3.5.3. క్రైస్తవ స్వతంత్రము (5:1-6:10)

3.5.3. క్రైస్తవ స్వతంత్రము (5:1-6:10)
3.5.4. ప్రత్యేక అంశము
3.5.5. ఇతర అంశాలు
3.6. ముగింపు

పౌలు తన వాదనలన్నింటిని 5:1లో క్రోడీకరించి యున్నాడు: “స్వతంత్రులుగ జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను.” మరల బానిసలుగా మారకండి అని పౌలు గలతీయులను కోరుచున్నాడు. దేవుని కృపయైన సువార్తా వెలుగులో సున్నటి అర్ధరహిత మైనది. “సున్నతి పొందినచో, క్రీస్తు మీకు పూర్తిగ నిరూపయోగ మగును. సున్నతి పొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను. మీరు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాదలచినచో, క్రీస్తు నుండి వేరైనట్లే. మీరు దేవుని కృప నుండి తొలగి పోతిరి” (గలతీ. 5:2-4). అన్య-క్రైస్తవులు సున్నతి పొందిన యెడల, క్రీస్తు వారికి నిరుపయోగ మగును, క్రీస్తు నుండి వేరగును, దేవుని కృప నుండి తొలగి పోవును.

క్రైస్తవ స్వతంత్రమును ఎలా ఆచరించ గలరో గలతీయ అన్య-క్రైస్తవులకు పౌలు తెలియజేయు చున్నాడు. వారు ఒకరికొకరు జీవిస్తూ, ప్రేమతో సేవకులుగా ఉండవలయును. వారు ఆత్మ యందు నడుచుకొన వలయును. శారీరక వాంఛలను తృప్తిపరచుటకు ప్రయత్నింప కూడదు. ఆత్మ శరీరమునకు విరుద్ధము అని పౌలు గ్రహించు చున్నాడు (రోమీ. 7:15-20). శరీరానుసారముగ జీవించడం అనగా ఏమిటో పౌలు వివరిస్తున్నాడు (గలతీ. 5:19-21). అలాగే ఆత్మానుసారముగా జీవించడం అనగా ఏమిటో కూడా వివరిస్తున్నాడు (గలతీ. 5:22-26). శరీరాను సారమైన జీవితం అన్ని రకాలైన అనైతికతకు నడిపించును. ఆత్మానుసారమైన జీవితం శాంతి, ఆనందము, ఇతర సుగుణాలను తెచ్చి పెట్టును.

శరీర కార్యములు

జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రాహారాధన, మాంత్రిక శక్తి, శతృత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్ధము, కక్షలు, వర్గాతత్వము, మాత్సర్యము, త్రాగుబోతు తనము, విందులు వినోదములు మొ.వి.

ఆత్మ ఫలములు

ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్త్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టము లేదు.

ఒకరికొకరు సహాయం చేసుకొనవలెనని, ఒకరి భారములను మరియొకరు భరించ వలయునని కోరుచున్నాడు. శరీరానుసారమైన జీవితం మరణమునకు, ఆత్మానుసారమైన జీవితం నిత్యజీవితమునకు నడిపించునని, పౌలు గలతీయులకు తెలియజేయు చున్నాడు. కనుక వారు విశ్వాసములో ఆత్మానుసారమైన జీవితమును జీవింప వలయును (గలతీ. 6:1-10).

3.5.4. ప్రత్యేక అంశము

పౌలు - సువార్త

గ్రీకు భాషలో ‘ఎవంగెలెయోన్’ అనగా సువార్త, సువిశేషము, మంచి వార్త అనే అర్ధాలున్నాయి. ఇతర అర్ధములు ఏమనగా, యుద్ధములో గెలిచినప్పుడు ప్రకటించే మంచి వార్త, అదృష్టము, ప్రజలకు రక్షణ మొ.వి. పౌలు ప్రకారం, పాత నిబంధన సువార్తకు సంబంధించినది, ఎందుకన, అది క్రీస్తుకు సాక్ష్యము ఇచ్చు చున్నది. కావున, పాత నిబంధన కూడా అన్యులలో సువార్తను ప్రకటించుటకు, వారిని విశ్వాసములోనికి తెచ్చుటకు ఉపకరించును (రోమీ. 16:25-26). పౌలు ప్రకటించిన సువార్తలోని ప్రధాన విషయం ఒక్క మాటలో చెప్పాలంటే, “యేసు క్రీస్తు”. సువార్త రక్షణ నొసగు దేవుని శక్తి (రోమీ. 1:16). సువార్తా ప్రకటనలో దేవుని యొక్క నీతి, ధర్మం వెల్లడించ బడెను. కనుక సువార్త దేవుడు వెల్లడి చేసిన కార్యము.

పౌలు ప్రకారం, ఒకే సువార్త ఉన్నది. అదియే క్రీస్తు సువార్త. ఈ సువార్తనే పౌలు యెరూషలేములోని అపోస్తలులతో పంచు కొనెను. వాస్తవమునకు ‘మరియొక సువార్త’ లేదు (గలతీ. 1:7). కొన్ని సార్లు ఈ సువార్త తన స్వంత సువార్తగా పౌలు పిలుచు చున్నాడు. ఎందుకన, సువార్తను బోధించు బాధ్యతను దేవుడే పౌలుకు అప్పగించి, అన్యులకు అపోస్తలునిగా పిలచెను (1 తెస్స. 2:4, గలతీ. 2:7).

యేసు క్రీస్తు ద్వారా దేవుడు మానవ చరిత్రలోనికి ప్రవేశించన ఈ సువార్త ఒక పరమ రహస్యము. పౌలు ప్రకటించిన సువార్తలోని మూలరాయి, “దేవునిచేత నీతిమంతులుగా పరిగణింప బడుట”. అలాగే సువార్త స్వాతంత్ర్యమును ఒసగును. యేసు మరణము పౌలు సువార్తకు పునాది. ఉత్థాన క్రీస్తు సువార్తకు హృదయం (1 తెస్స. 1:10, రోమీ. 10:9).

దేవుడు సర్వ మానవాళిని రక్షించెను. నిరీక్షణ, ప్రోత్సాహం, నిత్యజీవము నొసగు ఈ సువార్తను మానవాళి విశ్వసించవలెనని పౌలు ఈ లోకమునకు ప్రకటించు చున్నాడు.

3.5.5. ఇతర అంశాలు

క్రీస్తునందు విశ్వాసంద్వారా రక్షణ, సున్నతి, ధర్మశాస్త్రం, ఆత్మ మరియు ఆత్మవరాలు మొదలగునవి ఈ లేఖలో ఇతర ముఖ్యమైన వేదాంత బోధనలు. పౌలు ప్రధాన బోధన క్రీస్తునందు విశ్వాసంద్వారా రక్షణ. క్రీస్తునందు విశ్వాసులు రక్షణ పొందుటకు, క్రీస్తునందు విశ్వాసముతప్ప ఇతరమేదియు అవసరము లేదు. సున్నతి, ధర్మశాస్త్రము మొదలగు సంప్రదాయాల ఆచారణ యెరుషలేములోని యూద-క్రైస్తవులు, అపోస్తలుడైన యాకోబు మద్దతుతో, తప్పనిసరియని భావించారు. కొన్నిసార్లు అపోస్తలుడు పేతురుకూడా మద్దతు ఇచ్చియున్నాడు. కాని పౌలు ఈ ఆచరణలను తీవ్రముగా వ్యతిరేకించాడు. ఇవి నిజ సువార్తకు ఎలాంటి సంబంధము లేదని భావించాడు.

క్రీస్తునందు విశ్వసించిన వారికి సున్నతి, ధర్మశాస్త్రము అవసరము లేదు. పౌలు దేవుని ఆత్మానుభవమును ఆత్మ వరములను పొందియున్నాడు. క్రైస్తవులుకూడా ఈ అనుభవమును పొందియుండుట పౌలు గాంచాడు. శరీర కార్యములు, ఆత్మకు వ్యతిరేకమని పౌలు ఎరిగియున్నాడు. కనుక క్రైస్తవులు శరీర కార్యములకు బానిసలు కాకూడదు. క్రీస్తునందు విశ్వాసముంచి, జ్ఞానస్నానము పొందిన వారందరు క్రీస్తు వారిని స్వతంత్రములోనికి పిలిచినాడని పౌలు నమ్మకం. ఏదేమైనప్పటికిని, వారు ఈ స్వతంత్రమును కోల్పోరాదు. క్రీస్తు వచ్చువరకు ధర్మశాస్త్రం సన్నాహక అవసరతను కలిగి యున్నది. క్రీస్తు తన మరణ, ఉత్థానములతో మానవాళిని ధర్మశాస్త్రమునుండి స్వతంత్రులను చేసాడు. క్రీస్తునందు, సువార్తనందు విశ్వసించు వారందరు రక్షింప బడుదురని పౌలు బోధించుచున్నాడు. .

3.6. ముగింపు

ఈ లేఖ ద్వారా గలతీయ క్రైస్తవ సంఘములో జరిగిన నష్టమును పూరించుటకు పౌలు ఎన్నో పాట్లు పడ్డాడు. వారిలో విశ్వాసమును బలపరచుటకు, వారితో సత్సంబంధాలను పునర్నిర్మించుటకు ఎంతగానో కృషి చేసాడు. కాని, తన వ్యతిరేకులైన యూదుల (“కొంతమంది సోదరులు”) రాకతో పౌలు కృషి తలక్రిందులయ్యెను. గలతీయులు వారి బోధనకు ఆకర్షితులయ్యారు. వారి బోధన సారాంశం – ధర్మశాస్త్రము మరియు సున్నతి. క్రైస్తవులుగా మారుటకు ఇవి తప్పని సరియని బోధించారు.

ఇది తెలుసుకున్న పౌలు ఆశ్చర్యానికి లోనయ్యాడు. తక్షణమే ఈ లేఖను వ్రాయు చున్నాడు. ఈ లేఖలో తన వాదనలు, కథనాలు, పాటాలు, ఉపదేశములు, బోధనలు మొ.గు. వాటి ద్వారా గలతీయులను సరిదిద్దు తున్నాడు. తన బోధనలో విశ్వాసులకు క్రీస్తు యొక్క ప్రాధాన్యతను గూర్చి తెలియజేయు చున్నాడు. క్రీస్తు కేంద్ర బిందువైన సువార్తను పౌలు బోధించాడు.

No comments:

Post a Comment