1.5.4. ప్రత్యేక అంశము: ప్రభువు రాకడ, పునరుత్థానము

 1.5.4. ప్రత్యేక అంశము: ప్రభువు రాకడ, పునరుత్థానము
1.5.5. ‘ప్రభువు రాకడ’కు సంసిద్ధత (5:1-11)
1.5.6. ‘ప్రభువు రాకడ’కు సంసిద్ధత (5:1-11)
1.5.7. మనము నేర్చుకోవలసిన విషయాలు
1.6. ముగింపు

గ్రీకు భాషలో ‘పరూసియ’ అనగా ‘రాకడ’, ‘వచ్చుట’ అని అర్ధము. ‘పరూసియ’ అనగా ‘ప్రభువు రెండవ రాకడ’ అని అర్ధము. తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖలో ప్రధానమైన వేదాంత అంశము ‘ప్రభువు రాకడ’ (1 తెస్స. 4:13-18).

‘ప్రభువు రాకడ’ కొరకు వేచియుండమని పౌలు ఆయన అనుచులు తెస్సలోనిక ప్రజలకు బోధించారు. ఇది వారు సజీవులుగ నున్నప్పుడే సంభవించునని తెలియ జేశారు. కాని, ‘ప్రభువు రాకడ’ సంభవించక పూర్వమే తెస్సలోనిక ప్రజలు కొంతమంది మరణించడం జరిగింది. మరణించిన వారి కొరకు తెస్సలోనిక సంఘము ఎంతగానో వేదనతో దుఖించు చున్నది. “నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడ కుండుటకు, చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలెనని మా కోరిక” (1 తెస్స. 4:13) అని పౌలు తెస్సలోనిక ప్రజలకు తెలియ జేశారు.

ఇప్పటికే మృత్యువాత పడినవారు, వాగ్ధానము చేయబడిన ‘ప్రభువు రాకడ’లో ఎలా పాలుపంచు కొనగలరు? ఎ గొప్ప అవకాశమును వారు నిజముగానే కోల్పోయారా? ఉత్థాన యేసుతో వారు కలిసి ఉండెదరా? ఇలాంటి ప్రశ్నలకు పౌలు సమాధానాలిస్తూ, వారిలోని ఆందోళనను తొలగించు చున్నాడు.

1 తెస్స. 4:14లో పౌలు ఇలా అంటున్నాడు, “యేసు మరణించి పునరుత్థానము చెందెనని మనము విశ్వసింతము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంట బెట్టుకొని వచ్చును.” కనుక, మరణించిన వారు ఆ గొప్ప అవకాశమును కోల్పోవుట లేదు. అలాగే, సజీవులై ఉన్నవారు మరణించిన వారికంటే ముందు పోరు (1 తెస్స. 4:15). ముందుగా మృతులు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట సజీవులై ఉన్నవారితో కలిసి వారు ప్రభువును వాయు మండలమున కలిసి కొనుటకు మేఘములపై కొనిపోబడుదురు (1 తెస్స. 4:16-17).

ఇచ్చట పౌలు మృతుల పునరుత్థానము గూర్చి అంత స్పష్టముగా తెలియజేయుట లేదు. కాని, యేసు పునరుత్థానమును ఉదాహరణముగా చేసుకొని, దేవుడు మృతులను ‘ప్రభువు రాకడ’లో పాలుపంచు కొనునట్లు చేయునని పౌలు నొక్కి చెప్పుచున్నాడు.

1 తెస్స. 4:14ను 2 కొరి. 4:14తో సమాంతరముగా చూడవచ్చు:

“యేసు మరణించి పునరుత్థానము చెందెనని మనము విశ్వసింతము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంట బెట్టుకొని వచ్చును” (1 తెస్స. 4:14).

“యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి, మీతో సహా ఒకచోట చేర్చి, ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియును” (2 కొరి. 4:14).

పైన చెప్పబడిన రెండు వాక్యాలు కూడా క్రీస్తు రాకడ యొక్క అంతిమ లక్ష్యం, విశ్వాసులను దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావడమేనని సూచిస్తున్నాయి.

‘ప్రభువు రాకడ’ అనగా తండ్రి దేవుడు ఉత్థాన క్రీస్తును పరలోకము నుండి పంపి, తద్వారా ఆయన మరణించిన విశ్వాసులను పరలోకమునకు చేర్చుట. ఇది యేసు ద్వారా దేవుని కార్యము. యేసు విశ్వాసులను తిరిగి ఇంటికి చేర్చుటకు వచ్చును. “ఏలయన మేము మీకు చెప్పెడు ప్రభువు బోధన ఇది. ప్రభువు వచ్చెడి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారికంటె ముందు పోము” (1 తెస్స. 4:15).

‘ప్రభువు రాకడ’కు ముందే మరణించిన వారి పట్ల విచార పడకుడు అని తెస్సలోనిక ప్రజలను కోరిన తరువాత, సజీవులుగాను వారి స్థితి గురించి పౌలు తెలియజేయు చున్నారు. దీనిని “ప్రభువు బోధన”గా తెలియజేయు చున్నాడు (1 తెస్స. 4:15). దేవుడు పవిత్రాత్మ ద్వారా దీనిని ఒక పరమ రహస్యముగా పౌలుకు వెల్లడి చేసినట్లుగా మనకు కనిపించు చున్నది (చూడుము. 1 కొరి. 2:9-10, 2 కొరి. 12:1-10). పౌలు మరియు తెస్సలోనిక ప్రజలు ‘ప్రభువు రాకడ’ వరకు సజీవులుగా ఉందురని చెప్పుచున్నాడు.

1 తెస్స. 4:16-17లో ‘ప్రభువు రాకడ’ దినమున సంభవించు సంఘటనల గూర్చి పౌలు ప్రస్తావించాడు:

(అ). ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగి వచ్చును.
(ఆ). ఆజ్ఞా స్వరముతో వచ్చును.
(ఇ). ప్రధాన దేవదూత పిలుపు అచట ఉండును.
(ఈ). దేవుని బాకా ధ్వనియును అచట ఉండును.
(ఉ). క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించు వారు ముందు పునరుత్థానమును పొందుదురు.
(ఊ). పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయు మండలమున కలిసి కొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. వారు సదా ప్రభువు తోడనే ఉందురు.

ఈ ప్రక్రియ మొత్తములో సజీవులై ఉండువారు మరణించిన వారికంటె ముందు పోరు. ముందుగా మరణించిన వారు పునరుత్థానమై సజీవులగుదురు, అప్పుడు అందరు కలిసి ప్రభువును కలుసు కొనెదరు. సదా ప్రభువు తోడనే ఉండెదరు.

1 తెస్స. 4:16-17ను 1 కొరి. 15:51-52తో పోల్చి చూడవచ్చు:

రెండింటిలో అనేక సారూప్యతలు ఉన్నప్పటికిని, కీలక వ్యత్యాసాన్ని కూడా చూడవచ్చు. 1 తెస్స. 4:16-17 ప్రకారం, మృతులు పునరుత్థానులై, సజీవులతో కలిసి, ప్రభువును వాయు మండలమున కలుసు కొనుటకు మేఘములపై కొనిపోబడుదురు. 1 కొరి. 15:51-52 ప్రకారం, మృతులు మరియు సజీవులు అందరును మారిపోవుదురు: మృతులు అమరులై లేవనెత్త బడుదురు, సజీవులు మారిపోవుదురు.

పరలోకమున ప్రవేశించుటకు సజీవులు పొందు ఈ పరివర్తన, రూపాంతరం ఎంతో అవసరము. ఉత్థాన క్రీస్తుతో జీవితమును పంచు కోవడమే ఈ మార్పు. ఈవిధముగా, 1 తెస్స. 4:13-18లో ‘ప్రభువు రాకడ’ పట్ల తెస్సలోనిక ప్రజలలో నున్న సంక్షోభాన్ని పౌలు పరిష్కరిస్తున్నాడు.

1.5.5. ‘ప్రభువు రాకడ’కు సంసిద్ధత (5:1-11)

‘ప్రభువు రాకడ’ లేదా ‘ప్రభువు దినము’ గురించి తెస్సలోనిక ప్రజలు ఎంతగానో కలవర పడ్డారు. దీనిని గురించి పౌలు వారికి ఈవిధముగా తెలియజేయు చున్నాడు. ‘ప్రభువు రాకడ’ ఎప్పుడు, ఎట్లు సంభవించునో ఎవరికీ తెలియదు గనుక మనము చేయవలసినది, “మెలుకువతో ఉండి ప్రార్ధన చేయాలి” (మత్త. 25:13). “మనము సిద్ధముగా ఉండాలి. ఎందుకన, మనుష్య కుమారుడు మనము ఊహింపని గడియలో వచ్చును” (మత్త. 24:44). ప్రభువు దినము రాత్రివేళ దొంగ వలె వచ్చును. అది గర్భిణియగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. కనుక ఆ దినము ఆ గడియ కొరకు మనము సంసిద్ధముగా ఉండాలి. ఆ దినము మనకు ఆశ్చర్యము గొలుప కూడదు. మేల్కొని జాగరూకులై ఉండవలయును. అప్రమత్తులమై ఉండవలయును. మనము ఎలా సంసిద్ధ పడాలి? విశ్వాసమును, ప్రేమను కవచముగను, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగను ధరింప వలయును. ఒకరినొకరు ప్రోత్సహించు కొనవలయును, ఒకరినొకరు తోడ్పడ వలయును (5:2-11).

సువార్తలలో చెప్పబడిన దానినే పౌలు ఇక్కడ తెస్సలోనిక ప్రజలకు, ‘ప్రభువు రాకడ’, సంసిద్ధత గురించి తెలియ జేశారు (చూడుము. మార్కు. 13:26-37, మత్త. 24:29-31, 36-44, 25:13, లూకా. 21:25-28, 34-36).

1 తెస్స. 5:1-11లో ‘ప్రభువు రాకడ’కు సంసిద్ధతను గూర్చి పౌలు తెలియజేయు చున్నాడు. ‘ప్రభువు రాకడ’ పట్ల తెస్సలోనిక ప్రజలలో నున్న నిర్లక్ష్యాన్ని హెచ్చరిస్తున్నాడు. ‘ప్రభువు రాకడ’ ఆలస్య మైనంత మాత్రమున మృతులు ఈ గొప్ప సంఘటనలో పాల్గొనే అవకాశమును ఎంతమాత్రమును కోల్పోరు. ‘ప్రభువు రాకడ’కు సంసిద్ధపడని వారు వినాశనమునకు గురియగుదురు.

‘ప్రభువు రాకడ’ ఎప్పుడో సంభవించునో అనిశ్చితమైనది. ప్రభువు దినము రాత్రివేళ దొంగ వలె వచ్చును (చూడుము. మత్త. 24:43, లూకా. 12:39, 2 పేతు. 3:10, దర్శన. 3:3, 16:15). గర్భిణియగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును (1 తెస్స. 5:3). ప్రభువు దినము గొప్ప వేదనతో ఉండును, ఆకస్మితముగా వచ్చును, దాని నుండి తప్పించు కొనలేరు (చూడుము. యెషయ 13:8, యిర్మీ. 6:24).

‘ప్రభువు దినము’ అకస్మాత్తుగా నాశనము (దేవుని తీర్పు) సంభవించును అని చెప్పిన పౌలు, ఆ తరువాత వారు ఆశ్చర్య పడనవసరము లేదని తెలుపు చున్నాడు. ఎందుకన, వారు చీకటియందు లేరు, వారు అందరు వెలుగు కుమారులును, పగటి కుమారులునై ఉన్నారు. రాత్రికిగాని, చీకటికిగాని సంబంధించినవారు కాదు. అనగా వారు ‘ప్రభువు దినము’నకు సంసిద్ధులై ఉన్నారు. కనుక వారు దేవుని కోపమునకు గురికారు (1 తెస్స. 5:4-5). “చీకటి” దేవునికి అసంతృప్తిని కలిగించు ప్రవర్తనను సూచిస్తుంది (యోబు. 22:9-11, కీర్తన. 74:20, 82:5). “వెలుగు” దేవునికి సంతృప్తిని కలిగించు ప్రవర్తనను సూచిస్తుంది (యోబు. 29:3, యెషయ 2:5, మీకా. 7:8). కనుక “చీకటి” మార్గము అనగా చెడు మార్గములో, “వెలుగు” మార్గము అనగా మంచి మార్గములో నడవటము. ‘వెలుగు కుమారులు’ లేదా ‘పగటి కుమారులు’ అనగా వారి పూర్వపు లేదా పాత జీవితములకు వ్యతిరేకముగా, విశ్వాసులు క్రీస్తులో నూతన జీవితమును కలిగి ఉండటము.

కనుక, ప్రభువు రాకకై నిద్రించక, మేల్కొని జాగరూకులై ఉండవలయును. పగటివారు కనుక అప్రమత్తులై ఉండవలయును. ప్రభువు రాకడకు సంసిద్ధుల మగుటకు విశ్వాసము, ప్రేమ, రక్షణ నిరీక్షణ ముఖ్యమైనవని పౌలు తెలియజేయు చున్నాడు (1 తెస్స. 5:6-8). తెస్సలోనిక క్రైస్తవులు వీనిని కలిగి యున్నారని పౌలు ఇంతకు ముందే అంగీకరించాడు (1 తెస్స. 1:3).

విశ్వాసమును, ప్రేమను కవచముగను, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగను ధరింపుడు. క్రైస్తవులు తప్పక ప్రభువు దినములో పాలుపంచు కొనుటకు సంసిద్ధులైన వారై ఉండెదరు. అప్పుడు యేసు క్రీస్తు వచ్చు దినమున మనము జీవించి యున్నను, మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించెదము.

‘ప్రభువు దినము’ అనగా చరిత్రలో దేవుడు నిర్ణయాత్మకముగా జోక్యం చేసుకొను రోజు. ఇది శతృవులకు వినాశానమును, తీర్పును (ఆమో. 5:18-20) విశ్వాసులకు రక్షణ, విముక్తిని (యావే. 2:32) కలిగి ఉంటుంది (చూడుము. 2 తెస్స. 2:2, 1 కొరి. 1:8, 2 కొరి. 1:14, ఫిలిప్పీ. 1:16, 2 తిమో. 1:12, 1 పేతు. 2:12, 2 పేతు. 2:9).

1.5.6. క్రైస్తవ సంఘ జీవితమునకు చిట్కాలు (5:12-22)

క్రైస్తవ సంఘములో మార్గదర్శకులుగను, బోధకులుగను ఉండుటకు దేవునిచే ఎన్నుకొనబడి పనిచేయు వారికి తగినంత గౌరవమును ఈయవలయునని, వారు చేయు పని కొరకై వారిని అధికముగా ప్రేమతో గౌరవింప వలయునని పౌలు కోరుచున్నాడు (1 తెస్స. 5:12-13). ఈ సందర్భమున పౌలు మంచి క్రైస్తవ జీవన విధానము కొరకు మరికొన్ని చిట్కాలను, సలహాలను తెలియజేయు చున్నాడు (1 తెస్స. 5:14-22):

సోమరిపోతులను హెచ్చరించాలి
పిరికి వారిని ప్రోత్సహించాలి
బలహీనులకు తోడ్పడాలి
అందరి తోడను ఓర్పు వహించాలి (5:14)
ఇతరులకు అపకారము చేయక ఉపకారము చేయాలి (5:15)
సర్వదా సంతోషముగ ఉండాలి (5:16)
సదా ప్రార్ధన చేయాలి (5:17)
అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండాలి (5:18)
ఆత్మను అడ్డగింప కూడదు (5:19)
ప్రవచనమును తృణీకరింప కూడదు (5:20)
సమస్తమును పరీక్షింపుడు. మంచిని మాత్రమే అంటి పెట్టు కొనాలి (5:21)
అన్ని విధములైన చెడుకు దూరముగ ఉండాలి (5:22).

1.5.7. మనము నేర్చుకోవలసిన విషయాలు

ఈ లేఖనుండి మనమున్న పరిస్థితులలో ఎలాంటి సందేశమును నేర్చుకోవచ్చు?

1.5.7.1. హింసలలో ధైర్యముగా ఉండుట

పౌలు పరివర్తన చెందినప్పటి నుండి సమాజములో అన్ని వైపుల నుండి ఎన్నో ఇబ్బందులను, అవమానములను, హింసలను, బాధలను ఎదుర్కొన్నాడు. ప్రేషిత కార్యములో, సువార్తా బోధనలో ఉత్సాహ పూరితుడై ఉన్నందు వలన, ఇతరుల నుండి శతృత్వాన్ని, హింసలను చవి చూశాడు. 1 తెస్స. 2:2లో పౌలు ఫిలిప్పి నగరములో పొందిన బాధలను, అవమానములను, ఆటంకములను గురించి ప్రస్తావించాడు (చూడుము. అ.కా. 16:19-24). వీటి వలన పౌలు నిరాశ, నిస్పృహలకు లోను కాలేదు. అధైర్య పడలేదు. మనోధైర్యము కలిగి ఇంకా ఎక్కువగా తెస్సలోనికలో సువార్తను ప్రకటించాడు.

ప్రస్తుత కాలములో ఎంతోమంది క్రైస్తవులు, మిషనరీలు, మైనారిటీలు ప్రపంచ నలుమూలల హింసలకు గురియవటం వింటున్నాము, చూస్తున్నాము. సువార్తను ప్రకటించుటలో హింసలు మనలను అధైర్య పరచరాదు. పౌలును, అనాధి క్రైస్తవులను ఆదర్శముగా తీసుకొని, మన విశ్వాసములో దృఢముగా ఉంటూ సర్వమానవాళికి రక్షణానందమైన సువార్తా బోధనను కొనసాగించాలి.

1.5.7.2. మార్గదర్శకమైన మిషనరీ వైఖరీ

తెస్సలోనిక క్రైస్తవులు సంఘ స్థాపకులను, ప్రభువును అనుకరించిరి. అలాగే, వారు ఇతర విశ్వాసులకు మార్గదర్శకు లైతిరి  (1 తెస్స. 1:6-7). వారు అనేక బాధలు పడినను, సువార్తా సందేశమును స్వీకరించారు. తెస్సలోనిక ప్రజలు దేవుని వాక్కును మానవుని సందేశముగ కాక, దేవుని సందేశముగ గ్రహించినందులకు పౌలు దేవునకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు.

తనవలె క్రైస్తవులు నడువ వలెనని ధైర్యముగా పౌలు విశ్వాసులను అర్ధించియున్నాడు (చూడుము. 1 కొరి. 4:16, 11:1, ఫిలిప్పీ. 3:17, 4:9, 1 తెస్స. 2:14, 2 తెస్స. 3:7-9). ఎందుకన పౌలు ఎల్లప్పుడూ క్రీస్తును అనుసరించి యున్నాడు.

ఈ రోజు మిషనరీలుగాని, మనముగాని, ఇతరులను మనలను అనుకరించమని కోరే ధైర్యము ఉన్నదా? మనము నమ్మకముగా క్రీస్తును అనుసరిస్తున్నాము అని ధైర్యముగా చెప్పగలమా? సువార్త కొరకు మన బలహీనతల పట్ల, హింసల పట్ల గర్వపడు చున్నామా? క్రీస్తు కొరకు అవివేకులుగా మారుటకు సిద్ధముగా ఉన్నామా? ఒక మిషనరీగా పౌలు నుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకొనవచ్చు.

మిషనరీలుగా పౌలు, సిలాసు, తిమోతిల నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు (1 తెస్స. 2:5-12):
వారు నిజాయితీ పరులుగా ఉండిరి

వారి ఉద్దేశ్యాలు స్వచ్ఛమైనవి
విశ్వాసుల పట్ల, తల్లివలె ఎంతో శ్రద్ధ వహించి, మృదువుగా ప్రవర్తించిరి
వారు ఎల్లప్పుడూ విశ్వాసులకు అందుబాటులో ఉన్నారు
దేవుని సువార్తను మాత్రమే వారితో పంచుకోనక, వారి జీవితాలను, వారి పరిపూర్ణ వ్యక్తిత్వమును పంచు కొనుటకు సిద్ధమైతిరి
విశ్వాసులకు ఎట్టి శ్రమను, ఇబ్బందిని కలిగించక వారి పోషణకై రేయింబవళ్ళు కష్టపడి పని చేసిరి

ఈనాడు మనం విశ్వాసము, ప్రేమ, రక్షణ నిరీక్షణలో ఎదిగే క్రైస్తవ సంఘాలను నిర్మించాలి. క్రైస్తవ విశ్వాసాన్ని  స్వీకరించే వారందరికీ ఇవి ప్రాధమికముగా ఉండవలసిన అంశాలు. యేసు క్రీస్తు రక్షణ కార్యములో విశ్వాస ముండాలి. అనుదిన జీవితములో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ప్రభువు రాకడకై నమ్మకముతో ఉండాలి.

1.6. ముగింపు

తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖయే పౌలు ప్రప్రధమముగా వ్రాసిన లేఖ. అలాగే నూతన నిబంధన గ్రంథములోనే మొదటిగా వ్రాయబడినది.

పౌలు ఈ లేఖను క్రీ.శ. 50వ సంవత్సరములో వ్రాసియున్నాడు. ఈ లేఖను పౌలు కొరింతు నగరమునుండి వ్రాసాడు. క్రీస్తు పరమ రహస్యాలు ఏవిధముగా అనాధి క్రైస్తవ సంఘములో వివరించ బడ్డాయో, ఈ లేఖనుండి మనం తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment