3. పౌలు జననం, బాల్యము, కుటుంబము, విద్యాభ్యాసము
పౌలు సిలీషియా రాష్ట్రములోని తార్సు నగరమున ‘డయాస్పోరా’ యూద సంఘములో జన్మించిన యూదుడు (అ.కా. 21:39, 22:3, చూడుము. 9:30, 11:25). ‘డయాస్పోరా’ యూదులు (Jews of the Diaspora) అనగా “వాగ్ధత్త భూమి” అయిన పాలస్తీనా వెలుపల, ప్రవాసములో స్థిరపడిన యూదులు. వీరు సాధారణముగా హీబ్రూ పూర్వ నిబంధన అనువాదమైన గ్రీకు పూర్వ నిబంధనమును (సెప్తువజింత్ - LXX) ఉపయోగించేవారు.
ఆసియా మైనరులోని తార్సు నగరము, రోము సామ్రాజ్య భాగమైన సిలీషియాకు క్రీ.పూ. 66వ సంవత్సరములో రాజధాని అయినది. గొప్ప వారసత్వము, చరిత్ర గలిగన విశ్వజనీనమైన పట్టణము. నూతన నిబంధన కాలములో, తార్సు నగరము అతిపెద్ద సుసంపన్నమైన ఓడరేవుగా, పరిశ్రమకు, వాణిజ్యమునకు ప్రసిద్ధి గాంచినది. ప్రస్తుతము తార్సు నగరము టర్కీ దేశములో భాగము. తార్సు నగరము గురించి పౌలు, “నేను ముఖ్యమైన నగర పౌరుడను” (అ.కా. 21:39) అని ప్రస్తావిస్తూ ఆ నగర గొప్పదనాన్ని చెప్పియున్నాడు.
గ్రీకు పట్టణమైన తార్సు నగరము గ్రీకు తత్వశాస్త్రమునకు, ముఖ్యముగా స్తోయికు తత్వమునకు, సంస్కృతికి, విద్యకు కేంద్రముగా మారినది.
పునీత జేరోము ప్రకారం, యూదయా ప్రాంతమును రోమీయులు ఆక్రమించుకున్న నేపథ్యములో, పౌలు కుటుంబము ఉత్తర గలిలయలోని ‘గిషాల’ పట్టణమునుండి తార్సు నగరమునకు వలస వెళ్లియున్నది. పౌలు తండ్రి తార్సు నగరంలో స్వతంత్ర పౌరుడు, రోమా పౌరసత్వమును కలిగియున్నాడు. కనుక పౌలు పుట్టుకతోనే రోమా పౌరుడు (అ.కా. 22:25-29, 16:37, 23:27). పౌలు కుటుంబము మధ్యస్థముగా సంపన్న తరగతికి చెందిన కుటుంబము, దైవభక్తిగల కుటుంబము.
పౌలు కాలంలో తార్సు నగరంలో బలమైన యూదసంఘం ఉండేది. పౌలు కుటుంబం ఈ యూద సంఘమునకు చెందినది. పౌలు తల్లిదండ్రులు పరిసయ్యులు (అ.కా. 23:6). అపోస్తులుల కార్యములు 23:16 ప్రకారం, పౌలు సోదరి కుమారుని (మేనల్లుడు) గూర్చి గ్రంథకర్త లూకా ప్రస్తావించాడు. దీనినిబట్టి, పౌలుకు ఒక సోదరి ఉన్నట్లు, ఆమె యెరూషలేము నగరమున నివాసమున్నట్లు తెలియుచున్నది. ఇంతకుమించి మనకు పౌలు కుటుంబం గురించి గాని, బంధువుల గురించి గాని ఎలాంటి సమాచారం లేదు.
తన యూద వంశపారంపర్యం గూర్చి పౌలు చాలా గర్వపడేవాడు. “నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే ఎనిమిదవ రోజున నాకు సున్నతి కావింపబడినది. పుట్టుకచే యిస్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను, స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను” (ఫిలిప్పీ. 3:5). “యూద మతమును అవలంబించుటలో నా వయసుగల తోడి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనై యుంటిని. మన పూర్వుల సంప్రదాయముపై ఎంతో ఆసక్తి కలిగియుండెడి వాడను” (గలతీ. 1:14, చూడుము: రోమీ. 11:1, 2 కొరి. 11:22, గలతీ. 1:14).
పౌలు గ్రీకు భాష మాట్లాడు యూదా సంఘమునకు చెందినవాడు. అరమాయికు తన మాతృభాష. పూర్వ నిబంధనమును హీబ్రూ భాషలో చదవగలిగేవాడు. హీబ్రూ భాషలోకూడా మాట్లాడేవాడు (అ.కా. 22:2). అలాగే, పౌలు పుట్టుకతోనే ‘రోమా పౌరుడు’ లేదా ‘రోమా పౌరసత్వము’ను కలిగి యున్నాడు (అ.కా. 16:37, 22:25-29, 23:27).
మనకున్న కొద్దిపాటి సమాచారమునుబట్టి, పౌలు క్రీ.శ.5-10 సంవత్సరముల మధ్య జన్మించాడు. 16వ బెనెడిక్ట్ పోపుగారు 2008-2009ను పౌలు 2000 సంవత్సరాల జన్మమును పురస్కరించుకొని, “పునీత పౌలు సంవత్సరము”గా ప్రకటించి యున్నారు. దీనినిబట్టి పౌలు క్రీ.శ.8వ సం.ములో జన్మించాడని అధికారపూర్వకంగా తెలియుచున్నది.
పౌలు ఉత్తమమైన యూద, గ్రీకు విద్యాభ్యాసాన్ని పొందియున్నాడు. తల్లిదండ్రులు పరిసయ్యులు (రోమీ. 11:1, 2 కొరి. 11:22, ఫిలిప్పీ. 3:5) కనుక, పరిసయ్యుల సంప్రదాయాల ప్రకారం విద్యాభ్యాసమును స్వీకరించాడు. తను పెద్దవాడయ్యేకొద్ది క్రమం తప్పకుండా ‘సినగోగు’ (యూదుల ప్రార్ధనా మందిరము) నందు జరుగు సాంగ్యాలలో పాల్గొని ‘ధర్మశాస్త్రము’ను (మోషే ‘చట్టం’, ‘తోరా’) చదవడం, వివరించడం నేర్చుకొనియున్నాడు.
పౌలు యెరూషలేములో పెరిగి ‘గమాలియేలు’ వద్ద విద్యాభ్యాసము గావించాడు, “ఇక్కడ యెరూషలేమునందే పెరిగి, గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించితిని” (అ.కా. 22:3). ‘ధర్మశాస్త్రము’ను లోతుగా అధ్యయనంచేసి దానిపట్ల జ్ఞానమును, భక్తిని పొందియున్నాడు. ‘గమాలియేలు’ గూర్చి అ.కా. 5:34-39లో చూడవచ్చు. ఆ కాలములో గొప్ప యూద బోధకుడైన (రబ్బయి) గమాలియేలు, ‘హిలెల్’ కుమారుడుగాని లేదా అతని దగ్గరి బంధువుగాని అయి ఉండవచ్చు. ‘గమాలియేలు’ క్రీ.శ.20-50 సంవత్సరముల మధ్యకాలములో ధర్మశాస్త్ర బోధన చేశాడు.
బహుశా, 19 లేదా 20 సంవత్సరముల వయస్సున అనగా క్రీ.శ.24-30 మధ్యకాలమున పౌలు ధర్మశాస్త్రాభ్యాసమును ముగించి యుండవచ్చు. మతాభ్యాసముతోపాటు, గుడారము చేయు వృత్తిలో కూడా నైపుణ్యాన్ని పొందాడు. తన జీవనోపాధికోసం ఈ వృత్తిని చేసేవాడు (అ.కా. 18:3).
No comments:
Post a Comment