07. పౌలు
రోమీయులకు వ్రాసిన లేఖ - 01
7.1. ఉపోద్ఘాతము
7.2. రోము క్రైస్తవ సంఘము
7.3. లేఖ వ్రాయు సందర్భము
7.4. లేఖ వ్రాయు ఉద్దేశము
7.5. లేఖ సారాంశం (1:16-17)
7.1. ఉపోద్ఘాతము
పౌలు లేఖలలో రోమీయులకు వ్రాసిన లేఖ ఆన్నింటికంటే ప్రాధాన్యతను సంపాదించుకున్నది. ఎందుకన, ఈ లేఖ వేదాంతపరంగా చాలా ప్రాముఖ్యమైనది మరియు చాలా ప్రత్యేకమైనది. అతి ముఖ్యమైన మరియు పరిపక్వమైన క్రైస్తవ వేదాంత బోధనలను మనం ఈ లేఖలో చూడవచ్చు. ఇది ఒక ఉత్తమ రచన అని చెప్పుకోవచ్చు. నాటి నుండి నేటి వరకు, క్రైస్తవ వేదాంతమును రూపొందించడములో ఈ లేఖ ఎంతగానో ప్రభావితం చేసియున్నది.
ఈ లేఖ చాలా తీక్షణముగా వ్రాయబడినది. దీనిలోని ప్రతీ వాదన లేదా బోధన లోతుగా, జాగ్రత్తగా ఆలోచనచేసి రూపొందించ బడినది.
పౌలు ఈ లేఖను కొరింతు నుండి వ్రాసియున్నాడు, కారణం రోమీ. 16:1లో ఉన్నట్లుగా, “కెంక్రేయలోని క్రైస్తవ సంఘపు పరిచారకురాలు ఫేబీ అను సోదరిని” పౌలు రోమీయులకు సిఫారసు చేయుచున్నాడు. కెంక్రేయ కొరింతు పశ్చిమ భాగములో ఉన్నది. అలాగే, రోమీ. 16:23లో “నాకును, తన గృహమున చేరు సంఘమునకు కూడ ఆతిధ్యమిచ్చు గాయియు మీకు శుభాకాంక్షలను అందించుచున్నాడు” అని చూస్తున్నాము. గాయు కొరింతులో ప్రముఖ వ్యక్తి (చూడుము. 1 కొరి. 1:14).
అ.కా. 20:2-3 ప్రకారము కూడా పౌలు ఈ లేఖను కొరింతునుండే వ్రాసాడని చెప్పవచ్చు. తన మూడవ ప్రేషిత ప్రయాణము చివరిలో, అనగా క్రీ.శ. 57 లేదా 58 శీతాకాలములో మాసిడోనియా గుండా సిరియా మరియు యెరూషలేమునకు వెళ్లక ముందు పౌలు కొరింతులో మూడు మాసములు ఉండెను. కనుక, క్రీ.శ. 58వ సంవత్సర ఆరంభములో పౌలు ఈ లేఖను వ్రాసియుండవచ్చు.
ఈ లేఖ “రోము నగర మందలి పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికి” (రోమీ. 1: 7), అనగా యూద-క్రైస్తవులకు మరీ ముఖ్యముగా అన్య-క్రైస్తవులకు వ్రాయబడినది (చూడుము. రోమీ. 1:16, 2:9-10, 3:9,29, 9:24, 10:12).
7.2. రోము
క్రైస్తవ సంఘము
క్రీ.పూ. ఒకటవ శతాబ్దము నుండియే రోము నగరములో యూదులు నివసించు చున్నట్లుగా తెలియుచున్నది (చదువుము. 1 మక్క. 14:24). రోమను జనరలు అయిన పొంపి (క్రీ.పూ. 106 – క్రీ.శ. 48), క్రీ.పూ. 61వ సంవత్సరములో పాలస్తీనా ఆక్రమణ తరువాత, కొంతమంది యూదులను రోము నగరమునకు బందీలుగా లేదా బానిసలుగా తీసుకొని వచ్చాడు. ఇంకొంతమంది వ్యాపార నిమిత్తమై రోము నగరమునకు వచ్చియున్నారు.
క్రీ.శ. మొదటి శతాబ్దము వరకు, రోము నగరములోని యూదులు క్రమక్రమముగా, దాదాపు నలభై వేలనుండి యాభై వేలకు (40,000 - 50,000) పెరిగి, పదమూడు ప్రార్ధనా మందిరముల (సినగోగు) క్రింద విభజింప బడినారు. రోము నగర యూదులు మరియు అన్యులు కొందరు క్రీస్తును విశ్వసించుట వలన అచ్చట క్రైస్తవ సంఘము ఏర్పడినది (రోమీ. 1:16, 2:9-10, 3:9,29, 9:24, 10:12).
క్రీ.శ. 49వ సంవత్సరములో క్లౌదియా చక్రవర్తి యూదులందరును రోము నగరమును వదిలి వెళ్ళవలయునని శాసించి యుండెను (అ.కా. 18:2). ఎందుకన, “క్రీస్తు” నామమున వారు అనేక అల్లకల్లోలములను సృష్టించు చుండిరి అని వారిపై అభియోగం మోపబడినది. ‘క్రీస్తు సువార్త’ యూదులలో విభజనలను సృష్టించినది. క్లౌదియా మరణానంతరం, నీరో చక్రవర్తి కాలములో, యూదులు మరల తిరిగి రోము నగరములో నివాసమును ఏర్పరచు కొనిరి.
రోము నగరములో క్రైస్తవ సంఘమును ఎవరు ఎప్పుడు నిర్మించారు అనేది మనకు స్పష్టముగా తెలియదు. సాంప్రదాయకముగా, పేతురు, పౌలులు రోము క్రైస్తవ సంఘ స్థాపకులుగా చెప్పబడు చున్నప్పటికిని, అక్కడ సంఘమును స్థాపించినది వారు కాదని స్పష్టముగా తెలియు చున్నది. వాస్తవానికి, పౌలు ఈ లేఖను వ్రాయు సమయానికి, రోము నగరమున ఉన్న క్రైస్తవ సంఘమునే చూడలేదు. ఏదేమైనప్పటికిని, పేతురు, పౌలులు ఇరువురు కూడా రోము క్రైస్తవ సంఘాభివృద్ధికి ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు అని చెప్పడములో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు.
పేతురు రోము నగరమునకు ఎప్పుడు వెళ్ళినది పూర్తి సమాచారము లేదు. పౌలు ఒక ఖైదీగా క్రీ.శ. 61లో రోము నగరమునకు కొనిపోబడ్డాడు. సుదీర్ఘ సముద్ర ప్రయాణము తరువాత, “పిదప మేము రోముకు వచ్చితిమి” అని లూకా వ్రాసాడు (అ.కా. 28:14). ఇరువురు కూడా రోము నగరములోనే క్రీ.శ. 60లలో (నీరో చక్రవర్తి కాలములో) హతసాక్షి మరణాన్ని పొందారు.
బహుశా, పెంతకోస్తు పండుగ రోజున యెరూషలేములో నున్న “రోము నగరము నుండి వచ్చిన సందర్శకులు” (అ.కా. 2:10) రోము నగరములో సువార్తను ప్రకటించి యుండవచ్చు. అలాగే వ్యాపార నిమిత్తము లేదా లౌకిక విధులను నిర్వహించుటకు రోము నగరమునకు వెళ్ళినవారు క్రీస్తును అచట పరిచయం చేసియుండవచ్చు.
ఈవిధముగా, రోము నగరములో క్రైస్తవ సంఘ ఆరంభం జరిగినది. రోము నగరములో ‘క్రైస్తవ మార్గాన్ని’ ఆలింగనం చేసుకున్న వారిలో యూదులు మరియు అన్యులు కూడా ఉన్నారు (రోమీ. 1:16, 2:9-10, 3:9,29, 9:24, 10:12). అ.కా. 18:2లో అక్విలా, ప్రిసిల్లా అను ఇరువురు రోమను యూద-క్రైస్తవులను చూడవచ్చు. క్రీ.శ.50లలో అనేకమంది క్రైస్తవులు రోము నగరములో నివసించిరి. కొద్దికాలములో అన్య-క్రైస్తవులు యూద-క్రైస్తవులను మించిపోయిరి.
7.3. లేఖ
వ్రాయు సందర్భము
పౌలు ఈ లేఖను వ్రాయడానికి గల
కారణాలను, రోమీ. 1:8-16, 15:14-16:23 నుండి సంగ్రహించ వచ్చు.
(అ). పౌలు రోమీయ క్రైస్తవులను
చూడవలెనని ఎన్నోసార్లు కోరుకున్నాడు (రోమీ. 1:13, 15:23). వారికి ఆధ్యాత్మిక
కృపావరములను ఒసగుటకు (రోమీ. 1:11), ఒకరి విశ్వాసము వలన ఒకరు ప్రోత్సాహము పొందుటకు
(రోమీ. 1:12), అన్యులను విశ్వాసులుగా మార్చుటకు (రోమీ. 1:13), అందరికి సువార్తను
బోధించుటకు (రోమీ. 1:14-15).
(ఆ). పౌలు మాసిడోనియా, గ్రీసు
దైవసంఘముల నుండి ప్రోగు చేసిన ధన సహాయమును యెరూషలేము నందలి దైవ ప్రజలలోని పేదలకు అందించిన
తరువాత సువార్త నిమిత్తమై స్పెయిను దేశమునకు వెళ్లాలని నిర్ణయించు కున్నాడు (రోమీ.
15:25-26).
(ఇ). స్పెయిను దేశమునకు
వెళ్ళుచూ మార్గమధ్యలో రోము నగర క్రైస్తవ సంఘమును సందర్శించాలని భావించాడు (రోమీ.
15:24-28).
(ఈ). యూదయాలోని అవిశ్వాసులనుండి రక్షింప బడునటులును, యెరూషలేములో తన సేవలు అచటి దైవప్రజలకు అంగీకార యోగ్యమగునట్లును ప్రార్ధింపుమని కోరుటకు (రోమీ. 15:30-31).
7.4. లేఖ
వ్రాయు ఉద్దేశము
పౌలు ఈ లేఖను నాలుగు ఉద్దేశాల
కొరకు లేదా ప్రయోజనాల కొరకు వ్రాసాడని భావింప వచ్చు:
7.4.1. మిషనరి
ఉద్దేశం: “అన్యజనుల అపోస్తాలుడు”గా అన్యజనుల సామ్రాజ్య రాజధాని అయిన
రోము నగరమునకు పౌలు ఈ లేఖను వ్రాయుచున్నాడు (చూడుము. రోమీ. 15:18-24, 28, 11:13-15,
25-26). రోము నగర క్రైస్తవ విశ్వాసుల గురించి తెలిసియున్నను (రోమీ. 1:8), అక్కడి
వారికి సువార్తను బోధించడానికి (రోమీ. 1:13-15), వారిని ప్రోత్సహించుటకు మరియు
వారికి ఆధ్యాత్మిక కృపావరములను ఒసగుటకు (రోమీ. 1:11-12), స్పెయిను ప్రయాణమునకు వారి
తోడ్పాటును పొందుటకు (రోమీ. 15:24, 28) పౌలు ఈ లేఖను వ్రాయుచున్నాడు.
7.4.2. విశ్వాసమును
సమర్ధించు ఉద్దేశము: పౌలును మరియు అతను బోధించిన సువార్తను ప్రత్యర్ధులు
దాడి చేయుచుంటిరి. క్రైస్తవ విశ్వాసమును, సువార్తను, తన ప్రేషిత కార్యమును
సమర్ధించుటకు పౌలు ఈ లేఖను వ్రాయుచున్నాడు.
7.4.3. సంఘ
నిర్వహణ ఉద్దేశము: రోము నగరములోని క్రైస్తవ సంఘములో నెలకొన్న
విభజనలను చక్కదిద్దుటకు (రోమీ. 14:1-15:6) పౌలు ఈ లేఖను వ్రాయుచున్నాడు. ‘సువార్త’ను
గురించిన సంపూర్ణ అవగాహనను పౌలు ఈ లేఖలో తెలియ జేయుటకు నిర్ణయించు కున్నాడు.
బహుశా, తాను బోధించిన సువార్తను మరియు ఆ సువార్తను సంఘములో ఎలా జీవించాలో ఇతరులకు
తెలియజేయాలని పౌలు భావించాడు.
7.4.4. వ్యక్తిగత ఉద్దేశము: రోమీయ క్రైస్తవులను సందర్శించాలని అనుకున్న నేపధ్యములో పౌలు ఈ లేఖను వ్రాయుచున్నాడు. ఇప్పటికే తాను వివాదాస్పదముగా మారుట వలన, సువార్త మరియు దాని పరిణామాల గురించి, ప్రామాణికమైన మరియు ఆమోదయోగ్యమైన వివరణను ఇచ్చుటకు ప్రయత్నం చేయుచున్నాడు. రోమీయ క్రైస్తవులు పౌలును చూడకపోయినప్పటికిని, అతని గురించి, అతని బోధనల గురించి వినియున్నారు. యూదుల ధర్మశాస్త్రమును పౌలు నిరాకరించాడని, ప్రత్యర్ధులు పౌలుకు వ్యతిరేకముగా తప్పుడు వార్తలను ప్రచారం చేసియున్నారు (రోమీ. 3:8). ఈ నేపధ్యములో, వివాదాస్పదమైన అంశాలపై తన వ్యక్తిగత అభిప్రాయాలను తెలుపుతూ, జరిగిన నష్టమును నియంత్రించుటకు ప్రయత్నం చేయుచున్నాడు.
7.5. లేఖ
సారాంశం (1:16-17)
ఈ లేఖ యొక్క సారాంశమును రోమీ. 1:16-17లో
చూడవచ్చు:
“నేను
సువార్తను గూర్చి సిగ్గుపడుట లేదు. ఏలయన, అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు,
తరువాత గ్రీకులకు కూడ రక్షణ నొసగు దేవుని శక్తి. ఏలయన మనుష్యులను దేవుడు ఎట్లు
నీతిమంతులుగ చేయునో సువార్త వ్యక్తపరచు చున్నది. అది విశ్వాసము మూలముగా అంతకంతకు
విశ్వాసము కలుగునట్లు జరుగును. ‘విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును’ అని
వ్రాయబడి యున్నది.”
ఈ వచనాలలో సువార్త, రక్షణ, విశ్వాసము, నీతిమంతులుగ పరిగణించుట మొదలగు ముఖ్యమైన అంశాలను చూడవచ్చు.
సువార్త: సువార్త
దేవుని శక్తి. విశ్వాసముగల వారందరికి సువార్త రక్షణ ఒసగును.
విశ్వాసం:
సత్యమును, మంచితనమును, రక్షణకు మూలం అయిన దేవునికి స్పందించడం (ప్రత్యుత్తర
మివ్వడం). దేవుని వాగ్దానాలపట్ల మరియు దేవుని విశ్వసనీయతపట్ల నమ్మకముంచుట (1:3ff.,
1 తెస్స. 5:24, 2 తిమో. 2:13, హెబ్రీ. 10:23. 11). వాటిని అములు చేయు దేవుని
శక్తిని నమ్ముట (రోమీ. 4:17-21, హెబ్రీ. 11:19). దేవుని కుమారుడైన యేసు క్రీస్తును
విశ్వసించ వలెను. దేవుడు మృతుల నుండి లేవనెత్తి ప్రభువుగా నియమించిన యేసును
విశ్వసించ వలెను.
రక్షణ: క్రీస్తు ద్వారా, క్రీస్తును విశ్వసించు వారందరికి దేవుడు జీవితము నొసగును (రోమీ. 6:8-11, 2 కొరి. 4:13ff., ఎఫెసీ. 1:19ff., కొలొస్సీ. 2:12, 1 తెస్స. 4:14). రక్షణకు కావలసిన నియమం ఏమనగా, యేసు నామములో లేదా మెస్సయా, ప్రభువు, దైవకుమారుడైన యేసులో విశ్వాసముంచుట (రోమీ. 10:9-13, 1 కొరి. 1:21, గలతీ. 3:22).
విశ్వాసము మేథస్సుకు సంబంధించినది కాదు. విశ్వాసమనగా జీవమునొసగు సత్యమునందు నమ్మకము, విధేయత కలిగియుండటం. విశ్వాసం ఒక వ్యక్తిని క్రీస్తుతో ఐఖ్యపరచును. ఆ వ్యక్తిపై పరిశుద్ధాత్మను ప్రసాదించును. విశ్వాసము మాత్రమే దేవుని వరముగ స్వీకరించిన పవిత్రతను ప్రభావితం చేయగలదు. విశ్వాసం, అబ్రహాముతో చేసిన వాగ్దానమునకు సంబంధం ఉండుట వలన (రోమీ. 4, గలతీ. 3:16-18), అందరికి, అనగా అన్యులకు సైతము రక్షణ లభ్యమగునట్లు చేయును.
విశ్వాసము జ్ఞానస్నానముతో తోడైయుండును (రోమీ. 6:4). విశ్వాసము బాహాటముగా ప్రకటింప బడవలెను. “మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును. నోటితో ఒప్పుకొని రక్షణ పొందును” (రోమీ. 10:10, 1 తిమో. 6:12). విశ్వాసము ప్రేమ ద్వారా పనిచేయును. “ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము” (గలతీ. 5:6, యాకో. 2:14-18). విశ్వాసము కష్టాలు, శ్రమలలో అధికము కావలెను (1 కొరి. 13:12, చూడుము. 1 యోహా. 3:2).
No comments:
Post a Comment