5.2. గ్రీకు నేపథ్యము

 5.2. గ్రీకు నేపథ్యము

పౌలు పాలస్తీనా యూదుడు కాదు. అతను గ్రీకు-మాట్లాడు హెబ్రీయుడు అనగా ‘డయాస్పోరా’ యూదుడు (a Jew of the Diaspora, అనగా “వాగ్ధత్త భూమి” అయిన పాలస్తీనాలో గాక, ప్రవాసములో స్థిరపడిన యూద సంఘాలకు చెందిన యూదులు). పౌలు తనను తాను హెబ్రీయుడు (ఫిలిప్పీ. 3:5) అని చెప్పుకున్నాడు, అనగా అతను గ్రీకు-మాట్లాడే యూదుడని, అరమాయికు భాష కూడా మాట్లాడగలడని తన భావన. పౌలు కాలములో అరమాయిక్ భాష సిరియా మరియు ఆసియా మైనరులో విసృతముగా ఉపయోగించడ మైనది.

‘పౌలు’ అను తన పేరు, లేఖలను గ్రీకు భాషలో వ్రాయడం, గ్రీకు పాత నిబంధనను (LXX) తన లేఖలలో ఉపయోగించడం తన  ‘డయాస్పోరా’ నేపధ్యాన్ని సూచిస్తున్నాయి. తన ‘దైవ పిలుపు’, ‘పరివర్తన’ మొదలగు అనుభవాలు యూదయా ప్రాంతం వెలుపల, గ్రీకు సంబంధిత సిరియా నగరమైన దమస్కు దగ్గరలో సంభవించాయి.

“సిలీషియాలోని తార్సు నగర యూద పౌరుడు”గా (అ.కా. 21:39) గ్రీకు సంస్కృతి ప్రభావం పౌలుపై ఖచ్చితముగా ఉంటుంది. తార్సు నగరం గ్రీకు సంస్కృతికి నిలయం, అది ఒక సూక్ష్మ ప్రపంచం. క్రీ.పూ. 66నుండి రోమను మండలములో భాగమై సిలీషియా రాజధాని అయినది. తత్వశాస్త్రమునకు ముఖ్యముగా స్తోయికు తత్వశాస్త్రమునకు చాలా ప్రసిద్ధి గాంచినది. నూతన నిబంధన కాలములో, తార్సు నగరం విద్య విషయంలో ఎథెన్సు, అలెగ్జాండ్రియ పట్టణాలను మించిపోయినది. ఇలాంటి నగరంలో పుట్టిన పౌలుపై తప్పక గ్రీకు సంస్క్రతి ప్రభావం ఉంటుంది.

గ్రీకు-రోమను వాక్చాతుర్యం, తత్వశాస్త్రము నందు పౌలు ప్రావీణ్యమును కల్గియున్నాడు. తన లేఖలలో గ్రీకు తత్వశాస్త్రమునుండి, గ్రీకు నేపథ్యమునుండి కొన్ని పదాలను, భావనలను, అంశాలను, శైలిని అనుకరించి యున్నాడు. ఉదాహరణగా, ఫిలిప్పీ. 1:17, 3:20లో గ్రీకు రాజకీయ పరిభాషను ఉపయోగించాడు. ఫిలిప్పీ. 2:16, 1 కొరి. 9:24-27లో గ్రీకు క్రీడలను ఉదాహరించాడు. ఫిలే. 1:18లో గ్రీకు వాణిజ్య పరిభాషను, గలతీ. 3:15, 4:1-2, రోమీ. 7:1లో గ్రీకు చట్టపరమైన పరిభాషను, 1 కొరి. 7:22, రోమీ. 7:14లో గ్రీకు బానిస వ్యాపార పరిభాషను ఉపయోగించాడు. 1 తెస్స. 2:19లో గ్రీకు చక్రవర్తి సందర్శన వేడుకలను సూచించాడు. “స్వతంత్రము” (గలతీ. 5:1, 13), “అంత:కరణము” లేదా “మనస్సాక్షి” లేదా “అంతరాత్మ” (1 కొరి. 8:7, 10, 12, 10:25-29, 2 కొరి. 5:11, రోమీ. 2:15) అను గ్రీకు తాత్పర్యాలను మరియు “సమృద్ధిగా” (2 కొరి. 9:8), “స్వభావ సిద్ధము” (రోమీ. 2:14) అను స్తోయికు తాత్పర్యాలను ఉపయోగించాడు.

గ్రీకు భాషపై, సంస్కృతిపై పౌలుకు ఎంత పట్టు ఉన్నదంటే, గ్రీకు కవులను, రచయితలను కూడా తన లేఖలలో ఉదాహరించాడు. ఉదాహరణకు, ‘అరాతుస్’ గ్రీకు కవి (అ.కా. 17:28), ‘మేనాండర్’ గ్రీకు కధారచయిత (1 కొరి. 15:23), ‘ఎపిమెనిడెస్’ గ్రీకు తత్వవేత్త-కవి (తీతు. 1:12).

ఈ గ్రీకు నేపథ్యమే తుదకు క్రైస్తవ సువార్తను పాలస్తీనా యూదుల మాతృక నుండి రోమను సామ్రాజ్యము లోనికి తీసుకొని పోవుటలో ఎదురైన సమస్యలను, ఇబ్బందులను భరించుటకు (‘డయాస్పోరా’) పౌలును బలపరచినది. అప్పటి తూర్పు మధ్యధరా ప్రపంచములోనికి సువార్తను తీసుకొని వెళ్ళడం మాత్రమే గాక, గ్రీకు సంస్కృతిగల చోట్లలో ‘క్రైస్తవ సంఘాలను’ నిర్మించ గలిగాడు. ‘డయాస్పోరా’ యూదులతో మరియు ఆ ప్రాంతములోని అన్యులతోనున్న ఆచరణాత్మక అనుభవం మరియు బలమైన పరిచయాలు, క్రైస్తవ మతము పట్ల పౌలుకున్న దృక్పధాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి.

అందుకే పౌలు “నీతిగా ఎంచబడుట” గురించి, “క్రైస్తవ సార్వత్రిక రక్షణ” గురించి వ్రాయగలిగాడు. అంతేగాక, శ్రీసభను “క్రీస్తు శరీరము”గా (1 కొరి. 12:27-28) ‘క్రైస్తవ సహవాసము’గా వర్ణించుట పౌలు అవగాహన ఖచ్చితముగా సమకాలీన గ్రీకు-రోమీయ రాజకీయ వ్యవస్థనుండి వచ్చిన ఆలోచనయే!

ఇవి సువార్తను ప్రకటించుటకు దేవునిచేత పిలువబడిన తార్సు నగర పౌలును ప్రభావితం చేసిన గ్రీకు నేపథ్యము.

No comments:

Post a Comment