3.5. ముఖ్యమైన వేదాంత బోధనలు

 3.5. ముఖ్యమైన వేదాంత బోధనలు
3.5.1. ఏకైక సువార్త (1:1-10)
3.5.2. పౌలు సువార్త = క్రీస్తు సువార్త (3:1-4:31): 3.5.2.1. పౌలు వాదనలు (3:1-18)
3.5.2.1.1. జీవితానుభవము నుండి వాదనలు (3:1-5)
3.5.2.1.2. పరిశుద్ధ గ్రంథము నుండి వాదనలు (3:6-14)
3.5.2.1.3. వేదాంత వాదనలు (3:15-18)
3.5.2.2. ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యము (3:19-29)
3.5.2.3. ఆత్మ –శరీరము (4:1-31)

3.5.1. ఏకైక సువార్త (1:1-10)

“ఈ ప్రస్తుత దుష్టయుగము నుండి మనకు విముక్తి కలిగించుటకై మన తండ్రియగు దేవుని సంకల్పమును అనుసరించి, మన పాపముల కొరకు క్రీస్తు ఆత్మార్పణము చేసికొనెను” (గలతీ. 1:4). మనము రక్షణను పొందుటకు క్రీస్తు మరణము చాలు, ఇక ఏదియు (సున్నతిగాని, ధర్మశాస్త్రముగాని) అవసరము లేదని లేఖ ఉపోద్ఘాతములోనే స్పష్టం చేయు చున్నాడు. గలతీ. 1:6-8లో పౌలు గలతీయులను నిందిస్తున్నాడు, ఎందుకన, వారు పౌలు బోధించిన సువార్తను విడనాడి, ‘మరియొక సువార్త’ వైపునకు మరలి యున్నారు.

“మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగు చున్నది! క్రీస్తు కృపకు మిమ్ము పిలిచినా వానిని ఇంత త్వరగా విడనాడి, మరియొక సువార్త వైపుకు మరలు చున్నారు గదా! నిజమునకు అది మరియొక సువార్త కాదు. కాని కొందరు మిమ్ము తికమక పెట్టి, క్రీస్తు సువార్తను మార్పుచేయ ప్రయత్నించు చున్నారు. మేము కాని, లేక దివినుండి దిగివచ్చిన దేవా దూతయే కాని, మేము బోధించిన దానికంటె భిన్నమైన సువార్తను మీకు బోధించిన యెడల అతడు శపింప బడును గాక!”

3.5.2. పౌలు సువార్త = క్రీస్తు సువార్త (3:1-4:31)

3.5.2.1. పౌలు వాదనలు (3:1-18)

యెరూషలేము నుండి వచ్చిన యూద-క్రైస్తవులు (“కొందరు సోదరులు”, “తికమక పెట్టువారు”, “క్రీస్తు సువార్తను మార్పు చేయువారు”) అప్పటికే జ్ఞాన స్నానము పొందిన గలతీయలోని క్రైస్తవులు అబ్రహాముకు చేయబడిన వాగ్దానాలకు వారసులగుటకు మరియు పరిపూర్ణతను పొందుటకు సున్నతిని తప్పక పొంది, ధర్మశాస్త్రమును పాటించాలని వాదిస్తున్నారు.

పౌలు వారి వాదనను తీవ్రముగా వ్యతిరేకించాడు. అలా చేసినచో క్రీస్తు ప్రాధాన్యతను తిరస్కరించిన వారమౌతాము. సున్నతిని పొందటం, ధర్మశాస్త్రమును పాటించటం విగ్రహారాధనతో సమానమని పౌలు తెలియజేయు చున్నాడు. ఇది బహుదైవారాధనతో సమానమే!

జ్ఞానస్నానమందు పవిత్రాత్మ వరాలను పొంది యున్నారని పౌలు గలతీయులకు జ్ఞాపకము చేయు చున్నాడు. పౌలు ఆత్మ-శరీరం (సున్నతి)ల మధ్య విరోధమును గాంచుచున్నాడు. సున్నతిని పొందినచో వారు క్రీస్తు నుండి వేరుచేయ బడెదరు (గలతీ. 5:24) అని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. పౌలు ప్రకారం, దేవుని వాగ్దానాలకు వారసులగుటకు జ్ఞానస్నానము చాలు, వేరే ఏది అవసరము లేదు.

పౌలు గలతీయ క్రైస్తవ సంఘస్తులకు వ్రాసిన లేఖలో వారిని సమీపించిన విధానం చాలా దూకుడుగా కనిపిస్తుంది. వారిని తీవ్రముగా మందలించడం కూడా చూడవచ్చు. వారిని రెండు సార్లు ‘అవివేకులు’ అని పిలిచాడు (గలతీ. 3:1-3). ‘అవివేకులు’ అనగా ఆధ్యాత్మిక వివేచన లేనివారిని అర్ధము. “ఎవడైనను యేసు క్రీస్తు నందలి విశ్వాసము చేత నీతిమంతుడు అగునుగాని, ధర్మశాస్త్రమును పాటించుటచే కాదు” (గలతీ. 2:16) అని చెప్పిన దానిని పౌలు ఇచ్చట ఋజువు చేయుటకు ప్రయత్నం చేయు చున్నాడు.

దీనిని ఋజువు చేయుటకు పౌలు మూడు విధాలైన వాదనలను వినిపిస్తున్నాడు:

(అ). జీవితానుభవము నుండి వాదనలు (3:1-5)
(ఆ). పరిశుద్ధ గ్రంథము నుండి వాదనలు (3:6-14)
(ఇ). వేదాంత వాదనలు (3:15-18)

3.5.2.1.1. జీవితానుభవము నుండి వాదనలు (3:1-5)

దేవుని యెదుట నీతిమంతులు అగుటకు సిలువ వేయబడిన క్రీస్తు “సువార్త” ద్వారా మాత్రమేనని పౌలు గలతీయులకు జ్ఞాపకం చేయు చున్నాడు. క్రీస్తు సువార్త ఇతర సాధనములన్నింటిని త్రోసి పుచ్చును. ఈ సత్యమును వారు క్రైస్తవులుగా మారినప్పుడు నేర్చు కొంటిరి. ఇప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును అర్ధం చేసుకోవడములో గలతీయులలో వచ్చిన మార్పు దేని వలననో పౌలుకు అర్ధం కాలేదు.

వారు క్రైస్తవులుగా మారినప్పుడు పరిశుద్ధాత్మను పొందియున్నారు. ఆత్మ ఫలములను వారి జీవితాలలో అనుభవించి యున్నారు. ఇదంతయు క్రీస్తును విశ్వసించుట వలన జరిగినదని, ధర్మశాస్త్రమును అనుసరించుట చేత కాదని పౌలు వారికి గుర్తు చేయు చున్నాడు. ఒకసారి వారు యేసును రక్షకునిగా అంగీకరించినప్పుడు, పరిపూర్ణతను పొందుటకు, క్రీస్తునందు విశ్వాసమును, వేరే ఏదీ కూడా ధర్మశాస్త్రము గాని, సున్నతి గాని భర్తీ చేయలేదు.

వారి మధ్య జరిగిన అద్భుతములు విశ్వాసముతో క్రీస్తు సువార్తను వినుట వలనే గాని, ధర్మశాస్త్రమును అనుసరించుట చేత కాదు (గలతీ. 3:5).

3.5.2.1.2. పరిశుద్ధ గ్రంథము నుండి వాదనలు (3:6-14)

గలతీ. 3:6-9లో పౌలు ఆ.కాం. 15:6ను ప్రస్తావించి యున్నాడు. ఇచ్చట అబ్రహామును ఉదాహరణగా చూపుచున్నాడు. “అబ్రహాము దేవుని విశ్వసించెను. అతని విశ్వాసము వలన అతనిని నీతిమంతునిగ దేవుడు పరిగణించెను” (గలతీ. 3:6). అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు అతనిని దీవించెను. అబ్రహాముతో కలిసి క్రైస్తవులు యేసు క్రీస్తు నందు వారి విశ్వాసమును బట్టి దేవుని చేత ఆశీర్వదింప బడెదరు. అలాగే, అబ్రహామునకు చేయ బడిన వాగ్దానములందు, ఒసగబడిన ఆశీర్వాదములందు పాలుపంచు కొనెదరు.

కనుక, విశ్వాసము ద్వారా క్రైస్తవులు అబ్రహాము యొక్క నిజమైన సంతతి. కావున, అబ్రహాముతో చేయబడిన వాగ్దానములకు వారసులగుటకు ఈ విశ్వాసము తప్ప ఏదీ అవసరము లేదు. గలతీ. 3:10-14లో పౌలు తన వాదనలను బలపరచుటకు, ముఖ్యముగా క్రీస్తు-కేంద్ర బిందువుగా తన వాదనను బలపరచుటకు, పాత నిబంధన గ్రంథము నుండి నాలుగు వచనాలను ప్రస్తావించు చున్నాడు: ద్వితీయ. 27:26, హబ. 2:4, లేవీ. 18:5, ద్వితీయ. 21:23.

ఈ పరిశుద్ధ గ్రంథ వాక్యాల ద్వారా, అబ్రహాముకు ఒసగబడిన దీవెనలను అన్యులకు కూడా ఒసగబడుట వలన క్రీస్తు మనలను రక్షించెను. యేసును రక్షకునిగా అంగీకరించిన అన్య-క్రైస్తవులు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాలకు వారసులగుటకు ధర్మశాస్త్రమును పాటించ వలసిన అవసరము లేదని పౌలు వాదన.

పాత నిబంధన ప్రస్తావన: “ధర్మశాస్త్ర గ్రంథము నందు వ్రాయబడిన నియమములన్నింటికి సర్వదా విధేయుడు కాని వ్యక్తి శాప గ్రస్తుడగును” (ద్వితీయ. 27:26, గలతీ. 3:10).
వ్యాఖ్యానం: యూద-క్రైస్తవుల రక్షణకు ధర్మ శాస్త్రము అవసరము అని పరిశుద్ధ గ్రంథము చెబుచున్నది. ధర్మ శాస్త్రమును అవిధేయించువాడు శాప గ్రస్తుడగును.
పౌలు వ్యాఖ్యానం: ఎవరు కూడా చట్టాలన్నింటిని పాటించలేరు. అప్పుడు శాపమే దాని ఫలితము. అందులకే క్రీస్తు, చట్టము నుండి మరియు దాని శాపము నుండి మనలను కాపాడెను.

పాత నిబంధన ప్రస్తావన: “విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును” (హబ. 2:4, గలతీ. 3:11).
వ్యాఖ్యానం: నీతిమంతులగుటకు ధర్మశాస్త్రమునకు విశ్వాసులై ఉండవలయును.
పౌలు వ్యాఖ్యానం: సిలువ వేయబడిన క్రీస్తు నందు విశ్వాసము ద్వారా మాత్రమే నీతి మంతులు అగుదురు.

పాత నిబంధన ప్రస్తావన: “ధర్మ శాస్త్రము విధించు అన్ని నియమములను పాటించు వ్యక్తి, వాని వలన జీవించును” (లేవీ. 18:5, గలతీ. 3:12).
వ్యాఖ్యానం: ధర్మ శాస్త్రమును పాటించుట వలననే ఒక వ్యక్తి జీవించును.
పౌలువ్యాఖ్యానం: ఒక వ్యక్తి ధర్మ శాస్త్రము చేత జీవించ లేడు. ఎందుకన, ప్రతీ చట్టమును పాటించ లేడు. దీని ఫలితం శాపము.

పాత నిబంధన ప్రస్తావన: “చెట్టుకు వ్రేలాడ వేయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు” (ద్వితీయ. 21:23, గలతీ. 3:13).
వ్యాఖ్యానం: యూద-క్రైస్తవులు పౌలుకు వ్యహ్తిరేకముగా ఈ వాక్యమును ఉపయోగించ లేదు.
పౌలువ్యాఖ్యానం: ధర్మ శాస్త్రము యొక్క శాపమును యేసు తనపై వేసుకొని ఆ శాపము నుండి మనలను రక్షించెను.

3.5.2.1.3. వేదాంత వాదనలు (3:15-18)

మానవుల మద్య ఒక ఒప్పందము ఏర్పడిన పిదప దానిని రద్దు చేయుట గాని, మార్పు చేయుట గాని జరుగదు (గలతీ. 3:15). అటులనే, దేవుడు అబ్రహాముతో కూడా ఎన్నటికి రద్దు చేయబడనటువంటి ఒప్పందమును చేసుకున్నాడని పౌలు తెలియజేయు చున్నాడు. ‘యూదులు మాత్రమే అబ్రహామునకు చేయబడిన వాగ్దానములకు వారసులు’ యూద-క్రైస్తవుల వాదనను పౌలు త్రిప్పి కొట్టుచున్నాడు.

“వాగ్దానములను దేవుడు అబ్రహామునకును అతని కుమారునకును చేసెను. ‘అతని కుమారులకు’ అని పెక్కుమందిని సూచించుచు బహువచనములో అచట చెప్పబడలేదు. కాని, ‘కుమారునకు’ అని ఒకనిని సూచించుచు ఏకవచనములో చెప్పబడినది. అనగా క్రీస్తు” (గలతీ. 3:16). దేవుడు అబ్రాముకు కనబడి, “ఈ దేశమును నీ సంతతికి అప్పగించు చున్నాను” (ఆ.కాం. 12:7) అని చెప్పెను. “నీ సంతతికి” అని ఏకవచనములో చెప్పబడినది. ఆ “సంతతి”ని పౌలు యూదులతో గాక, క్రీస్తుతో గుర్తిస్తున్నాడు.

ధర్మశాస్త్రము రాకముందు 430 సంవత్సరముల క్రితమే దేవుడు అబ్రహాముతో తన వాగ్దానాలను చేసుకున్నాడు. దేవుని వాగ్దానాలను, దేవునిచేత ధృవీకరించ బడిన నిబంధనను, ధర్మశాస్త్రము రద్దు చేయలేదు, లేదా దానిని మార్పు చేయలేదు. అబ్రహాము, దీవెనలను ధర్మశాస్త్రము వలన గాక, దేవుని వాగ్ధానము ద్వారా పొందెను. కనుక, క్రైస్తవులు ధర్మశాస్త్రము లేకుండానే, యేసు క్రీస్తు ద్వారా, అబ్రహాము సంతతి కాగలరు.

3.5.2.2. ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యము (3:19-29)

దేవుని వాగ్దానములకు ధర్మశాస్త్రము విరుద్ధమా? అని ప్రశ్నిస్తూ, ఎంతమాత్రమును కాదు! అని పౌలు స్పష్టము చేయు చున్నాడు. ధర్మశాస్త్రము మరియు విశ్వాసము యొక్క పాత్రను గూర్చి పౌలు వివరిస్తున్నాడు. వాగ్దానం చేయబడిన కుమారుని రాకకై సంసిద్ధత కొరకు ధర్మశాస్త్రము ఇవ్వబడెను. అలాగే ఈ ధర్మశాస్త్రము యూదులు తమ పాపములను తెలుసుకొనునట్లు చేసెను. వారిని క్షమించి, పాపమునకు వ్యతిరేకముగా బలపరచుటకు, నూతన జీవితమును ఒసగుటకు వాగ్దానం చేయబడిన రాబోవు వారసుని అవసరతను వారికి తెలియ జేసెను. అయితే, వాగ్ధానము ధర్మశాస్త్రము మీద పైచేయి కలిగి యున్నది. మొదటగా వాగ్ధానము అబ్రహామునకు ఇవ్వబడినది. ఆ తరువాత, సంపూర్ణముగా, నేరుగా క్రీస్తుకు ఇవ్వబడినది. ధర్మశాస్త్రము నేరుగా ఇవ్వబడలేదు. అది దేవదూతల చేత ఇవ్వబడినది (ద్వితీయ. 33:22).

ఎప్పుడయితే, వాగ్ధానము చేయబడిన వారసుడు (కుమారుడు), క్రీస్తు వచ్చియున్నాడో, అతని రాక కొరకై సంసిద్ధత కొరకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము యొక్క ఔన్నత్యాన్ని కోల్పోయినది. ఇక దాని అవసరం లేకుండెను. అందుకే పౌలు క్రీస్తు మరియు జ్ఞానస్నానము యొక్క పాత్ర గురించి వ్రాయుచున్నాడు.

“మనము విశ్వాస మూలమున నీతిమంతులుగ తీర్చబడునట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకు డాయెను. విశ్వాస సమయము వచ్చినందు వలన, ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యము లేదు. ఏలయన క్రీస్తు యేసు నందు విశ్వాసము వలన మీరు అందరును దేవుని పుత్రులు. ఏలయన, క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరు క్రీస్తును ధరించి యున్నారు. కావున, యూదుడని, అన్యుడని లేదు. బానిసని, స్వతంతృడని లేదు. స్త్రీయని, పురుషుడని లేదు. ఏలయన, క్రీస్తు యేసు నందు మీరందరు ఒక్కరే. మీరు క్రీస్తుకు సంబంధించిన వారై నందున అబ్రహాము సంతతి కూడ అగుదురు. కనుక దేవుని వాగ్ధానమును బట్టి వారసులే” (గలతీ. 3:24-29).

క్రీస్తు నందు విశ్వాసము కలిగిన వారందరు దేవుని పుతృలగుదురు, జ్ఞానస్నానము పొందుట వలన క్రీస్తు వారిలోనికి వచ్చును. క్రీస్తు రాకతో మానవుల మధ్యనున్న వర్గాలు. బేధాలు, విభజనలు మటుమాయ మయ్యెను. దేవుని యెదుట అందరూ సమానులే!

3.5.2.3. ఆత్మ –శరీరము (4:1-31)

క్రీస్తు రాకతో వచ్చిన గొప్ప మార్పును గూర్చి పౌలు ఇచ్చట ప్రస్తావిస్తున్నాడు. పౌలు ఒకప్పటి ఆచారము గురించి ప్రస్తావిస్తున్నాడు. బాల్య దశలో ఉన్నవారు (మైనర్లు) ముఖ్యముగా ఆస్థికి వారసులయ్యే వారు యుక్త వయస్సు వచ్చేవరకు సంరక్షకులు, గృహనిర్వాహకుల ఆధీనములో ఉండును. అన్నిటికి కర్తయై యున్నాను బాలుడై ఉన్నంత కాలము అతినికిని, దాసునికిని బేధము లేదు. ఎందుకన, వారికి పూర్తి స్వతంత్రము ఉడదు కనుక (గలతీ. 4:1-2). అలాగే, అన్య-క్రైస్తవులు బాల్యదశలో నున్న వారివలె పూర్వము ప్రాపంచిక ప్రాధమిక నియమములకు బానిసలై ఉంటిరి (గలతీ. 4:1-2).

కాని కాలము పరిపక్వమయినపుడు దేవుడు తన కుమారుని (క్రీస్తు) పంపెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. ధర్మశాస్త్రమునకు లోబడి యున్న వారిని విముక్తులను చేసెను. తద్వార, మనము దేవుని దత్త పుత్రులము అగునట్లు చేసెను (గలతీ. 4:4-5).

తన మరణము. పునరుత్థానము ద్వారా, క్రీస్తు వారసుడయ్యెను. వాగ్దానములు చేసిన దేవుని పుత్రుడయ్యెను, వారసుడయ్యెను. తనతో పాటు, విశ్వాసులందరిని కూడా దేవునికి దత్తపుత్రులను చేసెను. మనము దేవుని పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశ పెట్టెను. ఇది దేవుని ప్రేమకు చిహ్నం. దీనిని గలతీయలోని క్రైస్తవ విశ్వాసులు వారి జీవితాలలో అనుభవించిరి. ఈ ఆత్మయే వారు దేవున్ని, “అబ్బా! తండ్రీ!” (నాన్న) అని పిలుచు చున్నది. ఇక వారు ఎన్నటికి బానిసలు కారని గుర్తించిరి. దత్తత వలన దేవుని పుత్రులని తెలుసు కొంటిరి. పుత్రులు కనుక వారు వారసులు కూడా (గలతీ. 4:6-7).

పౌలు ఈ లేఖను వ్రాయుచున్నప్పుడు ఎంతగానో భావోద్వేగమునకు లోనయ్యాడు. గతములో గలతీయ క్రైస్తవులు పౌలుతోనున్న సత్సంబంధాన్ని గుర్తుకు చేయుచున్నాడు. పౌలును వారు ఎంతగానో ప్రేమించారు. పౌలు కొరకు వారు తమ కన్నులుకూడా ఊడబెరికి ఇచ్చుటకు సిద్ధపడ్డారు (గలతీ. 4:15). పౌలు మొదటిసారిగా గలతీయకు వచ్చినప్పుడు అనారోగ్యముతో వచ్చెను. బహుశా, గలతీయకు రాకముందు, తన ప్రేషిత కార్యము చేపట్టిన ప్రదేశాలలో హింసల పాలై యుండవచ్చు. లిస్త్రాలో పౌలును రాళ్ళతో కొట్టి అతడు మరణించి యుండెనని భావించి, పట్టణము బయటకు ఈడ్చి వేసిరని అ.కా. 14:19లో చదువుచున్నాము.

అనారోగ్యముతో నున్న పౌలును గలతీయులు స్వీకరించి ప్రేమతో ఆదరించిరి. దేవుని దూతవలె, క్రీస్తు యేసు వలె వారు పౌలును స్వీకరించితిరి (గలతీ. 4:13-14). “నేను ఇప్పుడు మీకు విరోధినైతినా?” అని పౌలు వారిని ప్రశ్నిస్తున్నాడు (గలతీ. 4:16). “వేరే సువార్త”ను ప్రచారం చేయువారివలె పౌలు వారి మెప్పుకోలు కొరకు ప్రయత్నం చేయలేదు. వారి ఉద్దేశ్యము మంచిది కాదని, మిమ్ములను నా నుండి వేరుచేయు చున్నారని పౌలు గలతీయులకు స్పష్టం చేయుచున్నాడు (గలతీ. 4:17). “నా బిడ్డలారా! మీయందు క్రీస్తు రూపము ఏర్పడు వరకు, స్త్రీ ప్రసవ వేదనవలె నేను మరల మిమ్ము గురించి బాధపడు చున్నాను” (గలతీ. 4:18) అని పౌలు తన ఆవేదనను తెలియజేయు చున్నాడు.

గలతీ. 4:21-31లో హాగారు సారాల ఉదంతమును ఉదాహరణగా పౌలు ప్రస్తావిస్తున్నాడు/ పౌలు వ్యతిరేకులు ధర్మశాస్త్రమునకు లోబడి యున్నందున పౌలు ధర్మశాస్త్రము నుండియే (ఆ.కాం. 21:9-12) ఉదాహరణ తీసుకొని వారికి పాఠమును నేర్పిస్తున్నాడు.

సారా, అబ్రహాము భార్య - స్వతంత్రురాలు

1. దేవుని వాగ్ధాన ఫలముగా సారాకు, ఈసాకు జన్మించెను. అతను స్వతంత్రురాలి వలన కలిగిన పుత్రుడు.
2. సారా నూతన నిబంధనకు చిహ్నము (ధర్మశాస్త్రము నుండి స్వాతంత్రము కలది). క్రీస్తు పొందిన వాగ్ధానములో పాలుపంచుకొను విశ్వాసులకు తల్లియగు పరలోక యెరూషలేము.
3. ఈసాకు రాబోవు క్రీస్తుకు సూచన.
4. ఈసాకుకు, యిష్మాయేలు ‘ఎగతాళి’ చేయుచుండెను (ఆ.కాం. 21:9).
5. ఈసాకువలె క్రైస్తవులందరు వాగ్దానఫలమగు బిడ్డలు (గలతీ. 4:28).

హాగారు – అబ్రహాము దాసి

1. యిష్మాయేలు శరీరం ధర్మము ప్రకారం జన్మించెను. అతను తల్లివలె బానిసయై ఉండును.
2. హాగారు పాత నిబంధనకు చిహ్నము. ధర్మశాస్త్రమునకు లోబడి క్రీస్తును తృణీకరించిన ‘యెరూషలేము’.
3. హాగారు, యిష్మాయేలు అబ్రహాము కుటుంబము నుండి గెంటి వేయబడెను (ఆ.కాం. 21:14), తద్వార, అబ్రహాము వాగ్దానములకు వారసత్వమును కోల్పోయెను (ఆ.కాం. 21:9-12).
4. యిష్మాయేలు క్రీస్తును తిరస్కరించిన వారందరికి సూచన.
5. అబ్రహాము తన దాసి హాగారు మరియు యిష్మాయేలును గెంటి వేసినట్లుగా, ధర్మశాస్త్రమునకు బానిసలైన యూద-క్రైస్తవులను గలతీయులు గెంటి వేయాలని పౌలు కోరుచున్నాడు.

ఈ ఉదంతము ద్వారా, గలతీయులు తమనుతాము సారా బిడ్డలుగా భావించాలని పౌలు కోరుచున్నాడు. తద్వార, వారు వాగ్ధాన ఫలమగు బిడ్డలు. కనుక, వారిని బానిసలుగ చేయు ఏ చట్టమునైనను వ్యతిరేకించాలని పౌలు కోరిక. ఈసాకు మరియు యిష్మాయేలు సున్నతి పొందనప్పటికిని, దాని వలన వారిరువురికి ఎలాంటి పర్యవసానము (ఫలము) లేకుండెను.

ఈసాకు, వాగ్ధానమునకు వారసుడు అయ్యెను, ఎందుకన, అతను వాగ్ధాన ఫలమగు బిడ్డ. కనుక ఇచ్చట సున్నతి వలన ఎలాంటి పర్యవసానముగాని, ఫలముగాని లేదు. గలతీయులు కూడా, ఈసాకువలె, వాగ్ధాన ఫలమగు బిడ్డలు అని వారికి తెలియ జేయుచూ వారి కన్నులను తెరిపించాలని పౌలు ప్రయత్నం చేయు చున్నాడు.

ఈవిధముగా, తను బోధించిన ఏకైక స్వతంత్రము గల సువార్తను విడనాడి, ధర్మశాస్త్ర కేంద్రబిందువు అయిన సువార్తను అంగీకరించి సున్నతి పొంది, గలతీయులు యూద-క్రైస్తవుల వెంబడి వెళ్లకూడదని పౌలు అనేక పద్ధతులలో తెలియజేయు చున్నాడు.

No comments:

Post a Comment