2.5. ప్రధానాంశములు

 2.5. ప్రధానాంశములు
2.5.1. దైవ సంఘములో వర్గములు (1 కొరి.1:10-4:21, 3:1-23)
2.5.1.1. క్రీస్తు సిలువ (1 కొరి 1:17)
2.5.1.2. క్రీస్తు – దేవుని జ్ఞానము (1 కొరి 1:24)

2.5.1. దైవ సంఘములో వర్గములు (1 కొరి.1:10-4:21, 3:1-23)

కొరింతీయులు తమ లేఖ ద్వారా కొన్ని ప్రశ్నలకు సమాధానములను, స్పష్టం చేసేలా వివరణలను కోరినప్పటికిని, పౌలు వారి ప్రశ్నలకు సమాధానములు ఇవ్వకుండా, ముందుగా కొరింతు దైవ సంఘములోనున్న వర్గముల గూర్చి ప్రస్తావిస్తున్నారు. దైవ సంఘములో కలహములు, వర్గములు ఉన్నవని పౌలు క్లోవు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నాడు (1 కొరి.1:11). ఈ క్లోవు గురించి మనకు ఎక్కువ సమాచారం లేదు. బహుశా దైవ సంఘములో ఒక నాయకురాలై ఉండవచ్చు. సంఘములో చాలా మంచి పేరును కలిగి ఉన్నటువంటి వ్యక్తి. బహుశా ఏదో వ్యాపారాన్ని కలిగి ఉండవచ్చు. వ్యాపార నిమిత్తమై తరచుగా ఎఫెసు నగరమునకు ఆమె కుటుంబం వెళ్ళెడిది. అక్కడ పౌలును కలిసినప్పుడు దైవ సంఘంలో నున్న కలహములు, వర్గములను గూర్చిన సమాచారమును అందించి ఉండవచ్చు.

దైవ సంఘంలో నున్న వర్గముల గూర్చి 1 కొరి. 1:12లో స్పష్టంగా చెప్పబడింది, “మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు ‘నేను పౌలు అనుచరుడ’నని, వేరొకడు ‘నేను అపొల్లో అనుచరుడ’నని, మరియొకడు నేను ‘పేతురు అనుచరుడ’నని, ఇంకొకడు ‘నేను క్రీస్తు అనుచరుడ’నని చెప్పుకుంటున్నారు.” ఇలా చెప్పుకుంటూ వారు ఒకరిపై ఒకరు అధికారాన్ని ప్రదర్శించుటకు ప్రయత్నం చేయుచున్నారు. ఈ వాస్తవము వలన ఖచ్చితముగా కొరింతు సంఘములోని ఐఖ్యతకు ముప్పు వాటిల్లినది.

ఈ విభజనలు అపోస్తలుల మధ్య వ్యక్తిగత వైరము వలన కలిగినది కాదు. అలాగే, క్రైస్తవ సిద్ధాంత బేదాభిప్రాయముల వలన కూడా కాదు. పౌలు ఎప్పుడు కూడా ఏ అపోస్తలుడను కూడా తృణీకరించ లేదు.

పేతురు కొరింతు సంఘమును సందర్శించాడు. ‘పేతురు వర్గము’ బహుశా, యెరూషలేముతో సంబంధము కలిగి యుండి పాలస్తీనా నుండి వచ్చిన యూద-క్రైస్తవులచేత ఏర్పాటు చేయబడి ఉండవచ్చు. ‘అపొల్లో వర్గము’ అపొల్లోను ఆరాధించు వారిచే ఏర్పాటు చేయబడి ఉండవచ్చు. ఎందుకన, అపొల్లో “మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమయిన జ్ఞానము గలవాడు” (అ.కా. 18:24). పౌలు కూడా అపొల్లో గురించి ఎంతో ఆప్యాయముగా మాట్లాడటం 1 కొరి. 3:5-6, 16:12లో చదువుచున్నాము. అలాగే ‘క్రీస్తు వర్గము’ కూడా ఉన్నట్లు పౌలు తెలియజేయు చున్నాడు. ఏదేమైనప్పటికిని, వారి వారి ఇష్టమైన నాయకుని విశ్వాసులు అనుసరించు తీరుపై ఈ వర్గములు ఏర్పాటు చేయబడినవి.

ఇది తెలుసుకున్న పౌలు చాలా నిరాశ చెందాడు. దైవ సంఘములో వర్గముల గురించిన వివరణను 1 కొరి.1:10-17లో చదవవచ్చు. సంఘములో “వర్గములు లేకుండ, సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట” కొరింతీయులను పౌలు వేడుకొనుచున్నాడు (1 కొరి.1:10). అయితే, ఈ వర్గములు చీలికై వివిధ సమూహములుగా ఏర్పడలేదు. అందరు కలిసి “ప్రభువు భోజనము”లో పాల్గొంటున్నారు (1 కొరి.11:17). ఈలేఖ “కొరింతులోని దైవ సంఘమునకు” (1 కొరి.1:2) వ్రాయబడినది, కాని ఏ ఒక్క వర్గమునకో కాదు. విశ్వాసులు సంప్రదాయ విశ్వాస సత్యాలను గుర్తించినారు (1 కొరి. 11:23-26, 15:3-5). పౌలు ఈ వర్గములపై పోరాటం చేయడానికి కారణము యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్యతకు భంగం వాటిల్లునేమోనని!

ఈ క్లిష్ట సమస్యకు పౌలు సమాధాన్ని ఇచ్చుచున్నాడు.  యేసు క్రీస్తు కేంద్రబిందువుగా ఉండవలెనని తెలియజేయు చున్నాడు. “క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా?” (1 కొరి.1:13) అని ప్రశ్నిస్తూ, ‘యేసు క్రీస్తు క్రైస్తవులందరిని ఐక్యము చేయును’ అను సందేశమును ఇచ్చుచున్నాడు. జ్ఞానస్నానము ఇచ్చిన వారిని గాక, అందరు క్రీస్తును అనుసరించాలి అని పౌలు కొరింతీయులకు తెలియజేయు చున్నాడు.

3:1-23: కొరింతీయులు ఆధ్యాత్మిక వ్యక్తులుగా కాక, లౌకికులుగా జీవించుచున్నారని పౌలు చెప్పుచున్నాడు. అసూయ పరులై, ఒకరితో ఒకరు కలహించుచుండుటచే ఇంకను లౌకికులుగ, మానవమాతృలుగా జీవించుచున్నారని పౌలు చెప్పుచున్నాడు. 3:4లో పౌలు మరొకసారి కొరింతు క్రైస్తవ సంఘములో నున్న వర్గముల గురించి ప్రస్తావిస్తున్నారు. ఒకడు “నేను పౌలు అనుమాయుడను” అని, మరియొకడు “నేను అపొల్లో సహచరుడను” అని పలుకుచున్నప్పుడు, మీరు లౌకిక వ్యక్తులుగ ప్రవర్తించుట లేదా? (చూడుము, 1 కొరి. 1:12). క్రైస్తవ విశ్వాసములో కొరింతీయులు ఇంకా పసిబిడ్డలేనని, భోజనము భుజింప గల స్థితిలో ఇంకా లేరని తెలియ జేయుచున్నాడు. దీనికి ముఖ్య కారణం వారు ఆధ్యాత్మిక వ్యక్తులుగ గాక, లౌకికముగా జీవించడమే (1 కొరి. 3:1-3).

దైవ సంఘములో నున్న వర్గములను పరిష్కరించుటకు పౌలు దైవ సేవకుల యొక్క బాధ్యత గూర్చి తెలియజేయు చున్నాడు. “నిజమునకు అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము మిమ్ము విశ్వసింప చేసిన ఆ దేవుని సేవకులము మాత్రమే. ప్రతి వ్యక్తి, దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును” (1 కొరి. 3:5) అని పౌలు స్పష్టంచేయు చున్నాడు. పౌలు, అపొల్లో ఇరువురు కొరింతులో క్రైస్తవ సంఘమును నిర్మించినప్పటికీ, దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే. నిజమునకు విత్తువాడు (పౌలు), నీరు పోయువాడును (అపొల్లో) ముఖ్యులు కారు. మొక్కకు (కొరింతుసంఘము) పెరుగుదల నొసగు దేవుడే ముఖ్యుడు. పౌలు, అపొల్లోలు దేవుని సేవలో కలిసి పని చేయు వారు. కొరింతు దేవుని పొలము, దేవుని భవనము (1 కొరి. 3:6-9). నిజముగ, పౌలు, అపొల్లోల ద్వారా కొరింతులో పని చేసినది దేవుడు. వారిలో మారుమనస్సు కలిగించినది దేవుడు. కనుక దేవుని పేరిట వారిలో వర్గములు, విభజనలు, కలహములు ఉండరాదని పౌలు వారికి స్పష్టముగ తెలియజేయు చున్నాడు.

క్రైస్తవ సంఘమును ఏ మానవుడు కూడా పుట్టించ లేడు. కేవలం దేవుడు మాత్రమే ఆ గొప్ప కార్యమును చేయ గలడు. క్రైస్తవ సంఘములో పని చేయు వారందరు కూడా ఓకే ధ్యేయము, ఒకే ఆశయము కొరకు పని చేయు చున్నారు. క్రైస్తవులు దైవ సేవకుల పేరిట వర్గములను సృష్టిస్తూ వారి కృషిని వృధా చేయరాదు.

పౌలు ఇచ్చట రెండు ‘ఊహాచిత్రాల’ను ఉపయోగిస్తున్నాడు: ఒకటి పొలము, రెండవది భవనము (1 కొరి. 3:9, చూడుము. యిర్మీ. 1:10, 12:14-16, యెహెజ్కె. 17:1-8). క్రైస్తవ సంఘములో పనిచేయు వారందరు కలిసి చేసే కృషిని, అలాగే అందరికీ ఉన్న ఒకే ఆశయమును, ఒకే ధ్యేయమును గూర్చి. పౌలు “పొలము” మరియు “భవనము” ద్వారా తెలియజేయు చున్నాడు.

భవన నిర్మాణమును గురించి చెబుతూ, యేసుక్రీస్తు అను పునాదిపై కొరింతు అను క్రైస్తవ సంఘము నిర్మించబడినదని, ఒక్కొక్కని పనితనమును బట్టి ప్రతి వ్యక్తి బహుమానము పొందునని పౌలు చెబుతున్నాడు (1 కొరి. 3:10-15).

1 కొరి. 3:14-15, 17లో పౌలు మూడు రకాల బోధకుల గూర్చి ప్రస్తావిస్తున్నారు:

(అ). పునాదిపై నిర్మించు వారు (1 కొరి. 3:14); “యేసు క్రీస్తు అను దేవుడు వేసిన పునాది” (1 కొరి. 3:11).
(ఆ). దగ్ధమవు వానిపై నిర్మించు వారు (1 కొరి. 3:15)
(ఇ). నిర్మాణమునకు బదులుగా ధ్వంసం చేయువారు (1 కొరి. 3:17); ధ్వంసము చేయు వారిని దేవుడు ధ్వంసము చేయును.

1 కొరి. 3:15లో ప్రస్తావించిన ‘అగ్ని’, ‘ఉత్థరించు స్థలము’ అని పౌలు ప్రత్యక్షంగా చెప్పుట లేదు. సాంప్రదాయకంగా, శ్రీసభ ఈ వాక్యమును ‘ఉత్థరించు స్థల సిద్ధాంతము’ను బోధించుటకు ఉపయోగించినది.

కొరింతి క్రైస్తవ సంఘము దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని (1 కొరి. 3:16, చూడుము. 6:19) పౌలు చెప్పుచున్నాడు. ఎవరైనను ఈ దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయును (1 కొరి. 3:17). పౌలు ఉద్దేశ్యములో క్రైస్తవ సంఘ ఐక్యత అత్యంత ప్రాముఖ్యమైనది.

కనుక, కొరింతు క్రైస్తవులు ఏ బోధకునికి మరియు దైవ సేవకునికి చెందిన వారు కాదు. దానికి బదులుగా, దైవ సేవకులు మరియు బోధకులే కొరింతు సంఘమునకు చెందినవారు. “కనుక మానవుల చేతలను గూర్చి ఎవడును గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయును మీదే. పౌలు, అపొల్లో, పేతురు, ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు ఇవి అన్నియు మీవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు” (1 కొరి. 3:21-23).

2.5.1.1. క్రీస్తు సిలువ (1 కొరి 1:17)

“క్రీస్తు సువార్తను ప్రకటించుటకు పంపెను కాని జ్ఞానస్నానమును ఒసగుటకు కాదు” (1 కొరి 1:17) అని పౌలు తన వ్యక్తిగత నమ్మకాన్ని నిశ్చయముగా తెలియజేయు చున్నాడు. సువార్త ప్రకటనలో తన వాక్చాతుర్యము కాకుండా, క్రీస్తు సిలువ యొక్క శక్తికి ప్రాధాన్యత ఉన్నదని స్పష్టం చేయుచున్నాడు. సువార్త యనగా “సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట.”

క్రీస్తు సిలువ ఈలోకములోనికి విభజనలను తీసుకొని వచ్చింది: సిలువను అంగీకరించు వారికి దేవుని శక్తిగను, తిరస్కరించేవారికి అవివేకముగను మారినది. “నశించుచున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది. కాని, రక్షింప బడుచున్న వారికి అది దేవుని శక్తి” (1 కొరి 1:18) అని పౌలు తెలియజేయు చున్నాడు.

యెషయ 29:14ను (1 కొరి 1:19) ప్రస్తావిస్తూ, “జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును. వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును” అన్న యెషయ ప్రవక్త ప్రవచనం, క్రీస్తు సిలువనందు నెరవేరినదని పౌలు ధృవీకరిస్తున్నాడు.

క్రీస్తు సిలువ యొక్క శక్తిని పౌలు ఈవిధముగా వ్యక్తపరచు చున్నాడు, “యూదులు అద్భుతములను కోరుచున్నారు. గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు, సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించు చున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును, అన్యులకును, క్రీస్తు, దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలయన, దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటెను గొప్పది. దేవుని బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటె దృఢమైనది” (1 కొరి 1:22-25).

శ్రమలు, పుట్టుకనుండి లేమితనం (ఉదా. అంధత్వం, చెవుడు, మూగతనం మొ.వి.) పాప ఫలితమని యూదులు భావించారు (యోహాను. 9:1-3). అలాగే కొంతమంది అమాయకులు పడే శ్రమలను జూచి దేవుడు న్యాయము లేనివాడు అని తేల్చేశారు. కాని యేసు క్రీస్తు, శ్రమలకు ఒక నూతన అర్ధాన్ని ఇచ్చాడు. ఆయన చెప్పడం మాత్రమే గాక, సిలువపై తన మరణము ద్వారా శ్రమలు రక్షణ, విముక్తి దాయకమని నిరూపితం చేశాడు. శ్రమలు శుద్ధీకరణకు మరియు మోక్షమునకు నడిపించును. క్రీస్తు అమాయక బాధామయ శ్రమలు దేవుని నుండి శిక్ష ఎంత మాత్రము కానేకాదు మరియు దేవుడు అన్యాయమైనవాడని ఏమాత్రము బహిర్గతమవ్వలేదు. లోకపాప పరిహార నిమిత్తమై క్రీస్తు రక్తము సిలువపై చిందింప బడెను (యోహాను. 1:29). లోకం దృష్టిలో క్రీస్తు సిలువ మరణం ఒక ఓటమి, అపకీర్తి మరియు అవివేక మైనది. కాని ప్రభువు ముందుగానే ఇలా హెచ్చరించారు: “తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును” (మార్కు. 8:35). ఈ లోకముచే వివేకముగా పరిగణింప బడునది ఏదైనను, క్రీస్తు చెప్పిన ఈ వాక్యమును అర్ధంచేసుకొనలేదు. కాని క్రీస్తు సిలువ శక్తి, మానవుని వివేకమును దేవుని దృష్టిలో అవివేకముగా మార్చును. లోకముచే అవివేకముగా భావింపబడునది (క్రీస్తు సిలువను అంగీకరించువారు) దేవుని దృష్టిలో విముక్తి, దేవుని శక్తి జ్ఞానముగా మారును.

మానవుని వివేకము మరియు శక్తి సాధించ లేనిది, క్రీస్తు సిలువ సాధించినది. ఇది క్రీస్తు సిలువ శక్తిలో విశ్వసించునట్లు చేయును. దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటెను గొప్పది. దేవుని బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటె దృఢమైనది” (1 కొరి 1:25). ఇది ధర్మశాస్త్రము తెచ్చి పెట్టిన శాపమునుండి (గలతీ. 3:13, కొలొస్సీ. 2:14-15) మరియు పాపము నుండి (రోమీ. 8:3) మనలను విముక్తి చేసెను. క్రీస్తు సిలువ ద్వారా మనము తిరిగి దేవునితో సమాధాన పరచ బడితిమి” (కొలొస్సీ. 1:20). సిలువ ద్వారా క్రీస్తు ఒకే నూతన జాతిని సృజించి, మనకు శాంతి అయ్యెను (ఎఫెసీ. 2:14-15).

2.5.1.2. క్రీస్తు – దేవుని జ్ఞానము (1 కొరి 1:24)

పౌలు ఉద్దేశములో ‘క్రీస్తు, దేవుని జ్ఞానము’ అనగా ఏమి?’ ‘జ్ఞానము’ అను పదము 1 కొరి. 1:18-4:21లో ప్రత్యేకముగా మనకు కనిపిస్తుంది. ‘జ్ఞానము’ అను పదమునకు ప్రత్యేకించి రెండు అర్ధములను చెప్పుకోవచ్చు.

మొదటిగా, ‘జ్ఞానము’ అనగా వినేవారిని ఆకట్టుకొనే ‘వాక్చాతుర్యము’ అని చెప్పుకోవచ్చు. ‘జ్ఞానము’ అనగా కేవలము తార్కిక మరియు అలంకారిక భాషతో (‘పదజాలము’ - 1 కొరి. 2:13, ‘తీయని పలుకులు’ - 1 కొరి. 2:4) వినేవారిని ఆకట్టుకొనుటకు, నమ్మించేందుకు బోధించే పద్ధతియని కొంతమంది కొరింతీయులు భావించారు. ఇలాంటి వారి నమ్మకం కేవలము బోధనయందు ఉపయోగించే పద్ధతులపై మాత్రమే ఆధారపడి యున్నది. అందుకే, దీనికి వ్యతిరేకముగా పౌలు ఇలా అంటున్నాడు, “క్రీస్తు సిలువ మరణము శక్తి విహీనము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండ ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను” (1 కొరి. 1:17). కనుక ‘జ్ఞానము’ అనగా ‘వాక్చాతుర్యము’ అని పౌలు నిరాకరిస్తున్నాడు. “లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా?” (1 కొరి. 1:20).

రెండవదిగా, ‘జ్ఞానము’ అనగా ‘లౌకిక జ్ఞానము’, ‘మానవుని వివేకము’, ‘లోకముచే వివేకముగా పరిగణింప బడునది అని చెప్పుకోవచ్చు. దేవుని జ్ఞానమునకు వ్యతిరేక మైనది (చదువుము. 1 కొరి. 1:20, 2:5,13, 3:19). ఇది లౌకికమైనది, లౌకిక పాలకుల జ్ఞానము (1 కొరి. 2:6). ఈ జ్ఞానము క్రీస్తుద్వారా, ఆయన సిలువ మరణము ద్వారా దేవుడు ఒసగిన రక్షణ ప్రణాళికను అర్ధం చేసుకొనలేకపోయింది.

“దేవుని జ్ఞానము”తో, పై ఈ రెండు రకాల మానవ లేదా లౌకిక జ్ఞానమును పౌలు వ్యతిరేకిస్తున్నాడు. లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపాడు (1 కొరి. 1:20). “దేవుని జ్ఞానము” అనగా 1 కొరింతీయులకు వ్రాసిన లేఖలో రెండు అర్ధాలున్నాయి: ఒకటి, ‘దేవుని రక్షణ ప్రణాళిక’, రెండు, ‘దేవుని రక్షణ’.

దేవుని పధకం లేదా ప్రణాళికను 1 కొరి. 1:21లో చూడవచ్చు: “దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానముచేత ఆయనను ఎరుగక పోయెను. అందు వలన, మనము చేయు సువార్త ప్రకటనము అను వెఱ్రితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను.” దేవుడు ఈ ప్రణాళికను సిద్ధము చేసి మానవాళి రాక్షణార్ధమై దానిని అమలు చేసాడు. మానవ జ్ఞానమువలె గాక, దేవుని జ్ఞానము ‘క్రీస్తు సిలువను గురించిన సువార్త ప్రకటన’ ద్వారా పని చేయును. కాని ఈ దేవుని జ్ఞానమును, లోకము అవివేకముగా భావించినది. లౌకిక వివేకము దీనిని సాధించ లేక పోయినది. మానవాళికి రక్షణ ఒసగు దేవుని జ్ఞానమును పొందలేక పోయినది. పౌలు ఉద్దేశ్యములో, ఈ వైఫల్యము కూడా, దేవుని ప్రణాళికలో భాగమే అని భావిస్తున్నాడు. కనుక రక్షణ లౌకిక వివేకము వలన గాక, విశ్వాసము వలన వచ్చెను మరియు జ్ఞానము వలన గాక, అపోస్తలులు క్రీస్తు సిలువను గురించిన సువార్త ప్రకటనము అను వెఱ్రితనము చేత వచ్చెను.

యూదులు మరియు గ్రీకులు ఇరువురు కూడా తప్పుగా అర్ధము చేసుకొనిరి. “యూదులు అద్భుతములను కోరుచున్నారు. గ్రీకులు వివేకమునకై ప్రాకులాడు చున్నారు (1 కొరి. 1:22). క్రీస్తు సిలువపై దేవుడు ప్రదర్శించిన జ్ఞానమును ఎదుర్కొనినప్పుడు, యూదులు దానిని దూషణగ, అపకీర్తిగ, అల్పముగ, నీచముగ, విలువలేనిదిగ భావించారు. ఎందుకన, దేవుడు ఖచ్చితముగా లోకము అనుకున్న దానికి మరియు నిరీక్షించు దానికి వ్యతిరేకముగా చేస్తూ ఉంటాడు. గ్రీకులు దానిని అవివేకముగా భావించారు. ఎందుకన, వారి ఆలోచనకు వ్యతిరేకముగా, క్రీస్తు జన్మము మరియు సిలువ మరణము ద్వారా దేవుడు తన ప్రజలు ఉన్న చోటకే ఏతెంచెను. దేవుడు పిలచిన వారికే మాత్రమే క్రీస్తు సిలువ దేవుని శక్తి మరియు దేవుని జ్ఞానము. ఇచ్చట దేవుని జ్ఞానము అనగా దేవుని రక్షణ. అయితే ఈ రక్షణ దేవుని తెలివైన ప్రణాళికతో ఒసగ బడినది.

దేవుని జ్ఞానము పరిపక్వము నొందిన వారిమధ్య నున్నదని పౌలు చెప్పుచున్నాడు (1 కొరి. 2:6). కాని కొరింతీయులు తన ప్రవర్తన ద్వారా పరిపక్వము చెందని వారిగా, ఆధ్యాత్మిక లేమి వారిగా నిరూపించుకొను చున్నారు. కనుక వారు క్రైస్తవ జ్ఞానము కొరకు సంసిద్ధముగా లేరు. నిజమైన క్రైస్తవ జ్ఞానము లౌకికమైనది కాదు మరియు నశించెడి లౌకిక పాలకుల జ్ఞానము కూడ కాదు. లౌకిక జ్ఞానము దేవునిపై తిరుగుబాటు చేయునది. ఇది లౌకిక పాలకుల జ్ఞానము. ఇది రహస్యమైనది. నిజమైన జ్ఞానము క్రీస్తు సిలువనును గూర్చిన ప్రకటన ద్వారా బహిర్గతమవును. దేవుడు తన ఆత్మద్వారా ఈ రహస్యమును వెల్లడించెను (1 కొరి. 2:10). జ్ఞానమును గూర్చిన ఈవిధమైన పౌలుగారి బోధన రోమీ. 11:33-36, కొలొస్సీ. 2:3, ఎఫెసీ. 1:8-9, 3:9-10లో చూడవచ్చు.

ముగింపుగా, నిజమైన జ్ఞానము వాక్చాతుర్యములో లేదా లౌకిక వివేకములోకనుగొన లేము. నిజమైన జ్ఞానమును లోక రక్షనార్ధమై దేవుని ప్రణాళికలో కనుగొన వచ్చు.

No comments:

Post a Comment