2.6. ముగింపు (16:1-24)
ఇది ముగింపు అధ్యాయము. మొదటగా, 16:1-4లో వారములో మొదటి రోజుల (ఆదివారము) అర్పణగా ఇచ్చిన ధనమును యెరూషలేములోని దేవుని ప్రజలకు సహాయ పడును అని పౌలు తెలియజేయు చున్నాడు. “దేవుని ప్రజలు” అనగా యెరూషలేములో నున్న ‘పేదవారు’. యెరూషలేము ప్రజలకు సహాయార్ధమై ధనమును ప్రోగు జేయుట గురించి అ.కా. 11:29-30, 24:17, రోమీ. 15:26-28, 2 కొరి. 8-9. గలతీ. 2:10లో కూడా చూడవచ్చు. యెరూషలేములో నున్న పేదవారి కొరకు సహాయం చేయుటలో పౌలు గొప్ప ఆసక్తిని చూపాడు. ఎందుకన, దీనిని తాను స్థాపించిన క్రైస్తవ సంఘాలు, యూదా-క్రైస్తవుల క్రైస్తవ సంఘాల మధ్య ‘ఐఖ్యత’కు చిహ్నముగా భావించాడు. ఇది ధన సహాయమైనను, వాస్తవానికి అన్యులు, యూదక్రైస్తవుల మధ్య సహధానమునకు ముద్రణ వేయుచున్నది.
ఇచ్చట కొరింతీయులు ఈ ధనమును ఏవిధముగా ప్రోగు చేయవలయునో, అది యెరూషలేమునకు ఎలా పంపవలెననో తెలియజేయు చున్నాడు. ఆదివారమున ప్రతి వ్యక్తియు తాను సంపాదించిన దానికి అనుగుణముగ కొంత ధనమును ప్రక్కన పెట్టి దాచి ఉంచ వలయును. కొరింతీయుల ఆమోదము పొందిన వ్యక్తులు పరిచయ పత్రముతో పౌలుతో వెళ్లి వారి దానములను యెరూషలేములో అందింప బడును.
రెండవదిగా, 16:5-12లో పౌలు తనయొక్క మరియు తిమోతి, అపొల్లో యొక్క సంచార ప్రణాళికలను తెలియజేయు చున్నాడు. మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళాలనే ఉద్దేశ్యాన్ని పౌలు వ్యక్త పరచు చున్నాడు. అక్కడకు వెళ్ళినప్పుడు కొరింతులో కొంతకాలము, బహుశా చలి కాలము అంతయు ఉండవలెనని ఆశిస్తున్నాడు. పెంతకోస్తు దినము వరకు ఎఫెసులో ఉంటానని చెప్పుచున్నాడు. పెక్కుమంది విరోధులున్నను సువార్తను ఫలవంతముగా బోధించుటకు తగిన అవకాశమున్నదని తెలుపు చున్నాడు (1 కొరి. 16:5-9). తిమోతి కొరకు పౌలు కొరింతీయులను ప్రాధేయపడు చున్నాడు (1 కొరి. 4:17), తనను అలక్ష్యం చేయవద్దని కోరుచున్నాడు (చూడుము. 1 తిమో. 4:12). తిమోతి వారి యొద్దకు వచ్చినప్పుడు వారితో నిర్భయముగ సంచరించు నట్లు చూడుడని, ఎవరును అతనిని అవమానింప రాదని కోరుచున్నాడు (1 కొరి. 16: 10-11).
సోదరుడగు అపొల్లో విషయము గూర్చి కూడా పౌలు తెలియజేయు చున్నాడు. వారి మధ్య వివాదాలు ఉండటం వలన పౌలు, అపొల్లోను కొరింతునకు రావద్దన్నాడనే ఒక ఊహ కొరింతీయులలో ఉండిపోయింది. కాని, అది అవాస్తమని, ‘కొరింతీయులను చూచుటకు పెక్కుమార్లు అపొల్లోను ప్రోత్సహించాను. కాని తన వ్యక్తిగత కారణాల వలన రాలేక పోయాడు. సరియైన అవకాశము లభించినపుడు అతను తప్పక వస్తాడు’ అని పౌలు స్పష్టముగా తెలియజేయు చున్నాడు.
మూడవదిగా, తన చివరి ఆదేశాలను కొరింతీయులకు పౌలు వ్రాయుచున్నాడు (1 కొరి. 16:13-24). ఈ ఆదేశాల ద్వారా పౌలు కొరింతీయులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. “జాగరూకులై ఉండుడు. విశ్వాసమున దృఢముగ ఉండుడు. ధైర్యము కలిగి బలవంతులై ఉండుడు. ప్రేమ పూర్వకముగ అన్ని పనులు చేయుడు” (1 కొరి. 16:13-14) అని వారిని ప్రోత్సహిస్తున్నాడు. 16:15-18లో తనను సందర్శించిన స్తెఫాను, ఫోర్తునాతు, ఆకయికూసుల గురించి మాట్లాడు చున్నాడు. వారి రాకడ పౌలుకు ఎంతో ఆనందాన్ని కలిగించినదని తెలుపుచున్నాడు. అపోస్తలుడు అయిన పౌలు తన శుభాకాంక్షలతో పాటు, అక్విల, ప్రిస్కాల యొక్క శుభాకాంక్షలను కూడా కొరింతీయులకు తెలియజేయు చున్నాడు (1 కొరి. 16:19).
చివరిగా, ప్రభువును ప్రేమింపని వాడు
శపింప బడునని, మిగతా వారందరు అనుగ్రహాలు పొందునని తెలుపుతూ తన లేఖను
ముగిస్తున్నాడు (1 కొరి. 16:21-24).
No comments:
Post a Comment