5.3.2. క్రైస్తవ దాతృత్వము – యెరూషలేము పేదలకు సహాయం (8:1-9:15)

 5.3.2. క్రైస్తవ దాతృత్వము – యెరూషలేము పేదలకు సహాయం (8:1-9:15)
5.3.3. పౌలు తన ప్రేషిత పరిచర్యను సమర్ధించుట (10:1-13:10)
5.3.3.1. పౌలు తననుతాను సమర్ధించుకుంటూ, వ్యతిరేకులను ఖండించుట (10:1-18)
5.3.3.2. పౌలు – అసత్యపు అపోస్తలులు (11:1-15)
5.3.3.3. అపోస్తలుడుగా పౌలు బాధలు – బలహీనతలయందు గర్వపడుట (11:16-33)
5.3.3.4. పౌలు దర్శనములు: పారవశ్యం, “శరీరములో ముల్లు” (12:1-10)
“శరీరములో ముల్లు” (2 కొరి. 12:7)
5.3.3.5. కొరింతీయులను గూర్చిన పౌలు చింత (12:11-21)
5.3.3.6. తుది హెచ్చరికలు (13:1-10)

 5.3.2. క్రైస్తవ దాతృత్వము – యెరూషలేము పేదలకు సహాయం (8:1-9:15)

ఎప్పుడైతే, కొరింతు సంఘములోని సంక్షోభము సమసిపోయినదో, పౌలు సున్నితమైన అంశమును కొరింతు ప్రజల ముందు ఉంచుతున్నాడు: యెరూషలేము సంఘములోని పేదల కొరకై వారి సహాయాన్ని విజ్ఞప్తి చేయుచున్నాడు. యెరూషలేము సంఘములోని పేదల కొరకై, పౌలు అనేక సంఘాలనుండి సహాయ సహకారాలను కోరియున్నాడు (1 కొరి 16:1-4, రోమీ 15:25-32, అ.కా. 24:17, గలతీ 2:10). ఇది వారి సువార్త అంగీకారమునకు తార్కాణం.

మాసిడోనియాలోని దైవసంఘములు, నిరుపేదలైనను, యెరూషలేము సంఘమునకు వారు చేసిన గొప్ప దానమును బట్టి, పౌలు వారిని పొగడుచున్నాడు. వారి ఆదర్శమును చూసి, తీతు ద్వారా గత సంవత్సరమున ప్రారంభించిన సహాయమును కొనసాగింప వలయునని, పౌలు మరల కొరింతుకు తీతునే పంపుతూ, ఈ ప్రత్యేక సేవను కొరింతీయులందు పరిపూర్తి చేయవలయునని, పౌలు తీతును అర్ధించియున్నాడు (8:1-6).

ప్రేమపూర్వకమగు సేవలో, కొరింతీయులు కూడా ఉదారముగా ఉండవలెనని పౌలు అభిలాష. క్రిందటి సంవత్సరము వారు ప్రారంభించిన పని, ఇప్పుడు పూర్తిచేయుట వారికి మంచిదని పౌలు అభిప్రాయము. ఎంత ఆసక్తితో వారు ప్రారంభించిరో, అంతే ఆసక్తితో ముగించాలని పౌలు కోరుచున్నాడు. ప్రస్తుతం, యెరూషలేము సంఘము వారి సహాయాన్ని కోరుకుంటున్నది. బహుశా, భవిష్యత్తులో, కొరింతు సంఘము అవసరతలో ఉన్నప్పుడు, యెరూషలేము సంఘము తమ సహాయాన్ని పంపవచ్చు. ఈవిధముగా, పౌలు, వివేకముతో, యెరూషలేము సంఘముపట్ల నున్న ఆందోళనను, సమస్యను, ముందుచూపును కొరింతీయులకు తెలియజేయు చున్నాడు (8:7-15).

పౌలు తీతుకు ఆకట్టుకొనేటటువంటి సిఫార్సులు ఇచ్చుచున్నాడు. అలాగే, సహాయాన్ని సేకరించుటకు, తీతుకు తోడుగా, అన్ని దైవసంఘములలో మంచి గౌరవము గడించిన మరియు దైవసంఘములచే ఎన్నుకొనబడి నియమింపబడిన మరో ఇద్దరిని పంపుచున్నాడు. సహాయాన్ని సేకరించుటలో ఎట్టి వివాదములకు చోటులేకుండునట్లుగా పౌలు జాగ్రత్త పడుచున్నాడు. వారు పౌలు భాగస్వాములు, దైవసంఘములకు ప్రతినిధులు కనుక వారిని ప్రేమపూర్వకముగా స్వాగతించాలని, ప్రేమను వారికి చక్కగా ప్రదర్శింపవలెనని, తద్వారా కొరింతీయులను గురించి గర్వించుట యుక్తమేనని గ్రహించబడునని, పౌలు వారికి గుర్తుచేయుచున్నాడు (8:16-24).

సహాయ సేకరణకై పౌలు పంపు ప్రతినిధులతో సహకరించవలెనని, కొరింతీయులకు వ్యూహాత్మకముగా తెలియజేయు చున్నాడు. మాసిడోనియా ప్రజలకు వారి గురించి గొప్పగా చెప్పితినని, ఇది నిజమేనని నిరూపించు కోవాల్సిన సమయం కొరింతీయులకు వచ్చినది పౌలు వారికి చెప్పుచున్నాడు. పౌలు కొరింతుకు వచ్చేసరికి వారు వాగ్ధానమొనర్చిన దానము వారు ముందుగానే సిద్ధమొనర్చుకొని యుండాలి. ఎందుకన, ఒకవేళ, మాసిడోనియా ప్రజలు పౌలును వెంబడి వచ్చినట్లయితే, వారి ఉదారత్వములో వెనకబడిపోవుట వారు చూడకూడదని పౌలు కోరిక. అందులకే, పౌలు తనకంటే ముందుగా తీతుతోపాటు మరో ఇద్దరు సోదరులను ముందుగానే కొరింతుకు పంపుచున్నాడు (9:1-5)

“విత్తనములు కొలదిగ చల్లినవానికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును” (9:6) అని పౌలు సూత్రీకరించాడు. ఉదారముగా ఇచ్చువాడు ఉదారముగా పొందును. చింతతోగాని, ఒత్తిడి వలన గాని కాక, ప్రతీ వ్యక్తియు, ఉదారగుణముతో తనకు తోచినట్లు దానము చేయవలెను. సంతోషముతో దానమొనర్చువారిని దేవుడు ప్రేమించును. కొరింతీయులు కూడా సంతోషముతో ఇచ్చిన యెడల, సర్వదా అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. “పేదలకు ఆయన ఉదారముగ ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును” (9:9) అని కీర్తన 112:9ని ఉదహరిస్తూ, ఉదారముతో సహాముచేయు వారు కలకాలము గుర్తుంచ బడుదురు అని పౌలు కొరింతీయులకు జ్ఞాపకం చేయుచున్నాడు (9:6-9).

కొరింతీయులు చేసే దానములకు అనేకమంది దేవునకు కృతజ్ఞతా స్తుతులు అర్పింతురు అని పౌలు చెప్పుచున్నాడు. వారి ఉదారస్వభావమునకు దేవుడే మూలము. వారి సహాయమును పొందినవారు దేవునికి అనంతముగా కృతజ్ఞతలు చెప్పెదరు, మహిమ చెల్లింతురు. వారికై ప్రార్ధనలు సలిపెదరు. ఈ విధముగా, యెరూషలేము సంఘమునకు సహాయము చేయుటలో ఉదారస్వభావము కలిగియుండాలని పౌలు కొరింతీయులను ప్రేరేపిస్తున్నాడు.

ఇతరుల అవసరాలను గుర్తించి ఉదారగుణముతో సహాయము చేయడం, విశ్వాసమునకు యధార్ధతగా మారుతుంది. ధన లేదా వస్తుపరమైన కానుకలు స్వీకరించుటకు ఇచ్చట వేదాంతపరమైన ఆధారములను చూస్తున్నాము. కానుకలు ఇవ్వడము అనగా శ్రీసభ (క్రైస్తవ సంఘము) దేవునిపై ఉంచే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నది. ఒకరికొకరు సహాయము చేసుకోవడము వలన, సంఘముల మధ్య ఐఖ్యత, ప్రార్ధన బలపడుతుంది.

5.3.3. పౌలు తన ప్రేషిత పరిచర్యను సమర్ధించుట (10:1-13:10)

5.3.3.1. పౌలు తననుతాను సమర్ధించుకుంటూ, వ్యతిరేకులను ఖండించుట (10:1-18)

పౌలు లేఖలు తీవ్రముగను, కటినముగను ఉండును కాని అతడు బలహీనుడు అని వ్యతిరేకులు పౌలును తక్కువ చేసి మాట్లాడారు (2 కొరి. 10:10). ఈ నిందలకు జవాబు ఇస్తూ కొరింతు క్రైస్తవులు విధేయులుగా ఉండవలయునని, క్రీస్తువలె సంపూర్ణ విధేయతను కలిగి యుండాలని పౌలు కోరుచున్నాడు. కొరింతు క్రైస్తవ సంఘమును నిర్మించి, పోషించుట వలన పౌలు అపోస్తోలిక అధికారమును కలిగి యున్నాడు (2 కొరి. 10:7-11). ఆ అధికారముతోనే కొరింతీయులనువిధేయులుగా ఉండమని కోరుచున్నాడు. తన వ్యతిరేకుల అపనిందలను ఖండిస్తూ, తన లేఖలకు, తన పరిచర్యకు మధ్య వైరుధ్యము లేదని తెలియజేయు చున్నాడు. “దూరమున ఉన్నప్పుడు ఏమి వ్రాయుదుమో దగ్గర ఉన్నప్పుడు అదియే చేయుదును” (2 కొరి. 10:11).

పౌలు తాను ప్రలోభాలకు పోలేదని, తన అధికారము వలన గర్వపడలేదని తెలియజేయు చున్నాడు (2 కొరి. 10:12). దేవుడు తనకు అప్పగించిన ప్రేషిత పరిచర్యనే పౌలు పూర్తిచేసి యున్నాడు (2 కొరి. 10:13-14). ఇతరులు చేసిన పనులను గూర్చి పౌలు గొప్పలు చెప్పుకోలేదు (రోమీ. 15:20). సువార్త ప్రకటింపని చోట పౌలు బోధించాలని కోరుకున్నాడు (2 కొరి. 10:15-16). సువార్తకు విధేయులగుట వలన, తన అపోస్తోలికత్వమును అంగీకరించుట వలన కొరింతీయుల విశ్వాసము పెరుగునని పౌలు తన నమ్మాన్ని వ్యక్త పరుస్తున్నాడు. “గొప్పలు చెప్పుకొన దలచినవాడు ప్రభువు నందే గొప్పలు చెప్పుకొన వలెను” (2 కొరి. 10:17).

5.3.3.2. పౌలు – అసత్యపు అపోస్తలులు (11:1-15)

“విశిష్టమైన అపోస్తలులుగ” (అసత్యపు అపోస్తలులు) ఎంచబడిన వారికి ఏమాత్రము తీసిపోనని, తక్కువ కాదని పౌలు నొక్కి చెప్పుచున్నాడు (2 కొరి. 11:5, 13, 12:11). “విశిష్టమైన అపోస్తలులు” అనగా పన్నెండు మంది అపోస్తలులు కాదు. ‘అపోస్తలులు’ అని తమనుతాముగా చెప్పుకొనే వారిని పౌలు సూచిస్తున్నాడు. 11:5-12లో వారు చేసిన నిందలకు పౌలు సమాధాన మిస్తున్నాడు. పౌలును తమకన్న తక్కువయని వారు భావించారు. కారణాలు: వక్తగా నైపుణ్యం లేనివాడు, జ్ఞానము లేనివాడు మరియు కొరింతు క్రైస్తవులనుండి ప్రతిఫలము ఏమియును కోరలేదు.

పౌలు తన బోధనకు ప్రతిఫలముగా ఎప్పుడు ధనమునుగాని, వస్తువునుగాని, ఆశించలేదు, కోరలేదు. ఈ నిస్వార్ధమును పౌలు వ్యతిరేకులు ఏవిధముగను సవాలు చేయలేరు. ఈ నిస్వార్ధమే పౌలు ప్రేషిత కార్యమునకు గుర్తు.

11:13-15లో తన వ్యతిరేకుల పట్ల కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు. వారు అసత్య అపోస్తలులని, మోసపూరిత అపోస్తలులని, వారు తమ పనిని గూర్చి అసత్యము లాడుదురని, క్రీస్తు యొక్క నిజమైన అపోస్తలుల వలె అగుపడుటకు వేషము మార్చుకొందురని వారిపై తన కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు. వారిని సైతానుతో పోల్చుతున్నాడు. వెలుగు దూతవలె అగుపడునట్లు తమనుతాము మార్చుకొన గలరని చెప్పుచున్నాడు. వారి తప్పుడు బోధనల ద్వారా కొరింతీయులను చెడుపు చున్నారు.

5.3.3.3. అపోస్తలుడుగా పౌలు బాధలు – బలహీనతలయందు గర్వపడుట (11:16-33)

పౌలు తనను అవివేకిగా తలంపరాదని కోరుచున్నాడు. కేవలము లౌకిక కారణముల చేతనే తననుతాను పొగడు కొనుచున్నాడు (2 కొరి. 11:22). తన పరిచర్యలోను, కష్టములోను (2 కొరి. 11:23-26), దైవ సంఘములను గూర్చిన వేదనలోను (2 కొరి. 11:28), తాను పొందిన దర్శనములందును (2 కొరి. 12:1-5) పౌలు గర్వపడు చున్నాడు మరియు పొగడుకొను చున్నాడు.

తన వ్యతిరేకులను వారున్న స్థితిలోనే ఎదుర్కొనుటకు ఈ లౌకిక విషయాలలో తననుతాను పొగడుకొను చున్నాడు. వాస్తవానికి, పౌలు పొగడుకొనేది తను ఎంత బలహీనుడో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకొంటున్నాడు. “ఒకవేళ నేను పొగడు కొనవలసినచో, నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడు కొందును” (2 కొరి. 11:30). “నా బలహీనతలను ప్రదర్శించు విషయములను తప్ప, నన్ను గురించి నేను గొప్పగ చెప్పు కొనను” (2 కొరి. 12:5). “క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును” (2 కొరి. 12:9).

5.3.3.4. పౌలు దర్శనములు: పారవశ్యం, “శరీరములో ముల్లు” (12:1-10)

ఇచ్చట పౌలు ప్రభువు యొక్క దర్శనములను గూర్చియు, ప్రత్యక్షమగుటను గూర్చియు తెలియజేయు చున్నాడు. తనను దేవలోకమునకు ఎత్తబడుట (12:1-6), తన శరీరములో ఒక ముల్లు గ్రుచ్చ బడుట (12:7-10) గురించి మాట్లాడు చున్నాడు. అసత్యపు అపోస్తలులు వారి గొప్పతనమును గూర్చి చెప్పుకొనగ, పౌలు తన గొప్పతనము గురించి తెలియజేయు చున్నాడు. ఈ పొగడుట క్రీస్తు సువార్త కొరకు తను పడిన కష్టములు శ్రమలలోనే!

అసత్య అపోస్తలుల దర్శనములను గూర్చి విని అలిసిపోయి, ఇప్పటి వరకు రహస్యముగా ఉంచిన ప్తభువు దర్శనముల గూర్చి పౌలు బహిర్గతం చేయు చున్నాడు. పదునాలుగు సంవత్సరముల క్రితం తాను పొందిన ప్రభువు దర్శనము గూర్చి పౌలు మాట్లాడు చున్నాడు. ఆ దర్శనములో పౌలు మహోన్నతమగు దేవలోకమునకు ఎత్తబడెను. అది శరీరముతోనో లేక శరీర రహితముగనో దేవునకు మాత్రమే తెలుసు!

పౌలు చూచిన అద్భుత విశేషములను గురించి, దర్శనముల గురించి, గర్వముతో ఉబ్బిపోకుండా తన శరీరములో ఒక ముల్లు గ్రుచ్చ బడినది. అది సైతాను దూతగ పనిచేసి తనను నలగ గొట్టి గర్వము లేకుండా చేసెను.

“శరీరములో ముల్లు” (2 కొరి. 12:7)

“శరీరములో ముల్లు” ను ఏవిధంగా అర్ధం చేసుకోవాలి? అనేకమంది బైబులు పండితులు అనేక విధాలుగా వివరణలను ఇచ్చి యున్నారు:

(అ). శారీరక అనారోగ్యం: కంటి రోగము (గలతీ. 4:13-15), మూర్చరోగము (2 కొరి. 12:7, “నలగగొట్ట బడటం”). అవయవ / జ్ఞానేంద్రియ శక్తి లోపం / వక్తగా నైపుణ్యం లేకపోవడం (2 కొరి. 10:10, 11:6).
(ఆ). “శరీరములో ముల్లు”కు ఇవ్వబడిన ఇతర అర్ధాలు: యూదుల చేత సువార్త తిరస్కరించ బడటం, పౌలు శ్రమలు, పౌలు వ్యతిరేకులు (అబద్ద బోధకులు లేదా అసత్యపు అపోస్తలులు), సైతాను శోధనలు.
(ఇ). సంప్రదాయ అభిప్రాయాలు: లైంగిక శోధన వలన హింస, ఆధ్యాత్మిక బలహీనత, పాపము చేయుటకు శోధన

ఏది ఏమైనప్పటికిన, పౌలు “శరీరములో ముల్లు” యొక్క ఉద్దేశ్యము, పౌలును వినయముగా ఉంచి, తన బలహీనతలను తెలుసుకొనునట్లు చేయుట.

5.3.3.5. కొరింతీయులను గూర్చిన పౌలు చింత (12:11-21)

పౌలు కొరింతులో తన వ్యతిరేకుల చేష్టలను బట్టి తాను ఒక అవివేకిగా గొప్పలు చెప్పుకోవలసి వచ్చినదని పౌలు కొరింతీయులకు గుర్తుకు చేయుచున్నాడు. “నేను అవివేకి వలె ప్రవర్తించు చున్నాను, కాని నేను అట్లు చేయుటకు మీరే కారకులు (2 కొరి. 12:11). “నేను వ్యర్ధుడనైనను మీ విశిష్టమైన ‘అపోస్తలుల’ కంటె ఏ విధముగనుతీసిపోను” (2 కొరి. 12:11) అని పౌలు తన వాదనను వినిపిస్తున్నాడు. పౌలు అపోస్తలుడని స్పష్ట పరచుటకు తగిన సూచక క్రియలు, అద్భుతములు , మహత్కార్యములు ఉన్నవని స్పష్టమగు చున్నవి.

పౌలు కొరింతు ప్రజలనుండి ఏలాంటి ధనసహాయమును కోరలేదు (చూడుము. 2 కొరి. 11:9-11). కాని పౌలు మోసగాడని, కొరింతు దైవ సంఘములను మిగతా దైవసంఘముల కంటె హీనముగా చూస్తున్నాడని నిందించారు (2 కొరి. 12:13). కాని కొరింతీయులను ఏరకముగ బాధింప లేదని, వారికి భారము కాలేదని, పౌలు స్పష్టం చేయు చున్నాడు (2 కొరి. 12:13,14,16).

పౌలు కొరింతీయులను మూడవసారి సందర్శించుటకు సంసిద్ధ పడుచున్నట్లు తెలియజేయు చున్నాడు (2 కొరి. 12:14,21, 13:1). అలాగే వారికి ఏవిధముగను భారము కానని చెప్పుచున్నాడు. వారినుండి ఏమియు ఆశింపనని, దానికి బదులుగా తానే తన సమస్తమును సంతోషముగా వారి కొరకు వినియోగింతునని తెలియజేయు చున్నాడు. ఈ వైఖరి పౌలులోని తండ్రి ప్రేమను వ్యక్తపరచు చున్నది. పౌలు వారిని తన సొంత బిడ్డలుగా ఎంతగానో ప్రేమించాడు. వారితోనున్న సంబంధములో పౌలుకి ఎలాంటి రహస్య ఉద్దేశ్యాలు, ఆశయాలు ఏమి లేవు. వారిని ఎప్పుడు కూడా మోసగించ లేదు.

ఇలాంటి పరిస్థితులలో, పౌలు వారిని చూడాలని ఎంతగానో ఆశపడుచున్నాడు, కాని ఏమైనా జరుగునేమోనని భయపడుచున్నాడు. అలాగే వారు ఇంకను అన్యులవలె జీవించుచున్నారని, వారిలో వర్గములు ఏర్పడినవని పౌలు ఆందోళన చెంచుచున్నాడు.

5.3.3.6. తుది హెచ్చరికలు (13:1-10)

పాపము చేసి పశ్చాత్తాప పడని వారిపై కనికరము చూపనని పౌలు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తే తన ద్వారా వ్యవహరిస్తున్నాడని, మాటలాడు చున్నాడని తెలుపు చున్నాడు. క్రీస్తు, సిలువపై చంప బడినను, దైవశక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు.

కనుక, వారు ఆత్మ పరిశీలన చేసుకోవలెనని కోరుచున్నాడు. విశ్వాసము కలిగి జీవించు చున్నారా? క్రీస్తు యేసు మీ యందు ఉన్నాడని నిజముగ మీకు తెలియదా? అని వారిని ప్రశ్నిస్తున్నాడు. వారు ఎట్టి దోషములు చేయకుండుటకై పౌలు ప్రార్దిస్తున్నాడు. వారు సంపూర్ణులు కాగలుగుటకై పౌలు ప్రార్దిస్తున్నాడు.

5.4. ముగింపు

పౌలు మరల తిరిగి వచ్చుననే ఆశతో కొరింతీయుల నుండి సెలవు తీసుకొను చున్నాడు.

పౌలు తుది సూచనలు:

(అ). సంపూర్ణులగుటకు కృషి సలుపుడు
(ఆ). నేను బోధించిన సువార్తను ఆలకింపుడు
(ఇ). పరస్పరము ఏకీభావము కలిగి ఉండుడు
(ఈ). సమాధానముతో జీవింపుడు
(ఉ). పరస్పరము శుభాకాంక్షలు తెలుపు కొనుడు

No comments:

Post a Comment