2. పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ
2.1. ఉపోద్ఘాతము
2.2. కొరింతు నగరం
2.3. కొరింతులో క్రైస్తవ సంఘము
2.4. పౌలు లేఖ వ్రాయు సందర్భం
2.1. ఉపోద్ఘాతము
పౌలు కొరింతీయులకు వ్రాసిన లేఖ మిక్కిలి నిడివిగల లేఖ మరియు సమగ్రమైన లేఖ. అలాగే ఇది చాలా ఆచరణాత్మకమైన లేఖ. ఈ లేఖ కొరింతు దైవ సంఘములోనున్న వర్గముల ప్రస్తావనతో ప్రారంభమవుతుంది. అలాగే ఈ లేఖలో నైతికపరమైన మరియు సిద్ధాంతపరమైన అంశాలను పౌలు చర్చిస్తున్నాడు.
ఈ లేఖలో ఇతర ముఖ్యమైన అంశాలను ఎన్నింటినో కూడా పౌలు చర్చుస్తున్నాడు: యేసు సిలువ మరణము (1వ అధ్యాయము), ప్రేమ (13వ అధ్యాయము), పునరుత్థానము (15వ అధ్యాయము)...మొ.వి. పౌలు ఈ లేఖను వ్రాయడానికి గల కారణం సమస్యలకు పరిష్కారం కొరకు కొరింతు సంఘస్తులు పౌలుకు పంపిన లేఖ (1 కొరి. 7:1) అని తెలియు చున్నది. అలాగే పౌలు ఎఫెసు నగరములో ఉండగా (1 కొరి. 16:8), కొరింతు సంఘములోనున్న వర్గముల గురించి క్లోవు కుటుంబము అందించిన సమాచారము కూడా పౌలు ఈ లేఖ వ్రాయడానికి కారణమై ఉండవచ్చు. పౌలు అంతకు ముందే తిమోతిని కొరింతుకు పంపాడు (1 కొరి. 4:17).
పౌలు తన రెండవ ప్రేషిత ప్రయాణములో (క్రీ.శ. 50-52), కొరింతు నగరములో క్రైస్తవ సంఘమును నిర్మించాడు. పౌలు అచట 18 మాసములు ఉన్నాడు. పౌలు ఈ లేఖను క్రీ.శ. 54 లేదా 55వ సంవత్సరములోని వసంత కాలములో ఎఫెసు నగరము నుండి వ్రాసియున్నాడు.
2.2. కొరింతు నగరం
కొరింతు నగరం ప్రాచీనమైనది మరియు శక్తివంతమైనది. ఓడరేవు కలిగిన నగరము కనుక సుసంపన్నమైన వాణిజ్యమునకు ప్రసిద్ధి గాంచినది. వ్యాపారులు, రాయబారులు, యాత్రికులు, ఇతర ప్రయాణికులు ఈ నగరం గుండా వెళ్ళెడి వారు.
క్రీస్తు పూర్వం 46వ సంవత్సరంలో, ప్రాచీన కొరింతు
నగరమును, లూసియస్ ముమ్మియస్ అను జనరల్ ఆధ్వర్యంలో రోమనులు స్వాధీనపరచుకొని,
పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తరువాత, క్రీస్తు పూర్వం 44వ సంవత్సరంలో జూలియస్ సీజర్
దీనిని రోమను స్థావరముగ పునర్నిర్మించాడు. అప్పటినుండి ఈ పట్టణము త్వరగా అభివృద్ధి
చెందినది. క్రీస్తు పూర్వం 27వ సంవత్సరము నుండి ‘అకాయియ’ ప్రాంతమునకు రాజధానిగా
అయ్యింది.
కొరింతు నగరములో రోమనులు, గ్రీకులు, యూదులు, ఇలా అన్ని వర్గముల, మతముల, తెగలవారు నివసించు చుండేవారు. వీరిలో స్వతంతృలు, బానిసలు ఉండేవారు. ఈ నగరంలో భిన్న సంస్కృతులకు, మతాలకు, భాషలకు, భావాలకు, ఆచారాలకు చెందిన ప్రజలు నివసించేవారు. అక్కడ అసంఖ్యాకమైన నాగరికతలు వెలిశాయి. ఈ నగరంలో దాదాపు ఆరు లక్షల జనాభా ఉండగా, దీనిలో 2/3 భాగం బానిసలే!
కొరింతు నగరం వ్యాపారమునకు, ఇస్త్మియన్ క్రీడలకు చాలా ప్రసిద్ధి. గ్రీకులకు ‘ప్రేమ దేవత’ అయిన ‘ఆఫ్రోడైట్’ దేవతకు అంకితంచేయబడిన దేవాలయం ఒకటి అక్కడ ఉండెను. రోమనులు ‘వీనస్’ను ‘ప్రేమ దేవత’గా కొలిచేవారు. ఈ దేవాలయంలో 1000 మంది వేశ్యలు ఉండేవారు. వ్యభిచారము వృత్తిగా అచ్చట కొనసాగెడిది. పౌలు కాలంలో కొరింతు నగరం, ‘వ్యర్థమైన నగరము’గా పెరుమోసినది.
రాజకీయంగా ముఖ్యమైన మరియు ఆర్థికంగా సంపన్నమైన నగరముగా ఎంతగా వెలుగొందినదో, అంతగా ‘చెడు’కు పేరును తెచ్చుకుంది.
పురాతన తవ్వకాల్లో హెబ్రీయుల (యూదుల) ప్రార్థనా మందిరం (సినగోగు) ఒకటి బయట పడింది. అలాగే అనేకమైన అన్యుల ఆలయాలు, దేవుళ్ళ గౌరవార్ధం విందులు ఏర్పాటు చేయు భోజన గదులు (1 కొరి. 8:10) ఈ త్రవ్వకాలలో బయట పడ్డాయి. అలాగే, మాంసపు విక్రయశాలలు (1 కొరి. 10:25), అకయా ప్రాంతమునకు గల్లియో అధిపతిగా ఉన్నప్పుడు, పౌలును విచారణ జరిపిన న్యాయ పీఠము లేదా న్యాయస్థానము (1 కొరి. 18:12, 17), పౌలు పని చేసిన అక్విలా, ప్రిసిల్లా గుడారములు చేయు దుకాణము వలె నున్న దుకాణముల వరుసక్రమం (1 కొరి. 18:1-3), ప్రార్థన కొరకు క్రైస్తవులు సమావేశమైన గృహాలు (1 కొరి. 11:17-22, 33-34, 16:19) ఈ త్రవ్వకాలలో కనుగొన బడ్డాయి.
ఏదేమైనను, కొరింతు నైతిక విలువలులేని నగరముగా పేరుగాంచినది. “కొరింతులా జీవించడం” అనగా “ఎలాంటి నైతిక విలువలు లేకుండా జీవించడం” అనే అర్థం ఉండేది. దీనికి ముఖ్య కారణం బానిసత్వం, వ్యభిచారం, మరియు క్రీడలు.
2.3. కొరింతులో క్రైస్తవ సంఘము
“పౌలు ఏతెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను” (అ.కా.18:1). ఏతెన్సు నుండి కొరింతుకు 80 కి.మీ. దూరం ఉంటుంది. తన రెండవ ప్రేషిత ప్రయాణంలో కొరింతు నగరమును సందర్శించి అచట పదునెనిమిది మాసములు (సంవత్సరమున్నర) ఉండెను (అ.కా. 18:11). పౌలు అచటనున్న సినగోగులో (యూదుల ప్రార్ధనా మందిరము) యేసు క్రీస్తును గురించిన సువార్తను బోధించి, అచట క్రైస్తవ సంఘమును నిర్మించాడు (1 కొరి. 1:17, 4:15, 9:1-2; 2 కొరి. 10:13-14, అ.కా. 18:4, 8). కొరింతు నగరం పౌలును మిక్కిలిగా ఆకట్టుకున్నది, ఎందుకన, అచ్చట ఎలాంటి హింసలు లేకుండెను. కొరింతు క్రైస్తవ సంఘములో ధనికులు, మధ్యతరగతి వారు, పేదవారు ఉండెను.
కొరింతులో పౌలు మొదటిగా అక్విలా, ప్రిసిల్లా అను భార్యాభర్తలను కలుసుకొనెను. రోము నగరములో క్లౌదియా చక్రవర్తి యూదులందరిని రోము నగరము వదిలి వెళ్ళవలయునని శాసించెను. అప్పుడు అక్విలా, ప్రిసిల్లాలు రోము నగరమును (ఇటాలియా) వీడి కొరింతునకు వచ్చిరి. వారు అప్పటికే క్రైస్తవులుగా మారు మనస్సు పొంది యుండిరి, కావున వృత్తిరీత్యా (గుడారములు చేయు వృత్తి) కూడా వారు కొరింతుకు వచ్చి యుండవచ్చు. పౌలు తానును వారివలె గుడారములు చేయువాడు కనుక వారితో నివసించుచు గుడారములను చేయు పనిని చేయుచుండెను. అదేసమయములో, ప్రతి విశ్రాంతి దినమున ప్రార్ధనా మందిరములో తర్కించుచు యూదులను, గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించు చుండెను. (అ.కా.18:2-4).
సిలాసు, తిమోతిలు మాసిడోనియా నుండి వచ్చేటప్పటికి, పౌలు యేసే క్రీస్తు అని సాక్ష్యమిచ్చుచు, దేవుని వాక్కును యూదులకు బోధించు చుండెను. కాని యూదులు పౌలును ఎదిరించుచు అతని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, ఇకనుండి అన్యులకు సువార్తను బోధించెను. తద్వారా, అనేకమంది కొరింతీయులు, కొద్దిమంది యూదులు విశ్వసించిరి. మొదటగా, ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు, అతని కుటుంబంలోని వారందరు ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరంలోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని, విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి (అ.కా. 18:5-8, 1 కొరి. 1:2-6). అలాగే, సొస్తెనేసు (1 కొరి. 1:1) ప్రభువును విశ్వసించుటలో పౌలు విజయాన్ని సాధించాడు. కొరింతులో క్రిస్పుకు, గాయుకు మరియు స్తెఫాను కుటుంబమునకు పౌలు జ్ఞానస్నాన మొసగెను (1 కొరి. 1:14-16).
ఒక దర్శనములో ప్రభువు పౌలుకు కనిపించి, కొరింతులో దేవుని వాక్కును బోధించమని చెప్పెను. “ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, ‘నీవు భయపడ వలదు. నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము. ఆ పనిని ఆపకుము. ఏలయన, నేను నీతో ఉన్నాను. కావున నీకు ఎవరును హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలనేకులు ఉన్నారు’ అని చెప్పెను” (అ.కా. 18:9-10). సువార్త ప్రతీ ఒక్కరికి బోధింపబడాలి అని పౌలు ఎరిగియున్నాడు. అందుకే, కొంతమంది యూదులు మరియు ఇతరులు సువార్తను నిరాకరించినను, సువార్త బోధనను పౌలు కొనసాగించాడు.
కొరింతునకు తిమోతి, సిలాసుల రాకతో పౌలు ధైర్యపడ్డాడు, కాని యూదులు వారిని వ్యతిరేకించడంతో, వారు తిరిగి వెళ్లి పోవాల్సి వచ్చినది. పౌలు అచ్చటనే ఉండి అన్యులపై దృష్టి సారించి, అచట దైవ సంఘమును నిర్మించాడు.
కొరింతులో క్రైస్తవ సంఘమును నిర్మించిన తర్వాత పౌలు మరో రెండుసార్లు వారిని సందర్శించాడు. క్రైస్తవ సంఘము, పౌలు ఒకరినొకరు లేఖలు కూడా వ్రాసుకొని యున్నారు (1 కొరి. 7:1, 2 కొరి. 2:4). పౌలు కొరింతు క్రైస్తవ ప్రజలతో ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవాడు (2 కొరి. 6:11-13, 7:2-4). అయితే వారిమధ్యనున్న ఈ మంచి సంబంధంలో (అసత్యపు అపోస్తలుల వలన) ఉద్రిక్తతలు తలెత్తాయి (2 కొరి. 11:5). బహుశా, ఈ అసత్యపు అపోస్తలులు యూదయా ప్రాంతము నుండి వచ్చి యుండవచ్చు. అలాగే, పౌలును సవాలు చేసిన ఒక దోషి మూలముగా (2 కొరి. 2:5-11), కూడా వారి మధ్యనున్న మంచి సంబంధములో కలవరం, ఉద్రిక్తతలు తలెత్తాయి.
తన మూడవ ప్రేషిత ప్రయాణంలో మాసిడోనియా నుండి పౌలు కొరింతు క్రైస్తవ సంఘమును సందర్శించి, అచట మూడు మాసములు ఉండి యెరుషలేమునకు వెళ్ళాడు.
పౌలు ఈ లేఖను వ్రాయు సమయమునకు కొరింతులో 150 నుండి 200 వరకు క్రైస్తవులు ఉండిరి. వారిలో కొద్దిమంది యూద-క్రైస్తవులు మరియు చాలామంది అన్య-క్రైస్తవులు ఉండెను.
2.4. పౌలు లేఖ వ్రాయు సందర్భం
కొరింతీయులు వ్రాసిన లేఖద్వారా కొరింతు క్రైస్తవ సంఘము గురించి పౌలు సమాచారాన్ని తెలుసుకున్నాడు. బహుశా, ఈ లేఖను స్తెఫానా, ఫోర్తునాతు, అకయికూసు పౌలుకు అందజేసినట్లు తెలియుచున్నది (1 కొరి. 16:17). కొరింతు క్రైస్తవ సంఘములో నున్న కొన్ని సమస్యల పరిష్కారం కొరకు వారు ఈ లేఖను వ్రాశారు. కొరింతు సంఘములో ఉన్న సమస్యలు ఏమనగా: వివాహ సంబంధమును గూర్చిన ప్రశ్నలు, అవివాహితుల, విధవరాండ్రను గూర్చిన ప్రశ్నలు, విగ్రహములకు అర్పించిన ఆహారమును గూర్చిన ప్రశ్నలు...
అలాగే కొరింతులో నున్న అతి పెద్ద సమస్య - వారి మధ్యలోనున్న కలహములు, విభజనలు (1 కొరి. 1:11). ఈ సమాచారాన్ని పౌలు క్లోవు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నాడు. ఈ కుటుంబము వ్యాపార నిమిత్తమై ఎఫెసు నగరమునకు వెళ్ళినప్పుడు అచట పౌలును కలుసుకుని కొరింతు సంఘంలో నున్న సమస్యల గురించి సమాచారమును అందజేసి యున్నారు. కొరింతు క్రైస్తవ సంఘములో ఉన్న ఇతర సమస్యలు - వ్యభిచారం (1 కొరి. 5:1-11), వ్యాజ్యములు (1 కొరి. 6:1-11).
అదేవిధముగా, పౌలు ఇంతకుముందే తిమోతిని కొరింతు సంఘమునకు పంపియున్నాడు (1 కొరి. 4:17). ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గము చూపవలెనను ఉద్దేశ్యంతో పౌలు కొరింతీయులకు ఈ లేఖను వ్రాసియున్నాడు.
ఈ లేఖ ద్వారా పౌలు పైన చెప్పబడిన సమస్యలను ప్రస్తావిస్తూ
కొరింతు సంఘస్తుల మధ్య ఐక్యతను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసియున్నాడు. వారందరూ
కూడా క్రీస్తు శరీరములో ఐక్యులై ఉన్నారని తెలియజేసి యున్నాడు.
No comments:
Post a Comment