2. పౌలు వ్యక్తిత్వం

2. పౌలు వ్యక్తిత్వం

పౌలు తన లేఖలలో తననుతాను నిజాయితీపరుడుగా, విజయవంతుడిగా, చట్టానికి లోబడిన పౌరుడిగా, అత్యత్తమ పరిసయ్యునిగా విశదపరచి యున్నాడు. పౌలు యొక్క సంక్లిష్ట వ్యక్తిత్వము, తన నిజాయితి, వినయం, ఔదార్యం, ధైర్యం, ఉత్సాహం, స్నేహం మొదలగు గుణాలలో వ్యక్తపరచ బడినది.

పౌలు యొక్క నిజాయితి, ధర్మశాస్త్రము పట్ల తనకున్న అనుబంధం, ఆ తరువాత క్రీస్తుపై తనకుగల భక్తిలో కనబడుతుంది. “నా మనస్సాక్షి నిర్మలముగ ఉన్నది. కాని అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నాపై తీర్పు చెప్పును” (1 కొరి. 4:4) అను ఈ వాక్యములో తనలోనున్న నిజాయితి స్పష్టమగుచున్నది.

పౌలు వినయం తన నిజాయితికి నిదర్శనం. అదే అతనిలోని బలాలను, బలహీనతలను తెలుసుకొనునట్లు చేసినది. “పవిత్రులందరిలో నేను అత్యల్పుడను” (ఎఫెసీ. 3:8), “నేను పాపాత్ములలో ప్రథముడను” (1 తిమో. 1:15) అని తన వినయాన్ని చాటుకున్నాడు.

అదేసమయములో తనకున్న అధికారాలు, సాధించిన విజయాల గురించి, “పౌలు అయిన నేను యేసు క్రీస్తు సేవకుడను, అపోస్తలుడుగా ఉండుటకు పిలువ బడినవాడను, సువార్త నిమిత్తము ప్రత్యేకింప బడినవాడను” (రోమీ. 1:1, గలతీ. 1:15) అని గర్వముగా చెప్పుకున్నాడు. “ప్రభువునందలి మీ జీవితము వలన నేను అపోస్తలుడను అనుటకు మీరే ముద్రగా గల నిరూపణము” (1 కొరి. 9:2) అని కొరింతీయులకు వ్రాసియున్నాడు.

పౌలు యొక్క అసాధారణ ధైర్యం, ఉత్సాహము వలన ఇతర అపోస్తలులనుండి ప్రత్యేకింప బడినాడు. యూద మతముపట్ల తనకున్న ఈ అత్యుత్సాహము వలననే క్రైస్తవ మతాన్ని ఈ భూలోకమునుండి రూపుమాపాలని చూసాడు (అ.కా. 9:1ff). అదే ఉత్సాహం ఆ తరువాత క్రీస్తుకు భూదిగంతముల వరకు సాక్షియై ఉండునట్లు (అ.కా. 1:8), క్రీస్తు నామమును అన్యులకు తెలియజేయునట్లు (అ.కా. 9:15) చేసినది. పౌలు యొక్క భయానికే (1 కొరి. 2:3, 2 కొరి. 11:30) భయమెరుగదు, అనగా తన భయాలన్నింటిపై విజయాన్ని సాధించడం నేర్చుకున్న ధీరశాలి పౌలు!

పౌలు తన ప్రేషిత పరిచర్యలో నిజాయితీగల స్నేహమును ఎరిగియున్నాడు మరియు తన సహచరులను ఎల్లప్పుడూ అభినందిస్తుండేవాడు. తన స్నేహితులపట్ల ప్రేమను, విధేయతను ఎప్పుడు గెలుచుకునేవాడు. తిమోతితో తన బంధం, స్నేహం, వయస్సుతో సంబంధం లేనిదని, లూకాతో స్నేహం సమాన వయస్సు, ఒకే అభిరుచులుగల వారి మధ్యగల సాన్నిహిత్యాన్ని చాటిచెబుతుంది.

No comments:

Post a Comment