05. పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ లేఖ

05. పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ లేఖ
5.1. ఉపోద్ఘాతము
5.2. లేఖ వ్రాయు సందర్భము

5.1. ఉపోద్ఘాతము

పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ కన్న, ఈ రెండవ లేఖ చాలా వ్యక్తిగత మైనది. ఎందుకన, పౌలు తన వ్యక్తిగత విషయాలను ఈ లేఖలో ప్రస్తావించాడు. అందుకే ఈ లేఖ వేదాంతపరమైన లేఖ అని చెప్పుకోవచ్చు. మొదటి లేఖను వ్రాసిన ఒక సంవత్సరము తరువాత, పౌలు ఈ రెండవ లేఖను కొరింతీయులకు వ్రాసాడు (చూడుము. 2 కొరి. 8:10, 9:2, 1 కొరి. 16:1-4).

కొరింతులో పౌలు తన రెండవ ప్రేషిత ప్రయాణములో పదునెనిమిది మాసములు అచ్చట ఉండి క్రైస్తవ సంఘమును నిర్మించాడు (అ.కా. 18:11). అ.కా. 18:1-3 ప్రకారం, పౌలు అక్విలా, ప్రిసిల్లా కుటుంబముతో కలిసి గుడారములు చేయు పనిని చేసి యున్నాడు. అపోస్తలుల కార్యములు మరియు ఇతర లేఖల నుండి సమాచారం ప్రకారం, కొరింతులో పదహారు మందిని పౌలు క్రైస్తవ విశ్వాసములోనికి నడిపించి యున్నాడు (అ.కా. 18:2-17, 1 కొరి. 16:15-19, రోమీ. 16:1-3, 21-23). కొరింతులో తన మొదటి ప్రేషిత కార్యము ముగియు వరకు బహుశా యాభై మంది క్రైస్తవులు ఉంది యుండవచ్చు.

కొరింతులో పౌలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. తన యోగ్యతను, ప్రేషిత పరిచర్యను కొరింతీయులు ప్రశ్నించారు. సంఘములో అనేకమంది పౌలును ఎదిరించారు. పౌలు వ్యతిరేకులు ఎవరన్నది రెండు బిన్నాభిప్రాయాలు ఉన్నవి: (అ). యూద-క్రైస్తవులు (అబద్ద బోధకులు), (ఆ). గ్రీకు యూదులు. పాలస్తీనా యూదులు అని ఇంకొక అభిప్రాయము కూడా ఉన్నది.

కొరింతీయులకు వ్రాసిన రెండవ లేఖ అనేక లేఖల కూడికయని బైబులు పండితుల అభిప్రాయం:

(అ). 2:14-6:13 + 7:2-4, (ఆ). 10-13 అధ్యాయాలు, (ఇ). 1:1-2:13 + 7:5-16, (ఈ). 8:1-24, (ఉ). 9:1-15, లేదా రెండు లేఖల కూదికయైనా అయి ఉండవచ్చు అని మరొక అభిప్రాయం: (అ). 1-9 అధ్యాయాలు, (ఆ). 10-13 అధ్యాయాలు.

తను ప్రేమించిన కొరింతు క్రైస్తవ సంఘ విశ్వాసులు తనను నమ్మనప్పుడు, నిందలు మోపినప్పుడు, తన వ్యక్తిగత సాక్ష్యము ద్వారా, పౌలు తననుతాను సమర్ధించుకొను చున్నాడు. తద్వార, ఈ లేఖ ద్వారా, పౌలు వ్యక్తిత్వం గురించి, దైవ పిలుపు పట్ల తనకున్న మక్కువ, క్రీస్తు అపోస్తలుడుగా మొ.గు. ఎన్నో విషయాలను గురించి మనం తెలుసుకొన వచ్చును.

ఈ లేఖ పౌలుకు-కొరింతీయులకు మధ్యనున్న సంక్షోభము గురించి స్పష్టముగా తెలియజేయు చున్నది. పౌలు తన వ్యతిరేకుల నుండి లేదా అబద్ద బోధకులనుండి తన యోగ్యతను, ప్రేషిత పరిచర్యను, అపోస్తోలికత్వమును సమర్ధించుకొను చున్నాడు.

తననుతాను సమర్ధించు కోవడం, బాధల సమయములో నమ్మకం ఉంచడం, యెరూషలేము సంఘము కొరకు ధన సహాయము, తోటి క్రైస్తవులకు సహకారము మొ.వి. ఈ లేఖలోని ఇతర అంశాలు.

5.2. లేఖ వ్రాయు సందర్భము

పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ లేఖ, రెండు లేఖల కూడికగా అంగీకరించినచో (1-9, 10-13), అవి వ్రాయబడిన సమయము, స్థలమును సూచించ వలయును. 1-9 అధ్యాయాలను (మొదటి లేఖ), పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ అనంతరం, ఒక సంవత్సరము తరువాత వ్రాసినట్లుగా అర్ధమగు చున్నది (2 కొరి. 8:10, 9:2). దీనిని మాసిడోనియా నుండి క్రీ.శ. 55వ సంవత్సరములోని వసంత కాలములో కొరింతీయులకు పౌలు వ్రాసి యున్నాడు (2 కొరి. 2:13, 7:5, 8:1, 9:2). ఈ లేఖను కొరింతీయులకు పౌలు అనుచరుడు అయిన తీతు అందజేశాడు. ఈ లేఖ పౌలు మరియు కొరింతీయులకు మధ్య చెడిపోయిన సంబంధాలను సరిచేయు చున్నది.

క్రీ.శ. 55వ సంవత్సరములోని వేసవి కాలములో పౌలు తన ప్రేషిత పరిచర్యను ఇలూరికంలో కొనసాగించాడు (2 కొరి. 10:16, రోమీ. 15:19). ఇలూరికంలో నున్నప్పుడు కొరింతు సంఘములోని పరిస్థితులు చాలా దారుణముగా ఉన్నాయనే వార్తను పౌలు విని, తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఈ లేఖను, అనగా 10-13 అధ్యాయాలను వ్రాసి యున్నాడు.

పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ అనేక సమస్యల గురించి చర్చించినది, కాని కేవలం కొన్ని సమస్యలను మాత్రమే పరిష్కరించ గలిగినది. మొదటి లేఖ తరువాత, క్రైస్తవ అపోస్తులమని, యెరూషలేము అపోస్తలుల చేత ఆమోదింప బడిన వారమని చెప్పుకుంటూ, కొంతమంది అబద్ద బోధకులు కొరింతు లోనికి ప్రవేశించారు. వారు పౌలును అపోస్తులునిగా గుర్తించ లేదు మరియు అంగీకరించ లేదు. పౌలు యెరూషలేములోని అపోస్తలుల చేత ఆమోదింప బడలేదని నిందించారు. “విశ్వాసముచేత నీతిమంతులుగా ఎంచబడును” అన్న పౌలు సువార్తను వారు అనుమానించారు. పౌలు అబద్ధపు అపోస్తులుడని అన్నారు.

వారి తీరు కలహములతోను, ఆధిపత్యముతోను ఉండినది. పౌలు కొరింతును సందర్శించి నప్పుడు, వారిలో ఒకరు బహిరంగముగా పౌలుపై బడి అవమానించాడు (2 కొరి. 2:5-11). ఆశ్చర్యకరముగా, ఆ సమయమున కొరింతులోని క్రైస్తవ విశ్వాసులు తమ బోధకుడైన పౌలును సమర్ధించుటకు ఎవరుకూడా ముందుకు రాలేదు (2 కొరి. 2:2-3).

కొద్దికాలము తరువాత, పౌలు తీతును మాసిడోనియాలో కలుసుకున్నాడు. కొరింతీయుల గురించి పౌలుకు ఆనందదాయకమైన సమాచారాన్ని తీతు అందించి యున్నాడు: పౌలును చూడవలెనని వారు ఆశించారు. పౌలును సమర్ధించుటకు వారి సంసిద్ధతను తెలిపారు. ఇది తెలుసుకున్న పౌలు ఎంతగానో ఆనందించాడు. ఈ ఆనందముతో పౌలు కొరింతీయులకు రెండవ లేఖను మాసిడోనియా నుండి క్రీ.శ. 55-56వ సంవత్సరములో వ్రాసి యున్నాడు.

No comments:

Post a Comment