2. పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ

 2. పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ
2.1. ఉపోద్ఘాతము
2.2. పౌలు వీడ్కోలు
2.3. అసత్య బోధనలు


2.1. ఉపోద్ఘాతము

పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ కన్న రెండవ లేఖ చాలా వ్యక్తిగతమైనది (2 తిమో. 1:15-18, 4:9-13). తిమోతి, ఆయన దైవసంఘము ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితుల గురించి ఈ లేఖ తెలియజేయు చున్నది. ఈ సందర్భముగ, పౌలు తిమోతికి సానుభూతిని తెలుపుతూ, తన పరిచర్య సేవలో స్థిరముగా ఉండాలని ప్రోత్సహిస్తున్నాడు. ఈ లేఖలో క్రీస్తు ఒక తీర్పరిగా, న్యాయాధిపతిగా ప్రదర్శింప బడినాడు. ఆయన విశ్వాసులను ఫలింప జేయును, దుష్టులను శిక్షించును (2 తిమో. 1:18, 4:1,8,14). అలాగే, ఈ లేఖ శ్రీసభలో మారిన పద్ధతులను తేటతెల్లము చేయు చున్నది.

2.2. పౌలు వీడ్కోలు

చరమ దశలో నున్న పౌలు తన వీడ్కోలు పలుకులను (2 తిమో. 4:6-8) తిమోతికి వ్రాసి యున్నాడు. ఇది పౌలు తన మూడవ వీడ్కోలు సందేశము.

మొదటిది, క్రీ.శ. 57-58లో కొరింతు నుండి పౌలు వ్రాసిన రోమీ. 15:25-33లో చూస్తున్నాము. “సోదరులారా! నా కొరకై దేవుని ఆసక్తితో ప్రార్ధించి నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువగు యేసు క్రీస్తును బట్టియు, ఆత్మయొక్క ప్రేమను బట్టియు మిమ్ము అర్ధించు చున్నాను. యూదయాలోని అవిశ్వాసుల నుండి నేను రక్షింపబడునటులును, యెరూషలేములో నా సేవలు అచటి దైవప్రజలకు అంగీకార యోగ్యమగునట్లు ప్రార్ధింపుదు. కనుక, అది దేవుని చిత్తమైన, నేను సంతోషముతో మిమ్ము చేరి, మీతో ఆనందింప గలను” (రోమీ. 15:30-33).

రెండవ వీడ్కోలు సందేశం అ.కా. 20:17-36లో చూస్తున్నాము. క్రీ.శ. 58లో యెరూషలేము ప్రయాణమునకు ముందు, పౌలు వీడ్కోలు ప్రసంగము చెప్పెను. “మీలో ఎవరును నన్ను మరల చూడరని ఇప్పుడు నాకు తెలియును” (20:25) అని పౌలు చెప్పు చున్నాడు. “వారు వీడుకోలు సూచనగా పౌలును కౌగిలించుకొనుచు, ముద్దు పెట్టుకొనుచు అందరును కన్నీరు కార్చిరి. మరల వారు ఎన్నటికిని అతనిని చూడ బోరని, అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిరి” (20:37-38).

ఇక మూడవ వీడ్కోలు ఇచట పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖలో చూస్తున్నాము. “నేను బలిగా అర్పింప బడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడితిని. నా పరుగును ముగించితిని. విశ్వాసమును నిలుపు కొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి యున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు. ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికి అనుగ్రహించును” (2 తిమో. 4:6-8).

ఈ లేఖను పౌలు వీడ్కోలు పత్రముగా మనము పరిగణింప వచ్చు. ఇలాంటి వీడ్కోలు పలుకులను నూతన నిబంధన గ్రంథములో మనము చూడవచ్చు: యేసు వీడ్కోలు పలుకులు (యోహాను 13-17, లూకా. 22:14-38) పేతురు వీడ్కోలు పలుకులు (2 పేతు. 1:12-15), పౌలు వీడ్కోలు ప్రసంగము (అ.కా. 20).  

పౌలు యొక్క వీడ్కోలు పలుకులలో ఈ క్రింది విషయాలను గమనింప వచ్చు:

- దు:ఖముతో కూడిన స్వరముతో తుది వీడ్కోలు పలుకులను పలుకుచున్నాడు (2 తిమో. 4:6-8)
- విశ్వాసులు భయపడ వద్దని, అభద్రతకు లోనుకాకూడదని తన అభయ పలుకులను పలుకుచున్నాడు (2 తిమో. 2:1-2, 14-15, 4:1-2)
- పౌలు తన గత జీవిత పరిస్థితిని నెమరు వేసుకొను చున్నాడు (2 తిమో. 1:11-13, 15-18, 3:10-17)
- విశ్వాసులు ఐఖ్యతను కలిగి జీవించాలని ప్రేరేపించు చున్నాడు (2 తిమో. 2:14, 23-25)
- శతృవుల నుండి అపాయమును పౌలు ముందుగానే పసిగడుతున్నాడు (2 తిమో. 2:16-17, 3:1-9, 12-13, 4:3-4)
- విశ్వసనీయతను ప్రోత్సహిస్తూ ఉన్నాడు, వారు తగిన బహుమానమును పొందుదురని తెలియజేయు చున్నాడు (2 తిమో. 2:11-13, 3:14, 4:8)
- విశ్వాసుల యెడల తన ప్రేమను చాటుచున్నాడు (2 తిమో. 1:4-5, 2:1 “నా కుమారుడా!”)

ఈ వీడ్కోలు పలుకుల ద్వారా, పౌలు తననుతాను “విశ్వాసమనెడు బల్యర్పణపై ధారపోసిన పాన బలిగా” (ఫిలిప్పీ. 2:17) వివరిస్తున్నాడు. పౌలు “విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి యున్నాడు (1 తిమో. 6:12), “పరుగు పందెములో పాల్గొని యున్నాడు” (2 తిమో. 2:5, 1 కొరి. 9:24). పౌలు తన విశ్వాసమును నిలుపుకొని యున్నాడు (2 తిమో. 4:7). ఆ విశ్వాసమును ఇతరులకు అందజేశాడు మరియు సువార్తికునిగా, బోధకునిగా విశ్వాసపాత్రుడై జీవించాడు. 1 కొరి. 4:1-5లో చెప్పబడినట్లుగా దేవుని తీర్పుకై ఎదురుచూచు చున్నాడు. అప్పుడు (ప్రభువు రాకడ సమయమున) తనకు తగిన బహుమానమును దేవుడు ఒసగునని ఎదురుచూచు చున్నాడు.

2.3. అసత్య బోధనలు

సువార్తా ప్రచారం కొరకు తిమోతి పాటుబడ్డాడు. అయితే, కొంతమంది అసత్యపు బోధకుల వలన సువార్తా ప్రచారం తిమోతికి ఇబ్బందికరముగ మారినది. హిమనేయుసు మరియు పిలేతుసును అసత్యపు బోధకులలో ఇరువురు. వారు “పునరుత్థానము ఇప్పటికే జరిగిపోయినదని కొందరి విశ్వాసుల నమ్మకమును చెడగొట్టి యున్నారు” (2 తిమో. 2:14-19). 2 తిమో. 3:1-9లో కూడా పౌలు అసత్యపు బోధకుల గురించి చెప్పుచున్నాడు. వీరి వలన క్రైస్తవ సంఘాలు విభజించ బడ్డాయి.

No comments:

Post a Comment