5. పౌలు: యూద, గ్రీకు, రోమను నేపథ్యము: 5.1. యూద నేపథ్యము

 5. పౌలు:  యూదగ్రీకురోమను  నేపథ్యము

5.1. యూద నేపథ్యము

పౌలు ‘‘యిస్రాయేలీయుడు, అబ్రహాము సంతతి వాడు, బెన్యామీను గోత్రీయుడు’’ (రోమీ. 11:1). అనగా పౌలు పుట్టుకతో యూదుడు (అ.కా. 22:3), పరిసయ్యుడు (అ.కా. 23:6, 26:5). గ్రీకు వాతావరణం, యూద వంశపారపర్యం కలగలిపినదే పౌలు వ్యక్తిత్వం. అయితే ఏ సంస్కృతికి కూడా అతడు బానిస అవలేదు.

పౌలు తాను ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో తన యూద నేపథ్యము గురించి గర్వముగా చెప్పుకున్నాడు: “నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే ఎనిమిదవ రోజున నాకు సున్నతి కావింపబడినది. పుట్టుకచే యిస్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను, స్వచ్చమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను. నా మత ఆసక్తిచే దైవసంఘమును హింసించితిని. ధర్మశాస్త్రమునకు విధేయుడనై, మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశము ఉన్నదో, అంత వరకు నేను నిర్దోషిని” (3:5-6). కొరింతీయులకు వ్రాసిన రెండవ లేఖలో, “వారు హెబ్రీయులా? నేనును అట్టివాడనే” (11:22) అని ఉద్ఘాటించాడు.

లూకా కూడా అపోస్తలుల కార్యములులో పౌలు యూద నేపథ్యము గురించి ప్రస్తావించాడు. “నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను, కాని ఇక్కడ యెరూషలేమునందే పెరిగి, గమాలియేలువద్ద విద్యాభ్యాసము గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి, గట్టి ఉపదేశము పొందితిని. ఈనాడు ఇటనున్నమీరు అందరును దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితము కావించుకొంటిని” (అ.కా. 22:3). “నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను“ (అ.కా. 23:6). “నేను మొదటి నుండియు నిష్ఠాగరిష్ఠమైన మా మత వర్గములో సభ్యుడనుగా, పరిసయ్యుడనుగా జీవించిన విషయము వారు ఎరిగినదే” (అ.కా. 26:5).

‘‘యిస్రాయేలీయుడు”గా తన విశేష హోదాను పౌలు గుర్తించాడు: “దేవుడు ఎన్నుకొనిన యిస్రాయేలు ప్రజలను తన పుత్రులుగ చేసికొని, తన మహిమను వారితో పంచు కొనెను. వారితో నిబంధనలు చేసికొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే” (రోమీ. 9:4-5).

“అబ్రహాము సంతతి”గా, “అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్ధానము చేసెను” (రోమీ. 4:13) అని ఎరిగి యున్నాడు.

“బెన్యామీను గోత్రీయుడు’’గా పౌలు యాకోబు చిన్నకుమారుడు మరియు ప్రియమైన కుమారుడు బెన్యామీను పేరు మీద నెలకొన్న గోత్రానికి మరియు పండ్రెండు గోత్రములలో అతి చిన్నదైన దానికి చెందినవాడు. ఈ గోత్రము నుండియే యిస్రాయేలు ప్రధమ రాజు సౌలు ఉద్భవించాడు మరియు అతని పేరునే తనకు పెట్టబడి యున్నది (1 సమూ. 9:1, 4).

పౌలు తాను “పరిసయ్యుడ”ను అని గర్వపడ్డాడు, “యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను” (ఫిలిప్పీ. 3:5). “యూదమతమును అవలంబించుటలో తోడి యూదులనేకులలో నేనే అగ్రగణ్యుడనై యుంటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి యుండెడి వాడను” (గలతీ. 1:14). ‘పరిసయ్యుడు’ (అరమాయికు పదం pərîšayyâ “పెరిసయ్య” నుండి) అనగా ‘వేరు చేయబడినవాడు’ అని అర్ధం.

‘పరిసయ్యుల’ పుట్టుపూర్వోత్తరాల గురించి మనకు ఖచ్చితమైన సమాచారము లేదు. బైబులు పండితులు వీరి మూలాలు మక్కబీయుల కాలములో కనిపించిన “యిస్రాయేలీయులలోని భక్తులు, మహావీరులు, ధర్మశాస్త్రమును నిలబెట్ట వలెనను పట్టుదల కలవారు అయిన హాసిదీయులు” నుండి అని చెబుతున్నారు (1 మక్క. 2:42).

పరిసయ్యులు ఇతర యూద తెగలవారైన సద్దుకయ్యులు, ఎస్సేనీయులు, “ధర్మశాస్త్రమును ఎరుగని ప్రజలు” (యోహాను. 7:49) నుండి చాలా ప్రత్యేకముగా ఉండేవారు. మోషే చట్టమును కఠినముగా వివరించేవారు. వీరి ప్రకారం యూదులు లేదా యూద మతము అనగా ‘చట్టాన్ని నిక్కచ్చితముగా పాటించడమే’నని వాదించేవారు. మోషే బోధనలకు నిజమైన వారసులమని చెప్పుకునేవారు. మోషే చట్టముతోపాటు (తోరా) మౌఖిక లేదా నోటచెప్పిన పూర్వుల ఆచారములకు లేదా సంప్రదాయములకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చెడివారు (చదువుము. మత్త. 15:2, మార్కు. 7:5). ఈ సంప్రదాయములే చట్ట ఉల్లంఘనలనుండి కాపాడేవి!

ఈ భూలోకములో దైవరాజ్య స్థాపన జరుగునని పరిసయ్యులు ఆశించారు. మెస్సయ్య రాకలో తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించేవారు: రాజకీయముగా, మెస్సయ్య యిస్రాయేలు శత్రువులను జయించి వారిని లోబరచుకొనును. ఆధ్యాత్మికముగా, తన జ్ఞానము మరియు బోధనల ద్వారా ప్రజలను ‘తోరా’కు లోబడునట్లు చేయును. తన రాకతో ఓ కొత్త శకం, మెస్సయ్య యుగం ప్రారంభమగును. దానిలో అందరు ‘తోరా’కు లోబడునట్లు చేయును. మెస్సయ్య ఆత్మతో నిండి యుండును (యెషయ 44:3, యెహెజ్కె. 37:11-14, యోవే. 2:28-29). ఆయన ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను నింపును. మెస్సయ్య ద్వారా దేవుడు ఈ లోకమునకు తీర్పు చేయును అని వారు విశ్వసించారు.

ఈ నేపథ్యముతోనే పౌలు “ఇప్పుడు సువార్త నిమిత్తము ప్రత్యేకింప బడిన వాడను” (రోమీ. 1:1) అని, “ధర్మశాస్త్రమును (క్రియలు) నిక్కచ్చితముగా పాటించుట ద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు” (రోమీ. 3:20) అని, “మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసము వలన గాని ధర్మ శాస్త్రానుసార క్రియల వలన కాదు” (రోమీ. 3:28) అని వ్రాసాడు.

ఇవిగాక, పౌలు పాత నిబంధన యూదమత ప్రపంచములో జీవించాడు. దేవుడు వారి ‘పితరుల దేవుడు’ మరియు “వారి మనసులు పాత నిబంధన ముసుగుతోనే కప్పబడి ఉన్నవి” (2 కొరి. 3:14). దేవుడు తన సువార్తను ముందుగా తన ప్రవక్తల ద్వారా వాగ్ధానము చేసెను (రోమీ. 1:2). కనుక పౌలు పాత నిబంధన పద్దతిలోనే ఆలోచించాడు మరియు వ్యక్తపరచాడు. పాత నిబంధన ఉదాహరణలను, ప్రస్తావనలను తన లేఖలలో విరివిగా (90 సార్లు) ఉపయోగించాడు. పాత నిబంధన ద్వారా దేవుడు క్రీస్తు రాకను సిద్ధం చేసాడు. “మనము విశ్వాస మూలమున నీతిమంతులుగ తీర్చబడునట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను” (గలతీ. 3:24) అని పౌలు భావన. కనుక పాత నిబంధన ఇప్పటికి కూడా ఆదర్శప్రాయమైనదే! అబ్రహాము గురించి వ్రాయబడినది నేడు క్రైస్తవులకు కూడా సంబంధించునదియే! (చదువుము. రోమీ. 13-14 అధ్యాయాలు).

అలాగే పౌలు క్రీ.శ. మొదటి శతాబ్దములో జీవించిన యూదుడుగా ఆనాటి యూద పరిస్థితులచేత కూడా ఎంతగానో ప్రభావితం చేయబడినాడు. ఏదేమైనప్పటికిని, పౌలు తన యూద నేపథ్యము చేత ఎంతగానో ప్రభావితం కావింప బడినాడు. 

No comments:

Post a Comment