3. పౌలు
గలతీయులకు వ్రాసిన లేఖ
3.1. ఉపోద్ఘాతము
3.2. గలతీ పట్టణం
3.3. పౌలు – గలతి క్రైస్తవ సంఘము
3.3.1. పౌలు గలతీకు రాకముందు
3.3.2. పౌలు గలతీకు వచ్చిన తరువాత
3.3.3. పౌలు గలతీనుండి వెళ్ళిన తరువాత
3.4. లేఖ వ్రాయు సందర్భము
పౌలు లేఖలలో గలతీయులకు వ్రాసిన లేఖ చాలా ముఖ్యమైనది. ఇది అనాధి క్రైస్తవుల గూర్చి తెలుకొనుటకు ముఖ్యమైన పత్రము. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖతో కలిపి చదివితే గలతీయులకు వ్రాసిన లేఖ క్షుణ్ణంగా అర్ధమవుతుంది.
అన్యుల అపోస్తలుడైన పౌలుగారి జీవిత విశేషాలను ఈ లేఖలో చూడవచ్చు (గలతీ. 1:11-2:10). అలాగే, క్రైస్తవ మార్గం ఒక కొత్త మతముగా ఎలా అభివృద్ధి చెందినదో కూడా ఈ లేఖ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అనాధి క్రైస్తవ సంఘములో క్రైస్తవులు ఎదుర్కొన్న సమస్యలు, ఉద్రిక్తల గురించి ఈ లేఖ మనకు సమాచారాన్ని ఇస్తుంది.
పౌలు బోధించిన సువార్తను క్రైస్తవులే సవాలు చేసిన సమాచారాన్ని అందించిన చారిత్రాత్మకమైన పత్రముగా ఈ లేఖను చెప్పుకోవచ్చు. తను బోధించిన “సత్య సువార్త”కు అనుకూలముగా పౌలు ఈ లేఖలో సమాధానాలిచ్చాడు.
ఈ లేఖ ద్వారా పౌలు కొన్ని విషయాలలో గలతీయులను సవరిస్తున్నాడు. అలాగే, అనేక విషయాల గూర్చి తన వాదనలను వినిపిస్తున్నాడు. సాధారణముగా, పౌలు తను వ్రాసే లేఖలలో ఆరంభములో కృతజ్ఞతలు తెలుపుతూ వ్రాస్తాడు. కాని అలాంటి కృతజ్ఞత ఈ లేఖలో మనకు కనిపించదు. దానికి బదులుగా ఆశ్చర్య వచనాలతో ఆరంభిస్తున్నాడు, “మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగు చున్నది! క్రీస్తు కృపకు మిమ్ము పిలచిన వానిని ఇంత త్వరగా విడనాడి, మరియొక సువార్త వైపుకు మరలు చున్నారు గదా!” (గలతీ. 1:6).
ఈ లేఖలో గలతీయుల పట్ల తన నిరాశను వ్యక్త పరస్తున్నాడు, “మిమ్ము గూర్చిన నా కృషి అంతయు నిష్ప్రయోజనమేమోనని భయపడు చున్నాను” (గలతీ. 4:11).
‘క్రీస్తు మనలను స్వతంతృలుగా చేసెను’ అనునది ఈ లేఖలో ముఖ్య విషయం.
పౌలు ఈ లేఖను క్రీ.శ. 54-55 సంవత్సరములో బహుశా ఎఫెసు నగరము నుండి వ్రాసి యుండవచ్చు. కొంతమంది కొరింతు, మాసిడోనియా నుండి కూడా వ్రాసి యుండవచ్చని భావిస్తున్నారు.
పౌలు ఈ లేఖను గలతీయలోని క్రైస్తవ సంఘములకు వ్రాసి యున్నాడు (గలతీ. 1:2). ఈ సంఘముల గురించి మనకు పూర్తి సమాచారము లేదు. పౌలు మొదటి ప్రేషిత ప్రయాణములో ఉత్తర గలతీయలో బోధించి సంఘాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం (అ. కా. 13:14).
3.2. గలతీ
పట్టణం
మధ్య ఆసియా మైనరులో ఒక పెద్ద పట్టణం ‘గలతి’. గలతి రాష్టములో పిసీదియా, సిలీషియా, లికోనియా, లిస్త్రా, దెర్బె మొ.గునవి ముఖ్య పట్టణాలు. క్రీ.పూ. 25వ సంవత్సరములో గలతి రోమను సామ్రాజ్యములో భాగమైనది. ‘అంచిరా’ ( ప్రస్తుతం ‘అంకార’) దీని రాజధాని నగరము. నేడు టర్కి దేశములో ఉన్నది. ఇచ్చట ప్రజలు ముందుగా గ్రీకు సంస్కృతితో, ఆ తరువాత రోమను సంస్కృతితో ప్రభావితం గావింప బడ్డారు.
3.3. పౌలు –
గలతి క్రైస్తవ సంఘము
అ.కా. 13:13-14:20 ప్రకారం, పౌలు తన మొదటి ప్రేషిత ప్రయాణములో (క్రీ.శ. 46-49), బర్నబాసుతో (గలతీ. 2:1, 9, 13) కలిసి వేదప్రచారం చేసాడు. పౌలు గలతీలో మొదటగా సువార్తను ప్రకటించి, సంఘమును స్థాపించినప్పుడు తను అనారోగ్యం పాలైనాడని తెల్పియున్నాడు (గలతీ. 4:13). మరల తన రెండవ ప్రేషిత ప్రయాణములో గలతీ క్రైస్తవ సంఘమును పౌలు సందర్శించాడు (అ.కా. 16:1-5).
పౌలు ఈ లేఖను గలతీయలోని క్రైస్తవ సంఘమునకు వ్రాసి యున్నాడు. ఇచ్చట గలతీయులు అనగా పౌలు తన మొదటి ప్రేషిత ప్రయాణములో క్రైస్తవత్వమును (క్రీస్తును) స్వీకరించిన వారు. గలతీ రాష్ట్రములో పౌలు అనేక క్రైస్తవ సంఘాలను స్థాపించినట్లు తెలియు చున్నది.
3.3.1. పౌలు
గలతీకు రాకముందు
పౌలు గలతీలో సువార్త బోధన చేయక ముందు, గలతీయ ప్రజలు దేవుడిని ఎరిగి యుండలేదు. దేవుని ఎరుగక దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి (గలతీ. 4:8). ప్రాపంచిక, ప్రాధమిక నియమముల వైపు మరలి యున్నారు (గలతీ. 4:9). ప్రత్యెక దినములను, నేలలను, ఋతువులను, సంవత్సరములను పాటించు చున్నారు (గలతీ. 4:10). బానిసత్వము అను కాడిని వారు మోయు చున్నారు (గలతీ. 5:1).
3.3.2. పౌలు
గలతీకు వచ్చిన తరువాత
పౌలు గలతీకు అనారోగ్యముతో వచ్చియున్నాడు. వారు పౌలును తిరస్కరించ లేదు, అసహ్యించుకొన లేదు. దేవుని దూత వలె. క్రీస్తు యేసు వలె స్వీకరించిరి (గలతీ. 4:14). పౌలు కూడా వారి సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలను అంగీకరించాడు, “నేనును మీవంటి వాడినైతిని” (గలతీ. 4:12). వారికోసం ఎంతో కృషి చేసాడు, “మిమ్ము గూర్చిన నా కృషి అంతయు” (గలతీ. 4:11). పౌలు ప్రేషిత కార్యం అనేక శ్రమలతో కోన సాగింది, “స్త్రీ ప్రసవ వేదన వలె నేను మిమ్ము గురించి బాధపడు చున్నాను” (గలతీ. 4:19). గలతీయులు సువార్తను విశ్వాసముతో వినియున్నారు (గలతీ. 3:2,5). వారు జ్ఞానస్నానము ద్వారా దేవుని బిడ్డలుగా మారియున్నారు, “క్రీస్తు యేసు నందు విశ్వాసము వలన మీరు అందరును దేవుని పుత్రులు. క్రీస్తులోనికి జ్ఞాన స్నానము పొందిన మీరందరు క్రీస్తును ధరించి యున్నారు (గలతీ. 3:26-27). దేవుని యొక్క ఆత్మతో సహవాసములోనికి చేరిరి (గలతీ. 3:2-5).
దీని ఫలితముగా, వారు ప్రాపంచిక, ప్రాధమిక నియమముల నుండి స్వతంతృలైతిరి (గలతీ. 4:3). ధర్మశాస్త్రము తెచ్చి పెట్టిన శాపము నుండి విముక్తులైతిరి (గలతీ. 3:13). ఈవిధముగా, పౌలు గలతీలో సువార్తను బోధించాడు. అనేకమందిని క్రైస్తవ విశ్వాసములోనికి నడిపించాడు. ధర్మశాస్త్రము యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ‘సున్నతి’కి ఖచ్చితమైన నిర్వచనాన్ని చెప్పి యున్నాడు.
3.3.3. పౌలు
గలతీనుండి వెళ్ళిన తరువాత
పౌలు గలతీ నుండి తిరిగి వెళ్ళిన తరువాత, గలతీయులు వారి విశ్వాసములో ఏదో లోటు ఉన్నాడని భావించారు. క్రీస్తు సువార్తకు ద్రోహం చేయాలని, దేవున్ని విడనాడాలని, క్రీస్తు నుండి విడిపోవాలని, సత్యమును తిరస్కరించాలని (గలతీ. 1:6, 5:4) తలంచారు. మరల తిరిగి వారి ‘పాత’ జీవితాలకు తిరిగి వెళ్లాలని భావించారు.
3.4. లేఖ
వ్రాయు సందర్భము
“కొందరు సోదరులు” (గలతీ. 2:4), “తికమక పెట్టువారు”, “క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించు వారు” (గలతీ. 1:7), “కలవార పెట్టువారు” (గలతీ. 5:10, 12. వీరిగురించి 1:9, 6:2-17లో కూడా చెప్పబడినది), పౌలు బోధించిన సువార్తకు (గలతీ. 1:6-9) వ్యతిరేకముగా ‘వేరొక సువార్త’ను బోధించు చున్నట్లుగా పౌలు గలతీయ నుండి సమాచారమును తెలుసు కున్నాడు. గలతీయ సంఘములలో తన పట్టును కోల్పోతున్నట్లుగా పౌలు గ్రహించాడు. ఇంత త్వరగా గలతీయులు తనను విడనాడినందుకు పౌలు ఎంతగానో భంగ పడ్డాడు, బాధ పడ్డాడు మరియు భయపడ్డాడు (గలతీ. 4:11). ఈ సందర్భమున పౌలు ఈ లేఖను వ్రాస్తూ ‘వేరొక సువార్త’ను తీవ్రముగా ఖండిస్తున్నాడు. “నిజమునకు అది మరియొక సువార్త కాదు” (గలతీ. 1:7) అని పౌలు స్పష్టముగా తెలియజేయు చున్నాడు.
మానవులను రక్షించు యేసు క్రీస్తును మాత్రమే విశ్వసింపుమని పౌలు బోధించాడు. కాని, ‘వేరే సువార్త’ను బోధించువారు మాత్రము సున్నతి, ధర్మశాస్త్రము కూడా రక్షణకు అవసరమే అని బోధించు చున్నారు (గలతీ. 2:3-5, 5:2-4, 6:12-13). బహుశా వీరు యూద-క్రైస్తవులు, గలిలయేతరులు అయి ఉండవచ్చు. వీరు యేసు ప్రభువును “సంపూర్ణ సువార్త”గా చూడలేక పోయిరి. వారి ప్రకారం, సున్నతి, ధర్మశాస్త్రము సువార్తలో భాగమే అని భావించారు. ధర్మశాస్త్ర-సువార్తగా భావించారు. క్రైస్తవులుగా మారిన అన్యులు సున్నతి (గలతీ. 2:3-4, 5:2, 6:12), ధర్మశాస్త్రము (3:2, 4:21, 4:5)ను ఆచరించాలని కోరారు. అంతేగాకుండా, వీటిని ఆచరించడం వారి రక్షణకు తప్పనిసరియని సమర్ధించారు.
పౌలు అపోస్తలుడు కాదని కూడా వారు సవాలు చేశారు. “ఆధార స్తంభములు”గ ఎంచబడిన యెరూషలేములోని అపోస్తలులతో పౌలును పోల్చలేక పోయారు (గలతీ. 2:9). పౌలు నిజమైన అపోస్తలుడు కాదని, గలతీయులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎందుకన, పౌలు బోధించుటకు ఆమోదముగా యెరూషలేములోని అపోస్తలుల నుండి ఎలాంటి అధికార పత్రమును కలిగి యుండలేదని వారు వాదించారు. అయితే, గలతీయులందరిని ఒప్పించుటలో వారు విఫలమయ్యారు. ఈ సందర్భముగా తక్షణమే పౌలు ఈ లేఖను వ్రాయుటకు నిర్ణయించు కున్నాడు. గలతీయులను గూర్చిన తన కృషి అంతయు నిష్ప్రయోజనం కాకూడదని ఈ లేఖను వ్రాసాడు. తక్షణమే గలతీయకు పంపుటకు తన అనుచరులు కూడా ఎవరు అందుబాటులో లేనందున, అచటనున్న సంక్షోభమును అధిగమించేందుకు పౌలు ఈ లేఖను వ్రాసి యున్నాడు (చూడుము. గలతీ. 1:6-10, 3:1-5, 5:7-12).
యూద మతము పట్ల మూర్ఖాభిమానం గలవారు (“కొందరు సోదరులు”), పౌలు “సంపూర్ణ సువార్త”ను బోధించ లేదని తప్పు బట్టారు. పరిశుద్ధ గ్రంథ పటనాలను చూపిస్తూ రక్షణ నిమిత్తమై దేవుడు ధర్మశాస్త్రమును ఒసగి యున్నాడని, కావున గలతీయలోని అన్యక్రైస్తవులు దేవుని వారసులు కాగోరినచో, ధర్మశాస్త్రమును తప్పక పాటించ వలసినదేనని వాదించారు. ఈ వాదన పౌలును దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకన, పౌలు ఏకైక సువార్తయైన “క్రీస్తు సువార్త”ను మాత్రమే ప్రకటించి యున్నాడు. అలాగే పౌలు అన్యులకు సువార్త బోధన నిమిత్తమై, యెరూషలేములోని అపోస్తలుల చేత పంప బడలేదు, కాని స్వయముగా యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ చేత పంపబడి యున్నాడు.
పౌలు క్రీస్తు-కేంద్ర బిందువు
అయిన సువార్తను బోధించాడు. అది వినిన ఎంతోమంది అన్యులు క్రీస్తును ఏకైక రక్షకునిగా
విశ్వసించారు. వారిలో ఎవరు కూడా సున్నతినిగాని, ధర్మశాస్త్రమునుగాని పాటించ లేదు.
పౌలు ‘వారి’ కన్న ఎక్కువగా ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా ఎరిగి యున్నాడు, కనుక తను
బోధించిన “క్రీస్తు రక్షణ సువార్త”యే నిజమైన సువార్తయని దృఢముగా నమ్మియున్నాడు.
కనుక, గలతి సంఘాలలో నున్న ఈ సంక్షోభమును అధిగమించుటకు పౌలు ఈ లేఖను వ్రాసి యున్నాడు.
ఈ లేఖను పౌలు చాలా కటినముగా వ్రాసియున్నాడు. గలతీయులను “అవివేకులు” అని పౌలు
సంభోదించాడు (గలతీ. 3:1).
గలతీయలోని కొందరు
అన్య-క్రైస్తవులు ఈ ‘వేరొక సువార్త’ను (తప్పుడు ప్రచారాలను) ఇష్టపూర్వకముగా
అంగీకరించారు. వారు సున్నతిని, ధర్మశాస్త్రమును అంగీకరించారు. ఇది పౌలును ఒకింత
ఆగ్రహానికి గురి చేసింది. ఈ సందర్భముగ, పౌలు గలతీ క్రైస్తవుల అవివేకమును తెలియ
జేస్తూ, తిరిగి తను బోధించిన “ఏకైక సువార్త”ను విశ్వసించమని కోరుచున్నాడు.
మోసపూరితమైన బోధకుల ప్రచారము వలన దారి తప్ప కూడదని వారిని హెచ్చరిస్తున్నాడు.
No comments:
Post a Comment