వపడు చున్నాను. ప్రియులారా! ప్రభువు నందలి మీ జీవితములో గట్టిగా నిలువ వలెను” (ఫిలిప్పీ. 4:1). ఈ వాక్యము పౌలు ఫిలిప్పీయులతో నున్న లోతైన అనుబంధమును తెలియజేయు చున్నది. ప్రభువు నందు ఏక మనస్కులై ఉండవలెనని వేడుకొనుచూ, యువోదియ మరియు సుంతుకే అను ఇరువురు ఫిలిప్పి సంఘములో ప్రముఖులైన మహిళల పేర్లను ప్రస్తావిస్తున్నాడు. వారిరువురి మధ్య అసాధారణమైన వివాదం ఏదో జరిగి ఉండవచ్చు. దానిమూలముగ, సంఘములో ఐఖ్యతకు భంగము వాటిల్లినది. వారిరువురి గురించి కాని, వివాదము గురించి కాని మనకు ఎలాంటి సమాచారము లేదు.
“ప్రభువు నందు ఎల్లప్పుడు ఆనందింపుడు! ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు” (ఫిలిప్పీ. 4:4-5). ప్రభువు రెండవ రాకడను సూచిస్తుంది లేదా ప్రభువు వారితో ఉన్నాడు అని సూచిస్తుంది. ఫిలిప్పీ. 4:6లో ప్రార్ధన, కృతజ్ఞత గూర్చి నొక్కివక్కాణిస్తున్నాడు. కృతజ్ఞతా పూర్వకమైన హృదయముతో ప్రార్ధింపుడు. నా మాటల నుండియు, చేతల నుండియు మీరు గ్రహించిన వానిని, పొందిన వానిని, ఆచరణలో పెట్టుడు (చూడుము. ఫిలిప్పీ. 3:17) అని పౌలు ఫిలిప్పీయులను కోరుచున్నాడు (ఫిలిప్పీ. 4:9).
6.6. ముగింపు
తనకు ప్రియమైన ఫిలిప్పీ క్రైస్తవ విశ్వాసులకు పౌలు ఈ లేఖను చేరసాల నుండి వ్రాసియున్నాడు. వాస్తవానికి, తాను పొందిన శ్రమలు, బాధలు, కష్టాలు, సువార్తను బోధించుటకు ఉపయోగ పడినవని తేల్చి చెప్పుచున్నాడు. తన శారీరక శ్రమల గూర్చి తాను ఎంత మాత్రము చింతించ లేదు, ఎందుకన తన శరీరము ద్వారా జీవించినను, మరణించినను క్రీస్తునకు గౌరవము కలిగించెననే నమ్మకము కలిగి యున్నాడు. “నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చేయరాదని నా గాఢమైన అభిలాష, నమ్మిక. అంతేకాక, అన్ని సమయములందును, ప్రత్యేకించి, ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతో నుండి, నేను జీవించినను, మరణించినను క్రీస్తునకు గౌరవము కలిగించెదను” (ఫిలిప్పీ. 1:20).
“నాకు జీవించడం క్రీస్తు,
మరణించడం లాభం” (ఫిలిప్పీ. 1:21). “జీవించడం” విశ్వాసుల కొరకు జీవించడం,
క్రీస్తును ఇతరులకు ఒసగుట కొరకు జీవించడం. “మరణించడం లాభం” ఎందుకన క్రీస్తుతో
కలకాలం ఉండుటకు. అందులకే పౌలు మరణించుటకు సిద్ధముగా నున్నాడు.
ఫిలిప్పీయుల పట్ల పౌలు ఎంతగానో గర్వపడ్డాడు మరియు ఆనంద పడ్డాడు. అదే సమయములో, సంఘములో నున్న విభేదాల గురించి తన అసంతృప్తిని తెలిపి యున్నాడు. వారి ముందు క్రీస్తును మహోన్నతమైన నిదర్శనముగా చూపుచూ, క్రీస్తువలె జీవించాలని కోరాడు.
పౌలు తన యూద నేపధ్యాన్ని మరియు వారసత్వమును (ఫిలిప్పీ. 3:5-6) క్రీస్తు నందు విశ్వాసము కొరకు వదులు కొనుట మంచి నిర్ణయముగా పౌలు భావించాడు (ఫిలిప్పీ. 3:8). గతములో విలువైనదిగ భావించిన దానిని క్రీస్తును పొందుటకు సమస్తమును విడచినాడు (ఫిలిప్పీ. 3:9-10). క్రీస్తు పౌలును తన వానిగా చేసుకున్నాడను విషయములో ఏనాడు అనుమానించ లేదు. కనుక, బహుమానమును గెలుచు కొనుటకు, ధ్యేయము వంకకు సూటిగా పరుగెడు చున్నాడు (ఫిలిప్పీ. 3:14).
చివరిగా, తనను అనుసరించ వలెనని
పౌలు కోరుచున్నాడు (ఫిలిప్పీ. 3:17, 4:9). వారు పౌలు నుండి నేర్చుకొనినది,
పొందినది, వినినది, చూచినది, వారు ఆచరణలో పెట్టవలెను (ఫిలిప్పీ. 4:9). “క్రీస్తు
అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటిని చేయగలను” (ఫిలిప్పీ. 4:13) అని పౌలు సంపూర్ణ
నమ్మకముతో ఉన్నాడు. ఇదే నమ్మకము మనలో కూడా ఉండాలి.
No comments:
Post a Comment