4. పౌలు ఫిలేమోనునకు వ్రాసిన లేఖ

 4. పౌలు ఫిలేమోనునకు వ్రాసిన లేఖ
4.1. ఉపోద్ఘాతము
4.2. లేఖ వ్రాయు సందర్భము
4.3. లేఖ ప్రాముఖ్యత
4.4. లేఖ సారాంశము
4.4.1. లేఖను పంపినవారు (1)
4.4.2. లేఖను పొందినవారు, శుభాకాంక్షలు (1-3)
4.4.3. కృతజ్ఞత, ప్రార్ధన (4-7)
4.4.4. ఓనేసిమును గూర్చిన మనవి (8-22)
4.4.5. ముగింపు: తుది శుభాకాంక్షలు (22-25)

4.1. ఉపోద్ఘాతము

పౌలు లేఖలలో అతి చిన్న లేఖ. కేవలము 25 వచనాలు. ఫిలేమోను అను వ్యక్తికి ఎంతో సున్నితముగా వ్రాయబడినది. ఫిలేమోను ఆసియా మైనరులోని లికుస్ లోయలలోని కొలొస్సీయ వాస్తవ్యుడు. ఫిలేమోనుతో పాటు ఆప్ఫియకు (బహుశా ఫిలేమోను భార్య), అర్కిప్పునకు (బహుశా వారి కుమారుడు) మరియు దైవ సంఘమునకు పౌలు ఈ లేఖను వ్రాయుచున్నాడు (ఫిలే. 1:2). ఫిలేమోను పౌలుచేత విశ్వాసమును పొందియున్నాడని 1:19 వచనంద్వారా తెలియుచున్నది. ఫిలేమోను యింట దైవసంఘము ప్రార్ధనకు గుమికూడెడిది. ఫిలేమోను నివసించు ప్రాంతము బహుశా పౌలు ప్రేషిత పరిచర్య ఫలితం అయుండవచ్చు.

పౌలు ఈ లేఖను చెరనుండి వ్రాసాడు (ఫిలే. 1:1, 9-10, 13, 23). బహుశా, పౌలు ఎఫెసు చెరలో ఉండగా (క్రీ.శ. 56-57) వ్రాసియుండవచ్చు.

4.2. లేఖ వ్రాయు సందర్భము

ఫిలేమోనుకు ఒనేసిము అనే బానిస ఉండేవాడు. అతడు యజమాని యింటినుండి పారిపోయి రోము నగరములోని చెరలో నున్న పౌలు వద్దకు చేరుకున్నాడు (ఫిలే. 1:11, 18). పౌలుపై ఫిలేమోనుకు ఉన్న గౌరవ మర్యాదల గురించి ఒనేసిము బాగా ఎరిగి యున్నాడు. ఏదో విధముగా, పౌలు ఒనేసిముకు ఆశ్రయ మిచ్చి, చివరికి అతనిని క్రైస్తవ విశ్వాసములోనికి నడిపించియున్నాడు. ఈ క్రమములో ఒనేసిము ఫిలేమోను బానిస అని పౌలు తెలుసుకున్నాడు. తన ప్రేషిత పరిచర్యలో సాయము చేయుటకు ఒనేసిమును తనతోపాటే ఉంచదలచుకొన్నను, ఫిలేమోను హక్కును గుర్తించి తిరిగి ఒనేసిమును ఫిలేమోను వద్దకు పంపదలచ పౌలు నిర్ణయించుకున్నాడు (ఫిలే. 1:14, 16).

ఆకాలములో బానిసత్వం చట్టపరమైనది. యజమానినుండి పారిపోయిన బానిసలపట్లగాని, వారికి సహాయము చేసిన వారిపట్లగాని తీవ్రముగా వ్యవహరించెడివారు. ఒనేసిము విషయములో పౌలుకున్న బాధ్యత ఏమనగా, ఫిలేమోనుతో అతనిని సఖ్యపరచి తిరిగి పంపడమే. బానిసత్వ చట్టం ప్రకారం, ఒనేసిము ఫిలేమోను వద్దకు తిరిగి రావలసి ఉంది. 1 కొరి. 7:21-24 మరియు ఎఫెసీ. 6:5-9 ప్రకారం, ఆనాటి సామాజిక వ్యవస్థను అంగీకరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులకే, ఒనేసిమును ఫిలేమోను వద్దకు పంపుటకు నిర్ణయించుకున్నాడు. అయితే, పౌలు ఒనేసిముతో ఫిలేమోనుకు ఒక లేఖను వ్రాసి పంపుచున్నాడు. ఈ లేఖ సారాంశం ఏమిటంటే, యజమానుడు అయిన ఫిలేమోను బానిస అయిన ఒనేసిము మధ్యనున్న బంధానికి పౌలు ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాడు. “ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాడు. సేవకుని కంటె ఎన్నియో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగ నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున, ప్రభువు విషయమున, నీకు అతడు ఎంతటివాడు కాగలడో! కనుక, నన్ను నీ భాగస్వామిగ నీవు ఎంచినచో, నాకు నీవు స్వాగత మిచ్చునట్లే అతనికి స్వాగత మిమ్ము. అతడు నీకు ఏమైన ఋణపడి ఉన్నను, అది నా లెక్కలో కట్టుకొనుము” (ఫిలే. 1:15-18).

పారిపోయిన బానిసయైన ఒనేసిమును ఇక “సేవకునిగగాక, ప్రియ సహోదరునిగ” (1:16) తిరిగి స్వాగతించమని పౌలు ఫిలేమోనును వేడుకొనుచున్నాడు. చట్టరీత్యా అతనిపై ఎలాంటి శిక్షకు గురిచేయవద్దని తెలియజేయు చున్నాడు. అతడు ఏమైన ఋణపడి ఉన్నను పౌలు తన లెక్కలో కట్టుకొనుము అని చెప్పియున్నాడు.

ఒనేసిము: కొలోస్సీ. 4:9 ప్రకారం, ఒనేసిము కొలొస్సీయుడని అర్ధమగుచున్నది. బహుశా కొలోస్సీ. 4:17లో చెప్పబడిన అర్కిప్పు బానిస అయి ఉండవచ్చు. బహుశా, ఒనేసిము తరువాత తిరిగి వచ్చి పౌలు ప్రేషిత పరిచర్యలో సహాయకుడిగా పనిచేసి ఉండవచ్చు. ఒనేసిము అనగా ‘ఉపయోగపడు’ అని అర్ధము.

4.3. లేఖ ప్రాముఖ్యత

ఈ లేఖ ఫిలేమోను పేర వ్రాయబడినప్పటికిని, ఫిలేమోను కుటుంబముతో సహా, వారి గృహము వద్ద సమావేశమగు దైవ సంఘమునకు వ్రాయబడినది. పౌలు తన అపోస్తోలికత్వ అధికారముతో ఫిలేమోనును శాసించే సాహసము కలిగి యున్నాడు (ఫిలే. 1:8). గమనించ వలసిన విషయాలు: (అ). బానిసయైన ఒనేసిము పట్ల పౌలు చూపించిన ఆప్యాయత, (ఆ). ఒనేసిమును తిరిగి ఫిలేమోను వద్దకు పంపడము వలన, పౌలు ఆనాటి సమాజములో నున్న బానిసత్వమును నిర్మూలించుటకు ప్రయత్నం చేయలేదు, (ఇ). బానిసత్వమను సామాజిక వ్యవస్థను దైవ సంఘములో పౌలు మార్చడానికి ప్రయత్నం చేసాడు.

ఒనేసిమును సహోదరునిగా స్వీకరించమని ఫిలేమోనును పౌలు కోరుచున్నాడు, ఎందుకన, “ప్రభువుచే పిలువబడిన సేవకుడు ప్రభువునకు చెందిన స్వతంత్రుడే. అట్లే క్రీస్తుచే పిలువబడిన స్వతంత్రుడు ఆయనకు సేవకుడే” (1 కొరి. 7:22). అలాగే, “క్రీస్తులో జ్ఞానస్నానము వారు క్రీస్తును ధరించి యున్నారు. కావున, యూదుడని, అన్యుడని లేదు. బానిసని, స్వతంత్రుడని లేదు. స్త్రీయని, పురుషుడని లేదు. క్రీస్తు యేసు నందు అందరు ఒక్కరే” (గలతీ. 3:27-28).

4.4. లేఖ సారాంశము

4.4.1. లేఖను పంపినవారు (1)

పౌలు ఈ లేఖను వ్రాసినప్పటికిని, పౌలుతో పాటు తిమోతి పేరు కూడా పేర్కొనబడింది (1). పౌలు తననుతాను ‘క్రీస్తుయేసు కొరకు బందీ’యని చెప్పుకొనియున్నాడు. వాస్తవముగా, పౌలు క్రీస్తు కొరకు ప్రస్తుతం ఎఫెసు చెరలో ఉన్నాడు. అలాగే, పౌలు తన జీవితాన్ని సంపూర్ణముగా క్రీస్తుకు అంకితం చేసుకొని క్రీస్తు బందీ అయ్యాడు.

4.4.2. లేఖను పొందినవారు, శుభాకాంక్షలు (1-3)

ప్రధానముగా, ఈ లేఖను స్వీకరించినది ఫిలేమోను, “సహోదరియగు ఆప్ఫియ, తోడి సైనికుడగు అర్కిప్పు మరియు దైవసంఘము.” కనుక, ఈ లేఖ ఫిలేమోనునకు వ్యక్తిగతముగా వ్రాసిన లేఖ ఎంతమాత్రము కాదు. ఫిలేమోను యింట సమావేశమగు దైవసంఘమునకు వ్రాయబడినది. పౌలు ఈ లేఖ ద్వారా రెండు విషయాలను సాధిస్తున్నాడు: ఒకటి, పౌలు, ఓనేసిమును గూర్చి, ఫిలేమోనునకు చేయు తన వ్యక్తిగత అభ్యర్ధనను అక్కడనున్న దైవసంఘమునకు కూడా తెలియజేయు చున్నాడు. తన అభ్యర్ధనను ఫిలేమోను తప్పక నెరవేర్చుటకు, దైవసంఘమునుండి ఒత్తిడిని పెంచుతున్నాడు. రెండవది, పౌలు అభ్యర్ధనను దైవసంఘము ఎదుట తిరస్కరించుటకు, ఫిలేమోను ఇబంది పడవచ్చు. పౌలు అభ్యర్ధనను ఫిలేమోను తిరస్కరించినను, దైవసంఘము అతనిని వేడుకొనే అవకాశం ఉంటుంది. 3వ వచనములో పౌలు దైవసంఘమునకు తన శుభాకాంక్షలను తెలియజేయు చున్నాడు.

4.4.3. కృతజ్ఞత, ప్రార్ధన (4-7)

క్రీస్తునందు మరియు తోటి క్రైస్తవులపట్ల ఫిలేమోనుయొక్క విశ్వాసమును, ప్రేమను పౌలు జ్ఞాపకము చేసుకొంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేయు చున్నాడు. పౌలు ఫిలేమోను మంచి క్రైస్తవుడని నొక్కిచెప్పుట వలన, ఓనేసిమును గూర్చి ఫిలేమోనునకు తన అభ్యర్ధనను తెలియజేయుటకు సంసిద్ధము చేయుచున్నాడు.

4.4.4. ఓనేసిమును గూర్చిన మనవి (8-22)

ఫిలేమోనును విధేయించమని శాసించే అధికారము అపోస్తలునిగా పౌలుకు ఉన్నదని గుర్తుచేయుచున్నాడు. అయితే, పౌలు ఆజ్ఞను జారిచేయడానికి బదులుగా, ఫిలేమోను సానుభూతి చూపాలని “తోటి క్రైస్తవుడు” ఓనేసిము తరుపున మనవి చేయుచున్నాడు.” (8-9). ఓనేసిముకు తండ్రిగా మారానని పౌలు తెలియజేస్తూ, తన బిడ్డ కొరకు ఈ మనవి చేయుచున్నాను అని వ్రాయుచున్నాడు (10). ఓనేసిము అనగా ‘ఉపయోగపడు’ అని అర్ధము. ఆ నామార్ధముగానే, ఒకప్పుడు ఉపయోగములేని ఓనేసిము ఇప్పుడు ఉపయోగపడును అని పౌలు ప్రకటించు చున్నాడు. “సువార్త కొరకు చెరయందు ఉన్నపుడు నీకు బదులుగా నాకు సాయపడును” (13) అని ఓనేసిము ఎలా ఉపయోగపడునో పౌలు స్పష్టముగ చెప్పియున్నాడు.

ఓనేసిమును తన వద్దనే ఉంచుకొనవలయునని ఉన్నదని పౌలు స్పష్టముగా చెప్పుచునే, అతనిని ఫిలేమోను వద్దకు, రెండు కారణాల వలన తిరిగి పంపుచున్నాడు: (అ). ఓనేసిము, ఫిలేమోను సేవకుడు కనుక, ఫిలేమోను సమ్మతి లేకుండా ఓనేసిమును పౌలు ఉంచుకొనవలయునని ఆశించలేదు. (ఆ). ఓనేసిమును సేవలు నిర్బంధముగా కాకుండా, స్వచ్చందముగా ఇవ్వాలని పౌలు ఆశిస్తున్నాడు. ఫిలేమోను, పౌలును భాగస్వామిగ ఎంచి, ఎలా స్వాగతిస్తున్నాడో, అలాగే ఓనేసిమును కూడా స్వాగతించాలని పౌలు కోరుచున్నాడు (17). ఓనేసిము ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసము వలన క్రైస్తవునిగా, సహోదరునిగా మారాడు. కనుక, పారిపోయిన తన సేవకుడిని, ఎలాంటి శిక్షకు గురిచేయకుండా ఫిలేమోను స్వాగతించవలెను. ఫిలేమోనుపట్ల ఓనేసిము ఏదైనా తప్పుచేసి యున్నను లేక ఏమైన ఋణపడి యున్నను అది తన లెక్కలో కట్టుకొనుము అని పౌలు తెలియజేయు చున్నాడు. ఆత్మ విషయములో ఫిలేమోను పౌలుకు ఋణపడి యున్నాడు కాబట్టి, ఈ ఉపకారము చేయుట వలన, తిరిగి ఋణము తీర్చుకొనే అవకాశము  ఫిలేమోనుకు వచ్చినదని పౌలు గుర్తుచేయు చున్నాడు.

తాను కోరినట్లు చేయునని, నిజముగ తాను చెప్పిన దాని కంటే ఎక్కువయే ఫిలేమోను చేయునని పౌలు దృఢమైన నమ్మకముతో ఈ లేఖను వ్రాయుచున్నాడు.

4.4.5. ముగింపు: తుది శుభాకాంక్షలు (22-25)

తన చెర కాలము త్వరలో ముగియునని ఆశిస్తూ, కొలోస్సీ నందుయున్న ఫిలేమోనును, దైవసంఘమును సందర్శించాలని భావిస్తూ, తన కోసం ఒక వసతి గదిని సిద్ధము చేయుమని పౌలు, ఫిలేమోనును కోరుచున్నాడు. బందీయైన తన తోడి ఎపఫ్రా (కొలోస్సీ. 1:7, 4:12), తన తోడి పనివారైన మార్కు, అరిస్టార్కు (కొలోస్సీ. 4:10-11), దేమా, లూకా యొక్క శుభాకాంక్షలను అందజేయుచున్నాడు (23-24). పౌలు తన లేఖను ఆశీర్వచనాలతో ముగిస్తున్నాడు (25).

No comments:

Post a Comment